చిరునామా లేని ప్రేమలేఖ

3
3

[శ్రీ ఉషారం రచించిన ‘చిరునామా లేని ప్రేమలేఖ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి సుమారు ఒంటిగంట దాటింది. వినాయక చవితికి ఇంకా నాలుగు రోజులు ఉంది, సెప్టెంబర్ నెల పన్నెండవవ తారీఖు, చిక్కటి అడవిలో, చిమ్మ చీకటిలో నల్లటి రాదారి మీద కారు స్పీడుగా జుయ్యిమంటూ పోతోంది. పాటలు వింటూ, ఉల్లాసంగా తొందరగా ఇంటికి చేరాలని నడుపుతున్నాడు శరత్.

శరత్ ఒక పేరుమోసిన సాఫ్ట్‌వేర్ కంపెనీకి అధినేత, అనతికాలంలోనే తన ప్రతిభ వల్ల పైకి ఎదిగిన వ్యక్తి. వయసు సుమారు ముప్పై ఐదు ఏళ్ళు దాటి కొద్దిగా ఉంటాయి. పెళ్లయి భార్య సుమతి, మూడేళ్ల కుర్రాడు సుహాన్‌తో చక్కగా సాగిపోతున్న సంసారం. డబ్బులకు ఏమీ లోటు లేని సుఖమయం అయిన జీవితం.

ఏదో పనిమీద పక్క మెట్రోనగరానికి వెళ్లి, అక్కడ నుండి వచ్చేస్తుంటే, మధ్యలో దట్టమయిన అడవి సన్నటి చినుకు పడుతూ వాతావరణం పెద్ద వర్షానికి సిద్ధంగా ఉండటంతో, వర్షం పెద్దది అయ్యే లోపల ఇంకో నలభై కిలోమీటర్లు దూరంలో పట్టణంలో ఉన్న తన ఇల్లు చేరాలని ఆదుర్దాగా కారు వేగంగా నడుపుతున్నాడు. గత రెండు రోజులుగా జరిగిన మీటింగ్స్‌లో తన కంపనీకీ కొత్త ఆర్డర్లు రావటంతో, చాలా ఉల్లాసంగా కారు నడుపుతున్నాడు.

 ఉల్లాసంగా కారు నడుపుతున్న శరత్ కు దూరంగా కారు వెలుతురులో రోడ్డుకు అడ్డంగా మరీ వచ్చి కారు ఆపమన్నట్టు సౌజ్ఞలు చెస్తూ ఒక ఆడపిల్ల కనిపించింది. ఎవరై ఉంటారు? పైగా అర్ధరాత్రి, అడవి దారి, ఆపితే ఏమైనా ప్రమాదం ముంచుకు వస్తుందేమో? కానీ చూస్తుంటే ఎవరో ఆడపిల్లలా ఉందే. అదీ అడవి మధ్యలో, ఏం కష్టం వచ్చిందోనని ఆలోచిస్తూనే కారు వేగం బాగా తగ్గించి నెమ్మదిగా కారు ఆపమని అడుగుతున్న వ్యక్తి ఎవరై ఉంటారా అని తేరిపారా చూడటం మొదలు పెట్టాడు. ఎవరో అమ్మాయి, ఎక్కడో చూసిన పరిచయం ఉన్న అమ్మాయిలా ఉంది లిఫ్ట్ ఇవ్వమని అడుగుతోంది.

అలా ఆలోచిస్తూనే కారు ఒక పక్కాగా అమ్మాయికి దగ్గరగా ఆపాడు.

అరే!.. ఈ అమ్మాయి మన ఆఫీసు ముందు ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో కదా పనిచేస్తుంది. పేరు.. పేరు.. భూమిక అనుకుంటా.. అని తలుచుకుంటూ కారు డోర్ తెరిచాడు.

భూమిక డోర్ తీసుకుని ఎక్కి “థాంక్యూ సార్.. అదిగో నా కారు చెడిపోయింది. అందువల్ల.. హలో శరత్ గారు మీరా.. ఎవరో అనుకున్నా? ఓహ్ గాడ్.. గ్రేట్. బాగున్నారా సార్? మీతో పాటు నేనూ మన ఊరికి వచ్చేస్తాను.

ఎంత అదృష్టం. ఇంత అర్ధరాత్రి ఈ అడివిలో ఇలా కారు దొరకడమే కాకుండా మీలా తెలిసిన వాళ్ళది అవ్వడం.. వావ్” అంటూ గలగలా మాట్లాడేసింది.

“హాయ్! భూమిక.. కూర్చోండి. ఇంత అర్ధరాత్రి ఎక్కడకు వెళ్లారు? ఐనా ఈ అడవిలో మీ కారు ఆగిపోవటం ఏమిటి? ఏదో నేను కాబట్టి సరిపోయింది, ఇంకొకళ్ళు అయితే ప్రమాదం ముంచుకు రాదా? నేనూ మామూలుగా అయితే ఆపేవాడిని కాదు ,కానీ ఎవరో తెలిసున్న ముఖంలా అనిపించడంవల్ల.. ఆపాను. సరే ఇంక బయలుదేరుదామా? ఇందులో మంచినీళ్లు ఉన్నాయి తీసుకోండి” అంటూ వాటర్ బాటిల్ అందిస్తూ కారు ముందుకు ఉరికించాడు.

“ఏదో పని మీద అలా వెళ్ళాను. మధ్యలో కారు చెడిపోయింది. ఏమైనా అదృష్టవంతురాలిని, మీ కారులో వచ్చే అవకాశం వచ్చిందిగా?” అంటూ నవ్వింది భూమిక.

పెద్ద పెద్ద నల్లటి సున్నాలున్న పసుపు పచ్చటి పంజాబీ డ్రెస్సులో మంచి సౌష్టవంతో మెరిసిపోతూ చాలా అందంగా శరత్‍కు కనిపించింది. ‘చాలా అందంగా ఉంది, పైగా బుద్ధిమంతురాలు, చక్కగా మాట్లాడుతోంది. ముద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎవడికి భార్య అవుతుందో వాడు నిజంగా అదృష్టవంతుడే. అందం, అణుకువ, మంచితనం కలబోసిన రూపం ఆమెది, గత ఏడాది నుండి చూస్తున్నా, ఏవైనా కంపెనీ మీటింగులలో కలిస్తే పలకరించేది.

నాకే కనుక ఒక పది సంవత్సరాలు ముందు కలిసి ఉంటే నేనే పెళ్లి చేసుకునేవాడిని’ అనుకుంటూ ఆమెకేసి తనివితీరా చూడటం మొదలు పెట్టాడు.

“శరత్ గారు.. సార్.. మిమ్మల్నే.. ఏమిటి ఏదో ఆలోచనలో ఉన్నారు? నన్ను చూసి అలా మైమరచి పోతున్నారేమిటి?” అంటూ ఆటపట్టిస్తూ భూమిక నవ్వింది.

“లేదులే.. భూమిక.. నీలాంటి చక్కటి అమ్మాయిని పొందే అదృష్టవంతుడు ఎవరా? అని ఆలోచిస్తున్నాను. మన మధ్య పెద్దగా పరిచయం లేకపోయినా నిన్ను చూసినప్పుడల్లా మంచి భావన కలుగుతుంది. నీకో నిజం చెప్పాలి. చెబుతా కానీ ఏమీ అనుకోవు కదా?” అంటూ ఒక సెకను ఆగాడు.

“లేదు.. లెండి.. చెప్పండి. ఏమీ అనుకోను” అంటూ మురిపెంగా చూసింది భూమిక.

“నాకు పెళ్లి అయి ఉండకపోతే నేనే నీ వెనుక పడి ఈపాటికి పెళ్లి చేసుకునేవాడిని. నాకు చక్కటి భార్య, కొడుకు సంసారం అన్నీ ఉన్నాయి. నా ఉద్దేశంలో దురుద్దేశం ఏమీ లేదు. నీలాంటి చక్కటి అమ్మాయిని మంచి వరుడు దక్కితే, వాళ్ళ జీవితం ఎంత అందంగా ఉంటుందో అని నా ఉద్దేశం” అంటూ కాస్త భయంగానే మనసులో ఉన్నా తాను అనుకున్నది చెప్పేసాడు.

శరత్ మాటలకు చిన్నగా నవ్వి “ఇప్పుడు మాత్రం ఏమయ్యింది? శరత్ గారు, మీరు అవును అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నాకు మీరంటే చాలా ఇష్టం. నాకు ఏమీ ఇబ్బంది లేదు” అంటూ కాస్త సిగ్గుతో నవ్వింది భూమిక.

“చాల్లే.. ఊరుకో.. భూమిక.. నేనేమీ అలాంటి వాడిని కాదు. ఏదో మనసులో మాట చెప్పాను, చక్కటి పిల్లవు అని.. దానికే ఇంత ఆటపట్టించడమా. నీకు మంచి భర్త వస్తాడులే..” అంటూ కాస్త గర్వంగా నవ్వుతూ అన్నాడు శరత్.

“లేదు శరత్ గారు. నేనేమీ ఆటపట్టించటం లేదు. మీరు ఎలా మనసులో మాట చెప్పారో నేనూ అలాగే చెప్పాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎన్నాళ్ళు నుండో చెబుదాం అనుకున్నా కానీ, ఎప్పుడూ ఇలా మీతో కలిసి మాట్లాడే అవకాశం , సందర్భం రాలేదు. కానీ నేను ఇప్పడు మాట్లాడుతోంది వందశాతం నిజం” అంటూ ఎంతో మృదువుగా శరత్ చేతిలో చెయ్యి కలుపుతూ చెప్పింది భూమిక.

భూమిక మాటలు విన్న శరత్‍కు ఒక పక్క మనసులో ఆనందం కలిగినా, తన భాద్యతలు, పెద్దరికం రెండూ గుర్తుకు వచ్చి నెమ్మదిగా మందలిస్తూ “భూమిక.. ఏమిటా పిచ్చి ఆలోచనలు. నేను పెళ్లయినవాడిని. నీకు మంచి భర్త వస్తాడు, అంతే కానీ ఇలా ఊహించడం తప్పు. చిన్నపిల్లవి.”అంటూ ఆగాడు.

“శరత్ గారు.. నేను మీ కన్నా చిన్నపిల్లనే అంతే. కానీ నాకూ వయసు వచ్చింది, మనసుకు నచ్చింది సరిగ్గానే ఊహించే శక్తి భగవంతుడు ఇచ్చాడు. మిమ్మల్ని ప్రేమించడం మాట వాస్తవం. తరువాత మీకు పెళ్లి అయ్యిందని విషయం తెలియగానే ఆగాను. అంత మాత్రం చేత ఇష్టం వదులుకోవాలని, పడకూడదని లేదుగా?” అంటూ ఎంతో హృద్యంగా చెప్పింది.

దానితో వారి ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటలు కరువయ్యాయి. ఈ లోపల సిటీలోకి కారు వచ్చేసింది.

“సరే భూమిక! నీతో ప్రయాణం కొద్దిసేపు అయినా అద్భుతంగా అనిపించింది. ఇంతకూ నిన్ను ఎక్కడ దింపాలో చెప్పు, అక్కడ దింపేసి ఇంటికి వెడతాను” అన్నాడు శరత్.

“శరత్ గారు అదిగో ఆ మలుపు దగ్గర ప్యారడైజ్ ప్లాజా అపార్ట్మెంట్ ఉందిగా అక్కడ ఆపండి. అదే నేను ఉండేది” అంటూ కారు అక్కడకు రాగానే దిగిపోతూ “మరోసారి చెబుతున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం, అది మాత్రం నిజం. థాంక్యూ.” అంటూ చెయ్యి ఊపుతూ ముందుకు వెళ్ళిపోయింది.

“సరే.. భూమిక.. బై.. బై.., గుడ్ నైట్” అంటూ చేతులు ఊపుతూ కారు ముందుకు ఉరికించాడు.

***

“ఏమండోయి! మిమ్మల్నే! ఏమిటి? కల కంటున్నారా? ఎవరికి బై అంటూ చేతులు ఊపుతున్నారు” అంటూ భార్య సుమతి లేపడంతో కళ్ళు నులుముకుంటూ లేచాడు శరత్.

‘ఒహ్.. కలా.. ఏమిటో నిజం అనుకున్నా?’ అని మనసులో ఆ తియ్యటి కలను తలుచుకుంటూ గర్వంగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాత్రూమ్ వైపు దారి తీసాడు.

స్నానం చేసి పూర్తిగా తయారయి టిఫిన్ తినడానికి వచ్చిన శరత్‌ను చూసి భార్య సుమతి “ఏమిటి పొద్దున్నే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అదేమిటో మాక్కూడా చెప్పొచ్చుగా” అంటూ నవ్వింది.

తనకు వచ్చిన కల, అందులో సారాశం అంతా విశదీకరించిన శరత్‌ను సుమతి చూస్తూ “ఓహో ఇంకా ఏవో కొంటె ఆలోచనలు మనసులో ఉన్నాయన్నమాట, ఇంతకూ ఆ కలల రాకుమారి నిజంగా ఉందా? లేక కలయేనా?” అంటూ కాస్త కొంటేగాను, కాస్త కోపంగాను అడిగింది.

“ఆ అమ్మాయి ఉన్న మాట వాస్తవమే, కానీ ఇలాంటి సందర్భాలు జరగలేదు. అది కలే బాబూ. నువ్వు దాన్ని సాగతీయకు” అంటూ నవ్వుతూ ఒక దండంపెట్టి అక్కడనుండి ఆఫీసుకు బయలుదేరాడు.

సుమతి నవ్వుకుంటూ శరత్‌ను సాగనంపటానికి గేటు వరకు వచ్చింది. శరత్ తన కారు తీసుకుని ఆఫీసుకు బయలు దేరి వెళ్ళాడు.

రోజూ వెళ్లే దారిలో అలా కాసేపు వెళ్ళగానే రోడ్ రిపేరు వల్ల మూసివేయటంతో మళ్లీ కారు వెనక్కు తిప్పి ఇదివరకు ఎన్నడూ వెళ్లని దారివైపు ఆఫీసుకు వెడుతుంటే, ఏదో ఆ దారి ఇదివరకు ఎక్కడో చూసినట్లు, ఎప్పుడో అటువైపు వచ్చినట్లు అనిపించసాగింది.

ఒకేచోట రోడ్ సిగ్నల్ దాటుతుండగా దూరంగా ఒక అపార్ట్మెంట్ ప్యారడైజ్ ప్లాజా అంటూ ఆకర్షించింది. అప్పటిదాకా ఏదో ఆలోచిస్తూ కారు నడుపుతున్న శరత్ హఠాత్తుగా కారు ఆపేశాడు. నిన్న రాత్రి కలలో చూసింది ఈ అపార్ట్మెంట్ కదా!

ఇన్నాళ్లు ఈ ఊళ్ళో ఉండికూడా ఇటువైపు ఎప్పుడూ రాలేదు. మరి ఎప్పుడూ చూడని ఈ అపార్ట్మెంట్ కలలో అచ్చంగా అలాగే ఎలా వచ్చింది. చిత్రంగా ఉంది కదా. అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.

ఆఫీసుకైతే వెళ్ళాడు కానీ మధ్య మధ్యలో ఎదురుగా ఉండే కంపెనీ వైపు దృష్టి సారించడం మొదలుపెట్టాడు. నిజంగానే భూమిక అక్కడే పనిచేస్తుంది. చాలా చక్కటి అమ్మాయి, అందగత్తె, పైగా కలలోకి వచ్చి మరీ గిలిగింతలు పెట్టింది, తెలియకుండానే శరత్ మనసులో రొమాన్స్ కోణం నిద్రలేచింది. భూమిక బయటకు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని ఆలోచనలో పడ్డాడు. ఆ రోజంతా అలా ఆ రోజంతా అన్యమనస్కంగా గడిచింది.

ఇంతలో తన మొబైల్‌లో చిన్నప్పటి స్నేహితుడు ఇన్‍స్పెక్టర్ ఖాసిం లైనులో. “ఏం సార్ పోలీసువారు. ఏంటి విశేషం. చాలాకాలం అయ్యింది. ఈ మధ్య ఫోన్‍లో పలకరింపు కూడా లేదు, ఎలా ఉన్నావ్?” అంటూ చాలా ఆప్యాయంగా పలకరించాడు.

“ఒరేయి.. శరత్.. బాగున్నావా? నువ్వు ఎన్నింటికి ఇంటికి వెడతావ్? నీకో సర్‌ప్రెజ్, నేను ఈ ఊరిలోనే టూ టౌన్ సర్కిల్ ఇనస్పెక్టర్‌గా ప్రమోషన్ మీద బదిలీ అయ్యివచ్చాను. ఇవాళ ఉదయం డ్యూటీలో చేరాను. సాయంత్రం నిన్ను కలుద్దామని అనుకుంటున్నాను. భాభీ, బేటాగాడు క్షేమమేనా?” అంటూ అటువైపు నుండి అడిగాడు సి.ఐ. ఖాసిం.

“వావ్.. సూపర్.. ఇంకేమి. ముందుగా నీకు అభినందనలు. నేను సాయత్రం ఆరు ఇంటికల్లా ఇంటికి వచ్చేస్తా. నువ్వు కూడా వచ్చేయి. తెలుసుగా నా ఇంటి అడ్రస్” అంటూ ఎంతో ఉల్లాసంగా బదులిచ్చాడు.

“సరే రా. ఈవాళ నేనూ అదే టైమ్‌కు అన్నీ పక్కనపెట్టి వచ్చేస్తాను.” అంటూ ఫోన్ పెట్టేసాడు ఖాసిం.

శరత్ తన పనులు అన్నీ ముగించుకుని బాల్య స్నేహితుడిని కలుస్తున్న ఆనందంలో ఎంతో ఉల్లాసంగా ఇంటికి అనుకున్న సమయానికి వెళ్లి ఖాసిం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు కానీ ఖాసిం అనుకున్నట్టుగా కాకుండా కొంచెం ఆలస్యంగా రాత్రి ఎనిమిది తరువాత డ్యూటీ డ్రెస్ కూడా మార్చుకోకుండానే వచ్చాడు.

“సారి రా! బయలుదేరుదామనే లోపు ఏదో కొత్త కేసు, మిస్సింగ్ కేసు. దాని వివరాలు అన్నీ తెలుసుకుని విచారించి వచ్చేటప్పటికి ఇదిగో ఇలా అయ్యింది. ఇంక నా గెస్ట్ హౌస్‌కు కూడా వెళ్లకుండా వచ్చేసాను” అంటూ ఖాసిం సంజాయిషీ ఇచ్చాడు.

“పరవాలేదు రా.. మీ పని అలాంటిది. అర్థం చేసుకోగలను. అదిగో మీ భాభీ.. వాడు నా బేటా” అంటూ పరిచయం చేశాడు. పలకరింపులు అయ్యాయి. అలా ఇద్దరూ ఒక రెండు గంటల పాటు చిన్ననాటి సరదాలు, చదువుల విషయాలు, ఆర్థిక పరిస్థితులు, ఇలా ఒకటేమిటి ఎన్నో మాట్లాడుకుంటూ మైమరిచిపోయారు. ఖాసిం వెళ్లడంతో శరత్ చాలా ఆనందంగా నిద్రలోకి జారుకున్నాడు.

***

“హాయ్!.. శరత్ సార్! బాగున్నారా? నన్ను మరచి పోయినట్టున్నారు. ఏంటి నిన్న అంతా మా కంపెనీ గేట్ వైపు చూస్తూ నా కోసం ప్రయత్నం చేస్తూ కాలం గడిపారు. ఏం అంతలా గుర్తుకు వచ్చానా?” అంటూ భూమిక ఎదురుగా ఉండటంతో ఒక్క క్షణం తడబడ్డాడు శరత్.

“లేదు లేదు.. భూమిక అలాంటిది ఏమీ లేదు? నువ్వు గుర్తున్నావు కానీ ఏదో యథాలాపంగా మీ ఆఫీసు వైపు చూసాను.” అంటూ తప్పు చేసిన వాడిలాగ బింకంగా అన్నాడు.

“నాకు తెలుసు డియర్.. కబుర్లు చెప్పకు. నేను గమనించలేదని అనుకున్నవా, అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం” అంటూ చటుక్కున కిందకు వంగి శరత్ పెదాలపై ముద్దాడింది.

ఆ హఠాత్ పరిణామం ఊహించని శరత్ “నో.. వద్దు వద్దు.. భూమిక.. తప్పు” అంటూ గింజుకోవటం మొదలు పెట్టాడు.

“అయ్యా.. భర్తగారు.. బాబు పొడుకున్నాడు. మీరు ఏదో నా వైపు తిరిగి అమాయకంగా పొడుకున్నారని, ముద్దుగా కనిపిస్తే ముద్దు పెట్టాను. దీనికే ఇంత గింజుకుంటున్నారేమిటి.. నన్ను ఈ మధ్య మరచిపోయారు” అంటూ నిష్ఠూరంగా సుమతి అనడంతో తెలివిలోకి వచ్చిన శరత్‌కు అర్థం అయ్యింది భూమిక చేసిన అల్లరి కలలో జరిగిందని. ఎందువల్ల నాకు ఇలా అవుతోంది. కారణం అర్థం కావటం లేదు ఏమిటో అని అనుకుంటూ దగ్గరకు వచ్చిన సుమతిని బుజ్జగిస్తూ మరింత దగ్గరగా లాక్కుని ముద్దుపెట్టుకుంటూ రాత్రిలో కలిసిపోయాడు.

మరునాడు ఉదయం రోజూ లాగానే శరత్ ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో ఖాసిం ఉదయాన్నే ఇంట్లోకి వస్తూ “భాభీ! కాస్త కాఫీ ఇవ్వండి. ఏరా! ఆఫీసుకు బయలు దేరావా? ఏదో కేసు పనిమీద ఇక్కడకు వచ్చాను. మా దగ్గర కాఫీ బాగోలేదు. సరే ఇక్కడి దాకా వచ్చానుగా ఒక కప్పు కాఫీ తాగేసి వెడదామని వచ్చాను” అంటూ కూర్చున్నాడు.

“గుడ్ మార్నింగ్! దానికేముంది. కూర్చో.. ఏమిటి విశేషం” అంటూ శరత్ కూర్చున్నాడు.

“ఏముందిరా.. మా డ్యూటీ అలాంటిది. ఎవరో అమ్మాయి మిస్సింగ్ కేసు. నిన్న సాయంత్రం వాళ్ళ తల్లిదండ్రులు రిపోర్ట్ ఇచ్చారు. సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నుండి ఆ అమ్మాయి ఏమయ్యిందో తెలియదు, ఫోన్ అందుబాటులో లేదు. ఎవ్వరి దగ్గరా సమాచారం లేదు. ఇప్పటికే నాలుగు రోజులు దాటింది. ఆ అమ్మాయి ఇక్కడే దగ్గరలో ఉన్న ప్యారడైజ్ ప్లాజాలో వుంటుందిట. పరిశోధించడానికి వచ్చాను” అంటూ ఖాసిం ఇది మాకు మామూలే అన్నట్టు ముగించాడు.

“ప్యారడైజ్ ప్లాజా.. అరే.. మరోసారి ఈ పేరు ఉంటున్నా” అంటూ శరత్ గొణుక్కున్నాడు.

“ఇంతకూ ఎవరు.. ఆమె? ఏమైనా వివరాలు తెలిసాయా?” అంటూ కాస్త ఏమిటో తెలుసుకోవాలన్న ఆలోచనతో శరత్, ఖాసింను అడిగాడు

“ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను. ఇంకా ఆ ఇంటికి వెళ్లి చూడాలి. ఎవరో అమ్మాయి ఉద్యోగం చేస్తున్నదే. ఇదిగో ఈ ఫోటో నిన్న ఇచ్చారు. ఇంక మిగతా వివరాలు రాబట్టాలి” అంటూ జేబులో ఉన్న ఫోటో శరత్ ముందు పడేసాడు.

ఆ ఫోటో చూడగానే శరత్‍కు చమటలు పట్టేసాయి.. గత రెండు రోజులుగా ఎవరి గురించి తలుస్తున్నాడో అదే.. భూమిక ఆమెదే.. ఫోటో.

“అరే.. ఈమె.. భూమిక. మా కంపెనీకి ఎదురుగా ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈమెకు ఏమయ్యింది.” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు శరత్.

“ఓహో.. నీకు కాస్త ఐడియా ఉందన్నమాట, సరే నేను అక్కడకు వెళ్లి నా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాను. అవసరం అయితే ఆమె ఆఫీసుకు వెళ్లవలిసి వస్తే, నీ సహాయం అవసరం ఉంటుంది” అంటూ ఖాసిం అక్కడనుండి బయలుదేరి వెళ్లిపోయాడు.

శరత్.. సుమతి ఒక్కసారి ముఖాముఖాలు చూసుకున్నారు.

శరత్‌కు ఒక్కసారి తల తిరిగినట్టయ్యింది. ‘ఈ అమ్మాయే కదా రెండురోజుల నుండి కలలో అల్లరి చేస్తోంది. ఏమై ఉంటుంది? ఎంత చక్కటి అమ్మాయి, ఎంత అందగత్తె. పాపం ఏమి అయ్యిందో? ఏమీ అవ్వకుండా ఉంటే బాగుండును’ అని మనసులో అనుకుంటూ అన్యమనస్కంగానే ఆఫీసుకు బయలుదేరాడు. భర్త మానసిక పరిస్థితి అర్ధం చేసుకున్న సుమతి మౌనంగా భర్తను పరిశీలించసాగింది.

మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర ప్రాతం అప్పుడే లంచ్‍కు కూర్చున్న శరత్‍కు ఖాసిం నుండి ఫోన్ – “శరత్.. ఇంకో అరగంటలో నేను మీ ఆఫీసు ముందు ఉంటాను. లంచ్ చేసి సిద్ధంగా ఉండు. నాకు నీ సహాయం అవసరం” అంటూ.

సరేనంటూ గబగబా భోజనం ముగించి ఖాసిం కోసం ఎదురు చూడటం మొదలు పెట్టాడు.

అనుకున్నట్టుగానే ఖాసిం తాను చెప్పిన టైమ్‌కు వచ్చాడు. “శరత్.. ఈ అమ్మాయి నువ్వు గుర్తుకుపట్టిన భూమిక ఒకరే. అదిగో ఆ కంపెనీలో పనిచేస్తుంది. సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నుండి, అంటే సుమారు నాలుగు రోజులయ్యింది, కనబడటం లేదు. సెల్, కారు రెండూ అందుబాటులో లేదు. ఇంట్లో లాప్‌టాప్ దొరికింది. దాన్ని తెరవటానికి ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు రా, అక్కడ వాళ్ళ కంపెనీలో విచారిద్దాం.” అంటూ భూమిక పని చేసే కంపెనీలో విచారించడానికి అడుగులు వేసాడు.

అక్కడ సుమారు ఒక రెండు గంటల పాటు ప్రాథమిక విచారణ చేసాడు. అందులో భూమిక చాలా తెలివయిన అమ్మాయని, పెద్దగా ఎవరితోనూ పరిచయాలు లేవని, గత రెండు సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నదని అందరూ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ పన్నెండున ఆఫీసునుండి మార్నింగ్ షిఫ్ట్ చేసి వెళ్లిన ఆమె అప్పటి నుండి ఆఫీసుకు తిరిగి రాలేదు. వివరాలు ఎవ్వరికీ తెలియవు. ఇవే విషయాలు ఎవరిని అడిగినా తిరిగి, తిరిగి చెప్పారు. కానీ ఒక అమ్మాయి మాత్రం శరత్ వైపు వింతగా దొంగచూపులు చూస్తూ పక్క నుండి పరిశీలించడం ఖాసిం పోలీసు చూపునుండి తప్పించు కోలేకపోయింది. శరత్‍ను ఆఫీసుకు వెళ్ళిపొమ్మని పంపించేసి ఆ అమ్మాయిని ప్రత్యేకంగా విచారించడం మొదలు పెట్టాడు.

“చూడు.. ఇందు.. నీకు తెలిసున్న విషయాలు అన్నీ చెప్పు. నీకు ఏమీ అవ్వదు. మీ ఫ్రెండ్ భూమిక ఏమయ్యిందో, తెలియటానికి నీ సహాయం ఎంతో అవసరం. ఏ చిన్న విషయం అయినా పనికి వస్తుంది. నీకు శరత్ తెలుసా.. నువ్వెందుకు అతని వంక అనుమానంగా చూశావ్? పరవాలేదు. నీకు ఏమీ అవ్వదు” అంటూ నెమ్మదిగా చాలా విషయాలు రాబట్టాడు.

“నిజమా.. శరత్‌ను భూమిక ప్రేమిస్తోందా? అదీ పెళ్లయి పిల్లలున్న వ్యక్తిని, విచిత్రంగా ఉంది కదూ.” అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు ఇందు చెప్పిన విషయాలు విని.

“ఈయన అంటే చాలా ఇష్టం సార్, ఈ ఆఫీసులో నాకు తప్ప ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. నాతో చాలా క్లోజ్‍గా ఉండటం వల్ల తెలిసింది. అప్పటికి ఇదేం చోద్యం అన్నాను. నాకు ఆయనంటే చాలా ఇష్టం. తెలివయిన వారు, అందగాడు, మంచి మనిషి, తన ఉద్యోగుల అందరినీ చాలా బాగా చూసుకుంటాడు. ఏ దురలవాట్లు లేవు.. ఇంకేమి కావాలి. ఇలా చాలా కారణాలు ఉన్నాయి ఆయనను ఇష్ట పడటానికి. కానీ ఆయనకు ఈ విషయం తెలియదు. ఎప్పుడూ చెప్పలేదు. ఇంతే సార్. ఇంతకు మించి నాకు ఏ వివరాలు తెలియవు. ఇందాక అందుకే శరత్ గారు వస్తే భూమిక ఎందుకు ప్రేమించిందా అని అనుకుంటూ చూసాను.” అంటూ తనకు తెలుసున్న విషయాలు పూర్తిగా ఏకరువు పెట్టింది ఇందు.

గట్టిగా నిట్టూరిస్తూ ఖాసిం “ఇంక ఈ విషయాలు ఎవ్వరికి చెప్పకు” అంటూ, “ఏమైనా కొత్త సమాచారం గుర్తుకు వస్తే తనకు ఫోన్ చెయ్యి”అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి, అక్కడ ఉన్న సిసి కెమెరా ఫుటేజ్ పరిశీలించడం మొదలు పెట్టాడు. చాలా సేపు చూసిన తరువాత భూమిక ఆఫీసు నుండి వెళ్లిపోతూ తన కారును బయటకు తీసి వెళ్లిన దృశ్యాన్ని తన సెల్ ఫోన్ లోకి మార్చుకుని మళ్లీ శరత్ ఆఫీసు వైపు అడుగు వేసాడు.

“ఒరేయ్! శరత్.. కాస్త టీ తెప్పించరా, బుర్ర తిరుగుతోంది. విచిత్రమయిన కేసులా ఉంది. ఎక్కడా క్లూ దొరకటం లేదు. ఆమె పన్నెండవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఈ వీడియోలో ఆఫీసు వదిలి ఆమె బయటకు వెళ్లడం మాత్రమే ఆధారం. అక్కడ నుండే పరిశోధన మొదలుపెట్టాలి, నగరంలో ఈ కారు ఎటువైపు వెళ్లిందో ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నచోట కెమెరాలలో చూడాలి.” అంటూ ఆమె ఆఫీసునుండి బయటకు వెళ్లిన వీడియో శరత్‌కు చూపాడు.

ఆ దృశ్యం చూసిన శరత్‌కు ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది. తనకు కలలో ఎలా కనిపించిందో భూమిక అదే నల్లటి పెద్ద సున్నాలున్న పసుపు రంగు డ్రెస్సులో, అదే కారులో.

ఒక్కసారిగా శరత్‌కు తెలియకుండానే చమటలు పెట్టేసాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. శరత్ హావభావాల్ని పరిశీలిస్తూ అతని మానసిక పరిస్థితి అంచనా వేస్తూ టీ తాగటం మొదలు పెట్టాడు ఇన్‌స్పెక్టర్ ఖాసిం.

“శరత్.. ఏమిటి.. ఏమయ్యింది. నీ ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. నా పోలీసు కళ్ళను దాటి ఏమీ దాచలేవు, ఏమైనా ఉంటే నాతో చెప్పు.” అంటూ ఖాసిం శరత్‌ను సముదాయించాడు.

“అదేం కాదురా. ఏదో ఒక విచిత్రంలా నాకు అనిపిస్తోంది. ఇలా కూడా అవుతుందా ఏమిటి? నాకు అర్థం కావటం లేదు” అంటూ తనకు రెండు రోజుల నుండి వరుసగా వస్తున్న కలలు, అందులో కనిపిస్తున్న గుర్తులు అన్నీ పూసగుచ్చినట్టు చెప్పేసాడు.

“ఒహ్.. నిజంగా విచిత్రంగా ఉంది. మామూలుగా అయితే నమ్మేవాడిని కాదు. కొన్ని విషయాలు నీ కలలో లాగే ఇక్కడ జరిగి ఉన్నాయి. సరే.. మనం ఇలా ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు చెయ్యకూడదు. నువ్వు కలలో అమ్మాయిని ఎక్కడ ఎక్కించుకున్నావో గుర్తుందా? మనం అక్కడకు వెడదాం. ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. రాత్రి నాతో రాగలవు కదా” అంటూ తన స్టేషన్‍కు ఫోన్ చేసాడు.

“రాఘవయ్య.. నేను నిన్న మిస్సింగ్ కేసు దర్యాప్తు నిమిత్తం బయటకు వెడుతున్నాను. అవసరం అయితే మన టీమ్ మొత్తం సిద్ధంగా ఉండండి. నేను లొకేషన్ షేర్ చేస్తాను. రమ్మంటే వచ్చేయండి.” అంటూ ఖాసిం ఆర్డర్ వేసాడు.

అలా శరత్, ఖాసిం కారులో సుమారు ఒక గంట ప్రయాణం చేసి అడవి మధ్యలో శరత్ కలలో ఎక్కడ ఆపినట్టు అనుకున్నాడో అక్కడే పక్కకు కారు ఆపి ఇద్దరూ దిగారు.

అప్పటికే రాత్రి అయిపోవడంతో చిమ్మ చీకట్లో కారు లైట్లు వేసుకుని, తమతో తెచ్చుకున్న టార్చి లైట్లు వెలుగులో పరిశోధన మొదలు పెట్టారు. అలా వెతికిన ఒక అరగంటకు భూమిక కారు ఒక పొదల చాటున కనిపించింది.

వెంటనే ఖాసిం తన స్టేషన్‌కు ఫోన్ చేసి, మొత్తం క్లూస్ టీమ్‌ను అన్ని హాంగులతో రమ్మని లొకేషన్ షేర్ చేసాడు. భూమిక కారును చూసిన శరత్ నీరు గారిపోయాడు.

“ఖాసిం.. ఇప్పటిదాకా అన్నీ తెలిసునట్టుగానే అయ్యింది. భూమికకు ప్రమాదం ఏదో ముంచుకొస్తున్నదని నాకు భయంగా ఉందిరా” అంటూ బేలగా ముఖం పెట్టాడు.

“చెప్పలేం! దేనికయినా సిద్ధంగా ఉండాలి. మా క్లూస్ టీమ్ వచ్చాక నువ్వు నీ కారులో రెస్ట్ తీసుకో. ఇలాంటివి మీకు అలవాటు ఉండదు కదా, ఇబ్బందిగా ఉంటుంది. మనకు భోజనం వస్తుంది. అది తినేసిన తరువాత మా పని మొదలుపెడతాం. నువ్వు ఇప్పటిదాకా చేసిన సాయం చాలు. కంగారుపడకు. సరేనా” అంటూ ఖాసిం శరత్‍ను సముదాయించాడు.

అలా ఇంకో గంట తరువాత మొత్తం పదిమంది బృందంతో రావటం, వీళ్ళ ఇద్దరూ భోజనం చేసిన తరువాత ఖాసిం చెప్పినట్టుగా శరత్‌ను కారులో ఉంచి తన టీమ్‌తో దర్యాప్తు మొదలుపెట్టాడు. ఈలోపల శరత్ అక్కడ జరుగుతున్న విషయాలను సుమతికి చెప్పి రాత్రికి రావటం లేదని, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు.

క్లూస్ టీమ్ మొత్తం రెండు గంటలు ఆ మొత్తం ప్రదేశం గాలించి చాలా ఆధారాలు పట్టుకున్నారు. అలాగే ఒక చోట తవ్వినట్టుగా ఉన్న ప్రదేశంలో అనుమానంతో తవ్వటం మొదలు పెట్టగానే కాసేపటికి ఒక అమ్మాయిది కుళ్లిపోతున్న శవం దొరికింది. శరత్ చెప్పినట్టుగానే నల్లటి పెద్ద సున్నాలున్న పసుపు రంగు పంజాబీ డ్రెస్సుతో కనిపించడంతో దాన్ని చూసి ఖాసిం ఆశ్చర్యపోయాడు. విషయం చెబుదామని కారు వైపు చూసిన ఖాసింకు శరత్ గాఢ నిద్రలో కనిపించాడు.

ఆ రాత్రి వాళ్ళ పని పూర్తి చేసుకుని క్లూస్ సేకరించి అంతా అయ్యేటప్పటికి తెల్లవారింది. తెల్లవారుతూ లేచిన శరత్.. ఖాసింను చూసి “ఏమయ్యింది. ఏమైనా ఆధారాలు దొరికాయా” అంటూ ఆరా తీసాడు.

“ఆ శరత్. చాలా తెలిశాయి. అక్కడ నేను అనుకున్నట్టుగానే అమ్మాయి శవం దొరికింది. నువ్వు చెప్పిన గుర్తులు అన్నే అవే. పోస్టుమార్టంకు పంపుతున్నాం. నువ్వు చూడవద్దులే. ఇలాంటి విషయాల్లో మీరు చూడలేరు. తట్టుకోలేవ్” అంటూ శరత్‍ను వారించాడు. తరువాత దర్యాప్తు ఎలా చేయాలో ఆలోచిస్తూ, పోస్టుమార్టం రిపోర్ట్ త్వరగా వచ్చేలా చూడమని ఆదేశిస్తూ కారులో శరత్ ఇంటికి బయలుదేరాడు సి.ఐ. ఖాసిం.

శరత్‌కు ఇంటికి వెళ్లగానే జ్వరం వచ్చేసి ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ సాయంత్రానికి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేసింది.

ఆ శవం భూమికదే అని, తలపై బలమైన గాయం ఉన్నట్టు, మత్తుమందు ప్రభావం వల్ల చనిపోయినట్టు, ఇంకా శరీరంపై దెబ్బలు ఉన్నట్టు నివేదిక వచ్చేసింది. కానీ భూమిక అక్కడకు ఎలా వెళ్ళిందో, ఎందుకు వెళ్లిందో, ఏ కారణం వల్ల, ఎవరి వల్ల ఆమె అలా హత్యకు గురికాబడిందో ఇంకా దర్యాప్తు జరపాలని ఖాసిం చెప్పడంతో, శరత్, సుమతిలు విచారంలో మునిగిపోయారు.

ఏ బంధమూ లేకపోయినా, కేవలం కలలో కనిపించిన అమ్మాయికి ఇలా అవ్వడం తెలిసి పూర్తిగా మనసు వికలం అయి శరత్‌కు ఇంకో నాలుగు రోజులు సుస్తీ చేసి ఇంట్లోనే ఉండిపోయాడు.

ఖాసిం కూడా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒక నాలుగు రోజుల తరువాత ఒక సాయంత్రం హడావిడిగా శరత్ వాళ్ళ ఇంటికి వచ్చాడు.

“శరత్.. ఈ కేసు మొత్తానికి చేధించాను. కానీ పాపం భూమిక అమాయకపు పిల్ల, అన్యాయంగా బలి అయ్యింది. అసలు ఏం జరిగిందంటే.. భూమిక ఆఫీసు నుండి తిన్నంగా ఇంటికి కాకుండా, ఒక షాపింగ్ మాల్‌కు వెళ్ళింది. తను అక్కడ తిరిగినట్టుగా అక్కడ సి.సి. కెమేరా ద్వారా తెలిసింది. ఆ తరువాత ఆ షాపింగ్ మాల్ పార్కింగ్‌లో ఎవరో ఒకతను తన కారు దగ్గరకు రావటం, ఏదో మాట్లాడి ఎక్కడం జరిగాయి. తరువాత విషయాలు అక్కడ ఉన్న వేలిముద్రలు ఆధారంగా, ఘటనా స్థలంలో జాగిలాలు వాసన చూసి ముందుకు పరిగెత్తాయి.

అలా అక్కడ నుండి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న హోటల్ దగ్గర ఒక అనుమానితుడిని పట్టుకున్నాయి. వాడిని మాదైన పద్ధతిలో అడగగానే అన్నీ చెప్పేసాడు. వాడు ఒక సైకో. అందమైన అమ్మాయిలను ఎక్కడ కనిపించినా పరిచయం చేసుకుని, ప్రేమించమని అడుగుతాడు. కాదు పొమ్మంటే వాళ్ళను చంపేస్తాడు. ఆ రోజు భూమికను చూసి లిఫ్ట్ అడిగాడట, అలా భూమిక కారులోకి వెళ్లిన వాడు ఆమె అందంగా ఉండటం చూసి ప్రేమిస్తున్నట్టు చెప్పడం, ఆమె నిరాకరించడంతో మత్తుమందు ఉన్న రుమాలు పెట్టి స్పృహ కోల్పోయిన తరువాత ఇలా ఊరి చివరకు తీసుకు వచ్చి బలమైన ఇనప రాడ్‍తో బాది, హింసించి చంపేశాడు. వాడు ఇప్పటికే నాలుగు హత్యలు చేసాడు. ఎక్కడా దొరకలేదు. వాడి ఖర్మ ఇలా కాలింది. ఇవాళ ఉదయం దర్యాప్తు పేరుతో అదే స్థలానికి తీసుకు వెళ్ళాము.  వాడు వీలుచూసుకుని తప్పించుకోవాలని ప్రయత్నించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సివచ్చింది. చచ్చిపోయాడు. టీవీలో చూడు. అంతా వస్తోంది.” అంటూ పెద్దగా నిట్టూర్చాడు.

“ఏది ఏమైనా భూమికకు అన్యాయం జరిగింది, ఇది ఈ కేసు విషయం. కానీ నీకో గమ్మత్తయిన విషయం చెప్పాలి. భూమిక ఆ కంపెనీలో ఉద్యోగి కాదు. ఆ కంపెనీ అధినేత కూతురు, అనుభవం వస్తుందని అలా అజ్ఞాతంగా అక్కడే రెండు సంవత్సరాల నుండి పని చేస్తోంది. అలా అక్కడ ఉండే నిన్ను ప్రేమించేది. నీ పద్ధతులు, నువ్వు కంపెనీ నడుపుతున్న తీరు, నువ్వు నీ కంపెనీలో పనిచేసేవాళ్ళని ఎలా చూసుకుంటావో తెలిసి ముగ్ధురాలయ్యింది.

అవే వాళ్ళ కంపెనీలో కూడా అమలు అయ్యేలా చూసుకునేది. అలా నిన్ను ఆరాధించేది. నీకు పెళ్లి అయ్యిందన్న ఒక్క విషయం వల్ల ఆమె తన ప్రేమ విషయం నీకు చెప్పకుండా ఉండిపోయింది. ఆమె లాప్‌టాప్ నిండా నీ ఫొటోలే. నిన్ను చూసిన ప్రతీ క్షణం తన డైరీలో రాసుకుంది.

బహుశా ఆమె బతికి ఉంటే ఈ పాటికి నీ భార్యను వేడుకుంటూ ఉండేదేమో. తనకు నీతో వివాహం చేసి రెండో భార్యగా స్వీకరించమని. చివరగా ఆమె రెండురోజుల క్రితం తన మెయిల్‍లో రాసి డ్రాఫ్ట్‌లో పంపించకుండా ఉన్న ప్రేమలేఖపై అన్ని విషయాలు చెబుతుంది. ఇదిగో ఆమె లాప్‍టాప్‍లో చూడు.

ఇదే ‘చిరునామా లేని ప్రేమలేఖ’. ఒకసారి చదువు. ఎంతైనా నిన్ను ప్రేమించింది కదా, ఆమె మనసుకు శాంతి కలుగుతుందేమో” అంటూ ఖాసిం తన సుదీర్ఘ ఉపన్యాసం ఆపి భూమిక లాప్‌టాప్‍లో లేఖ తెరిచి శరత్ ముందు పెట్టాడు.

జరిగిన వృత్తాంతం అంతా వింటూ నిర్ఘాంతపోయిన శరత్ భూమిక తమ చివరిగా రాసుకున్న ఉత్తరం చదవటం మొదలు పెట్టాడు.

“డియర్!.. ఏమని పిలవాలి? ఎలా పిలవాలి? చిత్రంగా లేదూ, ఒక పెళ్లయి, పిల్లలున్న వ్యక్తికి ప్రేమలేఖ రాయటం. బహుశా నేనే, ఇలా మొదటగా రాస్తున్నానేమో? ఇది మీ సంసారంలో పెద్ద కల్లోలం సృష్టించవచ్చేమో? కానీ డియర్! చెప్పక పోతే నా మనసును నేనే చంపేసుకున్నట్టవుతుంది. ఎన్నాళ్ళని ఇలా నీపై గూడు కట్టుకున్న ప్రేమను దాచుకోగలను. సమాజంలో ఇదే తప్పే అయినా, నా మనసు వరకు ఇది ఒప్పే.

నీకు పెళ్లి కాకుండానే మనం ఒకరికొకరు తారసపడి ఉంటే ఈ పాటికి నా ప్రేమకు ఎప్పుడో శుభం కార్డు పడేదేమో. ఇన్నాళ్లు ఈ సమాజానికి విలువ ఇచ్చి ఇన్నాళ్లు ఆగాను. కానీ నాలో పొంగి పొర్లుతున్న ఈ ప్రేమ మైకంలో ఇంక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చేసాను.

సమాజంలో ఎన్ని విడ్డూరాలు జరగటం లేదు. ఇవాళ వింతగా చెప్పుకున్నది రేపటికి పాత అయిపోతుంది. సమాజం మరచి పోతుంది. అందుకే నేను నీకు పెళ్లి అయ్యిందని తెలిసినా ప్రేమిస్తున్నాను. నీ భార్యను ఒప్పించి నీకు రెండో భార్యగా వచ్చేస్తాను.

డియర్!.. కాదనకు. ప్రేమించడానికి మనసు, ఇష్టం ముఖ్యం కానీ మిగిలిన విషయాలుతో పనేముంది. ఈ విషయం చూచాయగా మా ఇంట్లో త్వరలో చెప్పేస్తాను. అక్కడ నా మాట కాదనేవారు ఎవ్వరూ లేరు. నేను ఎంత మంచి పిల్లనో, అంత మొండిదాన్ని. ఎందుకు డియర్!.. నన్ను అంతలా ఆకట్టుకున్నావ్. నన్ను ఎందుకు అంతలా నీ వెనుక పడేలా చేశావ్. ఒకటా, రెండా ఎన్నో గుణాలు ఆడపిల్ల కోరుకునేది సుఖంగా ఉండేవి అన్నీ నీలో ఉన్నాయి.

మంచి వాడివి, అందగాడివి, సమర్థుడవు, ముఖ్యంగా మంచి మానవతావాదివి.. ఇవి అన్ని కోణాల్లోనూ నిన్ను చాలా దగ్గరగా చూసాను. మనసు పారేసుకున్నాను. కాదని ఎన్ని సార్లు సముదాయించినా, నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. నీతో మాట్లాడిన ప్రతిసారి నాకు ఇష్టం పెరిగింది తప్ప, ఎక్కడా నాకు తప్పించుకునే అవకాశం, కారణం దొరకలేదు.

అందుకే డియర్. నీ ప్రేమ మహత్తులో మునిగి పోదామని నిర్ణయం తీసుకున్నాను. కాదనకు. నువ్వు అవునని ఒప్పుకుంటావని నేను అనుకోవటం లేదు. అలా ఒప్పేసుకుంటే నా శరత్ ఎలా అవుతాడు. నువ్వు అంతటి సంస్కారివి. అందుకే నీ వెంట పడుతున్నా.

నువ్వు సరే అని నన్ను దగ్గరకు తీసుకొనే వరకు నిన్ను వదలను. నీ భార్యనూ వదలను. త్వరలోనే కలుసుకుందాం డియర్..

శరత్ 143 భూమి.. తప్పదు. త్వరగా నిన్ను కలుసు కోవాలని, నీ కౌగిలిలో ఒదిగి పోవాలని మనసు, తనువు ఎంత ఉవ్విళ్లూరుతున్నాయో తెలుసా..

ఇప్పుడు నీకు అర్థం కాదులే నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు అర్థం అవుతుంది.

ఐ లవ్ యూ.

భూమిక.”

భూమిక రాసిన ఉత్తరం చదివాక శరత్‌కు మాటలు రావటం మానేసాయి. మనసంతా వికలం అయిపోయింది. ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో అర్థం కాక అలా నిస్తేజంగా ఉండిపోయాడు.

“ఒరేయ్.. శరత్.. నువ్వు ఇచ్చిన క్లూస్ వల్లే ఈ కేసు చేధించడం అయ్యింది లేకుంటే కష్టం అయ్యేది, లేదా మిస్సింగ్ కేసు లాగే ఉండేది. కానీ నీకు ఈ విషయాలు కలలో ఎలా తెలిసాయిరా? అంటే భూమిక ఆత్మ చెప్పిందా? అసలు ఆత్మలు ఉన్నాయంటావా?” అంటూ ఖాసిం అడుగుతుంటే కన్నీరు కారుస్తూ మూసుకుపోయిన కళ్ళ ముందు నవ్వుతూ వీడ్కోలు చెబుతున్న భూమిక రూపం మసకబారుతూ మాయం అయిపోతుంటే “ఉన్నాయేమోరా?” అంటూ అప్రయత్నంగానే జవాబిచ్చాడు శరత్.

ఆ రోజు అర్ధరాత్రి గాఢనిద్రలోవున్న శరత్ కు సుమతి ఏదో కలవరిస్తుంటే మెలకువ వచ్చింది. ఆమెను తట్టిలేపాడు. ‘ఏమిటి కలవరిస్తున్నావు?’ అడిగాడు.

ఆమె విచిత్రంగా శరత్ వైపు చూసింది. “భూమిక కలలోకి వచ్చింది. మిమ్మల్ని పెళ్ళి చేసుకునేందుకు అనుమతి అడుగుతోంది. మీకు రాసిన ఉత్తరం చదివి వినిపిస్తున్నది. మీరు నిద్రలేపేశారు.” అంది.

చిరునామా లేని ప్రేమలేఖ చేరకూడని గమ్యానికి చేరింది. శరత్ ముఖంపై కత్తిగాటుకు నెత్తురు చుక్కలేదు!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here