చిరునవ్వుల మృదుభాషి శ్రీ సి. ఎస్. రాంబాబు!!

18
2

కవి, రచయిత, సీ ఎస్ రాంబాబు రేడియోలో ప్రోగ్రాం ఎక్సెక్యూటివ్ గా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా రచయిత కే ఎల్ వీ ప్రసాద్ ఆయనతో తన స్నేహానుబంధాన్ని సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు.

[dropcap]స్నే[/dropcap] హం ఎప్పుడూ గొప్పదే! ఎంత గొప్పదైనా అన్ని స్నేహాలూ ఒకేలా వుండవు. కలకాలం నిలిచిపోయే స్నేహాలు పునాది స్థాయిలోనే అర్థం అయిపోతాయి. కొన్ని స్నేహాలు తెలియకుండానే జీవితాంతం మనతో కలసి పయనిస్తాయి. కష్టసుఖాలు పంచుకుంటాయి. అందులో అభిమానం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, చివరికి విడదీయరాని బంధం అవుతుంది. ఆత్మీయ స్నేహబంధంగా మిగిలిపోతుంది. అలాగే ఊహించని విధంగా కొన్ని స్నేహాలు ఏర్పడతాయి. నిత్యం ఏదోరకంగా సంబంధం కలిగి ఉండడంతో అవి క్రమంగా బలపడి ఆత్మీయ అనుబంధంగా మారుతుంది. ఇక్కడ కులాలు, మతాలూ, ప్రాంతాలూ లెక్కలోకి రావు. ఈ స్నేహాల మధ్య ఆర్థిక అంతస్తులు అసలు అడ్డు రావు. ఒకరిపట్ల మరొకరికి ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. ఇది కేవలం స్నేహితుల మధ్య కావచ్చు, స్నేహితుల కుటుంబాల మధ్య కావచ్చు. ఇలాంటి స్నేహాల వల్ల లాభనష్టాలు ఆలోచించే అవసరం రాదు. ఆస్తులు – అంతస్తుల గురించి అసలు సమస్య ఉండదు, కేవలం మానసిక ఆనందం, తెలియని ఒకరకమైన తృప్తి మిగిలిపోతుంది. ఆనందమయ జీవితానికి ఇలాంటి స్నేహాలు ఖచ్చితంగా పునాదిరాళ్లుగా నిలబడతాయి.

శ్రీ సి.ఎస్. రాంబాబు, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ (రిటైర్డ్), ఆకాశవాణి, హైదరాబాద్

ఈ స్నేహాలు, బాల్యానికి సంబందించినవి, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాల, లేదా వృత్తిపరంగా, ప్రవృత్తిపరంగా, ప్రయాణాలలో ఇలా ఏవిధంగానైనా స్నేహితులు కావచ్చు. ఒకే రకమైన ఆలోచనలు, అభిరుచులు, కోరికలు, స్నేహాన్ని మరింత పటిష్టంగా కొనసాగిస్తాయి. స్నేహితులు అనుకున్నవారందరూ చివరివరకూ స్నేహితులుగా కొనసాగలేరు. చివరి కంటూ కొద్దిమంది మాత్రమే మిగులుతారు.

నాకు సంబంధించి ఎవరైనా ఒకసారి పరిచయమైతే, ఆ వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చితే, ఆ పరిచయం ఖచ్చితంగా స్నేహంగా రూపాంతరం చెంది, అది ఎప్పటికీ విడదీయరాని బంధం అయిపోతుంది. అలాంటివాళ్ళ విషయంలో మరో రెండో ఆలోచన నాకు ఉండదు. వృత్తిపరంగానూ ప్రవృత్తిపరంగానూ నాకు చాలామంది స్నేహితులు వున్నారు. ఆధునిక సమాచార సాధనం, మొబైల్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల ప్రతి దినం ఏదో ఒకసమయంలో ఆత్మీయంగా పలకరించుకునే వెసులుబాటు ఉండడం వల్ల ఏదో రూపంలో మిత్రులతో సంబంధాలు కలిగి వుంటాను. అలాంటి వాటిల్లో ప్రతి రోజు వాట్సప్‌లో ‘గుడ్ మార్కింగ్’ చెప్పుకోవడం. కొంతమందికి ఇది ఇష్టం లేకపోవచ్చు, అది వేరే విషయం. అలా, ప్రవృత్తిపరంగా నాకు చాలా మంది మిత్రులు వున్నారు. అందులో ఆకాశవాణికి సంబంధించి అత్యంత ఆప్తులైన మిత్రుల్లో శ్రీ చెన్నూరి సీతా రాంబాబు ఒకరు. ఈయన సి. ఎస్. రాంబాబుగా ప్రసిద్ధులు. నిజానికి నాకు ఆకాశవాణితో సంబంధం 1975 నుండి. విద్యార్థిగా యువవాణి కార్యక్రమాలలో పాల్గొనేవాడిని. దానికి ముఖ్య కారకుడు మిత్రుడు సత్యవోలు సుందరసాయి. ఆ విధంగా పాలకుర్తి మధుసూదన రావుగారు, మంత్రవాది సుధాకర రావు, రాఘవులు, భీమయ్య గారు మొదలైన వారు పరిచయం అయినారు. నా ఉద్యోగ పర్వంలో ఆకాశవాణి వరంగల్, ఎఫ్.ఎం. కేంద్రం 17 ఫిబ్రవరి 1990 నాడు ఏర్పడిన తర్వాత, వరంగల్ రేడియోతో నాకు సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పుడు నేను మహబూబాబాద్‌లో పనిచేస్తున్నాను. రేడియో ఇంటర్వ్యూలో పాల్గొనడానికి వరంగల్ వస్తుండేవాడిని. అలా 1999 లో నాకు శ్రీ రాంబాబు పరిచయం చేయబడ్డారు. అప్పటికే మిత్రుడు శ్రీ మడిపెల్లి దక్షిణామూర్తి, వద్దిరాజు వెంకటరామారావు, అనీల్ ప్రసాద్, పెద్దలు వెంకటేశ్వర్లు గారు, చలపతి రావు గారు, శ్రీనివాస రెడ్డి, మంత్రవాది సుధాకర్ వంటివారు నాకు పరిచయమై వున్నారు.

శ్రీమతి & శ్రీ సి.ఎస్. రాంబాబు, హైదరాబాద్

అందరిలోనూ శ్రీ రాంబాబు ప్రత్యేకంగా ఉండేవారు. నిత్యం చెరగని నవ్వు, చక్కని మేనిఛాయ, నాకు మాదిరిగానే మిలమిల మెరిసే బాల్డ్ హెడ్, ఎప్పుడూ హడావిడిగా ఉంటూ పనిలో నిమగ్నమై ఉండేవాడు. అదే సమయంలో ఆయనతో పాటు శ్రీమతి సరోజా నిర్మలగారు కూడా పనిచేసినట్టు గుర్తు. తరచుగా నేను రేడియో కేంద్రానికి వెళ్లడం వల్ల రాంబాబు గారితో నాకు బాగా పరిచయం ఏర్పడింది. ఆరోగ్యానికి సంబందించిన కార్యక్రమాలు ఆయన చూస్తుండడం వల్ల మూడు నెలలకోసారి, దంత సంరక్షణకు సంబంధించి ఇంటర్వ్యూలు చేస్తుండేవారు. ఇంటర్వ్యూ చేయడంలో కూడా ఆయనలో ప్రత్యేకత ఉండేది. ఇంటర్వ్యూ చేసేముందు, అంశాన్ని కూలంకుషంగా చర్చించి తన డైరీలో కొన్ని ముఖ్యమైన అంశాలు రాసుకుని, చక్కని పరిపూర్ణమైన సమాధానాలు రాబట్టేవారు. ఆయన హయాంలో ఓ.బి. (outside broadcasting) కార్యక్రమాలు ఎక్కువగా రికార్డు చేసేవారు.

ఆయన ఆఫీస్ క్వార్టర్స్ లోనే ఉండడం వల్ల అప్పుడప్పుడూ అక్కడికి కాఫీ కోసం వెళ్ళేవాళ్ళం. నాకు తెలిసి రాంబాబు – ఆర్. వెంకటేశ్వర్లు, పాలకుర్తి మధుసూదన రావు, ఆదిత్య ప్రసాద్ గార్లు సంచాలకులుగా వున్న కాలంలో తన సేవలు అందించారు. అయితే శ్రీ రాంబాబు విశ్వరూపం శీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు సంచాలకులుగా పనిచేసిన కాలంలో బయట పడింది. ఈ జంట చేసిన వినూత్నమైన కార్యక్రమాలు వరంగల్ ప్రాంత రేడియో శ్రోతల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయి వున్నాయి. శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి మనసులో ఒక ఆలోచన మెదిలితే దానిని శ్రీ రాంబాబు కార్యరూపంలోకి తెచ్చేవారు, ఎంతటి క్లిష్టమైన కార్యక్రమం అయినా ఆ పని చేసి చూపించేవారు, ఆ నమ్మకంతోనే ఆదిత్య ప్రసాద్ గారు, ప్రతీది రాంబాబుకే అప్పగించి చేయించేవారు. రాంబాబు ఆ పనులన్నీ సంతోషంగానే చేశారు తప్ప పనిభారంగా ఎప్పుడూ తలచలేదు.

శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్, స్టేషన్ డైరెక్టర్ (రిటైర్డ్), ఆకాశవాణి-వరంగల్

శ్రీ రాంబాబులో కవి, కథా రచయిత వున్నారు. అయితే ఆయన వరంగల్ – రేడియో కేంద్రంలో పని చేసినంత కాలం, ఆయనలోని కవి మాకు కనిపించలేదు. అప్పుడప్పుడూ కథలు పత్రికల్లో వస్తుండేవి. చదవమని నాకు చెడుతుండేవారు. చదివి నా అభిప్రాయం చెబుతుండేవాడిని. కానీ వరంగల్‌లో పని చేసినంత కాలం రాయవలసినన్ని కథలు ఆయన రాయలేదు. ఆఫీసు పనికే ఎక్కువ సమయం కేటాయించేవాడు. కథలు రాయమని నేను వెంటపడి విసిగిస్తుండేవాడిని. ఎన్ని మాటలు అన్నా నవ్వి ఊరుకునేవాడు. రాత్రి తొమ్మిది అయినా స్టూడియోలో కూర్చుని ఏదో పని చేసుకుంటుండేవాడు. అలా ప్రతి క్షణం ఆఫీసు పనికే ఉపయోగించేవారు.

 

దక్షిణామూర్తి గారితో, రచయిత, రాంబాబు

2005వ సంవత్సరంలో నేను పదోన్నతి మీద జనగాం నుండి, కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ కావడం, రాంబాబు గారు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి బదిలీ కావడమూ జరిగింది. రాంబాబు హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత, ఆయన వృత్తిపరంగానే కాకుండా రచనా వ్యాసంగంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. కథలు రాయడం ఎక్కువైంది, పత్రికలతో, పత్రికా సంపాదకులతో, రచయితలతో, రచయిత్రులలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆఫీసులో ఆయన ఒకసారి నాటక విభాగం మరోసారి సాహిత్యవిభాగం చూసే అవకాశం కలిగింది. ఇది ఆయనలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించి రచనా వ్యాసంగాన్ని మరింతగా ప్రేరేపించింది. తర్వాత ఒక కథా సంపుటిని తీసుకువచ్చే అవకాశాన్ని కలిగించింది. నవ్య వారపత్రిక ద్వారా జగన్నాథ శర్మ గారితోనూ, పాలపిట్ట మాసపత్రిక ద్వారా శ్రీ గుడిపాటి పరిచయమై, కథలతో పాటు, ఇంటర్వ్యూలు, పుస్తక సమీక్షలు, చేసే అవకాశాన్ని పొందారు. కొన్ని కథలకు వివిధ పత్రికల ద్వారా బహుమతులు కూడా పొందారు. రేడియోలో సీనియర్ కవులను, రచయితలను, వారి రచనలను ఇంటర్వ్యూల ద్వారా పరిచయం చేశారు. అలా ఇప్పుడు రాంబాబు అంటే తెలియని కవులు రచయితలు, నటులు బహు అరుదు.

సాహిత్యపరంగా శ్రీ రాంబాబు రెండవ దశ కవిత్వం. ఈ దశ ఎప్పటి నుంచి అన్నది ఇదమిత్థంగా నేను విభజన రేఖ గీయలేను గానీ, కథల వేగం తగ్గించి కవిత్వం వెంట పడ్డాడాయన. అందులోనూ సఫలీకృతుడైనాడు. ఈ రోజున మంచి కవిత్వం రాస్తున్న కవుల్లో ఆయన కూడా ఒకడిగా చేరిపోయినాడు. ఆయన కవిత్వం కూడా పుస్తక రూపంలో త్వరలో రానున్నది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. వయసు రీత్యా వచ్చిన మార్పువల్లనో ఏమో గానీ శ్రీ షిరిడీ సాయిబాబా మీద కూడా ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఇది ఆయన భక్తికి సంబంధించిన విషయం.

సి.ఎస్. రాంబాబు రచన నివేదన సాయిలహరి

 

సి.ఎస్. ఆర్. కథలు పసిడి మనసులు

రాంబాబు గారిని మరో విషయంలో నేను జీవితాంతమూ గుర్తుంచుకోవాలి. మా అమ్మాయి నీహార కానేటి, ఈరోజున ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎక్సికుటివ్‌గా (program executive -PEx) పనిచేయడానికి పరోక్షంగా రాంబాబు గారు కారణం. అసలు మిత్రుడు శ్రీ దక్షిణామూర్తి ఒకసారి మా పాప దగ్గర “నీ వాయిస్ బాగుందమ్మా” అన్నారు. అది మా అమ్మాయి మనసులో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మా పాప హైదరాబాద్‌లో డిగ్రీ చేస్తున్న సమయంలో, ‘ఆర్.జె’ (రేడియో జాకీ)గా పార్టీ టైం చేస్తానని అడిగింది.

ఆకాశవాణి హైదరాబాద్ స్టుడియోలో శ్రీ దక్షిణామూర్తి, రచయిత,శ్రీ రాంబాబు
డా. ప్రసాద్ కె.ఎల్.వి. పుస్తకావిష్కరణ సందర్భంగా ఆకాశవాణి మిత్రులతో రచయిత, రాంబాబు
శ్రీ నక్కా సుధాకరరావు (ఆకాశవాణి, హైదరాబాద్), శ్రీ తోట సాంబశివరావు గార్లతో….

అప్పటికి రాంబాబు గారు హైదరాబాద్ లోనే ఉండడం వల్ల దానికి కావలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేయమని ఆయనకు చెప్పాను. అలా ఆయన సహకారంతో మా పాప ఆకాశవాణి -హైదరాబాద్, రెయిన్‍బో ఛానల్ లో రేడియో జాకీగా సమర్ధవంతంగా పనిచేసింది. ఈ అనుభవాన్ని దృష్టిలోవుంచుకుని పరీక్ష/ఇంటర్వ్యూ లో నెగ్గి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయింది. అలా దక్షిణామూర్తి, రాంబాబు గార్లు నాకు ఎంతగానో సహకరించారు. ఈనాటికీ చాలామంది వరంగల్ రేడియో శ్రోతలు ఈ ఇద్దరి గురించి అడుగుతుంటారంటే, ప్రజావాహినిలో వృత్తిపరంగా వీరు ఎంతగా కలసిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగం కేవలం జీతం కోసం చేసీ వాళ్ళే ఎక్కువ శాతం మంది వుంటారు. కానీ రాంబాబు దీనికి భిన్నం. వృత్తిని దైవంగా భావించడమే కాక అందులో ఆనందాన్ని ఆస్వాదించగల గొప్పగుణం, సహృదయత ఆయనకు అబ్బాయి. ఆయన భవిష్యత్ జీవితాన్ని రచనా వ్యాసంగం ద్వారా ఆనందంగా మలుచుకోగలడనే నమ్మకం నాకుంది. మిత్రుడు సి. ఎస్. రాంబాబుకు అభినందనలు. ఆయన రిటైర్మెంట్ జీవితం మరింత సృజనాత్మకంగా, ఆనందంగా సాగిపోవాలని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here