చిరుజల్లు-89

0
12

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఉద్యోగ పర్వం

[dropcap]ప[/dropcap]ది గంటలు అయింది.

ఆఫీసులో సందడి ప్రారంభం అయింది. ఒక్కొక్కరే వచ్చి కుర్చీల్లో కూలబడుతున్నారు.

కల్పన వచ్చి గంట అయింది. పనిలో మునిగిపోయింది. శ్యామల వచ్చి పలకరించింది.

“తమరు తపోనిష్టలో ఉన్నట్లున్నారు. ఒక్కక్షణం మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చా?”

“చెప్పు” అన్నది కల్పన చదువుతూనే.

“ఏం లేదు. ఉదయం అందరి కన్నా ముందే వస్తున్నావు. సాయంత్రం అందరి కన్నా ఆలస్యంగా వెళ్తున్నావు. వచ్చినప్పటి నుంచీ వంచిన తల ఎత్తకుండా పని చేస్తున్నా, ఎంతకీ తెమలటంలేదు. నువ్వు ఇంత కష్టపడ్డా నీ మీద జాలిపడే వాళ్లే లేరు” అన్నది శ్యామల.

“జాలి పడాల్సిన పనేముంది? జీతం ఇస్తున్నప్పుడు పని చేయాలి గదా..”

“జీతం నీకు ఒక్కదానికే కాదు గదా. మిగిలిన వాళ్లకీ ఇస్తున్నారు. కానీ వాళ్లంతా కబుర్లుతో కాలక్షేపం చేస్తున్నారు. నువ్వేమో టైం చాలక అవస్థపడుతున్నావు..” అన్నది శ్యామల.

కల్పన నిట్టూర్చింది.

మాధవరావు ఏదో విధంగా తనని కార్నర్ చేయాలని చూస్తున్నాడు. వాడి ఆటలు సాగనివ్వకూడదని అనుకున్నది కల్పన. అసలే పని ఎక్కువ అనుకుంటే నళిని దగ్గర నుంచి రెండు సబ్జక్ట్స్, కాత్యాయిని దగ్గర నుంచీ ఒక సబ్జక్ట్ అదనంగా ఇచ్చాడు.

ఎంత కష్టమైనా కల్పనకు ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజానికి కల్పనకు రఘురాంతో వివాహం అయింది. అతను జూనియర్ ఆఫీసరుగా పని చేస్తున్నాడు. సంపాదనకు లోటు లేదు.కాని అతనికి సరదాలు ఎక్కువ. ఆడవాళ్లతో స్నేహాలూ ఉన్నాయి. వాళ్లతో తిరుగుళ్లు వల్ల ఎంత డబ్బూ చాలటం లేదు.

అందుచేత తనూ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. కానీ భార్య ఉద్యోగం చేయటం అతనికి సుతరామూ ఇష్టం లేదు. ఉద్యోగం చేస్తే, తను తిరిగినట్లే ఆమె తిరుగుతుందని అనుమానం. ఈ విషయంలోనే ఇద్దరికీ పేచీ వచ్చింది.

కల్పన వచ్చి తల్లి దగ్గర ఉంటోంది.

“ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించుకోవటం సహజం అయిపోయింది. ఏ ఆఫీసులో చూసినా సగానికి సగం మంది ఆడవాళ్లే ఉంటున్నారు. ఉద్యోగం చేస్తానంటే వద్దనే వాడిని, ఇతడ్ని ఒక్కడ్నే చూస్తున్నాను” అన్నది కల్పన తల్లి.

***

“నువ్వు భర్తను వదిలేశావట కదా?” అన్నాడు మాధవరావు ఒకసారి.

“అవన్నీ మీకెందుకు? ఆఫీసు విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి” అన్నది కల్పన.

ఒకసారి ఆమెను లేటుగా ఉండమన్నాడు. ఎవరూ లేరు గదాని ఆమె చెయ్యి పట్టుకున్నాడు.

“నేను పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు. అప్పుడు నీ భార్య వచ్చి నా కాళ్లు పట్టుకుంటుంది” అన్నది కల్పన.

అప్పటి నుంచీ మాధవరావుకి కల్పన మీద ద్వేషం పెరిగిపోయింది. ఆమె దగ్గర పెండింగ్ ఎక్కవగా ఉంటోందని పై ఆఫీసర్‌కి ఫిర్యాదు చేశాడు.

“మాధవరావు ఆ సీట్లో ఉన్నంత కాలం పని పెండింగ్‌లో ఉంటూనే ఉంటుంది. పది మంది చేయాల్సిన పని ఒక్కరికే ఇచ్చి చేయమంటే పెండింగ్ ఉండక తప్పదు. ఆయన ఎవరు ఎంత పని చేస్తున్నారో తెల్సుకోరు గానీ, ఎవరి భర్త ఊళ్లో లేడో, ఎవరి భర్త సంపాదన ఎంతో, ఎవరు ఎన్ని సినిమాలు చూస్తారో, ఎవరికి ఎన్ని చీరలు ఉన్నాయో తెల్సుకునేందుకు ఆసక్తి ఎక్కువ..” అని పై ఆఫీసర్‌కి కల్పన స్పష్టం చేసింది.

ఆ రోజు కల్పన ఇంటికి వెళ్లేటప్పటికి గోటు దగ్గరున్న స్కూటర్ చూసి ఆశ్చర్యపోయింది.

లోపలికి వెళ్తూనే భర్తను చూసి చూడనట్లు లోపలికి వెళ్లిపోయింది. తల్లి మందలించి ముందు గదిలోకి పంపించింది.

భర్త వంక చూసింది. బాగా చిక్కిపోయాడు. మొహం వాడిపోయింది. బట్టలు నలిగిపోయాయి. జుట్టు రేగిపోయింది. ఒంటరి బ్రతుకు వేసిన ముద్ర మొహంలో స్పష్టంగా కనిపించింది.

“మా ఆఫీసులో ఖాళీ వచ్చింది. దానికి దరఖాస్తు పెట్టుడానికి రేపే ఆఖరి రోజు. అప్లికేషన్ తీసుకొచ్చాను. సంతకం పెట్టి ఇవ్వు” అన్నాడు.

కల్పన ఆశ్చర్యంగా అతని వంక చూసింది.

అతనా అప్లికేషన్ ఫారం ఆమెకు అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here