Site icon Sanchika

చిరుజల్లు-90

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

వినాయకుడి బొమ్మలు

[dropcap]ల[/dropcap]క్ష్మి బొమ్మలు చేస్తోంది. వినాయకుడి బొమ్మలు.

‘ఇగ ఈపాలి ఎట్లయిన నాలుగొందల బొమ్మలు చేయాల. మస్తు పైసలు పోగుచెయ్యాల.. గిప్పుడు గాకుంటే మళ్లి గిన్ని పైసలు దొరకవు’ అనుకుంది లక్ష్మి.

కానీ రాత్రింబగళ్లు చేసినా అన్ని బొమ్మలు తయారయ్యేటట్లు లేవు. ‘ఇంక వాటికి రంగులెయ్యాల’ అనుకుంది అంత వరకూ తయారు చేసిన బొమ్మలన్నీ గుడిసెలో ఒక మూల చేర్చి.

అవతల పక్క చాప మీద పడుకున్న యాదమ్మకు దగ్గు తెర వచ్చింది. ఖంగు ఖంగుమని ఊపిరాడకుండా దగ్గుతోంది. లక్ష్మి కుండలో నీళ్లు తెచ్చి ఇచ్చింది. యాదమ్మ గొంతు తడుపుకుంది.

“రోగం ఏమున్నదో గానీ పేణం పోతలేదు, ఉంట లేదు. దవ్వకనాలోకి పోతే ఇంక ఎక్సరే అంటడు, నెత్తురు పరీక్ష అంటాడు. పైసలు గుంజుతున్నారు గానీ రోగమైతే తక్కువ అయితలేదు. ఈ రోగంతో పొయ్యే దానికి నేను తయారు ఉన్నగానీ, నీకు లగ్గం అయితే నాకు బేఫికరుంటది..” అని యాదమ్మ అంటోంది.

“ఇక ఆ ముచ్చట ఆపరాదే..” అన్నది లక్ష్మి కంచంలో అన్నం పెడుతూ.

యాదమ్మ కష్టజీవి. మార్కెట్ కెళ్లి కూరలు తెచ్చి, నెత్తిన తట్ట పెట్టుకుని ఇల్లిలూ తిరుగుతూ, అయిదూ పదీ సంపాదించుకుంటూ రోజులు వెళ్లబుచ్చింది. ఇప్పుడింక ఓపిక తగ్గిపోయింది. అంత శ్రమ పడలేక పోతున్నది. రోజు గడిచేదెలా అన్న ప్రశ్న ఎదురవుతోంది.

లక్ష్మి పెళ్లికి ఎదిగింది. నిన్న మొన్నటి దాకా కన్నుల పండుగగా కనిపించిన పిల్ల ఇప్పుడు గుండెల మీద కుంపటి అవుతోంది. తను కన్ను మూస్తే, కూతురు గతేమిటి – అన్న ప్రశ్న యాదమ్మను క్రుంగదీస్తోంది.

లక్షి తల్లికి అన్నం పెట్టింది. ఆమె తిన్న తరువాత కంచెం కడిగి ఒక మూల పెట్టింది.

దగ్గర్లోనే వినాయకుడి గుడి ఉన్నది. లక్ష్మికి పూజా పునస్కారాల గురించి ఏమీ తెలియకపోయినా, రోజూ ఒకసారి గుడికి వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చి తరువాతనే అన్నం తింటుంది.

లక్ష్మి వెళ్ళే వేళకు పూజారి తప్ప ఇంకెవరూ ఉండరు. క్రమం తప్పకుండా రోజూ వచ్చే భక్తురాలు గనుక పూజారికి లక్ష్మి పైన అభిమానం ఎక్కువ. తీరికగా ఆయనతో తన సమస్యను చెప్పుకుంటుంది. పూజారి తనకు తోచిన సలహా చెబుతాడు. దేవుడే పూజారి ద్వారా తనతో మాట్లాడుతుంటాడని లక్ష్మికి అనిపిస్తూ ఉంటుంది.

లక్ష్మికి ప్రసాదం ఇచ్చాక పూజారి అడిగాడు “ఏం లక్ష్మీ ఇప్పటికి ఎన్ని ప్రతిమలు తయారు చేశావు?” అని.

“ఈపాలి అయిదొందలు సెయ్యాలని అనుకున్నాను అయ్యగారూ. కాని రెండొందలు కూడా కాలే. పండగ దగ్గర పడింది. ఈసారి పైసలు మస్తు జమ చేసి మా అమ్మకు మంచి మందు ఇప్పియ్యాలనుకున్నా. రోగం తగ్గుత లేదు. డాక్టరు శానా పైసలు అయితయి అంటుండు” అన్నది లక్ష్మి ఆయనకు ఎదురుగా కూర్చుంటూ.

“అందుకే అన్నారు యమధర్మరాజు ప్రాణాలను మాత్రమే తీసుకుంటాడు. కాని వైద్యుడు డబ్బూనూ, ప్రాణాలనూ కూడా తీసుకుంటాడని. నువు దేవుడ్ని నమ్ముకుని రోజూ ఆయనతో నీ కష్టాలు చెప్పుకుంటున్నావు. అన్నీ ఆయనే చక్కదిద్దుతాడు. దిగులు పడకు” అన్నాడు పూజారి.

“దేవుడు నాకయితే కనిపియ్యడు కదా అయ్యగారూ” అన్నది లక్ష్మి.

“నీకు ఆయన కనిపించకపోతేనేం? ఆయనకు నువ్వు రోజూ కనిపిస్తున్నావు కదా. అది చాలు..”

“ఏమో అయ్యగారూ. నా కెందుకో గుబులు అయితుంది. మాయమ్మ తప్ప నాకు ఇంకెవరూ లేరు. అమ్మ కూడా..” లక్ష్మికి దుఃఖం పొంగు కొచ్చి మాట బయటకు రావటం లేదు.

“ఏం దిగులు పడకు. వినాయకుడే నీకు కొండంత అండగా నిలుస్తాడు. భవిష్యత్తు గురించి బెంగ పడకు. అన్నీ ఆయనే చూసుకుంటాడు” అంటూ పూజారి ధైర్యం చెప్పాడు.

“దేవుడు మనకు అందనంత దూరంలో ఉన్నాడయ్యగారూ..”

“లేదు. దేవుడు ఎప్పుడూ పిలిస్తే పలికేంత దూరంలోనే ఉంటాడు. చక్కగా ముస్తాబు చేసి మంచి చీర కడితే, సాక్షాత్తూ లక్ష్మీదేవిలా ఉంటావు. నీలాంటి దాన్ని చేసుకోవాలంటే, వాడు ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఆ విఘ్నేశ్వరుడే నీకు తగిన వరుడ్ని పంపిస్తాడు” అని దీవించాడు పూజారి.

మర్నాడు బజారుకు వెళ్లి బొమ్మలకు వేయాల్సిన రంగులు తెచ్చుకొని రాత్రిదాకా ఆ పనిలో మునిగిపోయింది.

చీకటి పడింది.

బయట వాన పడుతున్నది. జల్లు లోపలికి వస్తోంది. తడిక అడ్డం పెట్టినా సందుల్లో నుంచి వచ్చే నీటితో సగం నేల తడిసిపోయింది. మిగతా సగం చెమ్మగిల్లింది. యాదమ్మ చాప మీద పడుకొని చలికి వణుకుతోంది.

గాలికి దీపం ఆరిపోయింది.

బొమ్మలు తడిసిపోతున్నయి. లక్ష్మికి రెండు చీరలే ఉన్నయి. ఒకటి ఒంటి మీద ఉంటే, మరొకటి తడిక మీద ఉంది. రెండో చీర తీసి బొమ్మల మీద కప్పింది. కాని వెంటనే మనసులో సంకోచం మొదలు అయింది.

దేవుడి బొమ్మల మీద తను కట్టుకునే చీర కప్పి తప్పు చేశానన్న అనుమానం మొదలైంది. మనసులోనే చంపలేసుకుంది.

మర్నాడు బొమ్మలకు రంగు లేస్తోంది. నలుగురు మనుషులొచ్చారు. వాళ్లను ఆమె ఎప్పుడూ చూడలేదు.

“ఈ బొమ్మలు ఎవలు చేస్తున్రు?” అని అడిగాడొకడు. గుడిసెలోకి తొంగి చూస్తూ మిగిలిన ముగ్గురూ బయట నిలబడ్డారు.

“నేనే చేస్తున్న. ఏంటికి?”

“ఎన్ని బొమ్మలు చేసినవ్?”

“నీకేంటికి?”

“మొత్తం అమ్మితే వచ్చే పైసల్లో నాలుగో వంతు మాకియ్యాల..”

“మీకేంటికి ఇయ్యాల?” అన్నది లక్ష్మి అడ్డంగా నిలబడి కొంగు బిగించి.

“మేం ఈ బస్తీలో లీడర్ ఉన్నం. ఎవలు ఏ బిజినెస్ చేసినా మాకు మామూలు ఇయ్యాల.. లేకుంటే ఈ బస్తీలో ఉండనియ్యం..” అన్నాడు వాడు.

“నేనియ్య. ఎంతో కష్టంతోని బొమ్మలు చేస్తున్న. వాన పడతుంది. అమ్ముడయితయో లేదో తెల్వదు. నాకే నుక్సాన్ ఉంది. మీకు యాడికెళ్లి దెచ్చియ్యాల..” అన్నది లక్ష్మి.

“ఇగ అదంత జెప్పకు., పైసలు ఇస్తవా లేదా?”

“నేనియ్య.”

“మాకు పైసలు ఇయ్యకుండా ఈ బస్తీలో తిరగుతవా?”

“ఎందుకు తిరగ? ఈ బస్తీ నీయబ్బ జాగీరా?”

“ఎక్కువ మాట్లాడుతున్నవ్, ఇయ్యకుంటే జూడు ఏమైతదో?” అని బెదిరించి వెళ్లారు.

చుట్టు పట్టల గుడెసె వాళ్లంతా – వాళ్ళతోని ఎందుకు పెట్టుకున్నవే అన్నారు.

“నేనే పైసలు లేక ఛస్తున్న. మా యమ్మకు బీమారున్నది. దవకానాలో జేర్చలేక గమ్మున ఉన్న. ఈళ్లకు యాడికెళ్లిదెచ్చి ఇయ్యాల పైసలు?” అన్నది లక్ష్మి.

గుడిలోకి వెళ్లింది. ఆ గుండాల నుంచి కాపాడమని చెప్పుకుంది. దేవుడికీ, పూజారికీ కూడా.

“ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మానవ జన్మ లభించదు అని అంటారు. కొందరు మనుష్య జన్మ ఎత్తి మానవుల్లా కాక దానవుల్లా ప్రవర్తిస్తుంటారు” అన్నాడు పూజారి.

“రేత్రి వాన వచ్చినప్పుడు దేవుడి బొమ్మల మీద నా చీర గప్పిన. ఇగ దేవుడు గుస్స అయితుండు. ఆండ్లకోసమే తెల్లారి ఈ గుండాలను పంపిండు” అని మనసులోని సంకోచం బయట పెట్టింది.

“అది తప్పు ఎలా అవుతుంది? ఆయన వానలో తడవకుండా నీకు చేతనైన ప్రయత్నం చేశావు. దేవుడి మీద భక్తితో ప్రేమతో ఏం చేసినా, ఆయన చిరునవ్వుతో స్వీకరిస్తాడు. శబరి ఎంగిలి పండ్లు పెడితే తినలేదా?” అని పూజారి లక్ష్మికి నచ్చచెప్పాడు.

“ఈ గుండాలు ఏమైనా చేస్తారేమోనని భయపడుతున్నది..” అన్నది లక్ష్మి.

“మానవ జన్మ ఎత్తినప్పుడు భగవంతుడూ కొన్ని కష్టాలు పడ్డాడు. సుఖాలతో పాటు కష్టాలూ తప్పవు. ఇంత అందమైన గులాబీ పూల కింద ఈ దేవుడు ముళ్లు ఎందుకు పెట్టాడని కొందరు అనుకుంటారు. ఇలాంటి ముళ్ల కొమ్మలకు కూడా అందమైన గూలాబీలను పూయిస్తున్నాడని మరి కొందరు అనుకుంటారు. ఆయన్ని నమ్ముకో. నీ నెత్తిన బరువు బాధ్యతలు పెట్టాడని బాధపడకు. బరువు భారంతో నువు కుంగిపోకుండా, నీ పాదాల కింద ఆయన అరచేతిని పెట్టి ఆపుతాడు. అంటే నిన్ను నీ బాధ్యతలనీ ఆయనే తన చేతిలోకి తీసుకుంటాడన్నమాట. ఇంక దిగులెందుకు?” అని లక్ష్మికి ధైర్యం చెప్పాడు. సాక్షాత్తూ భగవంతుడే పూజారి చేత ఈ విషయాన్నీ చెప్పిస్తున్నట్లు అనిపించింది లక్ష్మికి.

పండగ దగ్గర కొచ్చింది. కొన్ని బొమ్మలను వీధిలోకి తీసుకెళ్లి అమ్ముతోంది. రాత్రిళ్లు మిగిలిపోయన వాటికి రంగులు వేస్తోంది.

రోజంతా ఎండలో నిలబడి అమ్మినా నాలుగో వంతు బొమ్మలు కూడా అమ్ముడు కావటం లేదు.

రాత్రి ఎనిమిది గంటలకు రద్దీ తగిపోయింది. బొమ్మలున్న తోపుడు బండిని నెట్టుకుంటూ ఇంటికి బయల్దేరింది.

ఆ వీధిలో లైట్లు లేవు. చీకటి.

నీడల్లా నులుగురు మనుషులు ఆమె దగ్గర కొచ్చారు.

“మా మామూలు ఇయ్యకుండా బస్తీలో బిజినెస్ చేస్తావంటే” అంటూ చుట్టుముట్టారు.

లక్ష్మి తిడుతోంది, అరుస్తోంది. కాని ఆమె మొర వినేవాడు ఎవడూలేడు. చేత్తో నోరు మూసారు. గిలగిలా గింజుకుంటున్నా ఆమెను బలవంతంగా చీకట్లో నుంచి మరింత చీకట్లోకి లాక్కుపోయారు. పాడుబడిన గోడల మధ్యకు తీసుకు పోయారు. లక్ష్మిని కింద పడేశారు. ఏడుస్తోంది. అరుస్తోంది. ఒకడు లక్ష్మి చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంకొకడు ఒంటి మీద చీర లాగేస్తున్నాడు.

ఆమెకు ఆ సమయంలో మొన్న వానలో తడుస్తున్న బొమ్మల మీద చీర కప్పిన దృశ్యమే కళ్ల ముందు కనిపిస్తోంది.

సరిగ్గా ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఎలుకలు, వినాయకుడి వాహనాలు. ఎలుకులు గుంపుగా వాళ్ల మీదకు ప్రాకటం ప్రారంభించాయి. వాళ్లు పచ్చి నెత్తురు తాగే కిరాతకులే అయినా, ఆ చీకట్లో ఆ చిట్టెలుకలు బారి నుంచి తప్పించుకునేందుకు పారిపోక తప్పలేదు.

“గిదేందిరా ఇన్ని ఎలుకలు మీదకు ఉరుకుతున్నయి. ఇగ ఇప్పుడు గాదులే.. పదండ్రి..” అని ఆ నలుగురూ ఆమెను వదిలి వెళ్లిపోయారు.

లక్ష్మి లేచి నిలబడింది. చీర సర్దుకుంది. తడబడే అడుగులతో రోడ్డు మీద కొచ్చింది. తన బండి దగ్గర పొట్టిగా, లావుగా ఉన్న ఒక మనిషి కనబడ్డాడు.

“ఇంత చీకట్లో యాడికి పోయనవు బిడ్డా, నీ ఇంటి తాన దింపుతా, పదా” అన్నాడు ఆ మరుగుజ్జు మనిషి.

ఆమెతో కొంత దూరం వచ్చాడు. ఇంతలో ఎవరో ఒక కుర్రాడు కనిపించాడు.

“రేయ్, రాముడూ, ఈ పోరిని ఇంటి కాడ దింపిరారా” అన్నాడా పొట్టి మనిషి.

రాముడు లక్ష్మికి తోడుగా నడిచాడు. ఇంటి దాకా తోడుగా వచ్చాడు. మర్నాడు కలుస్తానని చెప్పి వెళ్లాడు.

తెల్లవారాక లక్ష్మి గుడికి వెళ్లింది. పూజారిక జరిగినదంతా చెప్పింది.

“నేను చెప్పాను కదా. చేసిన పుణ్యం ఊరికే పోదు. అక్కరకొస్తుంది. నీకు మరుగుజ్జు రూపంలో కనిపించింది, ఎలుక వాహనాలను దుండగుల మీదకు దండెత్తి పంపిందీ, రాముడ్ని తోడుగా పంపిందీ ఎవరనుకున్నావు? అన్ని వందల ప్రతిమలు చేశావే? వాటి అన్నిటికీ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. పూజలు జరుగుతాయి. ధూపదీప నైవేద్యలూ అందుతాయి. కనుక ఇన్ని వినాయక విగ్రహాలను సృష్టించిన నీ శ్రమ, నీ భక్తి ఊరికే పోతుందా? నీకు పెళ్లి చేయటం, మీ అమ్మకు రోగం నయం చేయటం అంతా ఇంక ఆయన పనే” అన్నాడు పూజారి.

ఆ దేవుడే ఆయన చేత ఆ మాటలు పలికించాడని లక్ష్మికి అనిపించింది.

లక్ష్మి పూజారికి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆయన ‘శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు’ అని దీవించాడు.

లక్ష్మి గుడిలో నుంచి బయటకు వచ్చింది. రాత్రి తనకు తోడుగా వచ్చిన రాముడు నవ్వుతూ కనిపించాడు.

లక్ష్మికి సిగ్గు ముంచుకొచ్చింది. రాముడే ఆమె దగ్గరకి వచ్చాడు.

Exit mobile version