[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
పునరపి జననం
[dropcap]ఎ[/dropcap]క్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తారోనని హిమబిందు భయపడింది. తీరా ఆర్డర్స్ చేతికి వచ్చాక చూసుకుంటే, పెద్ద బరువు దించుకున్నట్లు ఫీల్ అయింది. సిటీలోనే మరో బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఎటోచ్చీ ఇప్పుడుంటున్న ఇంటికి చాలా దూరం. రావటం, పోవటమే పెద్ద సమస్యగా ఉంది. దగ్గర్లో ఇల్లు తీసుకోవాలనుకుంది.
ఆఫీసు బాయ్ ఒక ఇల్లు చూపించాడు. ఆమె చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ ఇంటి యజమాని లేడు. పనివాళ్లు ఉన్నారు. ఇంటి యజమాని పేరూ, ఫోన్ నెంబరూ ఇచ్చారు.
ఇంటి యజమాని ప్రకాష్ అనగానే హిమబిందు వెనకాడింది. ప్రకాష్ అంటే, అతడే అయి ఉండవచ్చు, కాకపోనూ వచ్చు.
మర్నాడు ఫోన్ చేసింది. గొంతు గుర్తు పట్టింది. అంటే అది అతని ఇల్లేనన్నమాట.
హిమబిందుకు పెళ్లి అయినప్పుడు పెద్దగా చదువుకోలేదు. పల్లెటూరిలో పుట్టి పెరిగినా ముద్దబంతి పూవ్వులా అందంగా ఉంటుంది. పెళ్లి అయ్యాక భవిష్యత్తు మీద బోలెడంత భరోసాతో మహానగరంలో కాలు పెట్టింది.
ఆమె పుట్టి పెరిగిన లోకం వేరు. ఇప్పుడు చూస్తున్న లోకం వేరు. నగరాల్లో నాగరికత వీరవిహారం చేస్తుంటుంది. అమానుషత్వం నడిరోడ్డులో నిద్రపోతుంటుంది. విజ్ఞాన సర్వస్వం అరచేతిలో అమరిపోతుంటుంది. మోసం, దగా మనిషిని నిలువు దోపిడీ చేస్తుంటాయి. ఈ నగరాల్లో మనిషి పైకి పోవటానికి ఎన్ని మార్గాలున్నాయో, దిగజారి పోవటానికీ అన్ని మార్గాలున్నయి.
హిమబిందు ఈ కొత్త ప్రపంచం వంక ఇంత లేసి కళ్లతో వింతగా చూస్తోంది. అన్నీ తెల్సుకోవాలన్న కుతూహలంతో భర్తను అడిగేది. అతను విసుక్కునేవాడు.
“రోబో అంటే ఏమిటండీ?” అని అడిగింది ఒకసారి.
“రోబో అంటే మరమనిషి” అన్నాడు.
“మరమనిషి అంటే ఏమిటి?” అని మళ్లీ అడిగింది.
“ఓర్నాయనో, నీకు చెప్పటం బ్రహ్మతరం కూడా కాదు. ప్రపంచంలో నీకు తెలియని విషయాలన్నీ నీకు తెలియ జెప్పమని నా ప్రాణం తీయకు. ఎంచక్కా అన్నం వండి, కూరలూ, పచ్చళ్లూ, చేసి వేళకు వడ్డించు చాలు. తిన్నాక గిన్నెలు శుభ్రంగా తోము. తోమిన తరువాత సాయంత్రం మళ్లీ అన్నం వండు. మళ్లీ గిన్నెలు తోము. పునరపి జననం, పునరపి మరణం అంటారు చూడు, అలాగన్న మాట” అన్నాడు ప్రకాష్.
అతని మాటల్లో హేళన ఉంది. ఎగతాళి ఉంది. ఇంతకన్నా నీవు ఏమీ చేయలేవు అన్న నిర్లక్ష్యం ఉంది.
రెండు రోజుల పాటు హిమబిందు సీరియస్‌గా ఆలోచించి చదువుకోవాలని నిర్ణయించుకుంది. ఆ విషయమే భర్తతో చెప్పింది.
“నువ్వా? చదువుతావా? సినిమా పత్రికలా? వార పత్రికలా?” అని అడిగాడు తాపీగా.
“అవి కూడా చదువుతాను. మీరు ఇది వరలో చదివినవన్నీ చదువుతాను. మీరు ఇంత వరకు చదవని పుస్తకాలు అన్నీ కూడా చదువుతాను..”
“అంత కోపం వచ్చిందేమిటి? నా మీదనేనా ఈ కోపం?”
“ఇవి కోపంతో కాదు. బాధతో అంటున్న మాటలు.. నాకేమీ రాదు గనుక నేర్చుకుందామనుకుంటున్నాను..” అన్నది హిమబిందు.
“అది ఎప్పుడో చేయవల్సిన పని. ప్రతి దానికీ ఒక సమయం, ఒక సందర్భం అని ఉంటుంది..” అన్నాడు ప్రకాష్.
“తెలియని విషయాలు తెల్సు కోవటానికి వయసుతో పని లేదు. వయోజన విద్యా కోసం ప్రభుత్వం బోలెడంత డబ్బు ఖర్చుచేస్తోంది. వాళ్లతో పోల్చుకుంటే నేను చిన్నదాన్నే..” అన్నది హిమబిందు.
మర్నాటి నుంచి మధ్యలో ఆగిపోయిన విద్యాభ్యాసం కొనసాగించటం మొదలు పెట్టింది. ట్యుటోరియల్ కాలేజీలో చేరింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే ఆమె కాలేజీకి వెళుతోంది.
“నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడటం అవసరమా?” అని అడిగాడు.
“కష్టపడకుండా ఏదీ రాదు కదా” అన్నది.
క్లాస్‌లో మిగతా వాళ్లకన్నా ముందు ఉంటోంది. ఆమెకు మంచి మార్కులు వస్తున్నాయి. అందరూ ఆమె వంక ప్రశాంసా పూర్వకంగా చూస్తున్నారు. గర్వంగా ఫీల్ అవుతోంది.
ఇంటికొచ్చి వంట చేస్తోంది. గిన్నెలు కడుగుతోంది. ఆ తరువాత పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటోంది. భోజనం చేసేటప్పుడు కూడా రెండో చేతిలో పుస్తకం ఉంటోంది. చదవటం ఒక వ్యసనంగా మారింది. కనిపించన పుస్తకాలు అన్నీ కొంటోంది.
“వీటికి ఎంత డబ్బు తగలేస్తున్నావో తెల్సా?” అన్నాడు ప్రకాష్.
“అవునా? డబ్బు తగలేస్తున్నానా? అయితే ఈ రోజునుంచీ ఒక పూటే భోజనం చేస్తాను. రెండో పూట భోజనానికి అయ్యే ఖర్చు ఎంతో లెక్క చూడండి. ఆ డబ్బు పెట్టి పుస్తకాలు కొనుక్కుంటాను” అన్నది.
“తిండి మానేసి రోగాలు తెచ్చుకుంటే, నీ బాబు సొమ్ము ఉందా ఇక్కడ నయం చేయించటానికి. చదివింది చాలు. ఇంక ఆపెయ్యి. ఈ రోజు నుంచీ నువ్వు చదవటానికి వీల్లేదు” అన్నాడు ప్రకాష్.
“చదువు పట్ల ఆసక్తి లేకుండా ఇంటి పనీ, వంట పనీ చేసుకుంటుంటే హేళన చేసి, ఎగతాళి చేసి, నిద్రాణంగా నున్న నాలోని కోరికను నిద్రలేపింది మీరే. నేను రోబో అంటే ఏమిటంటే మీరు విసుక్కున్నారు. ఇవాళ మీకు తెలియని విషయాలు కూడా నాకు తెల్సు..”
“నాకా ట్రాష్ అవసరం లేదు.”
“ఆదే ట్రాష్ అయితే, మీరు చేయమనే చెప్పే ఇంటి పనీ.. వంట పనీ.. కూడా ట్రాషే. రొటీన్‌గా చేసుకుపోయే ప్రతి పనీ ఇప్పుడు ట్రాష్ గానే కనిపిస్తోంది నాకు” అన్నది హిమబిందు.
భార్య తనను ఎదిరించటాన్ని అతను సహించలేకపోయాడు. ఆమెను పుట్టింటికి పంపించేశాడు. ఆమెకు అదొక వరం అయింది. చదువే ఆమెకు ఒక లోకం అయింది.
అయిదేళ్లల్లో ఆమెకు మంచి ఉద్యోగం వెతుక్కంటూ వచ్చింది.
మళ్లీ సిటీకి వచ్చింది.
అద్దె ఇంటి కోసం వెతుకుతూ వెళ్లింది. ఆ సమయంలో అతను గిన్నెలు కడుగుతున్నాడు. ప్రకాష్ గిల్టీగా ఫీల్ అయ్యాడు.
“అదీ మన పనే. ఆ పని చేయటంలో తప్పు లేదు. కాకపోతే పునరపి జననం, పునరపి మనరణం అన్నట్లు అదే లోకం కాకూడదు” అన్నది హిమబిందు.