చిత్రం-భళారే-విచిత్రం
(సినారె-సినీ గీతాలు)
[dropcap]నా [/dropcap]దేశం భగవద్గీత!
నా దేశం అగ్నిపునీత సీత!
నా దేశం కరుణాంతరంగ !
నా దేశం సంస్కార గంగ!
ఇదీ నా దేశం-భారతదేశం అని మాతృభూమి ఔన్నత్యాన్ని వేనోళ్ళ కీర్తించినారు మన సి నా రె.
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కవిత, కావ్యం, గేయం, వ్యాసం, పద్యం, బుర్రకథ, హరికథ, గజల్ రూబాయిలు- ఇలా మొత్తం 19 ప్రక్రియల్లో 94 రచనలు చేశారు. వారి సిద్ధాంత గ్రంథం “సంప్రదాయాలు- ప్రయోగాలు”పరిశోధన విద్యార్థులకే కాదు, తెలుగు సాహితీ ప్రియులందరికి అదో ప్రామాణిక గ్రంథం.
మనకు నారాయణ రెడ్డి గారు అంటే ముందుగా గుర్తొచ్చేది సినిమా పాటలు.
సినీ గీతాలకు కావ్య పరిమళాన్ని అద్దిన కవి. వీరిని ఎన్నో అవార్డులు, బిరుదులు వరించాయి. కళాప్రపూర్ణ, పద్మశ్రీ, పద్మభూషణ్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాష్ట్ర,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకొని తెలుగు జాతి ఖ్యాతి ఇనుమడింప జేశారు. సినారె మహా వక్త, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు.
తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షులుగా ఎన్నో విశిష్ట కార్యక్రమాలు చేపట్టారు.
డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు 1931 జూలై 29 వ తేదీన హనుమాజీపేట కరీంనగర్ జిల్లా నేటి రాజన్న సిరిసిల్లాలో జన్మించారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి మల్లారెడ్డి. సినారె గారి అసలు పేరు సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి.
కానిగిరి బడి పంతులుకు ఆ పేరు అర్థం కాక నారాయణ రెడ్డి అని రాశారట.
ఏ శుభ ముహూర్తంలో నారాయణ రెడ్డి అని రిజిస్టర్ లో పేరు వ్రాశారో కానీ అది ఎన్నో ఘన విజయాలకు కారణ మయింది.
ఎనభై ఐదు వసంతాల నిండు జీవితాన్ని పండించుకున్న సాహితీ కృషీవలుడు మన సి నా రె.
“నన్ను దోచు కుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి! నిన్నే నా స్వామి!” అన్న గీతం (1962 లో గులేబకావళి కథ చిత్రానికి) వ్రాసి తెలుగు హృదయాలను దోచుకున్నారు.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ కాలం నిర్విరామంగా, నిరంతరాయంగా కొనసాగింది వారి సినీగేయ ప్రస్థానం.
సినారె గారు పాటలను సందర్భానుసారంగా వేదిక మీద పాడి వినిపించి అందరిని మైమరిపించేవారు.
జి. పుల్లారెడ్డి గారి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీకి నారాయణ రెడ్డి గారు విచ్చేసిన సందర్భంలో పుల్లారెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ–
చదువు రాని వాడాలని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువు లెందుకు–
ఏమి చదివి పక్షులు పైకెగర కలిగెను!
ఏ చదువు వల్ల చేపపిల్ల ఈద గలిగెను!
(జి. పుల్లారెడ్డి గారు 5వ తరగతి వరకే చదివారు.)
పట్టుదల పరిశ్రమలే విజయ సోపానాలు
అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మీరు అనిచెప్పి పుల్లారెడ్డి గారిని అభినందించారు సినారె గారు.
రెడ్డిగారు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు రిక్షాలో ప్రయాణం చేస్తూ ఉంటే వచ్చిన ఆలోచన– అందమైన గీతమై అలరారింది.
“రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరాబాద్
రిక్షావాలా జిందాబాద్!
మూడు చక్రములు గిరగిర తిరిగితె
మోటార్ కారు బలాదూర్!”
ఈ గీతం అందరిని ఎంత గానో అలరించింది.
ఏ పాట వ్రాసిన ఏదో ప్రత్యేకత వుండవలసిందే. బడి పంతులు సినిమాలో ల్యాండ్ లైన్ ఫోను గురించి హుషారుగా వ్రాసిన గీతమిది.
“బూచాడమ్మా బూచాడు!
బుల్లి పెట్టెలో ఉన్నాడు!
కళ్ళకి ఎప్పుడూ కనబడడు!
కబుర్లెన్నో చెబుతాడు! “
అంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరదాగా పలికించిన ఘనత రెడ్డి గారిది.
సినారె గారు రచించిన రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడింది. ఆ పాటతో తెలుగు పాట ఓ వెలుగు వెలిగింది.
బాలమిత్రుల కథలో-
“గున్నమామిడి కొమ్మమీద
గూళ్ళు రెండున్నాయి!”
అన్న గీతం- పంచతంత్రం కథలోని మిత్రలాభం కథను పాటగా పలికించిన భావన కలుగుతుంది.
స్నేహమేరా జీవితం!
స్నేహమేరా శాశ్వతం!
అంటూ మైత్రికి మించిన బంధం లేదంటారు.
మధుర గీతాలు పలికించినా, స్నేహ భావనను పండించినా అందులో ఏదో ఒక విశిష్టత, విలక్షణత చోటు చేసుకోవాల్సిందే సినారె గీతాల్లో–
ఏమివ్వను! నీకేమివ్వను!
నా మనసే నీదైతే ఇంకేమివ్వను
అంటూ రాసిన ప్రణయ గీతం మనసు కవి ఆత్రేయను గుర్తుకు తెస్తుంది.
దాన వీర శూర కర్ణ చిత్రంలో ప్రతి నాయకుడికి (దుర్యోధనుడు) యుగళ గీతం వ్రాసి ఔరా! అనిపించారు.
చిత్రం-హాయ్! భళారే !విచిత్రం!
రాచరికపు జిత్తులతో–
రణ తంత్రపు టెత్తులతో–
సతమతమౌ మా మదిని,
మదనుడు సందడి చేయుట చిత్రం!
ఈ గీతం విమర్శకుల ప్రశంసలకు సహితం పాత్రమైనది. ఆ పాత్రను పోషించిన ఎన్.టి. రామారావుగారు రెడ్డిగారిపై ప్రశంసల వర్షం కురిపించారట.
ఇదే పాట! ప్రతిచోటా! ఇలాగే
పాడుకుంటాను.
పలుకలేని వలపులన్నీ
పాటలో దాచుకుంటాను.
అంటారు ఆనందంగా-
తెలుగు నుడికారం మీద తీరనిమమకారంతో పాటు అధికారం కనిపిస్తుంది. వారి పదప్రయోగం చూస్తే అలవోకగా అలా అలా జాలువారతాయి పదాలు, పాదాలు సినారె కలంలో-
కురుక్షేత్రం చిత్రానికి- “మ్రోగింది కళ్యాణ వీణ” అనే గీతంలో “కలవరించి -కలవరించి”అంటూ చక్కని శ్లేషను ప్రయోగించారు ఆ గీతం ఎప్పటికీ నవ్యాతి నైవేద్యం.
మాయదారి చిన్నోడూ-నా మనసే లాగేసిండు మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే-
చిన్నమ్మ చెప్పువే ! పెద్దమ్మ చెప్పవే !
అన్న అచ్చు తెలుగు జానపద గేయం పడుచుపిల్ల మనసులోని ఆరాటాన్ని,వయసు చేసే తొందరను యువ హృదయాలను గిలిగింతలు పెట్టేలా శృంగార రసాన్ని ఒలికిస్తూ పలికించారు.
సూత్రధారులు చిత్రంలో మహదేవన్ సంగీతానికి అనువుగా సంకీర్తనగా ఆలపించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం.
జోలా జోలమ్మ జోలా
జేజేలాజోల- జేజేలాజోల
నీలాల కన్నులకు
నిత్యమల్లె పూల జోల
అన్న గీతం ఎంతో మనోరంజకం వృత్యనుప్రాసలో నడుస్తుంది. జానపదనికి సాహితీ దివ్వెలెత్తినారు నారాయణ రెడ్డి గారు.
దర్శకుల మనోభావాలను గ్రహించి సందర్భోచితంగా పాటలను పండించడం సినారె గారికి పెన్నుతో పెట్టిన విద్య.
స్వాతిముత్యం చిత్రంలో అమాయకుడైన కథానాయకుడికి మరిచిపోలేని మధుర గీతాన్ని రాయమన్నారట కె.విశ్వనాథ్ గారు. మధ్యమావతి రాగంలో-
“సువ్వి- సువ్వి- సువ్వాలమ్మ!
సీతాలమ్మ!” అంటూ అద్భుతమైన గీతాన్ని అందించారు. విన్నూత్న ప్రయోగాలు చేయడంలో చేయి తిరిగిన వారు సినారె.
అదే చిత్రంలో
“లాలీ!లాలీ!లాలీ!
వటపత్రశాయికి వరహాల లాలీ”
అనే జోల పాటలో ఆధ్యాత్మిక భావనలో ఓలలాడించిన అభినవ అన్నమయ్య మన సి నా రె.
మబ్బులో ఏముంది!
నీ మనసులో ఏముంది!
మబ్బులు కన్నీరు!
నీ మనసులో పన్నీరు!
అంటూ సాగిన ఈ గీతం వింటే ప్రపంచ పదులు గుర్తుకొస్తుంది.
మబ్బుకు మనసే కరిగితే
అది నీరౌతుంది!
మనసుకు మబ్బే ముసిరితే
అది కన్నీరౌతుంది.
అన్న గజల్ మనకు స్మృతి పథంలో మెదులుతుంది.
1972 లో పండంటి కాపురం చిత్రంలో
“ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు
ముందు ముందు కావాలి పొదరిల్లు–“
అనే గీతం ఆ కాలంలో ఎంతో ఖ్యాతిని గడించింది.
“ఈనాడు” పత్రిక పేరు ఆ పాట స్ఫూర్తి తోనే పెట్టారంటారు. (ఈనాడు కట్టుకున్న పేపరిల్లు అని ఆనందంగా పాడే వారట పత్రిక వచ్చిన తొలి నాళ్ళలో)
1974వ సంవత్సరంలో వచ్చిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో (ఒక పాట తప్ప) పాటలన్నీ శ్రీశ్రీ వ్రాసినవే. వీర రౌద్ర రస ప్రధాన మైనవే. కాని కథానాయిక (విజయ నిర్మల) చేత-ప్రగాఢమైన ప్రేమానురాగాల్ని-విరహ వేదనను చాలా బాగా పలికించారు రెడ్డిగారు.
“వస్తాడు నా రాజు ఈరోజు!
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు!”
పాటలో–
“వెన్నెలలెంతగా విరిసిన గాని చంద్రుని విడిపోలేవు!
కెరటాలెంతగ పొంగిన గాని కడలిని విడిపోలేవు!
కలిసిన ఆత్మల అనుబంధాలు
ఏ జన్మకు విడిపోలేవు”
అనే చరణాలు మరువలేని మధుర వేదనకు ప్రతి రూపం.
ప్రేమ భావన లోకంలో ఉన్నంతకాలం జన హృదయాల్లో ఈ గీతం నిలిచి ఉంటుంది.
ఇంత గొప్పగా ఈ పాటను చెక్కిన శిల్పి మన సినారె కాక మరెవరు! వారి ప్రతిభను ఎంత ప్రశంసించినా తక్కువే.
బంగారు గాజులు చిత్రానికి వ్రాసిన గీతం
“అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి!
కనిపించని దైవమే ఆ కనులలో ఉన్నది”!
అనే గీతం నిత్య నూతనం.
రాఖీ పౌర్ణమి పండుగ వచ్చిందంటే టీవీలో ప్రతిఛానల్లో ఈపాటే ప్రతిధ్వనిస్తుంది. అన్నా చెల్లెళ్ల అనురాగానికి ఈ గీతం ఓ చక్కని ఉదాహరణగా నిలిచింది.
“చెల్లెలి కాపురం” చిత్రంలో “చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన” అంటూ దీర్ఘ సమాసాలతో రాసిన గీతం రెడ్డిగారికి పదబంధాలతో వున్న అనుబంధాన్ని మనకు చెప్పకనే చెబుతుంది.
తాత మనవడు చిత్రంలోని పాట చాలా వరకు నిన్నటి తరానికి ఓ స్వీయ అనుభవం లాంటిది
“అనుబంధం -ఆత్మీయత
అంతా ఒక బూటకం!
ఆత్మ తృప్తి కై మనుష్యులు
ఆడుకునే నాటకం!వింత నాటకం” అంటూ
పేగు బంధానికి విలువ ఇవ్వని పిల్లల మనస్తత్వానికి-వయస్సు పడమరకు మళ్ళిన పెద్దల మనోవేదనకి అద్దం పడుతుంది ఈగీతం.
స్వాభిమాన పరిరక్షణ కోసం కాలం తో పాటు కలాన్ని కదిలించే అభినవ శిల్పి మన సినారె
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది
అన్న గీతం ఒక స్థాయిలో తెలుగువారి ఆత్మ గౌరవానికి గుర్తుగా నిలిచింది. రాజకీయ సంచలనాలు సృష్టించింది.
2014లో రాష్ట్ర అవతరణ తర్వాత తెలుగు జాతి విడిపోయింది కదా! మీరేమంటారు అంటే ఇప్పుడు మాత్రం ఏమయింది!
తెలుగు జాతి మనది
రెండుగ వెలుగు జాతి మనది
అన్నారు నారాయణ రెడ్డి గారు.
వారి కలానికి రెండు వైపులా పదును వుంది.
(కవులకు ఎల్లలుండ వన్నది వారి భావన.)
నారాయణ రెడ్డి గారిని పలకరించిన అవార్డులు అనేకం.
“కంటేనే అమ్మ అని అంటే ఎలా!
కడుపు తీపి లేని అమ్మ!
రాతి బొమ్మే కదా!”
ఈ గీతంలో ప్రేమను-ద్వేషాన్నీ సమంగా పలికించారు. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని తెలుపుతూనే కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా అన్న భావన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లోకంలోని మనస్తత్వాలకు ప్రతీక గా కనిపిస్తుంది ఈ పాట.
ఈ గీతానికి సి నా రె గారిని నంది అవార్డు వరించింది.
2009లో అరుంధతి చిత్రానికి వ్రాసిన ‘జేజమ్మా! జేజమ్మా’ వారి చివరి సినీ గీతం.
కాని (జూన్ 12- 2017) తుదిశ్వాస వరకు వారి సాహితీ కృషి కొనసాగింది. మొత్తం 3,500 కు పైగా గీతాలు వ్రాశారు.
అన్ని వర్గాల వారిని పలకరించాయి. వారి గీతాలు అక్షరలక్షలు చేసే సాహిత్యాన్ని తెలుగు వారికి అందించింది.ఏ గీతాన్ని రచించిన అందులో ఏదో ఓ అర్థం -పరమార్థం దాగి వుంటుంది.
తెలుగు సాహితీ వినీలాకాశంలో మసకేయని పున్నమి చంద్రుడు మన సి నా రె.
తెలుగు చలన చిత్ర యవనిక మీద చెరగని సంతకం వారు.
తెలుగు పాట ఉన్నంత కాలం జన హృదయాలలో నారాయణ రెడ్డి గారు నిలిచి ఉంటారు.