[dropcap color=”#1e73be”]భూ[/dropcap]మ్మీద పుట్టిన ప్రతి మనిషీ సుఖవంతమైన, సౌభాగ్యవంతమైన, శుభకరమైన జీవితాన్నేకోరుకుంటాడు. కోరుకోవాలి కూడా. కాని కోరుకున్నంత మాత్రాన జీవితం అలా మారిపోతుందా..? దానికి మనవంతు ప్రయత్నం తోడవ్వాలి. మన ప్రవర్తనకూడా దానికనుగుణంగా ఉండాలి. అదిఎలాఉండాలో ముహమ్మద్ ప్రవక్త(స) చెప్పారు.
హరాంకు, అంటే నిషిధ్ధాలకు దూరంగా ఉంటే మీరుభక్తిపరులవుతారు, అల్లాహ్ మీఅదృష్టంలో రాసినదాని పట్ల సంతృప్తిచెందితే మీరుఎవరి అవసరమూలేని సంపన్నులవుతారు, ఇరుగు పొరుగువారితో సత్ ప్రవర్తన కలిగి ఉండాలి. ఇతరులు మీపట్ల ఎలా వ్యవహరించాలని కోరుకుంటారో మీరుకూడా వారితో అలాంటి వైఖరినే కలిగి ఉండాలి. అప్పుడే మీరుపరిపూర్ణవిశ్వాసులవుతారు. అధికంగా నవ్వకూడదు. దీనివల్ల హృదయం నిర్జీవమవుతుంది’. అని ప్రవచించారు.
నిషిధ్ధాలకు దూరంగా…
నైతికతకు వ్యతిరేకమైనది, మానవ స్వభావానికి సరిపడనిది, ధర్మవిరుధ్ధమైనది, సమాజం హర్షించని ప్రతిదీనిషిధ్ధమే. ఉదాహరణకు, సృష్టికర్తను వదిలేసి సృష్టిరాసుల్ని పూజించడం, తల్లిదండ్రులకు విధేయత చూపకుండా, వారి సేవ చేయకుండా, వారిమాటను ధిక్కరించడం, హింసా దౌర్జన్యాలు, రక్తపాతం, జూదం, మద్యం, వ్యభిచారం, అవినీతి అక్రమాలు, ఇతరుల ఆస్తిని, ముఖ్యంగా అనాధల ఆస్తిని కొల్లగొట్టడం, చాడీలు చెప్పడం, ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీయడం – ఇంకా ఇలాంటి అనేక అమానవీయ కార్యాలన్నీ హరాం. అంటే నిషిధ్ధ, అధర్మం. వీటికి దూరంగా ఉండడం నిజంగా గొప్ప ఆరాధన. అందుకే దేవుడువీటిని నిషేధించాడు. నిషిధ్ధాలకు దూరంగా ఉండడం కన్నా భక్తితత్పరత ఇంకేముంటుంది. ఈకారణంగానే ప్రవక్తమహనీయులు నిషిధ్ధాలకు దూరంగా ఉంటే గొప్ప భక్తిపరులవుతారని చెప్పారు.
విశ్వాసులెవరు..?
ఇదేవిధంగా , దేవుడుమనఅదృష్టంలో ఎంతరాస్తే అంత తప్పక లభించి తీరుతుందని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని పెంచడం గాని, తగ్గించడం గాని చెయ్యలేరని నమ్మి, ఉన్నంతలోనే తృప్తిపడేవారి మనసులో ఒకవిధమైన సంతృప్తి, ప్రశాంతత ఉంటాయి. లేనిదాని కోసం వెంపర్లాట ఉండదు. అందుకే ప్రవక్తవారు ఇలాంటివారిని ఎవరి అవసరమూలేని సంపన్నులు అని అభివర్ణించారు.
మరోవిషయం ఏమిటంటే, ఇతరులు మనల్ని గౌరవించాలని, ప్రేమించాలని, ఆదరించాలని ఎలాగైతే మనం కోరుకుంటామో, మనంకూడా వారిపట్ల అలాంటి వైఖరినే కలిగిఉండాలి. ఎందుకంటే, ఎవరి దుర్నడత కారణంగా వారి పొరుగువారుసురక్షితంగా ఉండరో వారువిశ్వాసులు కారు. అన్నారుముహమ్మద్ ప్రవక్త. (స)
ఒకరి గౌరవమర్యాదలపై, ధనప్రాణాలపై, మతవిశ్వాసాలపై నోటిద్వారాగాని, చేతిద్వారాగాని దాడిచేసేహక్కు, అధికారం ఎవ్వరికీలేదు. కనుక మనం మనకోసం ఎలాంటి స్థితిని కోరుకుంటామో, అందరికీ అదే స్థితి ప్రాప్తం కావాలని కోరుకోవాలి. దీనికి భిన్నంగా పరుల కీడుకోరేవారు విశ్వాసులేకారని స్పష్టంగా చెప్పారు ప్రవక్తమహనీయులు.
నవ్వు దివ్య ఔషధం
ప్రవక్తమరోమాటకూడా చెప్పారు. అధికంగా నవ్వకూడదు అని. అంటే మూతిముడుచుకొని ముభావంగా ఉండమనికాదు దీనర్ధం. నవ్వు దివ్యఔషధమే అయినప్పటికీ మితి మీరితే అనర్ధమే అన్నది దీనర్ధం. స్వయంగా ప్రవక్తవారి దివ్య వదనంపై సదా చిరునవ్వుతొణికిసలాడుతూఉండేది. నువ్వు నీసోదరుడిని చిరునవ్వుతో పలకరించడం కూడా సత్కార్యమే అని ఆమహనీయులు సెలవిచ్చారు. కాని మితిమీరి, అదేపనిగా పగలబడి నవ్వడం మంచిది కాదన్నదే ప్రవక్త ప్రవచన సారాంశం. చిరునవ్వు ఎప్పుడూఅభిలషణీయమే. దైవనామ స్మరణలో హృదయం సజీవంగా ఉంటుంది. అల్లాహ్ ను విస్మరించి ప్రాపంచిక వినోదంలో మునిగితేలడంవల్ల హృదయం నిర్జీవమయ్యేప్రమాదంఉంది. కనుక ఆణిముత్యాల్లాంటి ఈవిషయాలను గమనంలో ఉంచుకొని ఆచరించగలిగితే జీవితాల్లో శాంతి, సంతృప్తి, శుభాలు నెలకొంటాయి. సమాజంలో సామరస్యం,సౌభ్రాతృత్వం పరిఢవిల్లుతుంది. ఏమంటారు..?