Site icon Sanchika

చిట్టితల్లి శతకం-6

[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]

51.
గొప్ప చెప్ప తగదు గురివింద రీతిగ
తప్పు లెంచ వలెను తనవె తొలుత
దోష మసలు లేని దొడ్డవారుందురా!
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
52.
అలుసు చేయ తగదు అంగవిహీనుల
సానుభూతి జూప సబబు కాదు
చేతనైన రీతి సేవ చేసిన మేలు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
53.
ఏకలవ్యునివలె యెదుగు శిష్యుని గన
గురువు కతని మీద గురియు పెరుగు
గడన చేయకున్న గర్వమొందు మదిని
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
54.
ప్రగతి పేరు జెప్పి పచ్చని చెట్లను
నరుకచుండ మనకె నష్టమగుచు
నడవులంత మొంది నాపద లెదరౌను
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
55.
జ్ఞానమునకు మించు సంపద లేదమ్మ
నదియె యెడరులందు నరయు మనల
బంచుచున్న కొలది మించిపోవు నదియు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
56.
దుర్లభమను మాట దూరముంచ మదికి
సులభమౌను బాట సుంతయినను
నిమ్మళించి నడువ నెరవేరు లక్ష్యము
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
57.
అంబరమ్ము నంటు నల్పుని మాటకు
మోసపోదురమ్మ యాశతోడ
నిజము నిగ్గు దేల నింద జేతురు వారె
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
58.
సజ్జనుండు దెలుపు బుజ్జగించి మనకు
మంచి మార్గ మందె మరలుమనుచు
చెడ్డ మార్గమెపుడు జెఱుపుజేయును తల్లి
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
59.
నమ్మకముగ జేరి సొమ్ములు దోచుచు
హాని జేయ జూతు రవని నిపుడు
తొలగు నాపద తగు మెలకువ నుండిన
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
60.
ఎదుటివారి జూచి యెరుసు పడకెపుడు
తనకు లేదటంచు వనటవలదు
తృప్తి లేని జీవి ధృతికి దూరమగును
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!

(ఇంకా ఉంది)

Exit mobile version