చిట్టితల్లి శతకం-5

0
2

[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]

41.
కనుల నీటి జూచి కరగిపోదురనెడి
తీరు మారెనెపుడొ తెలుసు కొనుము
మొత్త జూతురిపుడు మెత్తగ నున్నచో
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
42.
పరుల సేవె తనకు పరమార్థమని తల్చు
మంచితనమితరుని మనసు గెలుచు
నహము తగదు తల్లి! ఆస్తిపాస్తుల గాంచి
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
43.
నిర్భయముగ పల్కు నీతి మార్గమునందు
నాపద లెదురైన నడుగడుగున
రణము సేయనెంచి రాజీ పడవలదు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
44.
ప్రజల పక్ష మందు పయనించు పోరులో
నొంటరైన గూడ నోర్పు తోడ
తగ్గకుండ నిలిచి నెగ్గుకు రావలెన్
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
45.
కవచ కుండలములు కర్ణుడొసగగానె
మబ్బురవుతు ఘనత మసకబారె
స్వార్థమున్న పనుల సన్నగిల్లును కీర్తి
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
46.
ఊహలెక్కువైన నునికినే మరపించి
కలతలు కలిగించు గలలదేల్చి
యడ్డు గోడ యగుచు నభివృద్ధినె చెఱచు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
47.
జ్ఞాన నిధులు యుండి సాధనలేకున్న
బుద్ధి మందగించు మొద్దుబారు
తుప్పు బట్ట నినుము తునకలై మిగలదా?
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
48.
సిరులు, కీర్తి కొరకు పరుగుబెట్టినవాడు
చనవు పెంచుకొనుచు తనువు విడుచు
నుల్లసించు వాడె యున్నతుడిలలోన
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
49.
జలధినీద వచ్చు కొలదిదూరమయిన
ఎగుర సాధ్య మౌను గగనమందు
కాల మాప లేము కడగి నిమిషమైన
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
50.
వ్యసన పరుని వెంట పయనించ రాదమ్మ
నడుగు దూరమందె యెడరులుండు
నావహించ గలదు నంటురోగమువలె
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here