చిత్తూరు జిల్లా సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు

0
4

చెరువుల తవ్వకం

చిత్తూరుజిల్లాలో చెప్పుకోదగ్గ నదులు లేవు. చెరువుల ద్వారానే వ్యవసాయం చేసేవారు. తటాకాలు త్రవ్వడం, బావులు త్రవ్వడం, చెరువుల పూడిక తీయడం పవిత్రమైన కార్యాలుగా చెలామణి అయ్యేవి. జిల్లాలో వున్న పాపాఘ్ని, బాహుదా, కౌండిన్య, పాలార్, కళ్యాణి, కుశస్థలి, స్వర్ణముఖి నదులలో నీరు చాలా తక్కువ వుండేవి. అందుకే జిల్లాలో వర్షాధారిత పంటలను ఎక్కువుగా పండించేవారు. మిగిలిన కాలాలలో చెరువుల మీద ఆధారపడేవారు. దేవాలయాలకు భూమిని దానమిచ్చేటప్పుడు, దానికి సంబంధించిన చెరువులు తవ్వడం, కుంటలు, నూతులు, ఏతాలు లాంటివి ఏర్పాటు చేయడం కూడా దానంలోనే వుండేవి. శ్రీకాళహస్తి తాలూకా, గుడిమల్లంలో క్రీ.శ.845 సంవత్సరంలో దంతివర్మ శాసనంలో తిరువిప్పిరంబోడులోని తటాకంలో పూడిక తీయడానికి అయ్యపోరి భూమిని దానం చేసినట్టువుంది. క్రీ.శ.867లోను రాణి విజయక్కనార్ చక్రవర్తి అవిలాల చెరువు నిర్వహణకు బంగారం ఇచ్చినట్లు వుంది. మూడో నందివర్మ శాసనంలో ఇది చెప్పబడింది. కులోత్తుంగుని పాలనలో పుంగనూర్ తాలూకా, ఎడూరు శాసనంలో(క్రీ.శ.1106) కొల్హాన్ నదికి కరకట్టలు నిర్మించి, మధురాంతక పేరేరి అనే చెరువు పేరు పెట్టినట్టు తెల్పబడింది. నదులు ఎండిపోయున క్రమంలో అందులో కొంతభాగాన్ని చెరువుగా మలచడానికి రాజులు ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అంటే చిత్తూరు జిల్లా ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల వున్న అరకొర నదులు సైతం ఎండిపోవడంతో, నదులు చివరికి చెరువులు అయినట్టు తెలుస్తోంది.

పుణ్యం కోసం చెరువులు తవ్వించే సంప్రదాయం జిల్లాలో వుంది. క్రీ.శ. 1222-1223, పుత్తూరు తాలూకా, యోగిమల్లవరం గ్రామంలో నారాయణ పుత్తేరి, మున్నాయి పూండి అనే రెండు చెరువులను పాండియరైయర్ అనే అతను సామంతరాజు నారాయణ పెళ్లికి పుణ్యం దక్కాలని ఈ చెరువులు తవ్వించినట్టు తెలుస్తోంది. చెరువులు వర్షాలతో కళకళ లాడుతున్న క్రమంలో అందులో చేపలు పట్టడానికి గ్రామాధికారులు వేలం వేసేవారు. ఈ వేలంపాటను కొన్నవారు విధిగా రాజుకు పన్నులు చెల్లించాల్సి వుంటుంది. ఈ పన్నులను అప్పుడప్పుడు రాజు మినహాయించేవాడు. క్రీ.శ. 1085-1086 మొదటి కుల్లోత్తుంగుని లడ్డిగం శాసనంలో పులినాడులోని కొయార్రూర్లో గల ఇరుంగోళేశ్వర స్వామి నైవేద్యానికి మాదమంగలం అనే గ్రామాన్ని దానం ఇచ్చాడు. ఇదే గ్రామంలో గల చెరువులో చేపలు పట్టడానికి కట్టే మీన్పొట్టం పన్నును చెల్లించాల్సిన అవసరం లేదని శాసనంలో చెప్పబడింది.

అదే అవిలాల చెరువును క్రీ.శ. 1409నాటి తిరుమల శాసనంలో మళ్లీ పూడిక తీసినట్టు, దానికి రెండో కాలువను తవ్వించి 5వేల కులి భూమిని సాగులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. అవిలాల చెరువు ఇప్పుడు పెద్ద ఊరుగా మారిపోయింది. తిరుపతిలో వున్న సుమారు 100 చెరువులు ఇప్పుడు తిరుపతి పట్టణంలో కలిసిపోయి వున్నాయి. చెరువు నీటిని ఉపయోగించుకునే క్రమంలో గ్రామాల మధ్య ఘర్షణలు సైతం తలెత్తేవని, వీటిని పరిష్కరించడానికి రాజులు సైతం ప్రయత్నించేవారని తెలుస్తోంది. అవిలాల చెరువు నీటి పంపకాల విషయంలో అవిలాల, పయిండిపల్లి గ్రామస్థులు ఘర్షణ పడినట్టు తెలుస్తోంది. క్రీ.శ.1517 నాటి శ్రీకృష్ణరాయల తిరుమల శాసనంలో నరసింగరాయపురానికి చెందిన సిత్తము శెట్టి 14,590 నర్పణాలు తిరుమనేరి చెరువులో పూడిక తీయడానికి, కాలువల మరమ్మతులకు ఇచ్చినట్టు శాసనంలో వుంది. అలాగే దేవాలయాల నిర్వహణకు, అధికారులు చెరువులు పూడికకు కొంత దానం ఇచ్చి, సాగులోకి వచ్చిన భూముల పంటలో కొంత శాతాన్ని తిరిగి దేవాలయానికి చెల్లించాలనే షరతుతో దానం చేసినట్టు తెలుస్తోంది. క్రీ.శ.1517 నాటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకాళహస్తి శాసనంలో చిత్తాటూర్ లోని తటాకం పూడిక తీతకు 200 పణాలు దానం ఇచ్చినట్టు తెలుస్తోంది. సాగయ్యే భూమిలో కొంత ఫలసాయాన్ని కైలైమలైలోని దేవాలయ దీపారాధనకు ఉపయోగించాలనే షరతు వుంది.

చెరువులను పెద్ద చెరువులకు అనుసంధానం చేయడం, పెద్ద చెరువులను నదులకు అనుసంధానం చేయడం కనిపిస్తుంది. తద్వారా నది నుండి చిన్న చెరువుకు నీరు, చిన్న చెరువు నుండి నదికి నీరు చేరేవిధంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. నిరంతరం పంటపొలాలకు నీటిసౌకర్యం కల్పించినపుడే, ప్రభుత్వాలకు పన్నులు వచ్చే పరిస్థితి వున్నందున, రాజులు చెరువుల పూడికకు, కొత్త చెరవుల తవ్వకానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ధనికవర్గం సైతం చెరువుల నిర్మాణానికి కొంత ప్రాధాన్యతను ఇచ్చినట్టు కనబడుతోంది. ధనవంతులు రైతులకు సేవచేయడం వెనుక పుణ్యం, కీర్తిప్రతిష్ఠలు వస్తాయనే నమ్మకం వుంది. అలాగే తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి వారి దానం ఉపయోగపడేది.

చిత్రమేళి అనే వ్యవసాయ సంస్థను సైతం రాజులు స్థాపించి వ్యవసాయ ఉత్పత్తికి మార్కెట్ ను కల్పించారు. క్రీ.శ.1207 నాటి శ్రీకాళహస్తి శాసనంలో ముడో కులోత్తుంగుని పాలనలో చిత్తిరమేళి పెరియనాట్టవర్ (వ్యవసాయ సంస్థ) ప్రస్తావన వుంది. బ్రహ్మదేయ, ఊర్ లాంటి సంస్థల మాదిరే చిత్రమేళి ప్రముఖమైన పాత్ర వహించినట్టు తెలుస్తోంది. గ్రామాధికారులు, దేవాలయాధికారులు పన్నులను చిత్రమేళికి చెల్లించినట్టు శాసనాలు అనేకం వున్నాయి. అలాగే చిత్రమేళి సంస్థకు చెందిన అధికారులు కొంతమంది ఆలయప్రవేశాన్ని నిషేధించినట్టు కూడా తెలుస్తోంది. క్రీ.శ. 1354-55 నాటి శ్రీరంగనాధ యాదవరాయల కాలం నాటి, పుత్తూరు తాలూకా , సత్రవాడ గ్రామానికి చెందిన శాసనంలో చిత్రమేళి సంస్థ శంకేతి సమయక్కారర్, వీర కొడియార్ అనే శాఖల వారికి ఆలయ ప్రవేశాన్ని నిషేధించినట్టు శాసనంలో వుంది. అంటే ఈ శాఖలవారు చిత్రమేళి సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించకపోవడంతో వారికి దేవాలయ అనుమతి నిరాకరించబడినట్టు తెలుస్తోంది.

వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి, కొనడానికి వర్తక సంస్థలు వుండేవని తెలుస్తోంది. ఈ వర్తకసంస్థను నగరత్తార్ అనేవారు. ఈ సంస్థ వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే మార్కెట్ చేసేది. ఈ సంస్థకు చెందిన వ్యాపారవేత్తలు రాజులకు పెద్ద ఎత్తున కానుకలు సైతం ఇచ్చి రాజు మెప్పును పొందడానికి ప్రయత్నించే వారని తెలుస్తోంది. క్రీ.శ. 1011-1012 నాటి శ్రీకాళహస్తి శాసనంలో చక్రవర్తికి బంగారు పళ్ళాన్ని దానం చేసినట్లు వుంది. ఇందులో పాల్గొన్నవారు దేవరకన్నిగల్, కరణాట్టాన్, మూర్కాన్ పాండి, నగరత్తార్. ఈ నగరత్తార్ సంస్థ అధినేత పేరు పురుషమానిక్య శెట్టి అని శాసనంలో వుంది. వర్తకవ్యాపారులు తమ పేర్ల చివర కవర శెట్టి, దన్నశెట్టి, మాయిలెట్టి అనే పదాలను తగిలించుకునేవారు. మాయిలెట్టి అంటే మాహాశ్రేష్టి అని అర్ధం. శ్రేష్టిని చివరకు శెట్టిగా చేశారు. రాజులను సైతం నియత్రించే శక్తిసామర్థ్యాలు వర్తకులకు వుండేవని తెలుస్తోంది.

వివిధ దేశాలకు చెందిన బడా వర్తకులు మూగైనాడులోని శ్రీరావళ్లి అనే ప్రాంతంలో సమావేశమై ఆ ప్రాంతాన్ని ఎరివీర పట్టణంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అది వారి వర్తకానికి తగినచోటుగా వారు భావించేవారు. దీనికి ముందుగా ఆ ప్రాంత రాజు అనుమతి తీసుకున్నట్లు ఎక్కడా కనబడదు. క్రీ.శ. 1049-1050 మొదటి రాజాధిరాజు కాలం నాటి మదనపల్లి తాలూకా, బసినికొండ శాసనంలో ఇది చెప్పబడింది. వర్తకులకు సౌకర్యాలు కల్పించినందుకు ప్రతిగా వర్తకులు స్థానిక ప్రజలకు కొన్ని బహుమతులు, దానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజు అనుమతి లేకుండానే ఈ కార్యకలాపాలు జరిగినట్టు తెలుస్తోంది. అలాగే పన్నిరువర్శెట్టి, ఎగుమతి, దిగుమతి అనే వర్తక సంఘాలు వుండేవి. వీరు ఏకంగా ఆలయాలే కట్టించినట్టు తెలుస్తోంది. వీరి ఆర్ధికస్తోమత, చిన్న సామంతరాజుల ఆస్థులకుమించి వుండేదని అర్ధమౌతోంది. కనరీశ్వర స్వామికి వీరు నారాయణవనంలో దేవాలయాన్ని నిర్మించినట్టు ఇదే వూరులోని చోళ శాసనంలో ప్రస్తావించబడింది.

విశ్లేషణ

చిత్తూరు జిల్లాకు చాలా ప్రాచీనచరిత్ర వుంది. తెలుగు వెలుగులోకి రాకపూర్వం కూడా జిల్లాకు తనకంటూ ఒక ప్రత్యేకమైన చరిత్రను నిలుపుకుంది. ఈ ప్రాంతం అతి ప్రాచీనమైన భూభాగం కావడం, ద్రావిడదేశంలో ఓ భాగంగా వుండటం కూడా వైవిధ్యభరితమైన చరిత్రకు ఈ ప్రాంతం వేదికైంది. తమిళశాసనాల్లో అత్యధికంగా ఈ ప్రాంతం గురించి ప్రస్తావన వుంది. ఈ ప్రాంతంల్లోని శాసనాలు చాలా వరకు తమిళభాషకు సంబంధించినవి వున్నాయి. ఆహారసేకరణ నుండి ఆహార ఉత్పత్తికి వరకు మానవులు చేసిన సుధీర్ఘ ప్రస్థానానికి చెందిన ఆనవాళ్లు ఇక్కడ నిక్షిప్తమై వున్నాయి. ఆహార ఉత్పత్తి జరిగిన తర్వాతే స్థిరమైన గ్రామవ్యవస్థ ఏర్పడింది. ఈ గ్రామవ్యవస్థ ఏర్పడినా దరిమిలా భూస్వామ్య వ్యవస్థకు కావలసిన ప్రాతిపదిక ఏర్పడింది. చిత్తూరు జిల్లా భౌగోళిక స్వరూపం రీత్యా మూడు రాష్ట్రాలకు చెందిన ప్రాంతం ఇందులో కలపబడింది. అందువల్ల మూడు రాష్ట్రాల సంస్కృతి, సమాజలక్షణాలు ఇక్కడ గోచరిస్తాయి. శాసనాలన్నీ దాదాపు రాజుల పరిపాలనను, గొప్పతనాన్ని ప్రతిఫలించేవే. వివిధ వ్యవస్థల ఆర్థిక క్రమాన్ని విశ్లేషించేందుకు ఇవి కొంతమేరకు తోడ్పాటు నందిస్తాయి. చరిత్రను శాస్త్రీయంగా విశ్లేషించే ప్రక్రియ ఆరంభమైనప్పటి నుండీ, జిల్లా చరిత్రకు ముఖ్యంగా అట్టడగు వర్గాల చరిత్రకు కొంతమేరకైనా న్యాయం చేసే విశ్లేషణలు పెద్దగా రాలేదనే చెప్పాలి. చరిత్రకారులు వెలుబుచ్చిన అభిప్రాయాలు ఎక్కువుగా రాజు దక్షతకు, రాజవంశ చరిత్రకు సంబంధించినవే. ముఖ్యంగా రాజుల కులాన్ని వెతికే ప్రయత్నం ఎక్కువుగా కనిపిస్తుంది.

ఆదిమదశ నుండి భూస్వామ్య దశ వరకు జరిగిన చారిత్రక పరిణామాల నేపధ్యంలో చిత్తూరు జిల్లా చరిత్రను విశ్లేషించ వలసివుంది. వర్గ విభజన లేని కాలంలో అంటే ఆహారాన్ని సేకరించే క్రమంలో వున్న మానవులు ఈ ప్రాంతంలో నివసించారు అనేదానికి చారిత్రిక ఆధారాలు వున్నాయి. ఆహారాన్ని సేకరించే దశ ఇప్పటికీ చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతోంది. వీరు ఎక్కువుగా ఆహార ఉత్పత్తిలో పాల్గొనకపోవడానికి చాలా కారాణాలు వున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం జిల్లాలో పెద్ద ఎత్తున సాగులో లేదు. మరోవైపు వీరికి ప్రభుత్వమే మార్కెట్ కల్పించి గిరిజన కార్పొరేషన్ ద్వారా నగదును అందజేయడం కూడా ఒక కారణంగా వుంది. పశుపోషక సమాజాలను నాగరికత సమాజాలుగా చరిత్రకారులు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇవి వర్గసమాజాలు అవునా కాదా అనే విషయంలో అభిప్రాయభేదముంది. ఆహార సేకరణతో పాటే పశుపోషక దశ వచ్చి చేరింది. అలాగే ఈ రెండు దశలు కొనసాగుతున్నప్పుడే భూస్వామ్యసమాజం వచ్చింది.

ఆహారసేకరణ దశలో వున్న వారికి ఉత్పత్తిని పరిచయం చేయడంతోటే ఆగని నాగరిక సమాజం, వారిని కూలీలుగా, కౌలురైతులుగా మార్చి వారి శ్రమశక్తిని దోపిడీ చేయడం మొదలుపెట్టింది. జిల్లాలో 150కి పైగా పాలడెయిరీలు వున్నాయి. వీరంతా పశుపోషణ మీదనే ప్రధానంగా ఆధారపడివున్నారు. అందుకే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెరిటేజ్ డైరీని 20 సంవత్సరాలుగా ఇక్కడ నడుపుతున్నారు. విజయ ప్రభుత్వ డెయిరీరిని మూసివేసి పాడిపరిశ్రమ మొత్తాన్ని హెరిటేజ్ డైరీ కుట్రతో స్వంతం చేసుకుంది.

నాగరికులు ఆటవికులను బలవంతంగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారా లేదా వ్యవసాయాన్ని వారికి పరిచయం చేసి వారిని క్రిందివర్గాలుగా చేర్చుకున్నారా అనే విషయంలో స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరకడం లేదు. కోశాంబి భావించినట్టుగా ఆటవికుల్లోనే రెండు వర్గాలు ఏర్పడే అవకాశము వుండి వుండవచ్చు. జిల్లాలో వున్న జానపదాలు, కొన్ని స్థానిక ఆచారాలను పరిశీలించినపుడు నాగరికులు ఇక్కడి ఆటవికులను నూతన ఉత్పత్తిలకు అలవాటు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్యులు ఇక్కడి ప్రాంతాలతో సంబంధాలలలో వున్నారని చెప్పడానికి గుడిమల్లంలోని శాసనాలు, బయల్పడిన నాణేలు చెప్తున్నాయి. ముఖ్యంగా తిరుమల ఆలయంలోని ఆటవిక దేవతను, బౌద్ధ ఆరామంగా, తదుపరి జైన ఆలయంగా, ఆ తదుపరి శివుడిగా, అటుపిమ్మట వైష్ణవునిగా చేసిన చారిత్రక క్రమాలు కొన్ని విషయాలను స్పష్టం చేస్తున్నాయి. సామాజిక వ్యవస్థను ఏ శక్తులు తమ అదుపులో పెట్టుకుంటాయో, ఆ శక్తులే తమ మతాన్ని, దేవుళ్లను, సంస్కృతిని బలంగా ప్రజల మీద రుద్దినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రజాసంస్కృతి, ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తిరుపతి గంగమ్మ జాతరలో దీన్ని గమనించవచ్చు. ఇందులో బ్రాహ్మణ పూజారులు వుండరు. అట్టడగు వర్గాల వృత్తి కులాలకు చెందిన ప్రజలు గంగమ్మను పూజించడంలో తమ ప్రత్యేకతను ఇప్పటికీ చాటుకుంటూనే వున్నారు. సాంస్కృతిక అణచివేత పేరుతోనే సామాజిక ఆధిపత్యం సాధ్యపడిందని తెలుస్తోంది. పాత, మధ్య, కొత్త రాతియుగాలలో వాడిన పనిముట్లు విరివిగా ఇక్కడి ప్రాంతంలో దొరికాయి. లోహ యుగం రావడానికి అదనపు ఉత్పత్తి, అధిక శారీరక శ్రమ అవసరమవుతుంది. కాబట్టి లోహయుగపు పూర్వ సమాజంలోనే వర్గసమాజం ఏర్పడటానికి అవకాశం ఎక్కువ వుంది. అందుకే అదనపు ఉత్పత్తిని కాజేసే రాజ్యం లోహపు యుగాలలో విరివిగా కనిపిస్తుంది. క్రీ.శ. 15వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో రాతి విగ్రహాలే ఎక్కువుగా వున్నాయి. ఆశ్చర్యంగా సున్నంచే తయారచేసిన విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. సురుటుపల్లిలోని శివుని విగ్రహం, తిరుపతిలోని గోవిందరాజస్వామి విగ్రహానికి అభిషేకాలుండవు. ఎందుకంటే వాటిని సున్నం (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో తయారుచేశారు.

ఆటవిక సమాజంలో వుండే ఆహారాన్ని ఒక తంతుగా పంచుకోవడం, ఇప్పటకీ ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. తిరుమల ఆలయంలో జరిగే తిరుప్పావడ సేవ, తిరుపతిలోని గంగమ్మ ఆలయంలో జరిగే అన్నం కుంభాలు, జిల్లాలో జరిగే ద్రౌపదమ్మ జాతరలో బండికుంభం ఈ కోవకు చెందినవే. ఆహరపదార్ధాలను పెద్ద ఎత్తున ఒక కుప్పగా పోయడం, దీనికి మంత్రాలు, కొంత తంతు క్రియ వుండటం గమనించవలసిన విషయం. గుంపు కాలక్రమంలో కుదురుగా ఏర్పడటం అది గణాలకు దారితీయడం జరిగిందని చారిత్రకారులు భావిస్తారు. కుదురుకు ముఖ్యంగా కొన్ని ఆయుధ లేదా జంతు చిహ్నాలు వుండటానికి ఆస్కారం వుంది. జిల్లాలో ఇప్పటికీ కొన్ని కులాలకు మాత్రమే పరిమితమై కొన్ని ఆయుధాలున్నాయి. స్థానిక జాతర్లలో వీరు తమ కులానికి మాత్రమే పరిమితమైన ఆ ఆయుధాలను ధరించి వీధి ప్రదర్శన నిర్వహిస్తారు. అలాగే కుదురులకు పరిమితమైన జంతువుల పేర్లు, ఈ ప్రాంతంలోని ప్రజలు ఇంటిపేర్లు రూపంలో ఇప్పటికీ వున్నాయి. పిల్లి చెంచయ్య, ఏనుగు మల్లయ్య, పులి వీర్రాజు ఇంటి పేర్లగా ఇప్పటికీ చెలామణీలో వున్నాయి. అభావం చెందడంలో భాగంగా ఈ ప్రాంత యాదవులు గతంలో గోమాంసాన్ని తినేవారు. కాలక్రమంలో ఆర్యులు గోవుకు పవిత్రతను ఆపాదించడంతో వారు గోమాంసాన్ని, చివరకి గొడ్డుమాంసాన్ని తినడం మానివేశారు. అదొక పాప కార్యక్రమంగా వారు భావిస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలో పిల్లి, ఎలుక మాంసాన్ని తినే కొన్ని కులాలు వున్నాయి. ముఖ్యంగా వివిధ తెగలు తమ ఆహారాన్ని ఒక పండుగ వాతావరణంలో మార్చుకోవడం ఇప్పటికీ సజీవంగా వుంది. ముఖ్యంగా బండికుంభం అనే ద్రౌపదమ్మ జాతరలో సుమారు 50 గ్రామాల నుండి తెచ్చిన వివిధ ఆహారపదార్ధాలను ఆలయం ముందర కుప్పగా పోసి, అందరూ మహా ప్రసాదంగా తీసుకుని తింటారు. ఇది కుదుర్లు లేదా గణాల మధ్య వున్న స్నేహపూర్వక సంబంధాలను తెలియజేస్తుంది. కాలక్రమంలో ఇది శూద్రకులాలకు మాత్రమే పరిమితమై, దళితులను దూరం చేసే అనాచారంగా మారిపోయింది.

రాతియుగంలో స్థిరమైన నివాసం, ఉత్పత్తి సాధనాలు లేవని చరిత్రకారులు నిర్ధారించారు. అందుకే మాతృ ప్రధాన వ్యవస్థ ఆ కాలంలో వుండేది. స్త్రీ ఆధారంగానే పిల్లల్ని గుర్తించడం జరిగేది. అలాగే స్త్రీకి వున్న పునరుత్పత్తి శక్తి వల్ల ఆమెను దేవతగా భావించేవారు. స్త్రీ దేవతలను అమ్మదేవతలుగా కొలిచేవారు. గంగమ్మ, ఎల్లమ్మ, కాళికమ్మ, మూలస్థాన ఎల్లమ్మ, బాట గంగమ్మ, అంకాలమ్మ, మాతమ్మ దేవాలయాలు ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో వున్నాయి. జిల్లాలో ఎక్కువుగా గంగమ్మ గుళ్లు వుండటాన్ని బట్టి, నీటికోసం ఈ ప్రాంతంలో ఎక్కువ పూజలు జరిగేవని తెలుస్తోంది. కరువు ప్రాంతం కావడం వల్ల, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు, కప్పలకు పెళ్లిళ్లు చేసే ఆచారం ఇప్పటికీ కొన్ని గ్రామాలలో వుంది. అలాగే వూర్లో మలేరియా, కలరా లాంటి రోగాలు వచ్చినపుడు వూరి ప్రజలు ఒక రాత్రి ఊరిని వదిలేసి, వూరికి దూరంగా మైదానంలో పనుకుని తిరిగి పొద్దునే వచ్చే ఆచారముంది. గంగమ్మ ఆలయంలో పూజను మొదట్లో స్త్రీలే నిర్వహించారు. తర్వాతి క్రమంలో పురుషులు సైతం పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామాలలోని పొలిమేరల్లో వుండే చాలా గుళ్లల్లో అమ్మదేవతలకు స్వరూపం వుండదు. కొన్ని రాళ్లను అమ్మదేవతలుగా కొలవడం ఇప్పటికీ జిల్లాలో చూడచ్చు. అలాగే అక్కలమ్మలు అనేవి అడవుల్లోను, ఊరి పొలిమేరల్లోను వుండే కొన్ని జంతువు బొమ్మలు. అమ్మదేవతల గుళ్ల ముందర ఇప్పటికీ జంతువులను బలి ఇవ్వడం జరుగుతూనే వుంది. దీనికోసం బలిపీఠాలు సైతం గుళ్లలో వున్నాయి. తిరుమలలో వున్న బాటగంగమ్మ గుడి నాలుగు దారుల కూడలిలో వుంటుంది. ఈ బాటనుండి దట్టమైన అటవీ ప్రాంతానికి స్థానికులు వెళుతుంటారు. ఇది ఆదిమానవులు వేటకు వెళ్లి తెచ్చిన జంతుమాంసాన్ని ఈ గుడి దగ్గరే కర్మకాండ రూపంలో పంచుకునేవారనేదానికి నిదర్శనం. నెలకొకసారి స్థానికులు ఈ గుడిముందర ఇళ్లల్లో వండిన ఆహారపదార్థాలను విగ్రహం ముందర కుప్పగా పోసి నైవేద్యం పెడతారు. అలాగే తిరుమల ఆలయంలో తిరుప్పావడ అనే సేవ వుంది. ఈ సేవలో వెంకన్నకు వండిన ఆహారపదార్ధాలను రాశిగా పోస్తారు. దీనివల్ల ఈ దేవాలయం అమ్మదేవతలకు చెందినదని స్పష్టమౌతుంది. ఇప్పటకీ ఈ ప్రాంతంలోని అమ్మదేవతల గుళ్లలో కుండలు దర్శనమిస్తాయి. పొంగళ్లను ఇప్పటికీ మహిళలు దేవాలయ ప్రాంగణంలో కుండలలోనే వండుతారు. ఆహారసేకరణను నిలువ వుంచుకోవడానికి తర్వాతి క్రమంలో కనిపెట్టబడిన కుండలు, రాతి పాత్రలు ఉత్పత్తి సాధనాలుగా ఉపయోగపడ్డ క్రమాన్ని ఇది గుర్తుకుతెస్తుంది. | ఈ ప్రాంతంలోని అమ్మదేవతల గుళ్ల పరిసరాలలో రాతిపనిముట్లు, కుండపెంకులు ఎక్కువుగా లభించినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. పచ్చికాపలం పరిసర ప్రాంతంలోని ద్రౌపదమ్మను పార్వతి అంశగా గుర్తించడం జరిగింది. అలాగే తిరుపతిలోని గంగమ్మ వెంకటేశ్వరుని చెల్లిగా గుర్తించబడింది. ప్రతి ఏటా మే నెలలో జరిగే గంగమ్మ జాతరలో తిరుమల నుండి లాంఛనాలతో గంగమ్మకు చీర పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. నాగరికులు ఆటవికులను తమ అదుపులో వుంచుకోవడానికి అమ్మదేవతలను, పురుషదేవతలకు భార్యలుగా, చెల్లెళ్లుగా మార్చిన తీరు ఇక్కడ స్పష్టమౌతుంది. ద్రౌపదమ్మను శివుని భార్య అయిన పార్వతితో పోల్చడం, పార్వతిగానే ఆమె పూజలందుకోవడం ఇక్కడ మనం గమనించవచ్చు. ద్రౌపదమ్మ ఆలయం ప్రక్కనే శివాలయం వుండటాన్ని బట్టి, అమ్మదేవతను పూజించే క్రమంలోకి పురుషదేవున్ని చొప్పించడం జరిగిందని భావించవచ్చు. గంగమ్మ ఆలయానికి ఏటా నిర్వహించే జాతరలో పురుష భక్తులు ఎక్కువగా స్త్రీ వేషధారణతో వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. దీన్నిబట్టి మొదట్లో ఈ ఆలయం పూర్తిగా స్త్రీలకు మాత్రమే పరిమితమైన ఆలయమని, అందులో భాగంగా ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే స్త్రీ వేషధారణలో ప్రవేశించాలనే షరతు వుండి వుంటుంది. పురుష ఆధారిత వ్యవస్థలో పురుషులు అమ్మదేవతల గుళ్లపై క్రమంగా ఆధిపత్యం వహించినట్టు తెలుస్తోంది.

ఆటవికులను నాగరికులు తమ సంప్రదాయంలో భాగం చేసే క్రమంలో వారితో స్నేహపూర్వక వైఖరి అవలంభించినట్టు అర్థమౌతుంది. వ్యవసాయ ఆధారిత జనాభా అతి తక్కువుగా వుండటం వల్ల, వ్యవసాయంలోకి అదనపు ఉత్పత్తి కోసం ఆటవికులను ఉపయోగించుకోవడంలో నాగరికులు అతి తక్కువ స్థాయిలో బలప్రయోగం చేసినట్టు భావించవచ్చు. ఆటవికులపై తీవ్రమైన హింస జరిగినట్టుగా చారిత్రిక ఆధారాలు, సాంస్కృతిక ఆధారాలు ఈ ప్రాంతంలో పెద్దగా లభించలేదనే చెప్పాలి. దీనికోసం వారు మతాన్ని బలంగా ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. తిరుమలలోని అమ్మదేవతను చివరకి విష్ణువుగా చేసిన క్రమం పరిశీలిస్తే, ఇదే విషయం అర్థమౌతుంది. తిరుమల నుండి ఆటవికులను తిరుపతికి తరలించడానికి, ఏకంగా గంగమ్మనే క్రిందకి తరలించడం ఒక ఎత్తుగడగానే జరిగిందని తెలుస్తోంది. ఇక జిల్లాలో నాగమ్మ దేవాలయాలకు కొదవలేదు. పాము విగ్రహాలు, ఒక పుట్ట ఈ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో దర్శనమిస్తాయి. వీటికి దగ్గరగా శివలింగాలను ఏర్పాటు చేయడం కాలక్రమంలో జరిగినట్టు అర్ధమౌతుంది. శివుడికి నాగుపాము ఆలంకారప్రాయంగా మారడం వెనుక ఆధిపత్యవ్యస్థల కుట్ర వుందనేది సుస్పష్టం.

రాతి యుగపు పనిముట్లు ఇప్పటికీ, రోలు, రుబ్బుడిపత్రం రూపంలో దర్శనమిస్తున్నాయి. గట్టిగావున్న మాంసాన్ని నలగొట్టడానికి ఆదిమానవులు రాతిపనిముట్లను కనిపెడితే, ఆహారాన్ని నిల్వవుంచుకోవడానికి కుండలు, రాతిపాత్రలు తర్వాత కాలంలో కనిపెట్టబడ్డాయి. అవి ఇప్పటికీ అందరి ఇళ్లలో దర్శనమిస్తున్నాయి. ఇవి ఉత్పత్తిసాధనాలుగా పరిణమించడం, వీటిపై మతం పెత్తనం కొనసాగిందని చెప్పడానికి రుజువుగా అమ్మదేవతల గుళ్లల్లో ఇవి ప్రత్యక్షం కావడం గమనించదగ్గవిషయం. నామకరణంలోను, పెళ్లిళ్లలోను రోకలి, రోలు పాత్ర విశిష్టమైనవి. ముస్లింలు సైతం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నివారించలేని స్థితికి వెళ్లడానికి ప్రధానకారణం, బ్రాహ్మణమతం ఆటవికుల ఆచారాలను, సంప్రదాయాలను, దేవుళ్లను తనలో సమ్మిళితం చేసుకోవడమే. అభివృద్ధి దశయైన స్థిరవ్యవసాయ దశలోను బ్రాహ్మణులు తమ మత ఆధిపత్యాన్ని బల ప్రయోగం అవసరం లేకుండానే వ్యాపింపజేయగలిగారు. జిల్లాలో ఇప్పటికీ ప్రజల నోళ్లల్లో నానుతున్న జానపదాల్లో మత ఆధిపత్యం ఎంత బలంగా వుందో స్పష్టమౌతుంది. శివుడు, వెంకటేశ్వరుడు, విష్ణువు అట్టడగు ప్రజల ఇళ్లలోకి ఎలా దూరారో జిల్లాలోని జానపద పాటలను ఆలకిస్తే అర్ధమౌతుంది. శేషాచల అటవీప్రాంతంలో వున్న యానాదులు, ఎరుకల, తదితర తెగలకు చెందిన ప్రజలు వాడుతున్న పనిముట్లు అన్ని కొత్తరాతి యుగానికి చెందినవే. రుబ్బురోలు తయారుచేయడం, క్యాటర్ బాల్ వాడకం, అడవిలో వేటకు ఉపయోగించే సాధనాలు, వెదురుబుట్టలు అల్లడం లాంటి ఆహారసేకరణ దశకు చెందినవాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్న ప్రజలు ఈ ప్రాంతంలో లక్షల సంఖ్యలో వున్నారు. పేదమహిళలను వ్యభిచార రొంపలోకి లాగడానికి రాచరిక వ్యవస్థ పూర్వదశనుండి ప్రయత్నాలు జరిగాయి. దేవదాసీ వ్యవస్థను, మతం ద్వారా బలీయం చేసి, మాతమ్మ వ్యవస్థ ద్వారా ఇప్పటికీ చిత్తూరుజిల్లాలో కొనసాగిస్తున్నారు. పేదమహిళలు తమకు జబ్బుచేస్తే, మాతమ్మ దేవతకు నైవేద్యంగా తమ శరీరాన్ని ఇచ్చేస్తారు. అంటే ఆ శరీరం గ్రామపెద్దల శారీరక అవసరాలకు ఉపయోగపడాలి. అలాగే జిల్లాలో ఎటువంటి జాతరలు జరిగినా ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో నృత్య ప్రదర్శన మాతంగులే చేయాలి. ఇదొక వృత్తిగా చెలామణీ అవడానికి మతం రంగును పులిమారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 110కి పైగా మాతంగులు జిల్లాలో వున్నట్టు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రకటించాడు. వీరు పెళ్లిళ్లు చేసుకోకూడదు. తమకంటూ స్వేచ్ఛాయిత జీవనాన్ని కొనసాగించకూడదు.

కొన్ని వేల సంవత్సరాలుగా 650 కి. మీకి పైగా వున్న శేషాచలం అడవులు లక్షలమంది గిరిజనులకు జీవనోపాధిని కల్పిస్తున్నాయి. ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడ్డ ఈ సంపదను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించేశారు. ఇప్పుడు గిరిజనులు అడవుల్లోకి అడుగుపెడితేనే అరెస్ట్లు చేస్తున్నారు. పెట్టుబడిదారీ సంబంధాలకు ఇది బలమైన ఉదాహరణ. మిగులు స్వంత ఆస్తికి బీజం వేస్తే, పెట్టుబడి ప్రకృతి సంపదను కొంతమంది ఆస్తిగానే చేస్తుంది. ఈ రోజు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారంటూ, తమిళనాడులోని జువ్వాదికొండలకు చెందిన ఎస్టీతెగ వారే చెట్లు ఎక్కువుగా కొడుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ తెగను ఈరోజు నేరస్థుల జాబితాలో ప్రభుత్వం చేర్చడానికి సంకల్పించింది.

నాగరికుల వల్ల ఆదివాసులు, గిరిజనుల కన్నా కొంత మెరుగ్గా వున్న జాతులు తొందరగా వ్యవసాయంలోకి పెద్ద సంఖ్యలో కూలీలుగా చేరిపోయారు. వీరిలో మాల, మాదిగలు ఎక్కువుగా వున్నారు. చిత్తూరు జిల్లాలో ఆర్ఎస్ఎస్ వారు కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మాదిగజాతి వారు సాక్షాత్తు జాంబవంతుని సంతతివారని చెపుతున్నారు. అంతటితో ఆగిపోకుండా జాంబవంతుని కుమార్తెను శ్రీకృష్ణుడు పెళ్లాడాడని, కాబట్టి మాదిగలంతా శ్రీకృష్ణునికి ప్రియమైన బంధువులనే ప్రచారం జరుగుతోంది. మాదిగల్లో క్రిస్టియానిటీ పెరుగుతున్న సందర్భంలో దాన్ని నివారించడానికి ఆర్ఎస్ఎస్ ఈ ఎత్తుగడకి శ్రీకారం చుట్టింది. బ్రాహ్మణ మతం ఈ విధంగా అట్టడగు ప్రజానీకానికి తమ మతంలో కలుపుకోవడానికి కుయుక్తులు నిరంతరం పన్నుతూనే వుంటుంది. అడవుల నుండి ఆడవిబిడ్డలను తరిమివేస్తున్న కాలంలో మనం వున్నాం. వీరిని మొన్నటిదాక నేరస్థుల జాబితాలో చేర్చి వేధించిన పోలీసులు, ఈ రోజు జిల్లాలో ఎర్రచందనం దొంగలనే పేరుతో వేధిస్తున్నారు.

పశుపోషణ దశ నుండి భూస్వామ్య దశకు వచ్చే క్రమంలో చాలా తెగలను మురికిశ్రమలకు మాత్రమే పరిమితం చేశారు. దీనికి సామాజిక ఆమోదాన్ని పెంపొందించడంలో హిందూమతం ప్రముఖ పాత్ర పోషించింది. తితిదే లో కాంట్రాక్టు పద్దతిపై పనిచేస్తున్న 4వేలమందికిపైగా దళితులు బాత్రూమ్లు, లెట్రిన్లు కడుగుతుంటారు. అలాగే తిరుపతి మున్సిపాలిటీలో మురికికాల్వలు శుభ్రం చేయడం, అశుద్ధాన్ని తీయడం లాంటి పనులు ఇప్పటికీ దళితులే చేస్తున్నారు. పైగా ప్రభుత్వం వీరిని పర్మినెంట్ చేయకుండా కాంట్రాక్టు పద్దతిపైనే కొనసాగిస్తోంది.

చరిత్రకారుల ప్రకారం క్రీ.పూ. 2500 సంవత్సరాలకు పూర్వం గోదావరి నదీ తీరంలో వ్యవసాయం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. క్రీ.పూ. 600-300 మధ్య కాలంలో వ్యవసాయక వర్గ సమాజం గణ వ్యవస్థ నుండి నాగరిక సమాజాలుగా మారాయని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అలాగే కురుపాండవుల యుద్ధం క్రీ.పూ. 600 ముందే జరిగిందని వారు చెప్తారు. ఉత్తరభారతదేశంలో జరిగిన ఈ యుద్ధం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏ విధంగా ప్రభావితం చేసిందో పురాణగాథలు, ఆలయాలు, స్థానిక జానపద పాటల ద్వారానే అర్ధం చేసుకోవాల్సి వుంది. ఎందుకంటే వీటికి చారిత్రిక ఆధారాలు లేవు. ఈ ప్రాంతాన్ని మూడోకృష్ణుడు పరిపాలించినట్టు శాసనాలు వున్నాయి. కృష్ణుడు పేరుతో అనేకమంది రాజులు వున్నట్టు అర్ధమౌతోంది. పశుపోషకులైన ఆర్యులు స్థిరవ్యవసాయాన్ని నేర్చుకుని నదీతీరాల వెంబడి తమ సమాజాలను విస్తృతం చేసే పనిలో పడ్డారు. స్థానిక ఆటవికులను తమలో కలుపుకునేదానికి అప్పటికే వారు వర్ణవ్యవస్థను ఆయుధంగా చేసుకున్నారు. పనిముట్లు తదనంతర కాలంలో ఆయుధాలుగా మారినట్టే, వీరు వర్ణవ్యవస్థకు వైదిక కర్మకాండ రంగును పులిమారు. స్థానిక పశుపోషకులైన యాదవులకు, ఆర్యుల దేవుడైన ఇంద్రుడికి మధ్య వున్న వైరం కాలక్రమంలో మైత్రిగా ఆవిర్భవించింది. వ్యవసాయక సమాజమే కృష్ణుడ్ని దేవున్ని చేసింది. అమ్మదేవతలందరినీ శ్రీకృష్ణుడినికి భార్యలుగా చేయడం వల్ల, అన్ని ఆటవిక తెగలకి కృష్ణుడ్ని దేవుడిగా చేయడంలో సఫలీకృతులయ్యారు.

ఆర్యులు ఉత్తరాది నుండి దక్షిణాదికి రావడానికి, వ్యవసాయ సమాజాన్ని విస్తరించడానికి బౌద్ధులు ఎక్కువుగా ఉపయోగపడినట్టు చరిత్రకారులు భావిస్తున్నారు. వేటాడేవారు, పశుపోషకులు ఎక్కువుగా వున్న దక్షిణాపథంలో బౌద్దులు జంతుబలులను నిషేధించడానికి ప్రయత్నించడం సాహసోపేత చర్యే. అధిక ఉత్పత్తిని సాధించడానికి, వ్యవసాయంలో జంతువుల అవసరం ఎక్కువ. అందుకే వర్తకులు తమ వ్యాపారాన్ని ఇతోధికంగా పెంచుకోవాలంటే, వ్యవసాయ మిగులును సౌఖ్యమైన జీవనం కోసం ఖర్చుపెట్టాలి. ఇందుకు వారికి బౌద్ధులు ఉపయోగపడ్డారు. బౌద్ధులకు దట్టమైన అటవీప్రాంతాలలో బౌద్ధ ఆరామాలను కట్టించి, వారి ప్రచారాన్ని మరింత విస్తృతం చేశారు. బుద్ధుడు సాటిరాజు కాబట్టి, బ్రాహ్మణ ఆధిపత్యానికి గండికొట్టడానికి రాజులు బుద్ధుడికి సహాయం అందించారు. తిరుమల ఆలయం ఒకప్పుడు ప్రముఖమైన బౌద్ధారామం అని చరిత్రకారులు బలంగా విశ్వసిస్తున్నారు. కోసల, మగధ వర్తకులు గోదావరి నదీతీర ప్రాంతానికి వర్తకాన్ని క్రీ.పూ. 600 నాటికే తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో వర్తకం బలంగా అభివృద్ధి చెందింది క్రీ.శ 3 తర్వాతే జరిగిందని శాననాలు చెపుతున్నాయి. అమ్మదేవతకు నిలయమైన ఈ ప్రాంతంలో జంతుబలులను నిషేధించాలని బౌద్ధులు ప్రచారం చేయడం, కాలిబాట కూడళ్లు వర్తక నిలయాలుగా మారడం, కాలక్రమంలో అవి అంగళ్లుగా రూపుదిద్దుకోవడం జరిగింది. కాలక్రమంలో అంగళ్లు పట్టణాలుగా రూపొందాయి. వర్తక కేంద్రాలే రాజులకు వారి రాజ్యాల రాజధానులయ్యాయి. చంద్రగిరి వర్తకకేంద్రంగా, రాజధానిగా వెలసిల్లింది. అంగళ్లు అనే గ్రామాలు జిల్లాలో మూడుకు పైగా వున్నాయి. బౌద్ధ ఆరామాలలో ఎటవంటి విగ్రహం లేకపోవడం వల్ల, అక్కడ కూడా అమ్మదేవతల పూజలే జరిగేవని చరిత్రకారుల అభిప్రాయం.

సారవంతమైన నేలలు ఈ ప్రాంతంలో లేవు కాబట్టి, ఇక్కడ వ్యవసాయ సమాజాలు ఏర్పడ్డానికి ఎక్కువ కాలం పట్టింది. మౌర్యుల అనంతరమే ఇక్కడ స్థిరవ్యవసాయం ఏర్పడినట్టు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. గుర్రం కుదురు చిహ్నాన్ని కల్గివున్న శాతవాహనులు వ్యవసాయక సమాజాలను ఏర్పర్చారు. అయితే క్రీ.శ. 1వ శతాబ్దములోనే తమిళప్రాంతంలో, (చిత్తూరు జిల్లా ప్రాంతం కొంత తమిళదేశంలో కలిసి వుంది) పాండ్య, చోళ గణాలలో స్థిరవ్యవసాయం వుండేదని తెలుస్తోంది. ఇవి నాగరిక రాజ్యాలుగా ఏర్పడకుండా గణసముదాయంగానే వుండటం గమనించాలి. ఆటవికులను వ్యవసాయంలోకి నయాన, భయాన చేర్చుకున్న తర్వాత గ్రామాలు ఏర్పడ్డాయి. ఈ గ్రామాలు ఏర్పడిన తర్వాత బౌద్ధం క్రమంగా కనుమరుగు కావడం ప్రారంభమయింది. అప్పటికే బ్రాహ్మణమతం మాంసాన్ని నిషేధం చేసుకుంది. చెన్నై ప్రాంతంగా ఇక్కడ ఉత్పత్తులు విదేశాలకు వెళ్లినట్లు, విదేశీ వర్తకులు చిత్తూరు జిల్లా ప్రాంతంలో కొత్త పట్టణాలను సరుకుల మార్కెట్ రీత్యా ఏర్పర్చినట్టు శాసనాలు వున్నాయి. ఆటవికులు వర్తకులతో వస్తుమార్పిడి ద్వారా వ్యాపారం చేయడం వల్ల ఆటవికుల్లోను వర్గవిభజన ఏర్పడింది. బౌద్ధారామాలు వర్తకులకు బ్యాంకులుగా ఉపయోగపడ్డాయి. ఈ బ్యాంకులు ఆటవిక ఉత్పత్తులకు మార్కెట్ ను కల్పించాయి. తిరుమలలోని అటవీ ఉత్పత్తులు తమిళనాడు ప్రాంతానికి చేరేవిధంగా క్రీ.శ. 11వ శతాబ్దములో ఏర్పాట్లు వున్నట్లు శాసనాలు చెపుతున్నాయి. వ్యవసాయక సమాజానికి కావలసిన జ్ఞానాన్ని బౌద్ధ భిక్షువులు అందిస్తే, ఆ సమాజాన్ని ముందుకు తీసుకువెళడానికి బ్రాహ్మణమతం తోడ్పడింది. ఈ రెండు మతాలు వర్గవిభజనను మరింత పెంచాయి. వృత్తులలో నైపుణ్యం గల వాళ్లు కొన్ని సంఘాలుగా ఏర్పడినట్టు శ్రీకాళహస్తి శాసనాలలో తెలుస్తోంది. అంటే స్వయం పోషక గ్రామాలు అప్పటికి ఇంకా ఏర్పడలేదని చెప్పవచ్చు.

రాజ్యాల మధ్య తరచూ సంపద కోసం యుద్ధాలు రావడం, యుద్ధాల కోసం ప్రజల దగ్గర పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేయడం రివాజుగా మారిపోయింది. పెద్ద సామ్రాజ్యాలు సైతం ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడాయి. ఈ నేపధ్యంలో దీనికి పరష్కారంగా స్వయం పోషక గ్రామాలు ఏర్పడినట్టు చరిత్రకారులు భావిస్తున్నారు. వృత్తినైపుణ్యం వున్నవారు వివిధ శ్రేణులుగా ఏర్పడ్డారు. ఈ శ్రేణులు వస్తువులను మార్కెట్ చేయడానికి ఏర్పడ్డాయి. తర్వాతి క్రమంలో ఆ వస్తువులను వారే తయారుచేయడం మొదలుపెట్టారు. ఇది కులాలుగా అవతరించిందనే అభిప్రాయం చరిత్రకారులకు వుంది. జిల్లాలో శెట్టిబైలజ, గాజులబలిజ కులాలు వీటికి ప్రత్యక్ష ఉదాహరణలు. శూద్రవర్ణంలోకి పెద్దఎత్తున శ్రేణులు తమకున్న వృత్తి నైపుణ్యం రీత్యానే కులాలుగా చేరిపోయాయి. స్థిరవ్యవసాయం గ్రామాలలోని వ్యవసాయ అనుబంధ వృత్తికులాలను తనలో యిముడ్చుకుంది. ఈ గ్రామాలను నడపడానికి కావలసిన నిర్మాణాన్ని వైదికమతం అందించింది. స్వయం పోషక గ్రామాలు వర్తకవ్యాపారంలో మార్పులను తీసుకొచ్చింది. వర్తకకేంద్రాలుగా వున్న బౌద్ధ ఆరామాలు ఇక వ్యాపార కేంద్రాలుగా వుండలేకపోయాయి. బౌద్ధ ఆరామాల పోషణకు రాజులు, వ్యాపారశ్రేణులు దానాలు ఇవ్వడం ఆపివేశారు. క్రీ.శ. 2 వశతాబ్దంలో నాగార్జునుడు కృష్ణానది ఒడ్డున జీవించడానికి ముందరే, బౌద్ధం రెండుగా చీలిపోయింది. పూర్తిగా ప్రచారానికే బౌద్ధ సూత్రాలు పరిమితమయినాయి. వర్ణవ్యవస్థ కేంద్రంగా శ్రమదోపిడీని వైదిక మతం మరింత ఎక్కువ చేయగలిగింది. గ్రామాలలోని అదనపు ఉత్పత్తిని పూర్తిగా శూద్రులు, క్రిందికులాలు మాత్రమే ఉత్పత్తి చేయనారంభించాయి. రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు పరాన్నభుక్కులుగా తయారయ్యారు. భూమిపై సర్వహక్కులను ఏ మాత్రం శ్రమచేయని వర్గం దక్కించుకుంది. సంపద గణాలను వృత్తి శ్రేణులుగా చేస్తే, గ్రామాలలో ఇది కులాలకు దారితీసింది. ఒకే వృత్తినైపుణ్యం వున్న శ్రేణులు ఒక గ్రామంగా ఏర్పడటం వల్ల, ఇప్పటికీ జిల్లాలో ఒకే కులానికి చెందిన గ్రామాలు వందల సంఖ్యలో వున్నాయి. గణరాజ్యం నుండే కులాలు ఆవిర్భవించాయి అనేదానికి గుర్తుగా, ఈ ప్రాంతంలోని ప్రతి కులం తనకంటూ ప్రత్యేకమైన ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తుంది. ఒక కులం కులదేవత ప్రసాదాన్ని, వేరే కులం వారు భుజించరు. గుర్రప్పను కులదైవంగా భావించేవారు పెట్టిన ప్రసాదాన్ని మునీశ్వరుడు కులదైవంగా వున్నవారు తినరు. ఇది గణాలనుండి అబ్బిన ఆచారంగా చెప్పవచ్చు. అలాగే తమవృత్తికి సంబంధించిన పనిముట్టునే సదరు కులదేవుడు ఆయుధంగా ధరించడాన్ని గమనించవచ్చు. గ్రామాలు సామంతరాజులను తయారుచేశాయి. తదనంతరకాలంలో గ్రామాలలో ఉత్పత్తిసాధనాలను చేతిలో వుంచుకున్న ఆధిపత్యకులాలు భూస్వాముల అవతారం ఎత్తారు. వర్ణవ్యవస్థను ఆధారం చేసుకున్న వైదికమతం కాలక్రమంలో సబ్బన్నకులాలకు ప్రాతినిధ్యం వహించలేకపోయింది. అట్టడగు కులాల అసహనానికి వైదికమతం గురయింది. ఇది కులాల్లోని చాలామంది వేరే మతాల్లోకి వెళ్లడానికి దోహదపడింది.

సీమలోని చిత్తూరు జిల్లాకు ఒక వైవిధ్యమైన చరిత్ర, సంస్కృతి వుంది. ఇది ఈ జిల్లాను మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే ఈ చరిత్రను చూడ నిరాకరిస్తున్న ఆధిపత్యశక్తులు ఇక్కడి ఉత్పత్తి సంబంధాలను మననంలోకి తీసుకోకుండా పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను రుద్దుతున్నారు. ఇది ఇక్కడి వైవిధ్యాన్ని, భిన్నవృత్తులను ధ్వంసం చేస్తోంది. ప్రకృతి సహజ సంపద, ఖనిజాలు, ఎర్రచందనం లాంటి లక్షల కోట్ల విలువచేసే సంపదను, కార్పొరేట్ శక్తులకు విదేశీయులకు ప్రభుత్వం కట్టబెడుతోంది. మరోవైపు అధికారపార్టీ, బ్యూరోక్రసీ, మాఫియాకు అండగా వుండి ప్రజల సంపదను దోచుకునేటట్టు చేస్తున్నాయి. 80శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడివుండటం వల్ల వ్యవసాయాన్ని, దాన్ని అనుబంధ పరిశ్రమలను ఈ జిల్లాలో ప్రభుత్వం వృద్ధి చేయడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధి పేరుతో 25 వేల ఎకరాలను సెజ్‌ల పేరిట ఇచ్చి వేసింది.ఇది నూతన రియల్ ఎస్టేట్ విధానానికి తెరలేపింది. 2.5 లక్షల ఎకరాలను భూబ్యాంకు పేరుతో పేదల దగ్గర ప్రభుత్వం తీసుకుని, కార్పొరేట్ వర్గాలకు ఇవ్వబోతుంది. ఇది జిల్లాను తీవ్రమైన ఆర్థిక, సామాజిక మార్పులకు గురిచేయబోతోంది. ఈ నేపధ్యంలో భూమి, భుక్తి, స్వంత ఇళ్ల కోసం ప్రజలు అనివార్యంగా పోరాటం చేయాల్సివస్తోంది. సరైన నాయకత్వం లేకపోవడం వల్ల ఈ పోరాటాలు వినతిపత్రాల సమర్పణకే పరిమితమౌతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here