చిరుజల్లు-99

0
2

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

చంద్రోదయం

ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ తీరిక దొరికింది.

ఇంట్లో ఎవరూ లేరు. యుద్ధం ముగిశాక యుద్ధరంగంలో నెలకొన్న భయ౦కర నిశ్శబ్దం లాంటి స్తబ్ధత. నిన్నటి దాకా ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిగా హోదా వెలగబెట్టింది. ఆధికార హోదా, దర్పం, డాబూ, హుందాతనం నిండి యుండేది. వచ్చీపోయే జనం, కింది ఆధికారులూ, జవానులూ, కనుసన్నుల ఆజ్ఞల కోసం ఎదురు చూసే పరివారం – వాళ్లంతా కనుమరుగైనారు. జీవితాన్ని హాసన్మందార మాలగా మార్చాల్సిన భర్త, కొడుకూ, కూతురూ – ఎవరి దోవన వాళ్లు వెళ్లిపోయారు. చివరకు ఏం మిగిలింది? ఉరుకులూ, పరుగులూ తప్ప.. అలుపూ సొలుపూ లేకుండా రెండు చేతులూ చాచి అనుక్షణం పరుగెత్తుకొచ్చి ఉవ్వెత్తున ఎగిసిపడి, విరిగిపడి వెనక్కి మరలిపోయే కెరటాలకేం మిగిలింది? తనకూ అంతే.

ఒంటరితనం ఆమెకు కొత్త కాదు. తెలిసీ తెలియని వయసు లోనే తల్లికి దూరమైంది. తాతయ్య ఇంట్లో పెరిగింది. పది మంది ఉండేవాళ్లు. ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉండేవాళ్లు. ఆమె ఎక్కడో ఒక మూల కూర్చుని తలకు మించిన ఆలోచనలతో సతమతమయ్యేది.

పుస్తకాలే ఆమెకు నేస్తాలు అయ్యాయి. కంఠస్తం చేసిన పాఠాలే ఆమెకు కంఠాభరణాలు అయ్యాయి. ఇంతలో పెళ్లీడు వచ్చిందన్నారు. గొప్పింటి సంబంధం అన్నారు. పెళ్లి అయిందనిపించారు.

కిందటి జన్మలో ఏ బంగారు పూలతో పూజ చేసుకుందో ఇంత మంచి భర్త దొరికాడు అన్నారు. భర్త రాజా పురుషోత్తమరావు. ఆమెకన్నా వయసులో బాగా పెద్దవాడు. ఆయన్ను చూస్తే భర్త అన్న భావం కలిగేది కాదు. అయినా తప్పదు.

అది ఒక నాటి కోటే అయినా, ఇప్పుడు పరిచారకులు లేరు. పెళ్లలు ఊడిపోయి, గోడలు పడిపోయే స్థితిలో ఉన్నాయి. కాలగర్భంలో కలిసి పోయిన ఒకనాటి వైభవానికి చిహ్నంగా మిగిలింది.

రాజ్యాలు లేకపోయినా రాజావారికి ఖరీదైన అలవాట్లు వదలి పోలేదు. ఠీవిగా కూర్చుంటే అన్నీ కాళ్ళ దగ్గరకు రావాలనుకునే దర్పం పోలేదు. పేదరికాన్ని భరించడం ఒక ఎత్తు అయితే, రాచరికంలో బ్రతుకుతున్నట్లు భ్రమించటం మరొక ఎత్తు. ఇంగువ కట్టిన గుడ్డ కదా. ఒకరిద్దరు స్త్రీలతో ఆయనకు సంబంధాలు ఉండేవి. వాళ్ళను పోషించటం రాచరికానికి చిహ్నం అనుకునే అజ్ఞానం వదల లేదు.

ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని, జీవితం గురించి అధ్యయనం చేసుకునే నాటికి ఇద్దరు పిల్లలు కలిగారు. కొడుకును ఎత్తుకున్నా, కూతుర్ని గుండెలకు హత్తుకున్నా ఆ ఆనందంలో ఏదో తెలియని వెలితి.

ఆర్థిక సమస్యలు ఎక్కవైనాయి. ఆయనను ఉద్యోగం చేయమంటే, ఒకరి చేతి బ్రతకటం కంటే ఆకలితో మాడి చావడం మేలన్నాడు. ఖరీదైన వస్తువులన్నీ కాళ్లు వచ్చి నడిచి వెళ్లి పోయినప్పుడే, వాటితో పాటే వంశ గౌరవమూ తొలగిపోయింది.

ఆయనను మార్చటం తనవల్ల కాదని ఆమెకు అర్థమైంది. మళ్లీ దృష్టి చదువు మీదకు మళ్లించింది. పరీక్షలు రాసింది. ఆఫీసర్‍గా సెలక్ట్ అయింది. భర్త ఆమెకు దూరమైనాడు. అందుకు చింతించలేదు.

అది ముళ్ల కిరీటం అని ఆమెకు త్వరలోనే తెల్సివచ్చింది. లంచాలు ఇప్పించి, ఆమెను సస్పెండ్ చేయించాలని ఆమె కింద పని చేసే వాళ్లే ఎన్నో పన్నాగాలు పన్నారు.

ఒక రాజకీయ నాయకుడు లంచం ఇవ్వబోయాడు. నిష్కర్షగా ఆమె తిరస్కరించింది. ఏడాది తరువాత ఆయన మంత్రి అయ్యాడు. ఆమెకు ప్రమోషన్ ఇచ్చాడు. అతి ముఖ్యమైన శాఖకు అధిపతి అయింది. క్రమంగా ఆమె బిజీ అయిపోయింది.

పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. ఎంత పెద్దవాళ్లు అయ్యారంటే, కూతురు ఆమెకు చెప్పకుండానే ఎవరితోనో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.

కని పెంచిన పిల్ల. ఈ చేతులతో ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుని, చొచ్చుకొట్టి నిద్రపుచ్చిన పిల్ల, ఇవాళ తనను ఏమార్చి తన దోవ తను చూసుకుంది.

ఈ బాధ తీరక ముందే, ఎన్నాళ్లనుంచో దూరంగా ఉంటున్న భర్త చనిపోయాడు – అన్న వార్త వచ్చింది. అంత్యక్రియలకు వెళ్లి వచ్చింది.

“అమ్మా, నువ్వు ఏడవటం నేను చూడలేదు” అన్నాడు కొడుకు.

“చిన్నప్పుడే నిండు జీవితానికి సరిపడినంతగా ఏడ్చాను. హృదయం ద్రవించి పోయింది. ఇప్పుడింక నాకు ఏ అనుభూతులూ లేవు.” అన్నదామె కొడుకుతో.

ఆమె రిటైర్ అయిపోయింది. ఆ భోగం, వైభవం అంతా కాలంతో పాటే కరిగి, నీరై పోయింది.

కొడుకును అమెరికా పంపించింది.

వాడు అక్కడ స్థిరపడ్డాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాడు.

రోజూ సాయంత్రం పార్క్‌కు దాకా నడిచి వెళ్తుంది. అక్కడ ఎవరో ఒక పెద్ద మనిషి మాటలు కలుపుతాడు. యోగ క్షేమాలు అడుగుతాడు.

“ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి, చేసి పెడతాను” అంటాడు నవ్వుతూ.

ఆ నవ్వుతోపాటే చంద్రోదయాన్నీ చూస్తుంది ఆమె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here