చిట్టితల్లి శతకం-4

0
2

[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]

31.
దోష మెంచి నంత రోష పడగరాదు
అరయగలవు నీవె తరచి చూడ
తప్పుటడుగు పడును తపన పెరిగి నంత
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
32.
కలుపు బెరికివేయు కర్షకునివలెనె
సంతు తప్పిదముల జక్కబరచి
వారి బతుకు పంట పండించ వలెనమ్మ!
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
33.
దొంగతనము జేసి దొరవలె తిరిగినన్
మర్మ మెరుగు మనసు మాట వినున?
భంగ పడుదు వమ్మ! బయట పడెడు వేళ
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
34.
శిలయు ప్రతిమలాయె నులిదెబ్బ తగులగా
వెదురు గాయ పడిన వేణువాయె
నెదురు దెబ్బ లెపుడు నెదుగుదలకె సుమ్ము
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
35.
తలచ రాదు నాదు తలరాత యనుచును
చింత పడుచు విసుగు చెంద వలదు
తరచి వెదకి నపుడె తగుదారి దొరకును
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
36.
ఓడినంత నెపుడు నోరిమి విడరాదు
కృషిని వీడరాదు గెలుపునొoద
ఒజ్జ యగుచు నేర్పు నోటమి పాఠముల్
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
37.
అక్షయముగ పుట్టు నాలోచనలయందు
నెంచు కొనుచు సాగు మంచి దొకటి
గమ్యమెఱిగి సాగ గగనమ్మె తలదించు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
38.
చింతమాపు చేయ సిద్ధార్థుడే మారి
బోధనలను చేయు బుద్ధుడాయె
చింతనదుపు చేయ సిద్ధించు కార్యమ్ము
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
39.
సాగవలయునన్న శాంతి మార్గమునందు
జరుగుతున్న దరసి చనగవలయు
గతము వగచినంత వెతలింకి పోవునా?
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
40.
గాలికబురు లెపుడు గగనాని కెగబ్రాకు
నిజము సాగదెపుడు గజము కూడ
జాప్య మైన గాని సత్యమ్ము ధరనిల్చు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here