[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]
81.
నాగరికత నేర్చి నగరాల జీవించి
నచ్చినటుల మారి నడచుకున్న
మరువరాదు తల్లి మనయూరి నెప్పుడు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
82.
పరిధి దాట వలదు ప్రతిభ యున్నదనుచు
లోకువగుదువమ్మ! లోపమున్న
మించి యెదుగ వలెను నెంచు వారల జూచి
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
83.
చెదరనీయకమ్మ చిరునవ్వు మోముపై
చింత తొలగజేయు జిన్నినవ్వె
నవ్వవలెను గాని నగుబాటు కారాదు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
84.
పొరుగువారి జూచి సరితూగ వలెనంచు
నప్పు సేయ తగదు మెప్పు కొఱకు
నాపదలను దెచ్చు నాడంబర మెపుడు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
85.
విద్య నేర్చునపుడు విసుగుచెంద వలదు
మన్ననలను పొందు మార్గ మిదియె
మనిషి తీరు మారు మంచి విద్యవలనె
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
86.
దీక్ష బూని దెచ్చె దివిజ గంగనిలకు
నల భగీరథుండు తెలియుమమ్మ!
కష్టపడిన వారి కార్యమ్ము లొనగూడు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
87.
చీడపురుగు రీతి వీడక వెన్నంటి
చెరుపు జేతు రరయ చెనటులెపుడు
తగినరీతి బల్కి తప్పించుకోవలె
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
88.
ఆస్తులన్ని బంచ నాపద లెదురౌను
ధనము వలయు సుమ్ము ధరణి యందు
విలువ నిచ్చు జగము విత్తమున్నప్పుడే
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
89.
కన్న బిడ్డ కోర్కె కష్టమైనను దీర్చు
కన్న వార లవని కల్పతరులు
ముదిమి యందు వారి వదిలించు కొనరాదు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
90.
అతిగ మాట లాడ గతితప్పి పలుకులు
గుట్టులన్ని కూడ రట్టు జేయు
నాల్కనదుపు చేయు నల్వురి నడుమన
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
(ఇంకా ఉంది)