Site icon Sanchika

చిత్రం భళారే విచిత్రం

[box type=’note’ fontsize=’16’] ఓ మలయాళీ దర్శకుడు తీసిన తెలుగు, ఒడియా చిత్రంలో తానో చిన్న పాత్రలో నటించిన వైనాన్ని “చిత్రం భళారే విచిత్రం” పేరిట పాఠకులతో పంచుకుంటున్నారు ఆనందరావు పట్నాయక్. [/box]

[dropcap]ఒ[/dropcap]డిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్. జూన్ నెల తేదీ 22. వరుణుడు కాస్త శాంతించాడు కాబోలు, చిన్న జల్లు పడ్తోంది. రాష్ట్రంలోని నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. మిత్రుడు సుబ్రమణ్యం నుండి ఫోన్ వచ్చింది. సినిమా ఘాటింగు జరుగతోంది. సర్పంచి పాత్ర కోసం నటుడు కావాలి వస్తారా అని దాని సారాంశం. సినిమా అంటే ఆపరేషన్ టేబుల్ మీదున్న రోగి కూడా లేచి కూర్చుంటాడు. అలా నటిస్తావా అదీ వెండితెర మీద అంటే వెళ్ళనన్నవాడు ఎవడు? వర్షం పడుతున్నా, రోడ్లన్నీ గలీజుగా ఉన్నా ఆటోలో చంద్రశేఖర్‌పూర్‌లో కిట్సే క్యాంపస్‌కి వెళ్ళాను. భరణి, అతుల్‌ కులకర్ణి మీద షూటింగు జరుగుతోంది. తీసిన సీన్‌నే అరడజను సార్లు తీస్తున్నాడు డైరక్టరు రాజేష్. అతను మళయాళీ. ఒక యథార్ధ గాథని తెలుగు, ఒడియా భాషల్లో చిత్రీకరిస్తున్నారు.

ఒంటి గంటన్నర వరకు కంచిగరుడు సేవ జరిగంది. కటక్ నుండి వచ్చిన ఇద్దరు మిత్రులతో భోజనం చేసాను. ఉప్పుడు బియ్యం అన్నం తినాలన్న నా కోరిక తీరింది. అలానే అన్ని కూరగాయల కలగలుపుతో చేసిన ‘గొంటా’ తిని తరించాం. అక్కడ నుండి చందుకా అన్న ఊరికి మమ్మల్ని తీసుకు వెళ్ళారు. నన్ను అడ్వకేటు రోల్ చెయ్యమన్నారు. ప్రొడక్షన్ వాళ్ళు నా మెజర్‌మెంట్సు తీసుకుని షర్టు, ప్యాంటు తేవడానికి వెళ్ళారు. డైరెక్షన్ విభాగంలో ఉన్న రవి నా దగ్గరకు వచ్చారు. స్క్రిప్ట్ ఇచ్చి డైలాగు చదవమన్నారు. చదివాను. మాడ్యూలేషను మార్చమన్నారు. ఇంతకీ అవి సర్పంచి పాత్రవి. అంతవరకు ఆ పాత్రకు అనుకున్న జూనియరు నటుడ్ని తొలగించి నాకు చెయ్యమన్నారు. కాగితం మీద రాసుకున్నా డైలాగ్స్ కంఠతా బెట్టాను. చందుకా విలేజీలో పోలీసు స్టేషనులోనే షూటింగు. మరి కొంతసేపటికి రవి వచ్చి “సార్ మిమ్మల్ని అడ్వకేటు రోల్ చేయ్యమంటున్నారు డెరెక్టరుగారు. రడీ అవ్వండి” అన్నాడు.

అతడు అనడమే తరువాయి ప్రొడక్షన్ వాళ్ళు నాకు తెల్లటి ప్యాంటు, తెల్లటి షర్టు తొడిగి కాళ్ళకు నల్ల బూట్లు వేసి వకీలుని చేసారు. మెడకు తెల్ల రిబ్బను కట్టి ఎడమ చేతి మీద నల్ల కోటు పట్టుకోమన్నారు. అతుల్ కులకర్ణి డి.జి.పి. కారులో ఠాణాకు వస్తారు. ఆయన వెంటనే భరణి గారు సి.ఐ. గా ఫాలో అవుతారు. డి.జి.పి ఎంటర్ అవగానే నేను లేచి గుడ్మార్నింగు అని చెప్పాలి. వర్షం ఆగినా ఉక్కబోతగా ఉంది. ఆర్క్‌ల్యాంప్ వేడితో ఉక్కిరిబిక్కిరిగా ఉంది. పైన చెప్పిన సీనుని నాలుగు సార్లు షూట్ చేసారు. పొద్దున్న నుండి పడిగాపులు పడిన ఫలితం ఉంది. సిన్మా రిలీజయిన తర్వాత ఆ సీను ఉంటుందో కట్ అయిపోతుందో అనుమానం. ముందు అక్కడ నుండి బయట పడాలి. డైరక్టరు రాజేష్‌ని నేను వెళ్ళిపోయేదా అని అడిగాను. ఎందుకంటే ఇండస్ట్రీలో డైరెక్టరు మాటే ఫైనలు. ఎంతమంది అసిస్టెంటు డైరెక్టర్లు, ఆసోషియేట్ డైరెక్టర్లున్నా వాళ్ళ మాట చెల్లదు. అయితే ఇక్కడో తమాషా నేను గమనించాను. అతుల్ కులకర్ణి మరాఠీ. అతనికి తెలుగు, ఒడియా భాషలు రావు. తను నటించిన ప్రతీ సీను, దానికి అనుబంధంగా ఉన్న జూనియరు నటుల్ని తానే డైరెక్టు చేసి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్తున్నాడు. పాపం రాజేష్‌గారి అవస్థ చూడాలి. ఆయన అనుయాయులు అందరూ అరవవాళ్ళే. వాళ్ళలో వాళ్లే ఏదేదో మాట్లాడుకుంటున్నారు. భాష అర్ధమయి చావదు. అయినా అక్కడ ఆ సీన్ రక్తి కట్టింది.

నేను ఇంట్లో చెప్పకుండా షూటింగు రావడం సుమారు 8 గంటలు ఫోను రాకపోవడంతో ఇంట్లో వాళ్లంతా గాభరా పడ్తున్నారు. అందుకే డైరెక్టరుని అడిగితే భరణిగారు కల్పించుకొని డైలాగు ఉన్న పాత్ర ఇవ్వండి. ఆయన రైటర్, తెలుగు సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అని చెప్పడంతో, రాజేష్ గారు అయితే సార్ రేపు రావల్సి ఉంటుంది. మీకు సర్పంచి పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది అన్నారు. అలానే అని చెప్పి బయట పడ్డాను. చందుకా పోలీసు స్టేషనుకి రావడం అయింది గాని పోవడం అంత తేలికైన విషయం కాదు. మొత్తం మీద ఒకడు టూ వీలరు మీద ఇంటికి దిగబెట్టాడు.

ఈ పిక్చర్ పేరు ‘పాట్నాగడ్ ఫిబ్రవరి 2018’ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజవుతుంది. నటీనటులకు పారితోషకం లేదు. ఈ సినిమాలో నటిస్తున్న ఒడియా నటుడు అతుల్ కులకర్ణికి, భరణికి స్నేహితుడట. ఆయన అభ్యర్దన మేరకు యీ వెసులుబాటు. నూరుకోట్ల బడ్జెట్ ఉన్న తెలుగు చిత్రం ఎక్కడ, కోటి కూడా కాని ఒడియా ఫిలిం పరిశ్రమ ఎక్కడ. ఈ రాష్ట్రంలో ఎక్జిబిటర్స్ తక్కువ. పైగా చూసే వాళ్ళు మరీ తక్కువ. ఇక్కడ టాప్ డైరెక్టరు రెమ్యునరేషను ఐదు లక్షలు, టాప్ ఏక్టర్‌కి 10,12 లక్షలు. ఒకప్పుడు హీరో, హీరోయిన్‌లుగా ఒక వెలుగు వెలిగిన నటీనటులకు పారితోషికం ఒకటిన్నర లక్షలు మాత్రమే. ఇప్పడిప్పుడే మంచి లొకేషన్లు పేరిట దేశ, విదేశాల్లో ఘాటింగు జరుపుతున్నారు. గ్రాఫిక్స్ విరివిగా వాడుతున్నారు. త్వరలోనే ఒడియా చలన చిత్ర పరిశ్రమ మూడు టేకులు, ఆరు షాట్లుగా అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం.

గమనిక: ఇప్పడే అందిన వార్త. సిన్మాలో విలన్ తండ్రి యీ చిత్ర నిర్మాణానికి అడ్డు చెప్పడం, నిర్మాత, దర్శకుల మీద దావా వెయ్యడం జరిగింది. వివాదాలు కూడా ఒక ప్లస్ పాయింటే.

Exit mobile version