Site icon Sanchika

సావిత్రి గారి అద్భుత నటనకు గుర్తు ‘చివరకు మిగిలేది’

[dropcap]సు[/dropcap]చిత్ర సేన్ బెంగాలీలో గొప్ప పేరున్న నటి. హీరోయిన్ ప్రాదాన్యత ఉన్నఎక్కువ సినిమాలలో నటించిన నటి కూడా ఆవిడే. ఆమె నటించిన ‘ద్వీప్ జ్వలే జాయ్’ సినిమా 1959లో బెంగాలీలో వచ్చింది. బెంగాలీలో అశుతోష్ ముఖోపాధ్యాయ్ రాసిన ‘నర్స్ మిత్ర’ అనే కథ ఆధారంగా తీసిన సినిమా ఇది. 1960లో ఇదే సినిమాను ‘చివరకు మిగిలేది’అనే పేరుతో తెలుగులో తీసారు. బెంగాలీ సినిమా అసిత్ సేన్ గారి దర్సకత్వంలో వచ్చింది. ఈ కథ నచ్చి గుత్తా రామినీడు గారు తెలుగు సినిమాకు కథ రాసుకుని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీనికి వి. పురుషోత్తం రెడ్డి గారు నిర్మాత. అశ్వత్థామ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో విజయం సాధించలేదు కాని సావిత్రి గారి అద్భుత నటనకు గుర్తుగా మిగిలిపోయింది.

తెలుగులో ఈ సినిమాలో సావిత్రి గారి నటన తప్ప ఇతరల నటుల నటన చాలా పేలవంగా ఉండడం ఈ సినిమా ప్లాప్‍కు కారణం అనుకోవచ్చు. ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ నేపథ్యంలో కథ నడుస్తుంది. పద్మ ఈ హాస్పిటల్‍లో పని చేసే ఒక నర్సు. కొత్తగా వచ్చిన డాక్టర్ పేషంట్ల మనసును ప్రేమతో మరల్చుకోవాలని వారి మనసుకు తగిలిన గాయాలని ప్రేమతో నయం చేయాలని కొన్ని కొత్త ప్రయోగాలు తమ హాస్పిటల్‌లో పేషంట్ల పైన చేయడానికి నిశ్చయించుకుంటాడు. అత్యంత ప్రతిభావంతురాలైన నర్సు పద్మ తన ప్రయోగాలకు సహయపడాలని కోరుకుంటాడు. ప్రకాశం అదే హాస్పిటల్‌లో ఒక పేషంట్. అతనికి మానసిక ధైర్యం, ఓదార్పు ఇచ్చే నర్సుగా పద్మ అతని బాధ్యత తనపై తీసుకుంటుంది. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ఒక మానసిక బంధం ఏర్పడుతుంది. పద్మ ప్రకాశాన్ని ప్రేమిస్తుంది. ప్రకాశం కూడా పద్మను ప్రేమిస్తాడు. కాని ఒక సందర్భంలో పద్మ తనపై చూపిన ప్రేమ కేవలం నర్సుగా ఆమె బాధ్యత అని తనను మామూలు మనిషిగా చేయడానికి ఆమె ఒక నర్సుగా తన పట్ల కొంత చనువు తీసుకుందని తెలిసుకుని నిరాశపడతాడు. అతనితో జీవితాన్ని ఊహిస్తున్న పద్మను ఒక దేవతగా కొలుస్తూ తనకు పునర్జీవితం ఇచ్చిన గొప్ప స్త్రీగా ఆమెను ఆరాధిస్తూ మరో వివాహానికి సిద్ధపడి ఆ హాస్పిటల్ వదిలి వెళ్ళిపోతాడు.

ప్రకాశం వెళ్ళిపోయాక పద్మ మనసు మూగబోతుంది. ఆ మానసిక గాయం ఆమెను కుదురుగా నిలవనీయదు. మళ్ళీ అంత దగ్గరగా పేషంట్లతో ఉండలేననే నిశ్చయానికి వస్తుంది. డాక్టర్‌తో కూడా తాను అతని చికిత్సా ప్రయోగాలలో పాలు పంచుకోలేనని చెబుతుంది. ప్రకాశం వదిలి వెళ్ళిన వార్డులోకే ప్రేమ విఫలం అయి పిచ్చి పట్టిన భాస్కర్ వస్తాడు. భాస్కర్ చాలా కోపంతో, కసితో రగిలిపోతూ ఉంటాడు. అతని బాధ్యత తీసుకోవడానికి నర్సులు ఎవ్వరూ ముందుకు రారు. అతని స్థితి చూసి పద్మ కరిగిపోతుంది. సహజంగానే పేషంట్ల పట్ల ఆమె చూపే బాధ్యత భాస్కర్ విషయంలోనూ ఆమె ప్రదర్శిస్తుంది. ఆమె చూపించే ప్రేమ ముందు భాస్కర్ పిల్లిలా మారిపోతాడు. అతనిలోని ఆ మార్పు చూసి డాక్టర్ భాస్కర్‌కు చికిత్స చేసే బాధ్యతను మళ్ళీ పద్మకే అప్పగిస్తాడు. అతనికి సేవ చేస్తూ అతన్ని ప్రేమిస్తూ లాలిస్తూ పద్మ తన పాత గాయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. భాస్కర్‌కు దగ్గర అవుతుంది. కాని ఈసారి కూడా భాస్కర్‍కు నయమయినాక పద్మ ప్రేమ ఆమె బాధ్యత అనే అనుకుని ఆమెను వదిలి తన కొత్త జీవితంలోకి వెళ్ళిపోతాడు. పద్మ మనసు గాయపడుతుంది. అదే వార్డులో ఆమె మరో పేషంటుగా చేరుతుంది. నేను నటించలేను, నటించడం నాకు చేత కాలేదు అంటూ ఆమె విరిగిపోయిన మనసుతో దుఃఖంతో ఆ వార్డు లోకి ప్రవేశించడం సినిమాలో వచ్చే ఆఖరి సన్నివేశం.

మానసిక రోగులతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా వారితో ప్రేమగా ఉండడం చాలా కష్టమైన పని. సున్నితమైన మనసున్న వారు ఈ పని చేయలేరు. డాక్టర్ ప్రయోగిస్తున్న కొత్త ట్రీట్మెంట్‌లో ఒక నర్సు మరొకరికి ప్రేమను అందిస్తూ మనస్ఫూర్తిగా సేవలు చేస్తూ అతన్ని అలరించాలి. కాని ఈ క్రమంలో తన మనసును నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రేమను మనస్ఫూర్తిగా ప్రదర్శించాలి, అవతలి వ్యక్తికి అది అనుభవంలోకి రావాలి. అలాగే తన మనసును తన చేతులలో ఉంచుకోవాలి. ఆ వ్యక్తితో ఒక దూరం అలవర్చుకోవాలి. ఇది చాలా కఠినమైన పని. ఈ క్రమంలో కొన్ని సార్లు ఆ పేషంట్లతో మానసిక అనుబంధం ఏర్పడే స్థితి కలుగుతుంది. అది ఆ డాక్టర్లకు నర్సులకు పెద్ద పరీక్ష. ఇక్కడ వారి మనసు వారికి కొన్ని సార్లు ఎదురు తిరుగుతుంది. అప్పుడు మళ్ళీ వారు డిప్రెషన్ లోకి వెళ్ళే సందర్భాలు అనేకం. ఇది చాలా డాక్టర్లు, మానసిక రుగ్మత ఉన్న పేషంట్లలో ఈ రోజుల్లోనే కనిపించే సమస్య. ఈ సినిమాలో పద్మ అదే బాధను అనుభవించడం గమనిస్తాం. చివర్లో ఆమె మనసు దెబ్బతిని మానసిక సమతుల్యం కోల్పోతుంది. మానసిక చికిత్స అందులో డాక్టర్ల పాత్ర పై పెద్దగా అవగాహన లేని ఆ రోజులోనే ఇంత సున్నితమైన సమస్యను ధైర్యంగా చర్చించిన సినిమా ఇది. ఈ సినిమాలో పద్మ పాత్రలో నటించినందుకు సావిత్రి గారికి రాష్ట్రపతి అవార్డు లభించింది. ప్రకాశంగా కాంతారావు, భాస్కరంగా బాలయ్య నటించారు. ఇది ప్రభాకర్ రెడ్డి గారికి మొదటి సినిమా. డాక్టర్‌గా ఆయన ఇందులో కనిపిస్తారు.

ఈ సినిమాను మళ్ళీ 1969లో ‘ఖామోషీ’ అనే పేరుతో వహిదా రెహమాన్‌తో హిందీలో తీసారు. ఈ సినిమా చేసిన తరువాత తాను సుచిత్రా సేన్, సావిత్రి గార్ల స్థాయిలో ఈ పాత్రకు న్యాయం చేయలేకపోయానని వహిదా రెహమాన్ ఒప్పుకున్నారు. సుచిత్రా సేన్ గొప్ప నటి. అయితే ఈ మూడు చిత్రాలను చూసి కొన్ని విషయాలను చర్చించుకోవాలి. బెంగాలీలో వచ్చిన సినిమాలో ఇతర పాత్రల నటులందరూ బాగా నటించారు. హేమంత్ కుమార్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఈ కారణాలతో సినిమాగా ‘ద్వీప్ జలే జాయ్’ బావుంటుంది. కాని పాత్ర పరంగా ప్రతి సీన్ మనం విశ్లేషించుకుంటూ వెళితే సావిత్రి గారి  నటన పతాక స్థాయిలో ఉంటుంది. చివర్లో మతి చలించి అదే వార్డులోకి పద్మ వెళ్ళే సీన్‌ను గమనించండి. బెంగాలీలో సుచిత్ర సేన్, హిందీలో వహీదా రెహ్మాన్, తెలుగులో సావిత్రి వీరి ముగ్గురు ఆ సీన్‌లో ప్రదర్శించిన నటనను గమనిస్తే సావిత్రి గారు ఈ ముగ్గురిలో ముందుంటారు. వహిదా రెహ్మాన్ ఆ ఇద్దరి నటీమణుల స్థాయికి దగ్గరకు కూడా రాలేదు కాబట్టి ఆవిడని వదిలేసి సుచిత్ర సేన్ సావిత్రి గార్ల నటనను విశ్లేషిస్తాం.

మతి చలించి కడుపులో సుళ్ళు తిరుగుతున్న దుఃఖాన్ని, అసహాయతను ప్రదర్శించాలి వాళ్ళు ఆ సీన్‌లో. అది చేస్తున్నప్పుడు సావిత్రి గారు తన కళ్ళతోనే కాదు ముఖంలోని ప్రతి భాగంతో బాధను చూపిస్తారు. ఆవిడ చెంపలు అదురతాయి. గడ్డం వణుకుతుంది. కళ్ళు వర్షిస్తాయి. ముక్కు అదురుతూ ఉంటుంది. వేసే ప్రతి అడుగులో నిస్సహాయత ఉంటుంది. అంత దుఃఖాన్ని, ఆవిడ ఆ కళ్ళతో పలికించిన తీరు అమోఘం. గడ్డం క్రింది భాగంలో ఆ చిన్న వణుకుతో పాటు ఆవిడ పెదవుల అదురుతుంటాయి. ఆ ఏడుపులో విషాద స్థాయి గుండె లోతుల్లోంచి చూసే వారి మనసు లోతుల్ని తాకుతుంది. ముఖ్యంగా ఈ సీన్‌లో ఆమె కళ్ళు చూపించే ఆ బేలతనం, దుఃఖం మర్చిపోలేం. ఈ సీన్ బెంగాలీలో సుచిత్ర సేన్ చేస్తున్నప్పుడు ఆమె క్రిందకి ఎక్కువ భాగం చూస్తూ ఉంటుంది. అందువలన ఆమె ముఖం పూర్తిగా కెమెరా ఎదురుగా ఉండదు. హిందీలో వహిదా రెహమాన్ చాలా వరకు కెమెరా వైపు చూడకుండా ఈ సీన్ నడిపించేసారు. సావిత్రి గారు విషయానికి వస్తే ఆవిడ ముఖం పూర్తిగా కెమెరా వైపు ఫోకస్ అయి ఉంటుంది. ఆమె కళ్ళు కెమెరాని చూడావు కాని పూర్తిగా కెమెరా అమె పైనే ఫోకస్ అయి ఉంటుంది. అమె ముఖంలో ప్రతి భావాన్ని మనం చదవవచ్చు. మధ్యలో వినిపించే బాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో సావిత్రి పెదవులపై వచ్చే ఆ చిరునవ్వులో కూడా ఎంత విషాదం దాక్కుని ఉంటుందంటే చూసేవారు ఆమెను అ పాత్రను తమ జీవితంలో మర్చిపోలేరు. ఇంతకన్నా గొప్ప ఉదాహరణ అక్కర్లేదు సావిత్రి గారు మహానటి అనడానికి.

అయితే ఈ సినిమాను ఇంత క్రిటికల్‌గా నేను చూడడానికి కారణం చాలా చాలా ఏళ్ళ క్రితం వచ్చిన అక్కినేని గారి ఇంటర్వ్యూ. ఆయనే ఆ పై సీన్లను ప్రస్తావించారు. అప్పటికే ‘చివరకు మిగిలేది’, ‘ఖామోషీ’ సినిమాలు చూసి ఉన్నాను కాని ‘ద్వీప్ జ్వలే జాయ్’ చూడలేదు. అక్కినేని గారి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. బెంగాలీ రాదు. సబ్ టైటిల్స్ లేకుండా ఆ సినిమాను ఓపిగ్గా చూడడం ఒక అనుభవం. తరువాత ఎన్నో చోట్ల ఇది ప్రస్తావించినా, ఈ విధంగా క్రిటికల్‌గా తరువాత ఒకే సినిమాలో, ఒకే పాత్రను పోషించిన ఇద్దరి నటుల నటనను విశ్లేషించడానికి ఈ సినిమా, అక్కినేని గారి ఇంటర్వ్యూ నాకు ప్రేరణగా నిలిచాయన్నది మాత్రం నిజం. ‘చివరకు మిగిలేది’లో సినిమాగా చాలా లోపాలున్నాయి. ముఖ్యంగా సావిత్రి గారు తప్ప మరే స్త్రీ నటుల నటన బావుండదు. కాంతారావు, బాలయ్య గార్ల నటన కూడా నిరాశ పరుస్తుంది. డైరక్షన్‌లో కూడా కొన్ని లోపాలు కనిపిస్తాయి. కాని ఇన్నిటి మధ్యన మెరిసే తార సావిత్రి గారొక్కరే. తెలుగు వారందరూ గర్వించవలసిన నటి ఆమె.

ఈ సినిమాలో ‘సుధవో సుహాసినీ’ అనే పాట బెంగాలీలో హేమంత్ కుమార్ గానం చేసిన పాటను పోలి ఉంటుంది. ఈ ఒక్క పాట తప్ప పెద్దగా సంగీతం అలరించదు. తెలుగులో గొప్ప ఫెర్మామెన్స్‌లను విశ్లేషించే సమయంలో కూడా మర్చిపోకూడని సినిమా ‘చివరకు మిగిలేది’.

Exit mobile version