చిరుజల్లు-96

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

మరో నరకాసురుడి వధ

[dropcap]హా[/dropcap]స్పటల్‍లో పదోనెంబరు గదిలో కృష్ణచైతన్య అచేతనంగా పడి ఉన్నాడు. సత్యభామ భర్త బెడ్ పక్కన కూర్చుని దిగాలుగా చూస్తోంది. విషాదం ఆమె మొహంలో గూడు కట్టుకొని ఉంది.

నిన్నరాత్రి జరిగిన భయంకరమైన దృశ్యమే ఆమె కళ్ల ముందు మెదులుతోంది.

వారం రోజుల క్రిందకు కృష్ణచైతన్య, అతని భార్య సత్యభామ పాలెం వచ్చారు.

పొలం బేరం పెట్టారు. పొలం కొనదల్చుకున్న రైతులు రాత్రిపూట వచ్చి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్లేవారు. అలాగే నిన్న కూడా వచ్చారని కృష్ణచైతన్య తలుపు తీశాడు. గుమ్మంలో ఉండగానే అతని మీద కర్రలతో దాడి చేసి గాయపరిచి పారిపోయారు.

సత్యభామ ఎంత అరిచినా మొత్తుకున్నా చుట్టుపక్కల వాళ్లు ఎవరూ తలుపు తీయలేదు. వచ్చినప్పటినుంచీ, అంతకు ముందు నుంచీ ఆమె మామగారి కుటుంబానికీ నమ్మిన బంటులా ఉన్న వెంకటేశ్వర్లు ఇంటికి ఉన్న పరుగెత్తింది. “ఇంతపని చేస్తారా?” అంటూ – నర్సిములు మనుషుల్ని బండబూతులు తిడుతూ, బండిలో కృష్ణచైతన్యను దగ్గరలో నున్న పట్నానికి తీసుకొచ్చాడు. సత్యభామ భర్త వెంటవచ్చి, ఆస్పత్రిలో భర్తను కనిపెట్టుకొని ఉంది.

మర్నాడు డాక్టర్ రౌండ్స్‌కు వచ్చారు. కృష్ణచైతన్యకు ఫరవాలేదని అభయం ఇచ్చాడు.

పాలెం వెళ్లిరావటానికి ఆయన అనుమతి తీసుకున్నది.

లగేజ్, డబ్బు, బట్టలూ అన్నీ పాలెంలో తమ ఇంట్లో ఉండిపోయాయి. అందుచేత అక్కడికి వెళ్లిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

భర్తను కనిపెట్టుకొని చూస్తుండమని నర్స్‌కు అప్పగించి, ఆమె బస్ స్టాండ్‌కు చేరుకుంది.

ఆకాశాన దట్టంగా మబ్బుపట్టి ఒక్కొక్క చినుకే పడుతోంది. ఉన్న సమస్యలకు తోడు, ఇదొక సమస్య తోడైంది. పట్నం నుంచి ఒకే ఒక్క బస్సు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పాలెం వచ్చి వెళ్తుంది.

బస్సు రాగానే ఎలాగో కష్టపడి రద్దీలో తీసుకుంటూ, తొక్కుకుంటూ బస్సు ఎక్కుంది.

పాలెంలో బస్సు దిగేటప్పటికి కుండపోతగా వర్షం కురుస్తోంది. చెట్టు కిందకు చేరింది. బడ్డీకొట్టులో కూర్చున్న ముసలమ్మ సత్యభామను పలకరించింది.

“నీ పెనిమిటిని ఆస్పతాల్‍కి తీసుకుపోయిన్రంటనే, గండం గడిసినట్టేనా?” అని అడిగింది.

పర్వాలేదని చెప్పింది సత్యభామ.

“రాత్రివేళ నీ పెనిమిటిని చంపాలని చూశారు. ఆ ఎంకటేశ్వర్లు బండిలో తీసుకుపోయినందుకు వాడి మీద కచ్చగట్టారు. ఆడు వొస్తావుంటే తెల్లారగట్ట ఊరిబయట కాపు కాసి, బండిలోనుంచి లాగి వాడ్ని చంపేసినారు గదమ్మా” అన్నది ముసలమ్మ.

సత్యభామ నోట మాటరాలేదు. భయపడి పోయింది.

“ఈళ్లు రాక్షసముండా కొడుకులమ్మా. పచ్చి నెత్తురు తాగుతారు. ఎన్ని కుటుంబాలను ఆర్పేసి ఇంత పెద్దోడు అయిండో ఈ నర్సిములు గాడు” అన్నది ముసలమ్మ.

“ఎల్లిపోయినదానివి, మళ్లీ ఎందుకొచ్చినవమ్మా” అని అడిగింది.

కృష్ణచైతన్య పుట్టి పెరిగింది ఈ ఊరే. చాలా కాలంనుంచి ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో తిరుగుతున్నా సొంత ఊళ్లోని ఇల్లు, పొలాన్ని మాత్రం కాపాడుకుంటూ వస్తున్నాడు.

ఇప్పుడు ఇంక ఈ ఊరిలోని ఆస్తినంతా ఆమ్మేసి పోవాలని భార్య సత్యభామతో సహా వచ్చి తిష్ట వేశాడు.

ఏదో విధంగా కృష్ణచైతన్యను బెదిరించి, అవసరమైతే అంతమొందించి అయినా, ఆయన ఆస్తి కాజేయ్యాలని నర్సిములు పథకం వేశాడు. వాడి మాట కాదన్న వాడి మాట ఆ ఊరిలో వినిపించదు. ఎదురు తిరిగిన వాడి తలకాయలు తాటి కాయల్లా రాలిపడతాయి. ఎన్ని తలకాయలు రాలిపడితే వాడు అంత గొప్పవాడు అయిపోతున్నాడు. వాడు వీధిలో వెడుతుంటే, మగవాళ్ళు పక్కకు తప్పుకుంటారు. ఆడవాళ్లు లోపలికి పోయి తలుపులు వేసుకుంటారు. వాడు కన్నెత్తి చూస్తే పచ్చని పొలాలు ఎండిపోతాయి. గడ్డివాములు నిప్పు లేకుండానే భగ్గున మండిపోతాయి. బండరాళ్ళు నిలువునా బద్దలైపోతాయి. వారు తీక్షణంగా చూస్తే గాలి కూడా స్తంభించిపోతుంది.

పోలీసులూ, సాక్ష్యాలూ, కేసులూ, ఇవేవీ ఆ ఊరి సరిహద్దుల్లోకి కూడా రావు. ఆ ఊరు స్వతంత్ర భారతదేశంలోని ఒక భాగమే అయినా, ఏడాదికోసారి వాడు జెండా చెట్టు దగ్గర మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసినా, వాడు ఒక హిట్లర్. ఒక ఈదీ అమీన్. ఒక పోల్‌పాట్.

సత్యభామ ఇల్లు చేసింది. చీర మార్చుకుంది. తల తుడుచుకుంది. కుర్చీలో చేరగిలబడింది. అప్పుడామెకు ఆకలి సంగతి గుర్తు కొచ్చింది. గ్లాసెడు మంచినీర్లు సాగింది. వంట చేయటానికి ఓపిక లేదు.

తలుపు భళ్ళున విరిగిపోయింది. నర్సిములు ఆమె ముందు నిలబడ్డాడు. “ఏమే, మళ్లీ మా ఊళ్ళో అడుగుపెట్టటానికి ఎన్ని గుండెలే నీకు? నిన్ను రేప్ చేస్తే ఎవడే నీకు దిక్కు? ఎవుడే నన్ను అడ్డుకునే వాడు?” అంటూ తూలుతూ ఆమె మీదకు రాబోయాడు.

దగ్గర్లోని కుర్చీ ఎత్తి వాడి తల మీద కొట్టింది. దెబ్బకు కింద పడ్డాడు. వాడి గుండెలమీద కాలు పెట్టి తొక్కింది. పీక నొక్కింది.

మర్నాడు ఉదయం పోలీసులు సత్యభామను ఇంటరాగేషన్ చేశారు. “నాపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం అందుబాటులో ఉన్నదానితో కొట్టాను” అన్నది సత్యభామ.

“ఇందుకు సాక్షులు ఎవరన్నా ఉన్నారా?” అని అడిగారు పోలీసులు.

“మేం ఉన్నాం” అన్నారు వందమంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here