[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
నిజాయితీపరునికే.. నా ఓటు
[dropcap]భా[/dropcap]రత భారతి ముందుగదిలో కూర్చుని బియ్యంలో రాళ్లు ఏరిపారేస్తోంది. ఎవరో ఒక ఆగంతకుడు, ఆయనతో పాటు మరో పదిమంది వ్యక్తులు వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు.
ఒక వ్యక్తి మాత్రం లోపలికి వచ్చాడు.
“అమ్మా, నమస్కారం. మీరేనా భారతిగారు?”
“అవునండీ” అన్నది భారతి ఆశ్చర్యంతో.
“అమ్మా, నా పేరు గోవర్ధన రావు. నేను ఈ నియోజక వర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. మీతో మాట్లాడాలని వచ్చాను..” అన్నాడా వ్యక్తి ఆమెకు ఎదురుగా కిందనే కూర్చుని.
“మీరు నాతో మాట్లాడాలా? నేనొక సామాన్యురాలిని. నాకు ఓటు ఉందా లేదో కూడా తెలియదు. మీవంటి వారితో మాట్లాడటానికి ఏముంటుంది?” అని అడిగింది.
“చాలా ముఖ్యమైన విషయం ఉందమ్మా. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?” అని అడిగాడు గోవర్ధన రావు.
“నేను బియ్యంలో రాళ్లు ఏరేస్తున్నాను” అన్నది భారతి.
“బావుందమ్మా, బియ్యం బాగున్నాయా?”
“మీకు తెలియనిదేముంది? బియ్యంలో చాలా రకాలున్నయి. ఖరీదైన బియ్యం మేం కొనలేము. మేము కొనుక్కోగలిగిన బియ్యంలో రాళ్లు ఉంటాయి. బియ్యం చౌక రకం అయినా సరిపెట్టుకుంటాం. కానీ రాళ్లను నమిలి తినలేం గదా..” అన్నది భారతి.
“ఎన్నికలు వచ్చాయి. చాలా మంది ఎన్నికల్లో నిలబడుతున్నారు. బియ్యంలోని రాళ్లు ఏరేసినట్లు, వీళ్లల్లో పనికిరాని వారిని ఏరిపారెయ్యాల్సిన బాధ్యత కూడా మీదేగదా” అన్నాడు గోవర్ధన రావు.
“ఇందాకే చెప్పాను. నేనొక సామాన్యురాలని. రాజకీయాల గురించి చర్చించగల సామర్థ్యం నాకు లేదు..” అని ఆగిపోయింది.
“వినాయక రావుగారు ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అయన గురించి మీ అభిప్రాయం చెప్పండి” అని అడిగాడు గోవర్ధన రావు.
“ఆయన విషయం నన్ను అడగకపోవటమే మంచిది” అన్నది తల దించుకొని.
“మీరు వినాయక రావుగారి మొదటి భార్య అని విన్నాను”.
“నేను ఆ విషయం మర్చిపోయి చాలాకాలం అయింది. ఇప్పుడు ఆయనతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఇప్పుడు నేనొక చిన్న స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ జీవితం గడుపుతున్నాను. ఒక అనామకురాలిని. నన్ను ఇలాగే ఉండనివ్వండి దయచేసి నన్ను మీ ఎన్నికల్లో ఒక పావుగా వాడుకోకండి. నన్ను వదిలెయ్యండి” అన్నది భారతి.
“స్త్రీ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన ఎన్నో ప్రగల్బాలు పలుకుతున్నాడు. కట్టుకున్న భార్యను మోసం చేసిన వ్యక్తి ఇతర స్త్రీలకు న్యాయం చేస్తాడని అనటం హాస్యాస్పదం గదా. సమాజంలోని స్త్రీలందరి కోసం ఆయినా మీరు స్పందించాలి..” అన్నాడు గోవర్ధన రావు.
“వాస్తవాలు చెబితే, జరగబోయే పరిణామాలు ఏమిటో నాకు తెల్సు. మీరు వెళ్లిన మరుక్షణం నా గొంతు నులిమెయ్యటానికి ఆయన మనుషులు సిద్ధంగా ఉంటారు. అందుచేత నా కంఠశోష వల్ల ప్రయోజనం ఏముంది?” అని అడిగింది భారతి.
“మేం మీకు అండగా ఉంటాం. మా మనుషులు మీ ఇంటి ముందు కాపలా పెడతాం. వాస్తవాలు నిర్భయంగా లోకానికి చెప్పండి” అన్నాడు గోవర్ధన రావు. ఆమె మౌనం వహించింది. ఆ మౌనాన్ని ఆయన అంగీకారంగా తీసుకున్నాడు.
“వినాయక రావుగారు మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారట గదా. నిజమేనా?”
“నిజమే. అందుకు నా వద్ద సాక్ష్యాధారాలున్నాయి.”
“అప్పట్లో ఆయన ఏం చేస్తుండేవారు?”
“అప్పట్లో ఆయన ఒక గవర్నమెంటు ఆఫీసులో క్లర్క్‌గా పని చేస్తుండేవాడు. మా ప్రేమ వివాహాన్ని ఆయన తల్లిదండ్రులు అంగీకరించలేదు. కొన్నాళ్ళు మేం ఆన్యోన్యంగానే ఉన్నాం. క్రమంగా ఆయన తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి తీసుకురావటంతో ఆయనలో మార్పు వచ్చింది. మా మధ్య కలహాలు, కొట్లాటలూ నిత్యకృత్యం అయిపోయింది. నన్ను తిట్టడం, కొట్టటం ఎక్కువ అయింది. ఆయన తల్లిదండ్రులు ఆయన ఆఫీసుకు వెళ్లి అక్కడ మంతనాలు సాగించేవారు. ఆయనకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేశారు. నాకు తెలియకుండా ఆయన పెళ్లిచూపులకు వెళ్లారు. శ్రీమంతుల అమ్మాయితో ఆయనకు పెళ్ళి నిశ్చయం జరిగింది. నా మీద రెండు మూడు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. నాకు పరిస్థితి అర్థం అయింది. నేను మళ్లీ ఆయన జీవితంలోనికి తొంగి చూడనని ప్రమాణం చేస్తే, ప్రాణాలతో వదిలేస్తామన్నారు. నీకు గత్యంతరం లేకపోయింది. అంగబలమూ, అర్ధబలమూ గల ఆయనతో పోరాడి జయించలేనని అర్థమైంది.. ఫలితంగా ఇలా అనామకురాలిగా, అజ్ఞాతంగా బ్రతుకుతున్నాను..” అన్నది భారతి.
దూరం నుంచి మైక్ వినబడుతోంది – ‘ఓట్ ఫర్ వినాయక రావ్’ అంటూ.
గోవర్ధన రావు లేచి నిలబడ్డాడు. “మన దేశంలో దేశభక్తి, ప్రజాసేవ అనే మాటలకు అర్థం మారిపోయింది. రాజకీయాలు కలవారు చేసే వ్యాపారం అయింది. అధికారం, ధనార్జన మాత్రమే లక్ష్యాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. మీరు బియ్యంలో రాళ్లు ఏరిపారేసినట్లే, ఇటువంటి స్వార్ధపరులను ఏరిపారెయ్యటంలో కూడా సహకరించాలి. మీకు వచ్చిన భయం లేదు. ఈ క్షణం నుంచి మీ మీద ఈగ వాలకుండా చూసే బాధ్యత నాది” అన్నాడు.
గోవర్ధన రావు ఆమెకు నమస్కరించాడు.
ఆమె ఆయన్ని సాగనంపటానికి గుమ్మం దాకా వచ్చింది.
మైకులోనుంచి వినిపిస్తోంది – ‘ఓట్ ఫర్ వినాయక రావ్’ అంటూ.