[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
అల్లుడున్నాడు జాగ్రత్త
[dropcap]పం[/dropcap]డుగ వచ్చేసింది. వస్తూనే అందరి మొహాల్లోకి ఆనందోత్సాహాలను తీసుకొచ్చింది.
కాంతారావు ఇంట్లోనూ ఆనందం వెల్లివిరుస్తున్నా, అందులో ఏదో వెలితి కనిపిస్తోంది.
పెద్ద కూతురు అనుపమ, అల్లుడు ఆనంద్ పండగకు వచ్చారు. ముందు గదిలో ఆనంద్ పేపర్ తిరగేస్తున్నాడు. కానీ అతని మనసులోని పన్నాగాల పన్నగాలు కుదురుగా కూర్చోనివ్వటం లేదు. అనుపమ మావిడాకుల తోరణాలు కడుతోంది.
“నేను అడగమన్నది అడిగావా?” అన్నాడు చిన్నగా అనుపమకు మాత్రమే వినపడేటట్లు.
“ఇంకా లేదు. నిన్ననే గదా వచ్చాం. కొంచెం కుదుట పడనివ్వండి” అన్నది అనుపమ.
వంటింట్లో శ్యామల స్టౌవ్ దగ్గర నిలబడి ఉందిగానీ పాలు పొంగుతున్న విషయం ఆమె గమనించలేదు.
ఆమెకు చిన్న కూతురు రూప కళ్ల ముందు మెదులుతోంది. అది ఇంట్లో తిరుగుతున్న జ్ఞాపకాలను నెమర వేసుకుంటున్న కొద్దీ, దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. పైట చెంగుతో ఆగని కన్నీటి వరదకు ఆనకట్ట కడుతోంది.
అనుపమ, రూప ఇద్దరు కూతుళ్ల మధ్యా ఉత్తర దక్షిణ ధ్రువాలకు ఉన్నంత వ్యత్యాసముంది. అనుపమకు చిన్నప్పటి నుంచి దాని సుఖం, దాని సంతోషం, దాని స్వార్థమే తప్ప – ఇంకొకరి గురించి ఆలోచించే తత్వం కాదు. రూప అలా కాదు. చిన్న పిల్ల అయినా దాని దృక్పథం వేరు. ఎంతో పరిణతి చెందిన దానిలాగా ఆలోచిస్తుంది. అనుకున్నది ఆచరిస్తుంది. అందుకే శ్యామలకు చిన్న కూతురంటే వల్లమాలిన ప్రేమ.
పెళ్లి విషయంలో దాని నిర్ణయాన్ని ఎవరూ హర్షించలేదు. కులాంతర వివాహం చేసుకుని నలుగురిలో తలవంపులు తెచ్చింది. తండ్రి ఆగ్రహానికి గురైంది. ఆయన వాళ్లందరికీ దూరమైపోయింది. తోడబుట్టిన దానికీ శత్రువైపోయింది.
గుండెల నిండా చిన్న కూతురి జ్ఞాపకాలే నిండి ఉన్నప్పుడు, మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా అది విఫల ప్రయత్నమే అవుతుందని శ్యామలకు తెల్సు.
ఇంతలో ఇంటి ముందు ఆటో ఆగింది.
ఖరీదైన పట్టుచీర కట్టుకుని, నిండుగా నవ్వుతూ రూప లోపలికి వచ్చింది, “నేను రావచ్చా?” అని అడుగుతూనే.
“బావున్నావా అక్కా” అని అడిగింది. అనుపమ “ఊ” అనేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది.
బావగారినీ పలకరించింది. అతనూ ముభావంగా సమాధానం చెప్పాడు.
చిన్న కూతుర్ని చూడగానే శ్యామలకు కన్నీరు ఆగలేదు. కూతుర్ని కౌగింలించుకొని ఏడ్చింది.
“పండగ పూట మిమ్మల్ని అందర్నీ చూడాలనిపించింది. అందుకే మీరు పిలవకపోయినా వచ్చాను” అన్నది రూప.
“ఇంటి ఆడపిల్లవు, ఇది నీ ఇల్లు. నిన్ను ఒకరు పిలవాలా ఏమిటే?” అన్నది శ్యామల.
శ్యామల రూపను వంటింట్లోకి తీసుకెళ్లింది.
“మా సంగతి సరే గానీ, నీ పరిస్థితి ఎలా ఉందో చెప్పు. కావాలని అతన్ని పెళ్లి చేసుకున్నావు. నువ్వు సుఖంగా ఉంటే చాలు” అన్నది శ్యామల.
“నేను చాలా హాయిగా ఉన్నానమ్మా. ఆయన నన్ను కాలు కింద పెట్టనివ్వటం లేదు. వాళ్లింట్లో వాళ్లు కూడా నాకు ఎంతో గౌరవంగా చూస్తారు. మీకు దూరమయ్యానన్న దిగులు తప్ప, ఇంకే బాధా లేదు.”
“పోనీలే, ఈ కోపతాపాలు ఎంత కాలం ఉంటాయి. మీరు సుఖంగా ఉంటే చాలు” అన్నది శ్యామల.
“నేను ఎన్నో విధాల ఆలోచించానమ్మా. అక్కకు చేసిన పెళ్లి చూశాను. ఆ అప్పు తీర్చటానికి మీరు పడిన బాధా చూశాను. నా కోసం మీరు అప్పులపాలు కావటం నాకు ఇష్టంలేదు. నేను ప్రవీణ్‌ను చేసుకోవటానికి ముఖ్యమైన కారణం అతను పైసా కట్నం ఆశించలేదు. నా కోసం ఎంత అయినా ఖర్చు చేస్తాడు. నేను అతని స్నేహితురాలిని, ప్రియురాలిని, భార్యను కూడా నాకు ఏ లోటూ లేదు. మీకు నచ్చని పని చేశాను. అదే నా బాధ” అన్నది రూప.
“నీ ఆలోచనలు కాలం కన్నా ముందు పరుగెడుతుంటాయి. మేమే వెనకబడిపోతున్నాం. మా కోసం నువ్వు ఆగిపోనవసరం లేదు” అన్నది శ్యామల.
రూప తల్లికి పట్టు చీర ఇచ్చి కాళ్లకు నమస్కరించింది.
“ఏమిటే ఇది” అని అడిగంది శ్యామల.
“మా పెళ్లికి మీరు రాలేదు. అందుకని ఆయన మీకు బట్టలు పంపించారు” అన్నది రూప.
“రేపు అతన్ని తీసుకురా” అన్నది శ్యామల,
“అలాగే” అన్నది రూప.
రూప తల్లి దగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయింది.
ఆ రోజు మధ్యాహ్నం భోజనాల అయిన తరువాత అనుపమ తల్లి దగ్గర చేలింది.
“అమ్మా, ఆయన ఒక విషయం మిమ్మల్ని అడగమని నెల రోజుల నుంచీ నన్ను పోరుతున్నారే” అన్నది.
“ఏమిటే అది?”
“ఏం లేదమ్మా. ఇప్పుడు ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో హక్కు ఉంది కదా. అందుచేత ఇల్లు అమ్మించి, నా వాటా తీసుకొని రమ్మని పోరు పెడుతున్నారమ్మా” అన్నది అనుపమ.
“ఆయన అడగమంటే మాత్రం అడగటానికి నోరు ఎలా వచ్చిందే? దగ్గర లేకపోతే మాత్రం ఏమి, ఇద్దరు మగ పిల్లలున్నారు. వాళ్ల ఇష్టం లేకుండా ఇల్లు ఎలా అమ్ముతాం..? ఆడపిల్ల అయినా, నీ చదువుకూ, పెళ్లికీ ఎంత ఖర్చు చేశామో నీకు గుర్తు లేదా?” అని అడిగింది శ్యామల.
“ఆయన అడగమంటున్నారు అమ్మా” అని అన్నది అనుపమ.
రాత్రికి ఎవరూ భోజనాలు చేయలేదు. ఆకళ్లు లేవని పడుకున్నారు.
మర్నాడు పది గంటల సమయంలో రూప, ప్రవీణ్ స్కూటర్ మీద వచ్చారు. రూప భర్తను పరిచయం చేసింది. ఎవరి మొహంలోనూ, సంతోషం లేదు. ఎవరి దగ్గర నుంచీ సరియైన స్పందన లేదు. మౌనంగా ఉండిపోయారు. పండగ సంబరం లేదు, సరదా లేదు.
ప్రవీణ్ రావటం ఎవరికీ ఇష్టం లేదనీ, అంతకు ముందు ఆ విషయంలో గొడవ జరిగి ఉంటుందనీ రూప అర్థం చేసుకుంది.
“చూద్దామని వచ్చాం చూశాం గదా. ఇంక వెళ్తామా?” అని లేచి నిలబడ్డాడు ప్రవీణ్.
శ్యామల రూపను లోపలికి తీసుకెళ్లింది. ప్రవీణ్ ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు.
శ్యామల రూపకు విషయమంతా చెప్పింది.
“రాత్రి మీ నాన్న ఏమన్నారో తెల్సా? చిన్నది చేసిన పనే మంచిదని అనిపిస్తోంది. పైసా ఖర్చు చేయకుండా పెళ్లి చేసుకుంది. రేపు దానికి ఆస్తిలో వాటా ఇవ్వటంలో అర్థం ఉంది గానీ, పెద్దదానికి వాటా ఎలా వస్తుంది? దాని వాటా ఇది వరకే దానికి ముట్టింది అని అన్నారు” అన్నది శ్యామల.
“నేను ఆస్తులు హక్కుల గురించి ఇంతవరకు ఆలోచించలేదమ్మా. నా పెళ్లి కోసం నాన్న అప్పులు చేయకూడదని మాత్రమే ఆలోచించాను. చదువులూ, పెళ్లిళ్లూ, ఉద్యోగాలు వీటి అన్నింటికీ వేలకు వేలు పరుచుకుంటూ వెళ్తేనే గానీ అవి అమరవు. ఏ వయసులో జరగవల్సినవి అవి జరగాలి. అదీ అవసరమే. ఈ అవసరాలకీ, చట్టాలకీ, హక్కులకీ, పొంతన కుదరటం లేదు. వేటి దోవ వాటిదే అవుతోంది” అన్నది రూప.
“కానీ అతనేమో ఆస్తిలో వాటా తీసుకురమ్మని దాని ప్రాణం తీస్తున్నాడు. ఏం చేయాలో తెలియటం లేదు..” అన్నది శ్యమాల.
“ఇల్లు అమ్మేది మీ తరువాత మాట కదా. ఇప్పడు ఇల్లు అమ్మితే మీరు ఎక్కడుంటారు? అంతగా అక్కకు డబ్బు అవసరం అయితే బ్యాంక్‌లో ఏదన్నా లోన్ ఇప్పించే ఏర్పాటు ప్రవీణ్ చేయగలడు” అన్నది రూప.
“అతను ఇప్పించినా ఇతను లోన్ తీర్చడు. అతనికి అప్పనంగా డబ్బు కావాలి” అన్నది శ్యామల. “ఎప్పటికైనా ఆస్తిలో వాటా అంటూ ఇస్తే చిన్నదానికే ఇస్తాను గానీ, పెద్దదానికి ఇవ్వనని మీ నాన్న అంటున్నారు” అని గుర్తు చేసింది.
భోజనాలకు లేవమంటే “ముందు మీరు తినండి. నేను తరువాత తింటాను” అన్నాడు ప్రవీణ్.
“పర్వాలేదు రా నాయనా. మా అందరికంటే నువ్వే అన్ని విధాలా గొప్పవాడివి. ముందు దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాతే గదా మేం తింటాం. అలాగే ముందు నీకు పెట్టిన తరువాతే మేం తింటాం” అన్నాడు రూప తండ్రి కాంతారావు.
“పెద్దవారు. మీరు అలా అనకూడదు. నన్ను దేవుడితో పోల్చి, లేని గొప్పదనం నాకు ఆపాదించకండి. ఎవరి పద్ధతులూ, ఆచారాలూ వాళ్లకుంటాయి. అలాగే ఎవరి సంస్కారం వాళ్లది. ఎదుటి వాళ్లను గౌరవించే సంస్కారమే, అసలైన సంస్కారం” అన్నాడు ప్రవీణ్.
కాంతారావు అతని వంక ఆరాధనా పూర్వకంగా చూశాడు. శ్యామల రూప వంక ఆరాధనా పూర్వకంగా చూసి, దగ్గరకు తీసుకుంది.
“మీ అల్లుడు ఉన్నాడు జాగ్రత్త” అన్నది రూప తల్లితో నవ్వుతూ.