చిరుజల్లు-98

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

మిస్ సుందరి

[dropcap]సుం[/dropcap]దరి బంధువుల అమ్మాయి పెళ్లికి వెళ్లింది. అతిథులను ఆహ్వానించటం దగ్గర నుంచి, వాళ్లకు మర్యాదలు చేయటం దాకా అన్నిట్లోనూ తలదూర్చి యమ బిజీగా ఉంది. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ పేకాడుకుంటున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి “కాఫీ కావాలా?” అని అడిగింది. కావాలన్నారు వాళ్లు. హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపొయింది సుందరి.

“ఇంతకీ ఈ అమ్మాయి కాఫీలు తెస్తుందంటావా?” అని అడిగాడు ఒకడు.

“అదేం లేదు, కాఫీలు కావాలేమో కనుక్కోమన్నారు. అంతే” అన్నాడు ఇంకొకడు. అందరూ నవ్వుకున్నారు.

అయిదు నిముషాల తరువాత ఆ అమ్మాయి కాఫీలతో ప్రత్యక్షమైనప్పుడు మళ్లీ ఆ అమ్మాయి మీద జోక్స్ వేసుకున్నారు. వాళ్లల్లో ఒకడు, సత్యం మాత్రం ఆ అమ్మాయిని ఏమీ అనవద్దని వెనకేసుకొచ్చాడు.

“ఏమిట్రా కథ?” అని అడిగాడు ఒకడు.

“తొలిచూపులోనే వలపా?” అన్నాడు మరొకడు.

ఎవరేమనుకున్నా సత్యం కళ్లు మాత్రం సుందరి మీదనే ఉన్నాయి.

మర్నాడు సత్యం తల్లిదండ్రులు, సుందరి తల్లిదండ్రులకు కబురు చేశారు. ‘మీ అమ్మాయిని చేసుకోవటానికి మావాడు సుముఖంగా ఉన్నాడ’ని.

సుందరి తల్లి పొంగిపోయింది.

“అబ్బాయికి గవర్నమెంటు ఉద్యోగం, బోలెడంత జీతం. బుద్ధిమంతుడు. ఇంతకంటే ఇంకేం కావాలి? సుందరి కిందటి జన్మలో బంగారు పూలలో పూజ చేసి ఉంటుంది. అందుకే ఇంత సునాయాసంగా కాబోయే భర్త వెతుక్కుంటూ వచ్చాడు” అని సుందరి తండ్రి సంతోషించాడు.

లాంఛనాలు అన్నీ జరిగిపోయినయి. పెళ్లి దాదాపుగా నిశ్చయమై పోయింది. కానీ సుందరి మొహం విప్పారలేదు. మౌనమనే మేఘాల మాటున ఆలోచనల నీడలు ఆమె మొహం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎన్నో నోములు, వ్రతాలు చేశాక సుందరి పుట్టింది. అందుకని ఆ పిల్లకు బాల త్రిపుర సుందరి అని నామకరణం చేశారు. కానీ చివరకు సుందరి అన్న పేరే స్థిరపడి పోయింది. పేరుకు తగినట్లే అపరంజి బొమ్మలా ఉంటుంది. వయసొచ్చేకొద్దీ దినదిన ప్రవర్ధమానమవుతూ, నిండు చందమామలా విరాజిల్లుతోంది. కాలేజీ స్టూడెంట్స్ ‘ఓహో సుందరీ, నీవంటి దివ్యస్వరూపంబు ఎందెందు వెతికిన లేదు కదా’ అని గేలి చేసినా ముసి ముసి నవ్వులు నవ్విందేగానీ, కోపం తెచ్చుకోలేదు.

తను జగదేక సుందరి అయి ఉండి, అందరిలాగా తలొంచుకొని ఒక గుమాస్తా చేత తాళి కట్టించుకుని, అతని చిటికిన వేలు పట్టుకుని గృహప్రవేశం చేసి, వంట చేస్తూ, గిన్నెలు కడుగుతూ, పిల్లల్ని కంటూ చాలా చాలని జీతంలో అవసరాలను మానుకుని, మాసిన చీరలతో కుచించుకు పోతూ, ఒదిగి ఒదిగి నడుస్తూ గడిపే జీవితం తనకు అక్కర్లేదు.

తను ప్రపంచ సుందరిగా గుర్తింపు పొందాలి. అందగత్తెలు అందరిలోకి అందగత్తెగా గుర్తించి తననెత్తిన వజ్రాల కిరీటం పెట్టాలి. పత్రికలు, టీ.వీ.లు తన సౌందర్యాన్ని వేనోళ్ల పొగడాలి. ఎక్కడికి వెళ్ళినా రాచమర్యాదలతో స్వాగతం పలకాలి. గొప్పగొప్ప వాళ్లు తనకు ఆతిథ్యం ఇవ్వాలి.. ఇవీ సుందరి మనసును తొలిచేస్తున్న ఆశలు.

ఎంతో కాలంగా సుందరి మనసులో ఈ ఆలోచనల మథనం సాగుతూనే ఉంది. ఎవరికీ తెలియకుండా కరెస్పాండెన్స్ నడుపుతోంది. ఆమెను ముంబయి రమ్మని పిలుపు వచ్చింది. ఫలానా రోజు ఫలానా రైలుకు వస్తున్నట్లు జవాబు పంపించింది. స్టేషన్‌లో దిగగానే ఆమెను రిసీవ్ చేసుకోవటానికి ఆ కంపార్టెమెంట్ దగ్గరికే తమ సిబ్బంది వస్తుందని తెలియజేశారు. ఈ కరెస్పాండెన్స్ అంతా ఒక ఫ్రెండ్ ఇంటికే వచ్చింది. ఇంట్లో ఎవరికీ తెలియనివ్వలేదు. పోటీలలో తను గెల్చాక, ఆ వార్త విని, వాళ్లు పొందే థ్రిల్ అంతాయింతా కాదు. ఫ్రెండ్ ఊరికి వెళ్తున్నట్లు, చెప్పి, ముంబయి రైలు ఎక్కింది.

రైల్లో తన పక్కన ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు కూర్చున్నారు. వాళ్లు ఇంజనీరింగ్ చదివారనీ, ఐటీ ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెల్పుతుంది.

పక్కన ఉన్న అమ్మాయి పేరు సృజన. సుందరితో మాటలు కలిపింది. టాపిక్‍ను అందాల పోటీ మీదకు మళ్ళించింది.

“మగవాళ్లకు కూడా అందాల పోటీ పెడితే బావుణ్ణు. నా నెత్తిన కిరీటం పెట్టేవాళ్లు” అన్నాడు ఒకడు.

“తలకు మాసిన వెధవ్వి నీ నెత్తిన కిరీటం పెట్టేదెవర్రా?” అన్నాడు మరొకడు.

అక్కడి నుంచీ వాళ్ల సంభాషణ అందాల పోటీ మీదకు మళ్లింది.

“అందాల పోటీ అనేది ఒక పెద్ద బిజినెస్ రా. అందమైన అమ్మాయిలను సేలబుల్ కమాడిటీగా మార్చే వ్యాపారం అది. అందాన్ని గుర్తించే పేరుతో వాళ్ళని అర్ధ నగ్నంగా తిప్పటం, ఒకరిని అందాల రాశిని చేసి, ఏడాది పాటు ఆమెను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవటం, వ్యాపార ప్రకటనలు ఇప్పించి డబ్బు గుంజుకోవటం, స్పాన్సర్ల నుంచీ, టీ.వీ ఛానల్స్ నుంచి కోట్ల రూపాయల వ్యాపారం చేయటమే వాళ్ల ఉద్దేశం” అన్నాడు ఆ ఇద్దరిలో ఒక అతను.

“ఇదంతా పాశ్చాత్యదేశాల సంస్కృతి. సంపన్న దేశాల వాళ్లకు ప్రతిదీ వ్యాపారమే. వాళ్లకు వినోదాన్ని వ్యాపారంతో ముడిపెట్టగల సామర్థ్యం ఉంది. మన సంస్కృతి వేరు. అందమైన వాళ్ళను ఒక ఏడాది కాదు, జీవితాంతం గౌరవిస్తాం. అరవైఏళ్ల వయసులోనూ అందంగా ఉండే వాళ్లు ఉన్నారు. ఎదిగే ఎదగని పిల్లలకు ఇలాంటి పోటీలు పెట్టి ఆశలు కల్పించి, వ్యాపారపుటెత్తులకు వాళ్లను బలి చేయకూడదు” అన్నాడు ఆ కుర్రాడే.

రాత్రి పది గంటలు అయింది. అందరూ నిద్రకు ఉపక్రమించారు. సుందరి కూడా నిద్రపోయింది. కలలు ఆమెను కలత నిదురకు గురిచేశాయి. సుందరి అందాలరాణిగా ఎంపిక అయింది. ఆమె సంతోషానికి అంతులేదు. ఎవరెవరో ప్రముఖలతో కరచాలనం చేస్తోంది. ఎవరెవరితోనో విందులు ఆరగిస్తోంది. ఎవరెవరి ఇళ్లనో, కౌగిళ్ళనో పావనం చేస్తోంది.

పదేళ్లు గడిచాయి. ఆమె ఇప్పుడు ఒంటరి. అందరి కళ్ళూ ఆమెనే ఆకలిగా చూస్తుంటాయి. కానీ ఆమె ఆకలి తీరే మార్గం కనబడటం లేదు. ఏదో కలవరించింది. సృజన నిద్ర లేపింది.

మర్నాడు సుందరి రైలు దిగింది. ఎవరో ఆమెను వెతుక్కుంటు వచ్చారు. తనను కాదన్నట్లు తప్పుకుంది.

సుందరి తిరుగు ప్రయాణానికి టిక్కెట్టు కొనుక్కుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here