[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
బాధ్యత
[dropcap]కౌ[/dropcap]ముదికి పెళ్లి నిశ్చయమైంది. “పిల్ల అదృష్టవంతురాలు కాబట్టి అంత మంచి సంబంధం కుదిరింది” అన్నారు అందరూ.
కానీ కౌముది తల్లి సులోచన అదోలా నవ్వుకుంది. పిల్ల అదృష్టవంతురాలో, దురదృష్టవంతురాలో చెప్పవల్సింది ఇప్పుడు కాదు. కొన్నాళ్లు గడిచాక – అనుకున్నది.
సులోచన స్వానుభవమే ఆమెకు పెద్ద పాఠం నేర్పింది. అందరి ఆడపిల్లల్లా ఆమె కూడా వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కన్నది. మనోహర్‌తో పెళ్లి కుదిరినప్పుడు ఆమె అంత అదృష్టవంతురాలు లేదని అందరూ ముక్తకంఠంతో అన్నారు.
తలొంచుకుని మనోహర్ చేత తాళి కట్టించుకుంది. అతని అడుగులో అడుగువేస్తూ అత్తారింట్లో అడుగు పెట్టింది. మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది. ఆ రంగుల వలయంలోని భ్రమలు తొలిగిపోవటానికి ఎంతో కాలం పట్టలేదు.
మనోహర్ మరో అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడు. కానీ అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. “అమ్మాయికి నీకూ సరిపడదు. మీరు కల్సి బతకలేరు” అని పెద్దవాళ్లు ఎంత చెప్పినా అతను వినిపించుకోలేదు. పెద్ద వాళ్లకు తెలియకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ చివరి క్షణంలో మనోహర్ తల్లిదండ్రులకు తెల్సి వాళ్ల పెళ్లికి అడ్డు పడ్డారు.
ఇంత రాద్ధాంతం జరిగాక మనోహర్‌కు సులోచనతో పెళ్లి అయింది. తరువాత సులోచనకు విషయమంతా తెల్సింది. భర్త తన పట్ల ఎందుకు ముభావంగా ఉంటున్నాడో, ఎదురుగానే ఉన్నా, ఆమెకు ఎన్నో యోజనాల దూరంలో ఎందుకు ఉంచుతున్నాడో అర్థం చేసుకుంది. అక్కడి నుంచీ సులోచన కూడా భర్త నుంచి ప్రేమాభిమానాలను ఆశించటం మానేసింది.
భార్యగా తనకు కొన్ని బాధ్యతలు ఉన్నయి. ఆ బాధ్యతలు నెరవేర్చాలి కాబట్టి ఆ ఇంట్లో ఉంటోంది. తింటోంది. తిరుగుతోంది. ఆ ఇంటిని కనిపెట్టుకుని ఉంటూ ఒక మర మనిషిలా తయారైంది.
అన్నీ ఓపికగా సహిస్తూ సులోచన మనోహర్‌తో కాపురం చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. పాతికేళ్లు. కానీ ఇది నా ఇల్లు, ఇతను నా భర్త, ఇది నా పిల్ల, ఇంతకన్నా ఇంకేం కావాలీ అన్న అనుభూతి మిగల్లేదు.
ఆమె ఆలోచిస్తున్నది ఒకటే. ఇది కాదని బయటకు వెళ్తే ఆమె బతకలేదు. ఆమెకు ఉద్యోగం లేదు. సంపాదన లేదు. కనుక ఈ నాలుగు గోడల మధ్య ప్రాణమున్న ఒక మనిషిగా తిరుగుతుండాలి. అది తన బాధ్యత అంతే.
కూతురి పెళ్లి నిశ్చయమైనప్పుటి నుంచీ సులోచన పనుల ఒత్తిడిలో పడిపోయింది. నగలు, చీరలు దగ్గర నుంచీ నల్లపూసల దాకా ఎన్నో సమకూర్చుకోవాలి. ఇంటికి వచ్చి పోయేవారికి మర్యాదలు చేయాలి. పది రోజుల నుంచి ఊపిరి సలపని పనులతో సతమతమవుతున్నందు వల్ల బాగా అలిసిపోయింది. బి.పి, సుగరు ఉన్నాయి. కళ్లు తిరిగి పడబోయింది. కుర్చీని పట్టుకుని నిలదొక్కుకుంది. డాక్టరు దగ్గరకు వెళ్లింది. అన్ని పరీక్షలూ చేశాడు. “పెద్దగా జబ్బు ఏమీ లేదు గానీ ఎందుకో బాగా మానసికంగా బాధపడుతోంది. ఉండుండి డిప్రెషన్ లోకి వెళ్తోంది. ఆమెను సంతోషంగా ఉండేటట్లు చూడండి” అని డాక్టరు చెప్పాడు.
కౌముది వచ్చి తల్లి పక్కన కూర్చుంది. “దేనికమ్మా, నీలో నీవే మథన పడిపోతున్నావు?” అని అడిగింది.
“నీ గురించేనే నా బాధ” అన్నది సులోచన కన్నీళ్లు కారుస్తూ.
“నీ జీవితం నా జీవితంలా కాకూడదు. నువ్వూ, నీ భర్తా, అన్యోన్యంగా కల్సి మెల్సి ఉండాలి. నిండుగా నవ్వాలి. నిశ్చింతగా బతకాలి..”
“నీకు అంత అపనమ్మకంగా ఉంటే, నాకు పెళ్లి చెయ్యవద్దు” అన్నది కౌముది.
ఆ రోజు రాత్రి సులోచన పెందరాళే పడుకుంది. కానీ ఎంతకీ నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి దాకా మసులుతూనే ఉంది. నెమ్మదిగా లేచి డాబా మీదకు వెళ్లింది. మెట్ల మీద ఉన్న సులోచనకు డాబా మీద నుంచి మాటలు వినిపించాయి.
మనోహర్ కూతురికి చెబుతున్నాడు.
“మీ అమ్మ బాధ ఏమిటో నాకు తెల్సు. తెల్సీ తెలియని వయసులో కరుణను ప్రేమించాను. ప్రేమ మైకంలో ఉన్నవాడు, రెచ్చిపోయి మాట్లాడుతాడు. నేను కరుణను రహస్యంగా పెళ్లి చేసుకుందామని ప్రయత్నించిన విషయం మీ అమ్మకు తెల్సింది. మొదట్లో మీ అమ్మ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించాను.. సులోచన ఎంతో సంయమనం చూపింది. బాధను గొంతులో గరళంలా దాచుకుంది. రోజులు గడిచే కొద్దీ నేను కరుణను మర్చిపోయాను. కానీ మీ అమ్మకూ నాకూ మధ్య వెలితి అలానే మిగిలిపోయింది. కొన్నాళ్లు నా అనారోగ్యం.. మరి కొన్నాళ్లు నా నిరుద్యోగం.. మీ అమ్మ పస్తులున్న రోజులున్నయి. అయినా ఇంటెడు చాకిరీ చేస్తూనే ఉంది. మరో ఉద్యోగంలో చేరాను. రోజంతా మోటారు సైకిల్ మీద తిరగాల్సి వచ్చేది. ఒక రోజు యాక్సిడెంటు అయింది. ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాను. సులోచన కాక ఆ స్థానంలో మరొకరు ఉండి ఉంటే, నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేక పోయాను. ఒకసారి ఆఫీసు డబ్బు ఎక్కడో పడిపోయింది. ఆ డబ్బు కట్టటం కోసం మీ అమ్మ మెడలో ఉన్న గొలుసు తీసి ఇచ్చింది. ఇన్నేళ్ల జీవితంలో, చాలీ చాలని సంపాదనతో ఎన్నో కష్టాలు పడ్డాము. నా అసమర్థతను కప్పిపుచ్చుతూ, తను కొవ్వొత్తిలా కరిగిపోతూ ఉన్నంతలో కొంత వెలుగును ఇచ్చింది. ఆ వెలుగు లేకపోతే అంధకారమే మిగిలేది.. “
“ఇప్పుడు అయినా అమ్మను ప్రేమిస్తున్నావా?” అని కౌముది అమాయకంగా అడిగింది.
“ప్రేమ అనేది చాలా చిన్నమాట. మొదట్లో అనవసరంగా పెద్ద రాద్ధాంతం చేశాను. నేను నా భార్యను ప్రేమిస్తున్నాను అని చెబితే, ‘పగలు వెలుతురు ఉంటుంది, రాత్రి చీకటి ఉంటుంది’ అని చెప్పింనంత అవివేకంగా ఉంటుంది. సులోచన లేని జీవితాన్ని ఊహించుకోలేను. నేను సులోచన చేతుల మీదుగానే పోవాలని కోరుకుంటున్నాను”అన్నాడు.
సులోచన కిందికి దిగిపోయింది.
కళ్లు మూసుకుని పడుకుంది. కానీ నిద్ర పట్టలేదు.
తెల్లవారు ఝామున లేచి పనిలో మునిగిపోయింది. కౌముది లేచి తల్లికి సాయం చేయబోయింది.
“నీ కెందుకు ఈ పనులన్నీ. నువ్వు పడుకో..” అన్నది సులోచన.
“నీకు మాత్రం ఎందుకమ్మా ఈ పనులన్నీ” అని అడిగింది.
“ఇది నా బాధ్యత తల్లీ.”
“బాధ్యత తప్ప, ఇంకేం కాదా?”
సులోచన చేస్తున్న పని ఆపి, కూతురి దగ్గరగా వచ్చి తల నిమురుతూ అన్నది “బాధ్యతలు నెరవేర్చటంలో ఎంతో బాధ ఉందని మాత్రమే ఇన్నాళ్లూ అనుకున్నాను. ఆ బాధ్యతలు నెరవేర్చటంలో ఎంతో తృప్తి, సంతోషం కూడా ఉంటాయని ఇప్పుడిప్పుడే అనిపిస్తోందమ్మా..” అన్నది సులోచన.
“బాధ్యత నెరవేర్చటంలో ఎంతో బాధ ఉందన్నావు.. బాధ పడటంలో కూడా తృప్తి సంతోషం ఉంటాయా అమ్మా..”
“అయినవాళ్ల కోసం పడే కష్టంలో, సుఖం కూడా ఉంటుందమ్మా. ఇది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. నీకు కూతురు పుట్టి, దానికి పెళ్లి చేసేటప్పుడు తెలుస్తుంది” అని నవ్వింది సులోచన.
“నా కూతురు పెళ్లి నువ్వే చెయ్యాలమ్మా” అన్నది కౌముది నవ్వుతూ.
“తప్పకుండా. అదీ నా బాధ్యతే” అన్నది సులోచన కూతుర్ని గుండెలకు అదుముకుంటూ.