Site icon Sanchika

చిరుజల్లు 9

లేత తళుకు లొలుకు పలుకులు

[dropcap]M[/dropcap]any words hurt than swords.

మాటే గదా అనుకుంటాం గానీ, దానికున్న శక్తి అపారమైనది. అగ్ని లాగా, కత్తి లాగా, పదునైన ఆయుధం లాగా మాట వల్ల ఎనలేని మేలు జరుగవచ్చు, సరిదిద్దుకోలేని కీడు జరుగవచ్చు.

లేత తళుకు లొలుకు పలుకులే, మాటలై, తేనెతేటల పాటలై, జోలపాటలై పసివాడిని నిద్రపుచ్చుతాయి. మాటలే, ఉద్రేకాన్ని రెచ్చగొట్టే మాటలే, గుంపులు గుంపులుగా మారి జనం తిరగబడేలా చేస్తాయి. ధైర్యంగా ధీరోదాత్తంగా ఆదేశించే మాటలే సైనికులను మృత్యోన్ముఖునిగా నడిపిస్తయి. వివేకవంతుని మాటలే వివేకానందుని సూక్తులై చిరస్థాయిగా శిలాశాసనాల్లా తరతరాలకు స్ఫూర్తిదాయకమవుతాయి. ఒక దేశాధినేత జై జవాన్, జై కిసాన్ అంటే అది నినాదమై, దేశమంతటా, ఆసేతు హిమాచలం ప్రతిధ్వనిస్తుంది.

ఎదుటి వ్యక్తి మన మాటలకు స్పందిస్తాడు. పొగిడితే పొంగిపోయి, ఆశించిన దాని కన్నా పదింతలు మిన్నగా మేలు చేస్తాడు. మన మాటలే చురకత్తుల చిరుమొనలై, ఎదుటివారి హృదయాన్ని గాయపరుస్తయి. కొందరితో మనం చెప్పే మాటలే, మనల్ని యావజ్జీవిత మిత్రులుగా మారుస్తయి. మరికొన్ని మాటలే తూటాలై దూసుకుపోయి, బద్ధ శత్రువులను తయారు చేస్తయి.

మాటలు శబ్దంగా మారిన హృదయ స్పందనలు. కవిత్వం మనలను అమితంగా ఆకర్షిస్తుంది. శబ్దాడంబరంతో కూడిన భావమే గదా కవిత్వం అంటే.

ఒక పాదుషా వారు తన రాజధాని నగరాన్ని విడిచి వెళ్లి చాలా దూరంలో ఒక సుందరమైన ప్రదేశంలో గుడారాలు వేసుకున్నాడు. రాజు తలచుకుంటే కొదవ ఏముంటుంది? భోగ భాగ్యాలన్నీ ఆయన పాదాల చెంతకు చేరుతాయి గదా. పలు రకాల తరు లతలు, కనువిందు చేసే రంగు రంగుల పూలు, పక్షుల కల కూజితాలు, వింతలు, వినోదాలు, విందులు, సంగీత కచేరీలు, నృత్యాలు, కవితా చర్చలు అన్నీ అక్కడే జరిగిపోతున్నాయి. ఋతువులు మారుతున్నయి. ప్రకృతి విన్యాసాలు చూడ చక్కగా ఉన్నయి. కాలాలు గడిచిపోతున్నా రాజుగారు తిరిగి రాజధానికి పయనమవడం లేదు. మంత్రివర్యులు చూచాయగా చెప్పి చూసినా రాజుగారిలో చలనం లేదు. ఇక ఇది పని కాదని, కవిగారికి ఆ పని అప్పగించారు. ఆయన కవిత్వం ఒలకబోశారు.

రాజధాని అయిన బుఖారానగరం ప్రక్కన ప్రవహించే నది, అలాగే, ఆ నగరంలో తిరుగాడుతుండే ప్రియురాండ్రు గుర్తుకొస్తున్నారంటూ ప్రారంభించాడు. ఆకాశం మీదకు చంద్రుడు రానందున ఆకాశం చిన్నబోతున్నదన్న భావం వెలిబుచ్చాడు. ఇక్కడ ఆకాశం అంటే రాజధాని; చంద్రుడు అంటే రాజు – చంద్రుడి కోసం నక్షత్రాల్లా ప్రియురాండ్లు వేయి కన్నులతో ఎదురుచూస్తున్న భావాన్ని వ్యక్తీకరించాడు. ఆ ఆలోచన రాగానే రాజుగారు మేజోళ్లు అయినా ధరించకుండా, బయటకు వెళ్లి, అశ్వాన్ని అధిరోహించి రాజధానిని చేరుకున్నాడు.

ఏమున్నది ఈ కవితలో?… ఆ పదాల కూర్పులో రాజు గారి మనసు మార్చేంత శక్తి ఎలా వచ్చిందంటే, వినడానికి వింతగానే ఉంటుంది. కానీ ఎటువంటి కరడు గట్టిన మనసునైనా మంచు గడ్డలా కరిగిపోయేలా చేసే శక్తి, యుక్తి మాటలకే ఉంది.

అందుకే సినీ కవి ఆత్రేయ అంటాడు, మాటలు రాయటం అంటే మాటలు కాదు. అంటే ఆ మాటలు సందర్భాన్ని బట్టి, భగ్గున మండే అగ్గిపుల్ల కావాలి లేదా వలపుల తలపులు రేపే పూలబాణం కావాలి లేదా జాలితో కన్నీరు కార్పించే సుతిమెత్తని ఆయుధం కావాలి. మాటలు ఈత ఆకుల చాప లాంటివి, తిరగేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి.

మాటలు ఎంతవరకు అవసరమో, అంత వరకే వాడాలి. ఎంత తక్కువ వీలైతే, అంత తక్కువ మాటలు వాడాలి. ఎక్కువ మాటలు వాడితే, అందులో ఏదో ఒక మాట విపరీతార్థానికి దారితీయవచ్చు. వ్యంగ్య విమర్శగా కనిపించవచ్చు. దాని వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరగనూ వచ్చు. ఒకసారి మాట పెదవి దాటితే, దాని కున్న వేగం రేసు గుర్రానికి కూడా ఉండదు. అందుకే రాజకీయ నాయకులు తరచూ నాలిక కరచుకొని, నా మాటలను వక్రీకరిస్తున్నరంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు యమ యాతన పడుతుంటారు. మాటలు కొండొకచో శాంతములయ్యె, నిశాంతములయ్యె, క్రాంతములయ్యె – అనీ అన్నారు

వాక్శుద్ధి వల్లనే వాక్సిద్ధి కలుగుతుంది.

వేదములన్నీ శబ్దములే. శబ్ద తరంగములే. వేదోచ్ఛారణ వింటుంటే, శ్రవణానందంగా ఉంటుంది. వాటికున్న శక్తీ అపారమే. అవన్నీ యాత్మాంతరాత్మ పరమాత్మ జ్ఞానాత్మ స్వరూపాలుగానే భావిస్తారు.

మనోబుద్ధి చిత్తాహంకారలను వెల్లడి చేసేవి మాటలే. శబ్దాలే మేధాశక్తిని వెల్లడిస్తయి. మధురోక్తులను పలికిస్తయి. కృతులన్నీ శబ్దాకృతులే.

పెదవుల నుంచి వెలువడే పదములన్నీ, ఉడుపుల ధరించిన అంతరంగ మథనాలే. ఒకరు పండితుడు కావటానికి, ఒకడు విద్రోహి కావటానికి కారణమైనవి అతని ఆలోచనా తరంగాలే. అతని నిరంతర మేధోమథనమే. ఈ ఆలోచన ఎప్పుడూ శిఖరం మీద నుంచి జారిపడే సెలయేరు లాంటిది. దానికి అంతం లేదు. జీవనాన్ని సశ్యశ్యామలం చేసేది ఈ ఆలోచనా స్రవంతే. అది ఎటు ప్రవహిస్తే, బ్రతుకు అటువైపు సాగుతుంది. ఈ స్రవంతి మొదలైన చోట పరిశుద్ధంగానే ఉంటుంది. కానీ మార్గమధ్యంలో అనేకానేక కారణాల వల్ల కలుషితమైపోతుంటుంది. మనిషి సౌభాగ్యం, ఆరోగ్యం, అందం, ఆనందం, బాగోగులు అన్నిటికీ హేతువు అతని ఆలోచనే. ఇది వక్రమార్గం పడితే, జీవితమూ దుర్భరమవుతుంది. అలాంటి వారి ఆలోచనలన్నీ దురాలోచనలుగానే మారిపోతుంటయి. పర్యవసానాలు దారుణంగానే ఉంటయి.

మంచివాడి పక్కన నిలబడి ఎవడన్నా తుమ్మినా, దగ్గినా పక్కకు తప్పుకున్నట్లే, దుర్మార్గుడి ఆలోచనలకూ దూరంగా ఉండాలి. ఆలోచనలే మన చేత అనేక మంచి మాటలు చెప్పిస్తూ ఉంటయి. మంచి పనులు, కొత్త పనులు, కొత్త కొత్త పరిశోధనలూ చేయిస్తూ ఉంటయి. ఒక ఆలోచనలు జాబిల్లికి నిచ్చెనలు వేస్తుంటయి. సదా, జీవితమంతా అటే సాగిపోతుంటది. మరొకని ఆలోచనలు భీకర యుద్ధాలను సృష్టించి, శవాల గుట్టలను పొగు చేయిస్తూ ఉంటయి. మంచికీ, చెడుకీ కారణభూతమైనవి మనిషి మస్తిష్కంలో మసలే భావ తరంగాలే. అయితే ఇవేవీ పైకి కనిపించవు కాబట్టి సరిపోయింది.

ఆలోచనలు రోజు రోజుకీ నీ శక్తి సామర్థ్యాలు పెంచుతూ ఉండాలి. ఇతరులు ఎవ్వరూ చేయని, చేయలేని ఘన కార్యాలు నువ్వు చెయ్యాలి. అంతిమ లక్ష్యానికీ నీకూ మధ్య ఏదీ అడ్డు నిలవకూడదు. నీ కృషికి అవాంతరం కలుగకూడదు. ప్రపంచంలో ఈరోజు మనిషి అనుభవిస్తున్న అన్ని సదుపాయాలకూ కీలకమైన సూత్రం ఇదే. ఆలోచన స్రవంతే.

మనిషి ఆలోచనలు కలుషితమైనప్పుడు కోపం, ద్వేషం, అసూయ, భయం, తిరస్కారం, తిరుగుబాటు ఇవన్నీ ప్రత్యక్షమవుతాయి.

సంభాషణలు, చర్చలూ సాగించేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. ప్రతివాడి లోను అంతర్, బహిర్ ముఖాలున్నట్లుగానే లోపలి ప్రపంచం, బాహ్య ప్రపంచం అని రెండు ఉంటయి. మనసులో ఏవి అనుకుంటూ ఉంటామో, అది లోపలి ప్రపంచం; ఏది బయటకు వ్యక్తపరుస్తమో, అది బాహ్య ప్రపంచం అవుతుంది.

ఎదుటివాడి మీద నీకు సదభిప్రాయం లేకపోవచ్చు. అతని ప్రవర్తన నచ్చకపోవచ్చు. అప్పుడు అతనితో ఘర్షణకు దిగితే, శత్రువులు పెరుగుతారు. దూరంగా తొలగిపోతే, శత్రువుల సంఖ్య పెరగకపోవచ్చు. విమర్శలు, వ్యంగ్యాస్త్రాల జోలికి పోతే, తిరిగి వారూ అవే అస్త్రాలను సంధిస్తారు. అనటం, అనిపించుకోవటం వలన విలువ తుగ్గుతుందేగానీ, హెచ్చదు.

ఇక సభలలో ప్రసంగించటం, సభికులను ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ. దానికి అభ్యాసం ఉండాలి. అలవాటు లేని వారు ప్రసంగించకపోవటమే ఉత్తమం. మీరు చెప్పదల్చుకున్నది అందరికీ తెల్సినదే అయితే, అది చెప్పవలసిన అవసరం లేదు. కొత్తగా ఏదైనా చెప్పదలిస్తే, అది అందరికీ నచ్చే విధంగానూ, అందరూ మెచ్చే విధంగానూ ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు అరగంట సేపు మాట్లాడుతాడు. వాళ్ళు తనని పిలవడం జరిగింది, నేను వెళ్ళటం జరిగింది, చూడడం జరిగింది – అంటూ చర్విత చర్వణంతోనే అరగంట గడిపేస్తాడు. వంద మంది ఉన్న సభలో, అరగంట వృథా ప్రసంగం చేస్తే, యాభై గంటల సమయాన్ని దుర్వినియోగం చేసినట్లే మరి.

సభలో ప్రసంగించబోయే విషయంలో స్పష్టత ఉండాలి. ఒక విషయం మాట్లాడుతూ, మధ్యలో ఇంకో విషయం ప్రస్తావించి, అందులోనుంచి మరొక విషయాన్ని ఎత్తుకుంటే శ్రోతకు విసుగు చిరాకు కలగటమే కాదు, ఆ వక్త మీద చులకన భావం ఏర్పడుతుంది.

అసలు మన నిత్యజీవితంలో ఎదురయ్యే పనులలో తొంభై శాతం వరకూ రొటీన్ విషయాలే ఉంతయి. పది శాతం మటుకే ఆలోచించి నిర్ణయించుకోవాల్సినవి ఉంటయి. వీటిల్లో కూడా తొంభై శాతం వరకూ గతానుభవాల ద్వారా నిర్ణయించుకునే వీలుంటుంది. మన ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ ఇలా ఏర్పడినవే. ప్రతి చిన్న సమస్యా ఒక స్పీడ్ బ్రేకర్ కానవసరం లేదు. కానీ అవసరమైన చోట స్వంత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే ఒక క్షణమైనా మనిషి లోని విచక్షణా జ్యోతి వెలగాలి.

మన ఆలోచనలను బట్టే మన మాటలు, మన పనులు అన్నీ ఒకే గమ్యం వైపు నడుస్తుంటయి. సూది ఎటు దూరితే సూది లోని దారమూ అటే దూరుతుంది.

శబ్దం వాయిద్యాలలోనుంచి వస్తుంటుంది. దానిని అనుభవజ్ఞుడైన విద్వాంసుడే సుస్వరమైన సంగీతంగా మార్చగలుగుతాడు.

మనసులోని ఆలోచనల ప్రతిరూపమే మాటలు, సరస, విరస సంభాషణలు, సంభావనలు, సత్కారాలూ, అన్నీను.

కరుణశ్రీ అంటాడు:

కాకి చేసుకున్న పాపమేమి?

కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి?

మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు.

Exit mobile version