చిరుజల్లు-86

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఒంటరి నక్షత్రం

[dropcap]ఆ [/dropcap]వేళ కొత్త సినిమా రిలీజు అయింది.

రిలీజ్ అయిన రోజునే సినిమా చూడటం భారతికి అలవాటు. ఇవాళ మాత్రం ఎందుకో అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. మార్నింగ్ షోకి వెడదామంటే వీలు పడలేదు. భారతి భర్త బెంగుళూరు నుంచి ఫోన్ చేస్తాడని ఎదురుచూస్తూ కూర్చుంది. పన్నెండు గంటలకు గానీ ఆయనకు తీరలేదు. మాట్నీకి వెళదామంటే తల్లి అడ్డుపడింది. ఫస్ట్ షోకి వెళ్ళాలని టికెట్ల కోసం పక్కింటి కుర్రాడిని పంపిస్తే, ఫస్ట్ షోకి టికెట్లు అయిపోయాయంటూ సెకండ్ షోకి టికెట్స్ తెచ్చాడు.

అతి బలవంతం మీద చెల్లెలు నీలిమను కూడా సినిమాకు లాక్కుపోయింది. అక్కాచెల్లెళ్ళ మధ్య చెప్పలేనంత వ్యత్యాసం ఉంది. భారతి అంతా మోడరన్. పరుగెడుతున్న కాలం కన్నా ఒక ఫర్లాంగ్ ముందు పరుగెడుతుంది. నీలిమ మాత్రం నాలుగు అడుగులు వెనకే ఉంటుంది.

“అర్ధరాత్రి ఈ చీకటిలో పడుతూ, లేస్తూ వచ్చి ఈ పిచ్చి సినిమా చూడకపోతే, ఏం పోయిందే?” అని నీలిమ దారిపొడుగునా గొణుగుతూనే ఉంది. భారతి చెల్లెలి మాటలు వినిపించుకునే స్థితిలో లేదు.

“ఈ పిక్చర్‍కి మ్యూజికి హైలైట్. అబ్బ, ఏం కొట్టాడే మ్యూజిక్?” అని మురిసిపోయింది భారతి.

“నేనూ విన్నానులే ఆ పాటలు! అది తెలుగో, అరవమో, కన్నడమో, ఏ భాష గానీ, మొదటి ముక్క తప్ప రెండో ముక్క అర్థమై చావలేదు. పైగా కడుపు నొప్పితో బాధ పడుతున్నవాడిలా మధ్య మధ్యలో గావుకేకలు..” అన్నది నీలిమ.

“అది వెస్ట్రన్ టైప్. నీవన్నీ పాత చింతకాయ భావాలు. నీకు ఎక్కడ నచ్చుతుంది?” అన్నది భారతి సినిమా హాలు ముందు ఆటో దిగుతూ.

మొదటి ఆట ఇంకా వదల్లేదు. రెండో ఆట కోసం వచ్చిన రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులతో హాలు ముందు ఖాళీస్థలమంతా కిటకిటలాడిపోతోంది. జనం మధ్య నుంచీ దారి చేసుకుంటూ వెళ్తున్న భారతికి ప్రవీణ్ కనిపించాడు.

“హలో” అంటూ పలకరించాడు.

భారతి ఆగిపోయింది. పాత స్నేహితుడితో కబుర్లలో పడిపోయింది. తమ క్లాస్‍మేట్స్ ఇప్పుడు ఎవరెవరు ఎక్కడున్నారో గుర్తు చేసుకున్నారు.

భారతి తన చెల్లెలు నీలిమను పరిచయం చేసింది. అతడు ‘హలో’ అన్నాడు స్టయిల్‍గా. నీలిమ రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది.

“అన్నట్లు, నువ్వు ఫామిలీతో రాలేదా ప్రవీణ్?” అని అడిగింది భారతి.

“ఎవరి ఫామిలీతో రమ్మంటావ్? నాకింకా పెళ్ళి కాలేదు” అన్నాడు ప్రవీణ్.

“అవునా? అదేంటీ? ఇంకా ఎందుకు చేసుకోలేదు? ఉద్యోగంలో సెటిల్ అయ్యావు కదా?” అని ఆశ్చర్యంగా చూసింది భారతి.

“ఉద్యోగం ఒక్కటే కాదు, పెళ్ళి కాకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. నీలాంటి అందమైన అమ్మాయి దొరకాలి కదా..” చివరి మాట స్వరం తగ్గించి భారతికి మాత్రమే వినపడేలా అన్నాడు.

భారతి ఇంతలేసి కళ్ళతో ప్రవీణ్ వంక చూసింది. అతను అదోలా నవ్వాడు. ఆ నవ్వులో కొంత విరక్తి కనిపించింది.

ఫస్ట్ షో వదిలారు. జనం ప్రవాహంలా వచ్చేస్తున్నారు. వీళ్లు పక్కకి తప్పుకుని నిలబడ్డారు. పది నిముషాల తరువాత వీళ్ళు వెళ్ళి హాల్లో కూర్చున్నారు.

ప్రవీణ్ అన్న మాటలే భారతి చెవిలో మారుమ్రోగుతున్నాయి. ‘నీలాంటి అందమైన అమ్మాయి దొరకాలి కదా? ..నీలాంటి’ అని అనటం భారతికి ఎన్నో అర్థాలను స్ఫురింప చేస్తున్నది.

ఇద్దరి మధ్యా చనువు ఉన్నది. అరమరికలు లేకుండా మాట్లాడుకునే అలవాటు ఉంది. కానీ తనకి ఇప్పుడు వివాహం అయిందని తెల్సి కూడా అతను అలా ఎందుకు అన్నాడు?

సినిమా చూస్తున్నంత సేపూ భారతి ఈ విషయమే ఆలోచిస్తోంది.

సినిమా అయిపోయాక, బయటకు వస్తూ చెల్లెల్ని అడిగింది పిక్చర్ ఎలా ఉందని.

“చాలా మంచి పిక్చర్. బాగా నిద్ర పట్టింది” అన్నది నీలిమ.

భారతి వద్దని వారిస్తున్నా వినకుండా ప్రవీణ్ తన కారులో వారిద్దరినీ ఇంటి దగ్గర దింపాడు. అతన్ని లోపలికి రమ్మని ఆహ్వానించింది భారతి.

“ఇది సమయం కాదు. రేపు ఎప్పుడైనా వస్తానులే” అన్నాడు ప్రవీణ్.

“అయితే, రేపు సాయంత్రం తప్పకుండా రా” అని చెప్పింది భారతి.

అలాగేనంటూ ప్రవీణ్ వెళ్ళిపోయాడు.

నీలిమ నిద్రపోయినంత నిశ్చింతగా భారతి నిద్రపోలేకపోయింది.

ప్రవీణ్, భారతి క్లాస్‍మేట్స్ మాత్రమే కాదు. రాంక్‍ల కోసం పోటీ పడుతుండేవారు. అందుచేత ఒక రకమైన సాన్నిహిత్యమూ ఏర్పడింది. అప్పట్లో ప్రవీణ్ తనను ప్రేమిస్తున్న విషయం చూచాయగా కూడా తెలియజేయలేదు. ఒకవేళ తను ఆ సూచనలను గ్రహించలేదేమో?

భారతి చదువు పూర్తి కాగానే, తల్లిదండ్రులు సంబంధం వెతికి తీసుకొచ్చి, వివాహం చేసి తమ బరువు బాధ్యతలు దించుకున్నారు.

మర్నాడు భారతి ఆలస్యంగా నిద్రలేచింది. టేబుల్ మీద కళ్ళజోడు అందుకోబోయింది. అది కింద పడి పగిలిపోయింది. పొద్దున్నే అదొక అపశకునంలా తోచింది.

ఉదయం టిఫెన్ చేస్తున్నప్పుడు భారతికి ఏదో ఒక చిన్న ఆలోచన వచ్చింది. చెల్లెలితో అన్నది.

“నిన్న ప్రవీణ్‍ను చూశావు కదా, అతని మీద నీ అభిప్రాయం ఏమిటే?”

“బాగానే ఉన్నాడు. హీరోలా ఉన్నాడు. సినిమాల్లో వేషాలకు ట్రయ్ చేయమను..” అన్నది నీలిమ.

“నేను నీ అభిప్రాయం ఎందుకు అడిగానో నీకు తెలుసు. అతనితో మాట్లాడమంటావా?”  అని అడిగింది భారతి.

“అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నాకు వివాహం చేసుకోవాలని లేదు”

“అది కాదే. అయిందేదో అయిపోయింది. జీవితం అంతా ఏకాకిగా ఉంటూ ఒంటరి పోరాటం చేయటం అనేది పెద్ద శిక్ష. ప్రవీణ్ మంచి సహృదయుడు. అలాంటి వాడు దొరకటమూ అదృష్టమే. ఆలోచించు” అని హితవు చెప్పింది భారతి.

సాయంత్రం ప్రవీణ్ కారు దిగి లోపలికి వచ్చేటప్పటికి భారతి ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్వానించింది.

“నీ కోసమే ఎదురు చూస్తున్నాం” అన్నది.

“రావల్సిన టైం కన్నా ముందే వచ్చా? ఇంకా ముస్తాబు పూర్తయినట్లు లేదు” అన్నాడు సోఫాలో కూర్చుంటూ.

“భలేవాడివే. అరగంట నుంచి ఎదురు చూస్తుంటేనూ..”

“అవునా? ఇవాళ నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు..” అన్నాడు.

భారతిని మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నయి. ‘ఏమిటీ మధ్య ఇలా మాట్లాడుతున్నాడు? తను పెళ్ళి అయిన మనిషి కదా? పరాయి వాడి భార్యను కొత్తగా కనిపిస్తున్నావని అంటున్నాడు’ అనుకుంది.

“ఏం లేదు. నిన్ను కళ్ళజోడుతో చూడటం అలవాటు అయింది. ఇవాళ కళ్ళజోడు లేనందువల్ల కొత్తగా కనిపిస్తున్నావు.. అని అన్నాను” అనీ చెప్పాడు.

“అదా.. కళ్ళజోడు పొద్దున కిందపడి పగిలిపోయింది” అని నవ్వింది భారతి.

“ఫర్వాలేదా? ప్రాబ్లం ఏం లేదా?”

“ఇబ్బందేం లేదులే” అని చెప్పింది భారతి.

నీలిమని పిల్చింది. చెల్లెలు వచ్చి కూర్చున్నాక భారతి అన్నది.

“నిన్న నువ్వొక మాట అన్నావు, అందమైన అమ్మాయి దొరకలేదని, వివాహం చేసుకోలేదని.. మా చెల్లెలు నచ్చుతుందేమో చూడు”

“మీ చెల్లెలికేం? బంగారు బొమ్మ కదా..”

చెల్లెలు అతనికి నచ్చినందుకు భారతి సంతోషించింది. ప్రవీణ్ కూడా ఇన్నేళ్ళ తన అన్వేషణ పూర్తి అయిందనే అనుకున్నాడు.

కానీ నీలిమ కిటికీ లోనుంచి ఏటో చూస్తూ, “నా వివాహం ఎప్పుడో అయిపోయింది” అన్నది.

ప్రవీణ్ ఉలిక్కి పడ్డాడు. భారతి కంగారు పడింది.

“ఏమిటే, పిచ్చివాగుడు. మతి పోయిందా? అతను ఏమనుకుంటాడు?” అని చెల్లెల్ని మందలించింది. “దానికి ఎవరితో ఎప్పుడు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు” అని నిర్లిప్తంగా నవ్వింది.

ఆ టాపిక్ మార్చే ప్రయత్నం చేసింది. నిన్న చూసిన సినిమా గురించి మాట్లాడి వాతావరణం తేలికపరిచింది.

భారతి కాఫీ తీసుకురావటానికి లోపలికి వెళ్లినప్పుడు ప్రవీణ్ నీలిమతో “ఐయామ్ సారీ” అన్నాడు.

“నేను కూడా మీకు సారీ చెప్పాలి. అలా సారీ చెప్పబోయే ముందు జరిగిన విషయం విపులంగా వివరించాలి. అది ఇక్కడ వీలు కాదు. వీళ్లు ఎవరూ నన్ను నోరు తెరిచి మాట్లాడనివ్వరు. విడిగా ఎక్కడన్నా కలిస్తే నా కథ చెబుతాను” అన్నది నీలిమ.

“ఎక్కడో ఎందుకు? మీరు మా ఇంటికే రావచ్చు. రేపు రండి. ఎదురు చూస్తుంటాను” అన్నాడు ప్రవీణ్.

అతను వెళ్ళిపోయాక భారతి తల్లితో ఫిర్యాదు చేసింది.

“నిక్షేపం లాంటి సంబంధం. అతను బుద్ధిమంతుడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆదర్శభావాలు గలవాడు. తల్లి డాక్టరు. తండ్రి లాయరు. సభ్యతా, సంస్కారం గల కుటుంబం. నేను అంతా సానుకూలపరుస్తుంటే, ఇది పిచ్చి వాగుడు వాగి, కాళ్ళ దాకా వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకుంది. దీని దిక్కుమాలిన ఆదర్శాలు దేనికి పనికొస్తయి? ఎల్లకాలం ఊహల్లో బతకటం ఎవరికీ సాధ్యం కాదు. కాస్త కళ్ళు తెరిచి వాస్తవాన్ని గుర్తించాలి” అంటూ భారతి తన ఆవేదనను వెళ్ళబోసుకుంది.

నీలిమ వాదించదలచుకోలేదు. చెప్పదలచుకున్నదేదో సూటిగా అతనికే చెప్పదల్చుకుంది.

మర్నాడు నీలిమ ప్రవీణ్ ఇంటికి వెళ్ళింది. సాయంత్రం పూట మేడ మీద కూర్చున్నారు.  చల్లగాలి హాయిగా వీస్తూ సేద దీరుస్తోంది.

“మీరు నిన్న మా ఇంటికి కేవలం మా అక్కయ్య ఆహ్వానం మీద కాలక్షేపానికే వచ్చి ఉంటే, ఇవాళ నేను ఇక్కడికి రావల్సి వచ్చేదే కాదు. నిన్న మీరు నన్ను పెళ్ళిచూపులు చూడడం కోసం వచ్చినట్లు మా అక్కయ్య మాటల్ని బట్టి అర్థం చేసుకున్నాను. మీ ఆదరాభిమానాలను పొందగలిగే యోగ్యత నాకు లేదు. అది వివరించాల్సిన అవసరమూ ఉంది. యవ్వనంలోకి రాగానే ప్రతి ఆడపిల్లా గుండె గడపకు ఆశల తోరణాలు కట్టుకొని భవిష్యత్తు వంక ఆసక్తిగా చూస్తూంటుంది. అలాంటి సమయంలో ఏర్పడే పరిచయాలు త్వరలోనే ప్రేమలుగా మారిపోతుంటయి.

రవికీ, నాకూ పరిచయం ఏర్పడింది. రోజూ అతన్ని కల్సుకోవటం, అభిప్రాయాలు కలబోసుకోవటం, చిరునవ్వులు చిందించుకుంటూ చెట్టాపట్టాలుగా నడవటం – అవన్నీ మనసును పారవశ్యంలో ముంచెత్తేవి. రవి ఒక చైతన్య రథం. ఎక్కడుంటే అక్కడ సందడి. సంబరం. ఆనంద కోలాహలం. పాడని పాటలూ, ఆడని ఆటలూ ఎన్నో మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఒక్కరోజు అతన్ని చూడకపోయినా, సామ్రాజ్యాలు పోగొట్టుకున్న దానిలా దిగులు పడేదాన్ని. మా రహస్య సమావేశాల గురించి మా ఇంట్లో తెలిసింది. అతను మా హోదాకు, అంతస్తుకు తగినవాడు కాదని, మా అమ్మానాన్న అభ్యంతరం పెట్టారు. ఇంట్లో గొడవలు ప్రారంభమైనయి. నేను ఎదిరించాను. ఏది దూరం అవుతుందో, దాని మీద మనసు పడే మక్కువ ఎక్కువ అవుతూ ఉంటుంది. మేం పెళ్ళీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు చెప్పాను. మా చదువులు పుర్తయ్యాక, ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకున్నాక, ఆర్థికంగా నిలబడగల శక్తి వచ్చాక, రహస్యంగా వివాహం చేసుకోదలచాం.

జీవితాన్ని మలుపు తిప్పే, అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతుంటయి. కాలేజీ హాస్టల్లో రవికీ, మరికొంత మంది విద్యార్థులకీ మధ్య గొడవలు జరిగాయి. అన్యాయంగా అతన్ని చంపేశారు. నిన్నటి దాకా నవ్వుతూ, నవ్విస్తూ గలగలమని ప్రవహించే నదిలా నడిచినవాడు, శవమై కనిపించాడు. నా కలలూ, ఆశలూ, భవిష్యత్ స్వప్నాలూ అన్నీ అతనితో పాటే కాలి బూడిదైపోయాయి. మనం ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఏడవాలో భగవంతుడు ముందుగానే నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయాన్ని ఎదిరించలేని నిస్సహాయులం అయిపోతాం. బాధపడుతూ, భంగపడుతూ జీవించటమే ఇంక మిగులుతుంది. అతను నా కోసం మేఘాల లోకాల్లో వెన్నెల దారుల్లో నిరీక్షిస్తునే ఉంటాడు. ఎంత ప్రయత్నించినా అతన్ని మర్చిపోలేకపోతున్నా. ఒకరిని ప్రేమించి, మరొకరితో సంసారం చేయటానికి నా మనసు అంగీకరించటం లేదు. నన్ను క్షమించండి. ఇలా ఒంటరి నక్షత్రంలా, ఎవరికీ ఏమీ కానిదాని లాగానే ఉండిపోనివ్వండి” అన్నది నీలిమ.

“కలలన్నీ చంపుకొని శిలగా మారిపోదామనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజున పశ్చాత్తాపం తప్పదేమో. ఇంకోసారి ఆలోచించుకో. మనసు మీద పడిన ముద్రలు త్వరగా చెరిగిపోవు. వాడిన ఆశల తోరణాలను ఎంత కాలం చూస్తూ కూర్చుంటావు? నీకై నీవే ఆలోచించుకో. రవి చైతన్య స్రవంతి లాంటి వాడని నువ్వే అన్నావు కదా. ఒక మనిషి నిండు జీవితం ఇలా నిర్వీర్యంగా గడిచిపోవటాన్ని అతను మాత్రం హర్షిస్తాడంటావా? ఆలోచించు. తొందరేమీ లేదు. నెల రోజులు.. రెండు నెలలు తరువాతే నీ అభిప్రాయం చెప్పు..” అన్నాడు ప్రవీణ్.

ఆమె దూరంగా కనిపిస్తున్న దీపాల తోరణాల వంక చూస్తోంది. ఆలోచిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here