చిరుజల్లు-88

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

స్పందన

[dropcap]జ[/dropcap]గత్తు యావత్తూ నిద్రాముద్రితమైన సమయంలో..

పులిలా కరుస్తున్న చలికి భయపడి, అందరూ మూడు అంకె వేసి ముడుచుకొని పుడుకున్న సమయంలో-

అర్ధరాత్రి వేళ సుభద్రకు చెమటలు పట్టాయి. గుండెల్లో సన్నగా మొదలైన నొప్పి క్రమంగా ఎక్కవైంది.

భర్తను నిద్ర లేపింది. రామచంద్రరావు కంగారు పడ్డాడు. చొక్కా తగిలించుకొని చీకట్లో ఫర్లాంగు దూరం పరుగెత్తుకెళ్లి ఆటో తెచ్చాడు. ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

ఆస్పత్రిలో అడ్మిట్ చేస్కున్నారు. అన్ని పరీక్షలూ చేశారు. చివరకు బైపాస్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుదని చెప్పారు.

ఇన్నేళ్ల జీవితంలో ఆమె ఎన్నడూ జబ్బు పడి ఎరుగదు. జిర్రున చీదేసిన సందర్భాలూ లేవు. ఇప్పుడీ జబ్బూలూ, టెస్టూలూ, రిపోర్టూలూ, మందులూ – అన్నీ వింతగా ఉన్నయి ఆమెకు.

“ఇంతకీ బైపాస్ ఆపరేషన్ అంటే ఏమిటండీ?” అని అడిగింది భర్తను.

ఆయనకూ అంతగా తెలియకపోయినా, తెల్సినంత వరకూ చెప్పే ప్రయత్నం చేశాడు.

 “ఏం లేదు సుభద్రా, హృదయ కవటాలు మూసుకుపోయాయి. అందుకని సవ్యంగా రక్త ప్రసారం జరపటం లేదు. ఆపరేషన్ చేసి దాన్ని సరి చేస్తారు” అని చెప్పాడు.

ఆమెకు అర్థం అయీ, కాకుండా ఉన్నది. తనలో తనే గొణుకున్నది.

“ఈ హృదయ కవాటాలూ, గవాక్షాలూ మూసుకుపోవటం ఏమిటండీ? నేను ఎప్పుడూ ఎవరి విషయంలోనూ సంకుచితంగా ఆలోచించలేదు. తనా, పరా అన్న బేధం లేకుండా అందరికీ చేతనైన సాయం చేస్తూ వచ్చాను. నాది విశాల హృదయమే అందరూ అంటూ వచ్చారు. చివరకు నా కోడళ్లు కూడా నన్ను తప్పుపట్టలేదు. అలాంటిది ఇవాళ ఈ హృదయ కవాటాలు మూసుకు పోవటం ఏమిటండీ?” అని బాధపడింది.

“దానికీ, దీనికీ సంబంధం లేదు సుభద్రా. నువు మంచిదానివి. నీ మనసు అంతకన్నా మంచిది. అందులో సందేహం లేదు. కానీ డాక్టర్లు చెబుతున్నది శరీర పరిస్థితి గురించి..” అన్నాడు రామచంద్రరావు.

సుభద్ర నిట్టూర్చింది. “జీవాత్మ శరీరమనే ఇంట్లో నివసిస్తున్నది. కొన్నేళ్లకు ఈ ఇల్లు పాడైపోతుంది. కూలిపోతుంది.. అంతేలెండి. దేవుడు ఉండే గుడే పాడైపోతుంటే, పునరుద్ధరణ చేస్తున్నారు. ఇంక ఈ శరీరం గురించి చెప్పాల్సింది ఏముంది? అందుకే అన్నారు పోకన్ మానదు దేహమే విధిమునన్ పోషించి రక్షించినన్.. అని”

ఆమె మాటలు వినలేక ఆయన ఇవతలికి వచ్చేశాడు.

భార్యకు బైపాస్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పినప్పటి నుంచీ రామచంద్రరావు పరిస్థితి దయనీయంగా తయారైంది.

ఆయ రెండేళ్ల కిందటే రిటైర్ అయినాడు. జీవన సమరంలో జరపవలసిన పోరాటాలన్నీ జరిపి ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. వృద్ధాప్యం నిశ్చింతగా గుడుపుదామనుకుంటున్న సమయంలో ఈ ఉపద్రవం వచ్చి పడింది.

ఆపరేషన్‌కు పదిలక్షలకు పైగానే అవుతుందిట. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్ధం కావటం లేదు. నిశ్చలంగా నున్న చెరువులోకి, పెద్ద బండరాయి వచ్చి పడినట్లు అయింది. దిగులు పడిపోతున్నాడు. దేని మీదా మనసు నిలవటం లేదు. నిద్రలో కలవరించినట్లు పట్టపగలు తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. పెరిగిపోయిన గడ్డాన్ని రాసుకుంటూ ఆలోచనల్లో మునిగిపోతున్నాడు.

ఇంతకు ముందు ఎంత పెద్ద సమస్య వచ్చినా, భర్త ఇంతలా డీలా పడిన సందర్భాలు లేవు. అందుకని భర్తకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది.

“పుట్టటం గిట్టటం ఎంతటి వాళ్లకైనా తప్పదు. వచ్చిన పని పూర్తి అయ్యాక అవతార పురుషులే కనుమరుగైపోయారు. మనం అనగా ఎంత? మనకు ఇద్దరు కొడుకులూ, ఒక కూతురూ ఉన్నారు. మనవళ్లూ, మనవరాళ్లు అంతా పైకి వచ్చారు. ఆ తృప్తి చాలు. భగవంతుడి పిలుపు కోసం ఎదురు చూడటం తప్ప ఇంక నాకు కావల్సింది ఏముంది? ఇంకా ఎందుకీ తపన, ఈ ఆరాటం?” అని అన్నది సుభద్ర.

“నువ్వు చెప్పింది యథార్ధమే. కాదనటం లేదు. కానీ నా బాధ వేరు. నలభై ఏళ్లకిందట నువ్వు నా జీవితంలో ప్రవేశించిన నాటి నుంచీ నీ మీద ఆధారపడి బతకటానికి అలవాటు పడిపోయాను. బయట ఎంత గొప్ప చిక్కు సమస్యనైనా ఇట్టే నెగ్గుకు రాగలను. కానీ ఇంటికి వచ్చాక గ్లాసెడు మంచి నీళ్లు అయినా నువ్వు అందిస్తే గానీ తాగలేను. పొద్దుటే నిద్దర కళ్లకు నువు కనిపించాలి. ఏది కావాలన్నా నిన్ను పిలవటం అలవాటు అయింది. నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉండగలను?” అంటున్న రామచంద్రరావు గొంతు మూగపోయింది.

కాసేపటికి తెప్పరిల్లి అన్నాడు “ఇప్పుడు ఈ ఆపరేషన్లు అన్నీ అలవోకగా, సక్సెస్‌ఫుల్ గానే చేస్తున్నారు. భయం లేదు. ఇంకో పదేళ్ల దాకా ఢోకా లేదు. ఇప్పుడు నా బాధ నీ ఆరోగ్యం గురించి కాదు. డబ్బు గురించి” అని మనసులోని మాట బయట పెట్టాడు.

భర్త దగ్గర అంత డబ్బు లేదన్న విషయం ఆమెకు తెల్సి, రిటైర్ అయినప్పుడు వచ్చినదంతా కొడుకులకే పంచి పెట్టాడు.

సుభద్ర అన్నది “దేవుడి దయవల్ల కొడుకులూ, కూతురూ మంచి స్థితిలోనే ఉన్నారు. ఉద్యోగాల రీత్యా దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్లు మనకు దూరమైనట్లు కాదుగదా.. వాళ్లకు చెప్పి చూడండి. ఆ మాత్రం పంపక పోతారా? ముందుగా అన్నీ మనమే ఊహించుకుంటే ఎలా?”

ఆయన అన్నాడు “ఇంత కాలం వాళ్లు అడిగినప్పుడల్లా నేను పంపిస్తూ వచ్చావు. ఇప్పుడు వాళ్లను డబ్బు అడగటానికి సంకోచంగా ఉంది. ఇన్నాళ్లూ నా చెయ్యి పైన ఉంటోంది. ఇప్పుడు చెయ్యి చాచవల్సిన..” ఉద్వేగం ఆయన మాటలను మింగేసింది.

“బిడ్డల్ని కని పెంచి పోషించేది, ఇదుగో ఇలా వార్ధక్యంలో ఆదుకుంటారనే కదా. పిల్లల్ని పైకి తీసుకురావటానికి తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉన్నదో, పండుటాకులుగా మారిన తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన బాధ్యత పిల్లలకీ ఉన్నది. ఇందులో ఎవరి చెయ్యి పైనా కాదు. ఎవరి చెయ్యి కింద కాదు..” అని హితవు చెప్పింది.

తల్లికి వచ్చిన గుండె జబ్బు గురించీ, చేయవల్సిన చికిత్స గురించీ దానికి అయ్యే డబ్బు గురించీ ఆయన కొడుకులకు చెప్పలేకపోయాడు. సుభద్రే కొడుకులకు ఫోన్ చేసింది.

పెద్ద కొడుకు ఆందోళన పడుతూ అన్నాడు “వెంటనే ట్రీట్‌మెంట్ చేయించుకో. డబ్బుది ఏముంది? ఇవాళ వస్తుంది. రేపు పోతుంది. ప్రాణం తిరిగిరాదు కదా. అందుకని ఎక్స్‌పర్ట్ డాక్టరు చేత ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఆపరేషన్ చేయించండి. నేను పంపుదామంటే, కుదరంటం లేదు. మీ మనవడు శ్రీకాంత్ ఈ నెలలో ఆమెరికాలో చదువుకోవడానికి వైళ్తున్నాడు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే కదా. అంచేత వాడిని పై చదువులకు పంపిస్తున్నాను. తమ్ముడిని అడగండి. నేను తరువాత ఎడ్జస్ట్ చేస్తానని చెప్పండి..” అంటూ మొండి చెయ్యి చూపించాడు.

సుభద్ర భర్తతో అన్నది “పాపం వాడు మాత్రం ఏం చేస్తాండండీ? శ్రీకాంత్‌ని అమెరికా పంపిస్తున్నాడట. మన కుటుంబంలో ఇంత వరకూ అమెరికా వెళ్లి చదువుకున్న వాళ్లు ఎవరూ లేరు. రాకరాక వాడికీ అవకాశం కల్సి వచ్చింది. అదీ సంతోషించ వల్సిన విషయమే గదా.. అన్నీ ఒక్కసారి వచ్చాయి.. పోన్లెండి, పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు?” అని పెద్ద కొడుకు మీద జాలిపడింది సుభద్ర.

రెండో కొడుకుకీ ఫోన్ చేసి చెప్పింది. తల్లి అనారోగ్యం గురించి విని అతనూ బాధపడ్డాడు. డబ్బు విషయంలోనే నిరాశ ఎదురైంది.

“నీకు అనారోగ్యం అంటే ఆశ్చర్యంగా ఉంది. అశ్రద్ధ చేయకుండా చికిత్స చేయించుకో. నేను డబ్బు పంపుదామంటే వీలు కావటం లేదు. కిందటి వారమే అయిదు లక్షలు పెట్టి కారు కొన్నాం. అక్కడా అక్కడా ఉన్నదంతా పోగు చేసి కారు కొన్నాం. ఈసారి కారులోనే వస్తాం. నిన్ను కారులో ఎక్కడికన్నా తీసుకవెళ్లాలని అనుకుంటున్నాను..” అని చెప్పాడు.

సుభద్ర సంతోషించింది “ఎప్పటి నుంచో కారు కావాలని, అందులో తిరగాలని కలలు కన్నాడు. దేవుడి దయవల్ల ఇన్నాళ్లకి వాడి కోరిక తీరింది” అన్నది.

రామచంద్రరావుకి కొడుకులు ఆదుకుంటారన్న మిణుకు మిణుకు మంటున్న ఆశ కాస్తా ఆవిరైపోయింది.

“అడ్డాల నాడు బిడ్డలు గానీ గడ్డాల నాడు కాదు. ఇది మన పిల్లలు విషయంలో మరోసారి రుజువు అయింది. తల్లికి ప్రాణం మీదకు ముంచుకొచ్చిదంటే, ఆదుకునేందుకు సవాలక్ష కారణాలు ముందుకొస్తయి. ఒకవేళ వాళ్లకు మనసులో ఏమూల నన్నా కాస్త ప్రేమ ఉన్నా, వాళ్లను శాసించే కోడళ్లూ, మనవాళ్లూ, మనవరాళ్లూ వాళ్ల అవసరాలూ వీళ్ల చేతులు కట్టేస్తయి. ఈ ప్రపంచంలో నికార్సుగా నీకు నేను, నాకు నువ్వు మాత్రమే మిగిలాం. అందుచేత ఇది మన ఒంటరి పోరాటం.. ఒక పని చేస్తాను ఇల్లు అమ్మేస్తాను. ఇల్లాలి కన్నా ఇల్లు ఎక్కవేమీ కాదు. కాని ఇప్పటికిప్పుడు అమ్మాలన్నా ఎంత వరకు సాధ్యపడుతుందో తెలియదు. ఎంత వస్తే అంతకు తెగనమ్మేస్తాను..” అన్నాడు రామచంద్రరావు.

ఇల్లు అమ్ముతున్నామన్న విషయం చెప్పగానే పెద్ద కొడుకు అన్నాడు.

“ఆ ఇంట్లో పుట్టి పెరిగాం. అందుచేత ఆ ఇల్లు కూడ తల్లిలాంటిదే. ఆ ఇంటి మీద నున్న మమకారం అంతా ఇంతా కాదు. అది మరొకరి సొత్తు అవుతుందంటే వినటానికే బాధగా ఉంది. ఇప్పుటి అవసరం అలాంటిది కదా. మీ నిర్ణయాన్ని కాదనటం లేదు. కానీ ఎంత డబ్బు అయినా సరే, ఆ ఇల్లు నేనే కొందామనుకుంటున్నాను. తమ్మూడూ, నేనూ ఇద్దరమే కదా హక్కుదారులం. ఇల్లు ఎంతకు అమ్ముతున్నారో చెప్పండి. తమ్ముడి వాటా మేరకు వాడికి ఎప్పడో ఒకప్పుడు డబ్బు ఇచ్చి నేనే ఇల్లు సొంతం చేసుకుంటాను..” అని చెప్పాడు.

రెండో కొడుకూ దాదాపుగా ఇదే మాట అన్నాడు.

రామచంద్రరావుకి పరిస్థితి చాలా విచిత్రంగా తోచింది. తల్లికి ఆపరేషన్‌కు సాయం చేయటానికి ఎవరి దగ్గరా డబ్బు లేదు. కానీ ఆస్తిని చేజిక్కించుకోవటానికి మాత్రం డబ్బు ఉన్నది.

ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉండగానే, రెండు రోజుల్లో వస్తున్నట్లు కూతురు ఫోన్ చేసింది. పది లక్షల రూపాయలు తండ్రి ఖాతాకు జమ చేసింది.

రెండు వారాలు ఆఫీసుకు సెలవు పెట్టి వచ్చింది. దగ్గరుండి తల్లికి ఆపరేషన్ చేయించింది.

ఆమె ఇంటికి తిరిగి వచ్చాక ఒక రోజు రామచంద్రరావు కూతుర్ని అడిగాడు. “ఇంత డబ్బు ఇంత ఆకస్మాత్తుగా ఎలా తెచ్చావు” అని.

“నా ప్రావిడెంట్ ఫండ్ నుంచి వీలున్నంత డబ్బు డ్రా చేశాను. నా బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టాను. ఇంకా కొంచెం కావాల్సి వచ్చింది. ఒక చిట్ కంపెనీలో పది లక్షల సగానికి సగం పాట పాడి డబ్బు పోగు చేశాను. నెమ్మదిగా తీర్చుకుంటాను. ఇవేవీ అమ్మ ప్రాణం కన్నా విలువైనవేమీ కాదుగదా నాన్నా” అన్నది కూతురు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here