చిత్రగుప్తుడి నోము

0
2

[dropcap]చి[/dropcap]త్రగుప్తుడి పేరు సుపరిచితము. యమధర్మరాజు వద్ద లేఖకుడు. జీవులపాప పుణ్యములను లిఖించి ఉంచుతాడు. మరణానంతరము మానవులు యమపురికి చేరుతారు. యమపురినివాసి చిత్రగుప్తుడు తయారుచేసిన పాపపుణ్యముల చిట్టా ఆధారముగ జీవులకు స్వర్గ, నరకఫలములు యముడు అనుభవింప చేస్తాడని హిందూమత విశ్వాసము. మరణానంతరము పాపపుణ్యఫలములు అనుభవిస్తామని విశ్వసించేవారందరూ చిత్రగుప్తుని ఉనికిని కాదనరు. అందుకే దైవత్వమాపాదించారు. చిత్రగుప్తుడి పదమునకు యముడని కూడ, హరిశబ్దపరముగ పర్యాయపదముల పట్టికలో ఆంధ్రవాచస్పత్వము పేర్కొంది. కాని చిత్రగుప్తునిగా లేఖకుడిగ జీవులపాప పుణ్యములను బేరీజు వేస్తాడన్నదే ప్రముఖము.

చిత్రగుప్తుడు పేరుకు ప్రత్యేక అర్థము తెలియదు. చిత్రాదిత్యుడనే పేరు ఆయనకు ఉంది. అందుచేత సూర్యవంశానికి చెందినవాడు అని చెప్పవచ్చు. జీవులెనుబది నాల్గులక్షల పాపపుణ్యములను విచారించడానికి బ్రహ్మ యముని కధికార మిచ్చాడని జానపదుల విశ్వాసము, అందుకు యమపురిని ప్రత్యేకముగా విశ్వకర్మ నిర్మించాడు. ఆ యమపురి శతయోజన విస్తార రమణీయ ప్రదేశమని మహాభారతము ఆదిసభాపర్వము వర్ణించింది.

రాజసూయయాగము సంకల్ప సమయాన నారదుడు ధర్మరాజుకు దిక్పాలుర లోకాల్ని వర్ణించి చెప్పినసందర్భములో యమపురి ప్రశంస చేశాడు. అగస్త్య, మతంగాది సిద్ధమునులు, పితృదేవతలు, యమకింకరులు, రూపుదాల్చిన కాలచక్రం, యాగాలు, దక్షిణదిక్కులోని దేవతలు, ఉగ్రతపస్సులు, కృతవీర్య, జనమేజయ, జనకాది మహారాజులు ఉన్నారని, పాండవుల జనకుడు పాండురాజువంటి రాజర్షులు కూడా ఉన్నారని నారదుడు చెప్తాడు. యముని సన్నిధిలో ఏ పాపపుణ్యాలూ బాధించవు. శాశ్వతసభ్యులుగ వీరి సమక్షములోనే యమధర్మరాజు పాపులను పుణ్యులను విచారించి స్వర్గనరకములకు పంపుతాడు. యమధర్మ విచారణ సభకు సమీపములోనే పాపులు అనుభవించవలసిన నరకలోకములు సృష్టింపబడ్డాయి.

గరుడపురాణ ప్రకారము చిత్రగుప్తుడికి యమపురిలో ప్రత్యేకనివాసముంది. అది చాలామనోహరము. యమనివాసానికి సమీపములో ఉంటుంది. ఇక్కడ నివాసముండి చిత్రగుప్తుడు పెక్కుమంది అనుచరులకు పాపుల మరణసమయము లెక్కగట్టి యమాజ్ఞను అమలు చేయిస్తాడు.. చిత్రగుప్తనివాసానికి ఇరవై యోజనముల దూరములో ఆ అనుచరులు రెండువందల యోజనాలు విస్తరించిన జ్వరమందిరము అనే పేరుగల నివాసాల ప్రాంగణములో ఉంటారు. వారు చిత్రగుప్తుని ఆదేశము ప్రకారము నడుస్తారు. జ్వరమందిరనివాస స్వభావానికి తగినయమపాశ మృత్యుపాశములుగా మారే యమకింకరులు. పాపపుణ్య కర్మశీలుర ఆయువు తీరిన తరువాత జీవులను శిక్షార్థము యమపురికి తీసుకురావడానికి యమపాశములై పంపబడుతున్నారు. యమసభలో ఆయువు తీరినవారిని ప్రవేశ పెడుతున్నారు. శిక్షార్హత నరకయాతన తప్పించే శుభాశుభములనుబట్టి పునర్జన్మలేని నివాసము యమసన్నిధిగ సభా నిర్ణయాధికారము సమవర్తిది. చిత్రగుప్తుని లిఖితముగ యముడు గౌరవిస్తాడు. బ్రహ్మలిఖితము చిత్రగుప్తుని లేఖినిద్వారా వరప్రదాయిని కాగలదని లోక విశ్వాసము.

సూర్యుని భార్య సంజ్ఞ సూర్యుని తేజస్సు భరించలేక తన చాయను సూర్యుని వద్దయుంచి తను పుట్టింటికి వెళ్ళిపోయింది. సూర్యుడు తెలుసుకోలేక పోయాడు. చాయకు కూడా పిల్లలు పుట్టారు. యముడు గుర్తించి సవతి తల్లివని నిందించాడు పాదమును తన్నగలనన్న భంగిమగా ఎత్తిచూపి వాదించి నందుకు పాదవిహీనుడవు కమ్మని యముని చాయ శపించిందని బ్రహ్మాండపురాణ కథనం.

యముని యొక్క పాదము నేలపైబడి క్రిములు భక్షించగానే శాపవిముక్తుడిని చేసి సూర్యుడు అనుగ్రహించాడు. తండ్రితో నిజాయతీగా జనని యెడ చేసిన తప్పును ఒప్పుకుని తిరిగి పాదమును పొందినందుకు ధర్మపాదుడై పేరుతెచ్చుకుంటావని సూర్య దీవన ఇచ్చాడని కధనం. సమవర్తిగా ధర్ముడై ధర్మపాదమును సార్థకము చేయాలి. అందుకు యమునికి సహాయకుడిగా సూర్యవంశజుడైన చిత్రగుప్తుని బ్రహ్మతన విధిలిఖిత అమలుగ చిత్రగుప్తుని లేఖినిద్వారా సమవర్తికి కీర్తి తెచ్చే సందేశము అయేలా నియమించాడు.

చిత్రగుప్తుడు ఇంద్రాణి పుత్రుడని ప్రతీతి. ఇంద్రాణి అంటే శచీదేవి. మనకు తెలిసిన దేవేంద్రుని భార్య. కాని ఇంద్రపదవి మనము కొలిచే ఇంద్రునికి ఒకొక్కప్పుడు దూరమయ్యేది. నూరు యజ్ఞములు చేసిన నహుషుడు, నరకుని వంటి రాక్షసులు ఇంద్రాధిపత్యముగా స్వర్గమును పాలించారు. ఇంద్రాణిగా శచీదేవి పేరు తప్ప మరో స్త్రీ పేరు సూచింపబడలేదు. శచీదేవిని శాశ్వత ఇంద్రాణిగా పతివ్రతగా భావించ బడింది తప్ప అన్య స్త్రీలెవరూ ఆ పదవిని ఆశించినట్లు పురాణాలలో లేదు. అందుకే ఇంద్రాణి సప్తమాతృకలలో ఒకామెగా కూడ కనిపిస్తుంది. దేవతలకు భర్తృసంభోగమువలన సంతానము జన్మించకూడదని పార్వతి శాపమిచ్చింది. అందుచేత దేవతలు వివిధోపాయములనాశ్రయించారు. శచీదేవి కామధేనువునారాధించింది. కామధేను వరము వలన ఆమె గర్భము ధరించి నవమాసములు మోసి చిత్రగుప్తుని కన్నది. తల్లి అయిన మాతృత్వ మాధుర్యమును అనుభవించింది. చిత్రగుప్తుడు శచీపుత్రుడని చెప్పబడ్డాడు.

చిత్రగుప్తుని ప్రసన్నము చేసుకుంటే పుణ్యము సరేసరి. ప్రసన్నుడై చేసిన పాపములకు కూడ తీవ్రమైన శిక్షలు నుంచి మినహాయింపు యమునికి సిఫార్సు చేయగల వరము చిత్రగుప్తుని లేఖినికి ఉందని ప్రచారమయింది. చిత్రగుప్తుని ప్రసన్నము చేసుకుందుకు పుట్టినస్త్రీల వ్రతముగ చిత్రగుప్తుడి నోము ఖ్యాతినందింది. ఈ నోము ఆచరించేవారు ముఖ్యముగా స్త్రీలు. ఎక్కువ ప్రచారము గ్రామీణ ప్రాంతము. గ్రామకరణమునుగాని సోదరతుల్యుడైన వానిని గాని చిత్రగుప్తునిగా భావించి చేసే ఈ వ్రతవిధానము వెనక ఆసక్తికర కథనము ఉంది.

ఒక రాజు భార్య, మంత్రి భార్య కలిసి నోములు, వ్రతములు చేసేవారు. చిత్రగుప్తుడి నోము తప్ప అన్ని నోములు సమానముగా చేశారు. కాని చిత్రగుప్తుడి నోము అధికముగా చేసిన కారణముగా మరణానంతరము మంత్రి భార్యకు స్వర్గభోగములు లభిస్తున్నాయి.

ఒక్క నోము చేయకపోవడము వలన ఇంత తేడా చూపించవద్దని రాజుభార్య ప్రార్థించడము వలన చిత్రగుప్తుడామెకు ఏడదిపాటు భూలోకానివెళ్ళే అవకాశమిచ్చాడు. తిరిగి యమలోకానికి వెళ్ళవలసిన ఏడాది కాలములో ఆమె చిత్రగుప్తుని నోముపట్టి ఆరాధించింది. ప్రతిరోజు పూజానంతరము అక్షింతలు వేసుకునేది. ఏడాది తరువాత గ్రామకరణమును పిలిచి అయిదు కుంచముల (సుమారు ఇరవైకెజీలు) ధాన్యము కట్టులేని గంపలోపోసి అయిదుమూరల పట్టుపంచె అడ్డెడుతవ్వుడు (సుమారురెండున్నరకేజీలు) బియ్యము, గుమ్మడిపండు పెట్టి, యధాశక్తి దక్షిణతాంబూలముంచి వెండి ఆకును పైడి గంటమును దానమిచ్చింది. చిత్రగుప్తుడు ప్రీతుడై రాజు భార్యను రప్పించి మంత్రి భార్యతో కలిసి స్వర్గభోగము లనుభవించే అనుగ్రహము కలిగించాడు. అప్పటినుండి ఈ వ్రతము చేస్తున్నారని వ్రతకథల ప్రచారము.

ఇప్పుడు కరణాలుండే గ్రామాధికారివ్యవస్థ రద్దయి కరణము అన్న పేరు మారిపోయింది. అందుచేత కరణముగా పిలిపించుకోబడే గ్రామ అధికారికి గాని, అన్న లేదా తమ్ముడికి లేదా ఆ వరసకు అర్హతున్నవాడికి చిత్రగుప్తుని నోము నోస్తున్నారు. యమనివాసమైనా, సౌఖ్యప్రదమై, నరకశిక్షను తప్పించే చిత్రగుప్తుని సన్నిధిగా చిత్రగుప్తుడి నోము ఫలశ్రుతికన్న పాపభీతిగలవారికి ఆత్మవిమర్శగా తేలికగా ఆచరించగల వ్రతము అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here