చివరి చూపు

0
3

[dropcap]“అ[/dropcap]మ్మా, కామేశ్వరీ… కామేశ్వరీ” తలుపుతట్టి పిలిచారు నరసింహం.

“ఆ… వస్తున్నానండీ.” అంటూ బదులు పలికి తలుపు తీసింది కామేశ్వరి.

ఎదురుగా పోస్టుమాష్టరు నరసింహం.

“నీకో టెలిగ్రాం వచ్చిందమ్మా” అంటూ ఓ కవరు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు నరసింహం. కంగారుగా కవరు విప్పి, లెటరుతీసి చదివింది. ‘ఫాదర్ సీరియస్. స్టార్ట్ ఇమ్మీడియట్లీ… రామశాస్త్రి” అని వుంది.

పదిరోజుల క్రితమే తండ్రిని చూసి వచ్చింది. ఆయాసం తగ్గింది. బాగానే ఉన్నారు. మంచం మీద నుండి లేచి కుర్చీలో కూర్చుంటున్నారు. ఒక రోజుండి మర్నాడే శివపురం వచ్చేసింది కామేశ్వరి.

మూడు నెలల నుండీ దగ్గూ, ఆయాసంతో బాధపడుతున్నాడు కామేశ్వరి తండ్రి వెంకటశాస్త్రి. సంచీలో ఒక జత బట్టలు పెట్టుకుని ఇంటికి తాళం వేసి బస్టాండుకు వచ్చింది.

రాత్రి ఏడుగంటలయ్యింది. కాకినాడ వెళ్ళే ఆఖరి బస్సు వెళ్ళిపోయిందని చెప్పారు బస్టాండులో.

ఒక పావుగంట గడిచేసరికి పాలవ్యాన్ వచ్చింది. అందులో ఎక్కి కాకినాడ వచ్చింది కామేశ్వరి.

అదురుతున్న గుండెలతో కోటిపల్లి వెళ్ళే బస్సుల ప్లాట్‌ఫాం దగ్గరకు వచ్చింది. కాకినాడ నుండి కోటిపల్లి వెళ్ళే బస్సు బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. గబగబా వెళ్లి బస్సు ఎక్కింది కామేశ్వరి. వెంటనే బస్సు బయల్దేరింది. ఆ వెంటనే వర్షమూ ప్రారంభమయ్యింది.

రాత్రి ఎనిమిదిన్నరకి బస్సు కోటిపల్లి చేరింది. వర్షం తగ్గి సన్నని జల్లు పడుతోంది.

కామేశ్వరి చీర చెంగు నెత్తిమీద కప్పుకొని నడుచుకుంటూ గోదావరి రేవుకి వచ్చింది.

చిమ్మ చీకటిగా ఉంది. గోదావరి గట్టు దగ్గరున్న పాకలో స్తంభానికి వేలాడుతున్న హరికేన్ లాంతరు వెలుగులో రేవు గుమాస్తా గుర్నాధం బ్రాకెట్ డైరీ తీసి ఆరోజు ఏ నెంబరు వస్తుందా? అని దీర్ఘంగా చూస్తున్నాడు.

‘బాబూ’ అని పిలిచింది కామేశ్వరి.

డైరీ మీంచి తల పైకెత్తి ఏమిటన్నట్టు చూసాడు గుర్నాథం.

“ముక్తేశ్వరం వెళ్ళాలి. పడవ ఏమైనా వెళ్తుందా?” ఆతృతగా అడిగింది కామేశ్వరి.

“ఇప్పుడేం వెళ్ళవమ్మా. ప్రొద్దున్నే ఆరింటికి వెళ్తుంది. మొదటి పడవ. అప్పుడు రండి.” అని బ్రాకెట్ చార్టు పొడుగ్గా టేబుల్ మీద పరచుకుని నెంబర్లను, నిశితంగా పరిశీలించసాగాడు గుర్నాధం.

గుర్నాధానికి టిఫిన్ పట్టుకొని పాకలోకి వచ్చాడు గంగన్న. టిఫిన్ పొట్లం టేబుల్ మీద పెట్టి, మంచినీళ్ళ బిందెలోంచి నీళ్ళు తీసుకువచ్చి గ్లాసు నిండా పోశాడు.

“మా నాన్నగారికి ఒంట్లో బాగుండలేదని టెలిగ్రాం వచ్చింది. చాలా సీరియస్సుగా ఉందట. అర్జెంటుగా వెళ్ళాలి. కాస్త పడవ కట్టమని చెప్పండి. ఎంత డబ్బెనా ఫరవాలేదు. మిమ్మల్ని వేడుకుంటున్నాను.” రెండు చేతులూ జోడించి నమస్కరించింది కామేశ్వరి.

“వర్షం వస్తోంది. ఈ చీకట్లో ఎవరూ పడవ కట్టరమ్మా. వెళ్ళండి. ప్రొద్దున్నే రండి.” చిరాకుపడ్డాడు గుర్నాథం.

“యెల్లిపొండమ్మా” అన్నాడు గంగన్న. అతడు నోరు తెరవగానే సారా వాసన గుప్పుమంది.

చీరకొంగు ముక్కుకు అడ్డం పెట్టుకుని పాకలోంచి బయటకు వచ్చి రావిచెట్టు కింద ఉన్న చెక్క బల్లమీద కూర్చుంది కామేశ్వరి.

వర్షం సన్నగా పడుతూనే ఉంది.

పాకలోంచి నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి.

అరగంట గడిచింది.

గంగన్న పాకలోంచి బయటకు వచ్చాడు. రావిచెట్టుకింద బల్లమీద కూర్చున్న కామేశ్వరి కనిపించింది. ఆమె దగ్గరకు వచ్చాడు.

“మీరింకా యెల్లిపోనేదా. వోన పెరిగిపోద్ది. యెల్లి పొద్దున్నే రండి. నేను పడవ కడతాను.” అన్నాడు గంగన్న,

“మా నాన్నగారికి అస్సలు బాగోలేదు. ఉదయం వరకూ ఉంటే చివరి చూపు కూడా దక్కదేమో.” అంటూ భోరుమంది కామేశ్వరి.

రెండు నిముషాలయ్యాకా దుఃఖాన్ని సంబాళించుకుంది. ఎడమ చేతి వ్రేలికున్న ఉంగరాన్ని తీసి కుడిచేత్తో పట్టుకుంది.

“చూడు బాబూ! నన్ను రేవుదాటి పంపిస్తే ఈ ఉంగరం నీకు యిస్తాను. దయచూడు.” అంది కామేశ్వరి వేడికోలుగా.

గంగన్న ఆశ్చర్యపోయాడు. మనిషిని రేవు దాటించడానికి పావలా తీసుకుంటాడు. ఎవరైనా పడవ సొంతంగా కట్టించుకుంటే మూడు రూపాయలిస్తారు. అటువంటిది ఈ అమ్మ ఏకంగా ఉంగరమే యిచ్చేస్తానంటంది. పాపం, శానా కట్టంలో ఉన్నట్టుంది.

ఆలోచనలో పడ్డాడు గంగన్న.

“రేవు దాటించినా, మీరు శానాదూరం నడవాలి ఊల్లోకి యెల్లాలంటే. ఈ సీకట్లో ఎలా ఎత్తారు?” అడిగాడు గంగన్న.

“ఎలాగో అలాగా వెళ్తాను. నాకు దారి తెలుసు. మాది ముక్తేశ్వరమే. నాన్నని చూడాలి. అంతే.” స్థిరంగా అంది కామేశ్వరి.

ఆమె నిర్ణయానికి ఆశ్చర్యపోయాడు గంగన్న.

“సరే ఉండండి. నేను గుమాస్తా గారితో సెప్పివత్తాను.” అని పాకలోకి వెళ్ళాడు గంగన్న, గుర్నాథం టిఫిన్ తినేసి ఇంకా బ్రాకెట్ చార్ట్ కేసే దీర్ఘంగా చూస్తున్నాడు.

“అయ్‌గోరూ, ఆ ఆడమనిషి శానా కట్టంలో ఉంది. వాళ్ళ నాన్న చావు, బతుకుల్లో ఉన్నాడంట. చివరి చూపైనా దక్కదేమోనని శానా బాధ పడిపోతున్నాది. రేవు దాటించి పొద్దున్నే వత్తాను.” అన్నాడు గంగన్న.

“గోదావరి మంచి పోటుమీదుంది. రాత్రి సమయంలో నీకెందుకురా రిస్కు. తెల్లారకట్లే తీసుకెళ్దువుగాని. వెళ్ళకు.” అన్నాడు గుర్నాథం.

“ఫరవాలేదండీ. ఆయమ్మని సూత్తే జాలేతంది. పడవ కడతాను. ఇక్కడే పుట్టి పెరిగినాడ్ని. గోదారమ్మ నాకు తెలుసు అయ్యగారూ. తన బిడ్డలకి ఏ కట్టం రానీదు. వెళ్తాను.” అని చెప్పి పాకలోంచి బయటకు వచ్చాడు గంగన్న.

“రండమ్మ గారూ” అని కామేశ్వరిని కేకేసాడు గంగన్న.

కామేశ్వరి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఏటి గట్టు దిగి పడవ ఎక్కింది. ఆమె పడవ ఎక్కాకా గట్టుకి కట్టిన తాడు విప్పి పడవ ఎక్కి వెదురు గడతో గట్టుని పొడిచి బలంగా పడవని నెట్టాడు వెంకన్న. పడవ నెమ్మదిగా గోదావరిలో కదలసాగింది.

ఇంతలో ఉన్నట్టుండి వర్షం పెరిగి పోయింది. గంగన్న తలపాగా పూర్తిగా తడిసిపోయింది. వర్షపు చినుకులు సూదుల్లా గంగన్న మొహాన్ని తాకుతున్నాయి. ఆ పెద్ద వర్షానికి పడవ మీదున్న ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు.

వర్షానికి గాలి కూడా తోడయ్యింది. గోదావరిలో పడవ అటూ ఇటూ ఊగసాగింది. అనుకోని పరిస్థితికి గంగన్న, కామేశ్వరి ఇద్దరూ గాభరాపడ్డారు.

‘మొండి ధైర్యంతో పడవకట్టాను. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఈ అమ్మని ఎలా కాపాడగలను?’ అని గంగన్న ఆలోచిస్తే ‘రేవు దగ్గరే ఉండిపోయి, ప్రొద్దున్నే బయల్దేరవలసిందేమో! వర్షానికి ఈదురు గాలి తోడయ్యింది. అవతలి గట్టు క్షేమంగా చేరగలనా? భగవంతుడా నువ్వే దిక్కు. మా ఇద్దర్నీ కాపాడు తండ్రీ’ అని దేవుడికి మొరపెట్టుకుంది కామేశ్వరి.

గంగన్న ఎంతో శ్రమతో, చాకచక్యంగా పడవ నడిపి కామేశ్వరిని నది అవతలి గట్టుకు తీసుకు వచ్చాడు. ముందుగా గంగన్న పడవమీంచి ఒడ్డుకు గెంతి పడవలోని తాడు తీసి రాటకు కట్టేశాడు.

వర్షానికి కామేశ్వరి చీర పూర్తిగా తడిసిపోయి వంటికి అతుక్కుపోయింది. చాలా ప్రయాసపడి పడవదిగింది.

పడవ ఎక్కడానికి వచ్చేవారికోసం వేసిన తాటాకు పందిరి కింద నిలబడ్డారు గంగన్న, కామేశ్వరి.

చీర కొంగు పిండుకుని మొహం తుడుచుకుంది కామేశ్వరి.

జడివాన తగ్గి తుంపర పడసాగింది.

“నాకు చాలా ఉపకారం చేసావు. ఎంతో ధైర్యం చేసి పడవకట్టి ఈ రేవుకు తీసుకువచ్చావు. ఇదిగో నేను నీకిస్తానన్న ఉంగరం. తీసుకో బాబూ.” అని కామేశ్వరి ఉంగరం గంగన్న కివ్వబోయింది.

“వద్దు తల్లీ. నేను సొమ్ము కాసించి మీకు పడవ కట్టలేదు. మీరు కట్టంలో ఉన్నారని ఒక మడిసిగా ఆలోసించి ఇక్కడకు తీసుకొచ్చాను. మీ మాటలతో నన్ను సిన్నబుచ్చకండి.” అన్నాడు బాధగా గంగన్న.

అతని మాటలకి కామేశ్వరి ఖంగుతింది. “అయ్యయ్యో, నన్ను మన్నించయ్యా. నీవు చేసిన మేలు ఎన్నటికీ మరవలేను.” అంది కామేశ్వరి.

వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే విచిత్రంగా వాన తగ్గిపోయింది. ఆకాశంలో మబ్బులు కూడా వెళ్ళిపోయి చందమామ కనిపించాడు.

“వర్షం ఆగిపోయింది. నేను బయల్దేరతాను.” ఆనందంగా చెప్పింది కామేశ్వరి.

“పౌర్ణమి రోజులు కదమ్మా. పాములు కాళ్ళకడ్డం పడతాయి. నేను తోడు వత్తాను. మీరు ఒక్కరూ వెళ్ళడం పెమాదం” అని పందిరికి కట్టిన వెదురు కర్రలలోంచి ఒక సన్నపాటి కర్రను బయటకు లాగాడు గంగన్న.

కామేశ్వరి గోదావరి కేసి తిరిగి చీరను సగంవరకూ తీసి నీళ్ళు పిండుకుని మరలా కట్టుకుంది. అంతవరకూ గంగన్న లంకదారికేసి తిరిగి నిలబడ్డాడు.

రెండు నిముషాలు గడిచాయి.

కామేశ్వరి ఇటుకేసి తిరిగి ‘బయల్దేరదామా’ అంది.

“అలాగేనమ్మా” అని ముందుకు కదిలాడు గంగన్న.

వెన్నెలలో దారి స్పష్టంగా కనిపిస్తోంది. ముందు చేతిలో కర్రతో గంగన్న, అతని వెనకే కామేశ్వరి నడుస్తున్నారు.

తాను తిరిగి వచ్చేటప్పుడు ఇతనికి మంచి బట్టలు కొనివ్వాలి అని అనుకుంది కామేశ్వరి. “బాబూ, నీ పేరేమిటి?” ఆప్యాయంగా అడిగింది కామేశ్వరి.

“గంగన్నమ్మా” వినయంగా చెప్పాడు గంగన్న.

పావుగంట గడిచింది. నడుస్తున్న గంగన్న ఒక్కసారి ఆగిపోయాడు.

ఏమైంది? అని అడుగుదామనుకున్న కామేశ్వరికి మాట్లాడవద్దని సైగచేసాడు గంగన్న. దారిలో వీళ్ళిద్దరికీ పదడుగుల దూరంలో ఒక పెద్ద పాము భారంగా దాటుతోంది.

కొద్దిసేపటికి పాము డొంకల్లోకి వెళ్ళిపోయింది.

కామేశ్వరికి అంత పెద్దపాముని దగ్గరగా చూడడంతో భయంవేసింది. తాను ఒక్కరే బయల్దేరితే ఎంత ప్రమాదం జరిగేదో అని తలచుకోగానే భయంతో వణికి పోయింది.

పాము వెళ్ళిపోగానే గంగన్న తిరిగి నడవసాగాడు.

అతని వెనుకే కామేశ్వరి బిక్కుబిక్కుమంటూ నడవసాగింది. ఆకాశంలో చందమామ నిర్మలంగా ప్రకాశిస్తున్నాడు. పుచ్చపువ్వులా వెన్నెల కాస్తోంది.

మౌనాన్ని భగ్నం చేస్తూ గంగన్న పల్లెపదాన్ని అందుకున్నాడు. చందమామ చక్కదనాన్ని, మరదలు అందాన్ని పోలికలు తెస్తూ సాగిన ఆ పాట కామేశ్వరిని ఆకట్టుకుంది. ‘పల్లెపాటల్లో ఎంత అందమైన భావాలు దాగున్నాయి.’ అని అనుకుంది కామేశ్వరి.

గంటకు పైగా నడిచాకా గంగన్న కామేశ్వరిని వారింటి వద్ద దిగవిడిచి వెనక్కి వెళ్ళిపోయాడు.

కామేశ్వరి తండ్రి వెంకట్రామ శాస్త్రిని అరుగుమీద పడుకోబెట్టారు. ఈ రాత్రి గడవడం కష్టం అని ఆచారిగారు, శాస్త్రి గారిని చూసి సాయంత్రమే చెప్పడంతో శాస్త్రి గారిని ఇంట్లోంచి తీసుకువచ్చి అరుగుమీదకు చేర్చారు.

శాస్త్రిగారు మాట్లాడడం లేదు కానీ చూస్తున్నారు. ఆయన చూపులు వీధి గుమ్మంవైపే ఉన్నాయి. కామేశ్వరి గుమ్మం దగ్గరనుండి గబగబా వచ్చి “నాన్నా… నాన్నా…” అని పిలిచింది.

ఆ పిలుపు వినగానే శాస్త్రి గారి మొహంలో కళవచ్చింది. కళ్ళు పెద్దవి చేసుకుని కామేశ్వరి కేసి చూసారు. ఆయన చూపులో సంతోషరేఖ కనిపించీ, కనిపించనట్టు ద్యోతకమయ్యింది. కామేశ్వరికేసి చూస్తూనే ప్రాణాలు వదిలేశారు శాస్త్రిగారు. తన తల్లి పేరు చిన్న కూతురుకి పెట్టుకున్నారు. అందుకే కామేశ్వరి అంటే ఆయనకంత ప్రేమ, అనురాగం.

నాన్నా… నాన్నా… అంటూ కొడుకులూ, కూతుళ్ళూ రోదిస్తూనే ఉన్నారు. మీ పిలుపులకి బదులు పలకనని శాస్త్రిగారు శాశ్వతంగా ఈలోకం నుండి శెలవు తీసుకున్నారు.

శాస్త్రిగారికి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు.

పెద్దకొడుకు, రెండవ కొడుకూ వ్యవసాయం చేస్తున్నారు. శాస్త్రి గారికి ఇరవై ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల కొబ్బరితోట ఉన్నాయి.

మూడవ కొడుకు, నాల్గవ కొడుకు ఉపాధ్యాయులుగా అమలాపురంలో పనిచేస్తున్నారు. పెద్దకూతురు మాణిక్యాంబని విజయవాడ పేరిశాస్త్రికి యిచ్చి పెళ్ళిచేసారు. ఆయన వేద పండితుడు. చిన్నకూతురు కామేశ్వరిని శివపురం రామశాస్త్రికిచ్చి పెళ్ళిచేసారు. రామశాస్త్రి పౌరోహిత్యం చేసేవాడు. పెళ్ళైన మూడేళ్ళకే రామశాస్త్రి గుండెజబ్బుతో మరణించాడు. వాళ్ళకు పిల్లలు లేరు. కామేశ్వరి వీధి బడి నడుపుతూ, పొలం మీద వచ్చే అయివేజుతో జీవిస్తోంది.

శాస్త్రి గారి అంత్యక్రియలు గోదావరి ఒడ్డున నిర్వహించి ఇంటికి తిరిగి వచ్చారు ఆయన కొడుకులు.

“ఒరేయ్ పెద్దాడా, మీ నాన్న పుణ్యాత్ముడురా. ఏకాదశి మరణం, ద్వాదశి దహనం పుణ్యప్రదం అంటారు.” సావిట్లో కుర్చీలో కూర్చుంటూ అన్నాడు శాస్త్రి గారి బావమరిది అవధానులు.

“మరి అయితే నిన్నరాత్రి చనిపోయిన పడవవాడు గంగన్నని కూడా ఈ రోజు దహనం చేస్తున్నారుగా, వాడికి కూడా పుణ్యగతులు కలుగుతాయంటావా?” సందేహం వ్యక్తం చేసాడు నీలకంఠం.

“నిస్సందేహంగా” అన్నాడు అవధానులు.

“ఎలా కలుగుతాయి? గంగన్న ఒట్ఠి తాగుబోతు. నిన్నరాత్రి కూడా సారా త్రాగడానికి ముక్తేశ్వరం వచ్చాట్ట. తిరిగి వెళ్తూ దారిలో నల్లత్రాచుని తొక్కాట్ట. అది కాటేసింది. చచ్చాడు. తెల్లారాకా గానీ ఎవరూ చూడలేదు. నాన్నంటే ఆహితాగ్ని. దైవారాధన చేయందే పచ్చిమంచినీళ్ళు కూడా త్రాగలేదు. అటువంటి నాన్నకి, గంగన్నకి ఒకే పుణ్యం ఎలా వస్తుంది.” మేనమామని అడిగాడు సర్వేశ్వరం.

వంటింట్లో ఉన్న కామేశ్వరి గంగన్న చనిపోయాడన్న వార్త వినగానే స్థాణువులా ఉండిపోయింది. ఆమె చెవుల్లో ప్రళయ గోదావరి హోరు ప్రతిధ్వనించింది.

ఏమిటి? ఎందుకిలా జరిగింది?

తనకి మేలు చేయడానికి వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్తూ తన ప్రాణాల్నే పోగొట్టుకున్నాడా? ఎంత దారుణం?

కామేశ్వరి పరిపరివిధాల ఆలోచించసాగింది. సావిట్లో పాప, పుణ్యాల చరిత్ర గురించి అరగంటసేపు చర్చ సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటయ్యింది.

“అమ్మా, కామేశ్వరీ, వంట పూర్తయ్యిందా?” పిలిచాడు అవధానులు.

పెద్దకోడలు వచ్చి కామేశ్వరి కనిపించడం లేదని చెప్పింది. కామేశ్వరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అని సావిట్లో అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు.

నీలకంఠం కొడుకు శ్రీచరణ్ గబగబా సావిట్లోకి వచ్చాడు.

“తాతయ్యా, కామేశ్వరి అత్తయ్య గోదావరి గట్టుకు వెళోంది…” అని ఆయాస పడుతూ చెప్పాడు శ్రీ చరణ్ అవధానితో. సావిట్లో అందరూ ఒక్కసారి నిర్ఘాంతపోయారు. అవధానే ముందుగా తేరుకున్నాడు.

“అయ్యయ్యో, తండ్రి కోసం కామేశ్వరి గోదావరి కేసి వెళోందేమో, ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళడం మన ఇంటా వంటా లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను.” అని అవధాని బయటికొచ్చి సైకిల్ మీద గోదావరి గట్టు కేసి బయల్దేరాడు.

మధ్యాహ్నం రెండు గంటలవుతుండగా నీలకంఠం పెదతండ్రి కొడుకు వ్యాఘ్రిశాస్త్రి రొప్పుతూ వచ్చాడు సావిట్లోకి.

“ఒరేయ్ నీలకంఠం. మన వంశ ప్రతిష్ఠలు గోదావర్లో కలిసి పోయాయిరా. కామేశ్వరి ఆ పడవ గంగన్న గాడి చితి దగ్గర నిలబడి ఏడుస్తోందిరా. నలుగురూ నాలుగురకాలుగా అనుకుంటున్నార్రా.” అని చెప్పి కుర్చీలో కూలబడిపోయాడు వ్యాఘ్రిశాస్త్రి.

ఆయన మాటలకి ఇంట్లోని వాళ్లందరూ బొమ్మల్లా నిలబడి పోయారు. ఎవరికీ నోటమాట రాలేదు. కామేశ్వరి ఇటువంటి పని చేసిందేమిటి? ఎందుకలా చేసింది. అని ఎవరికి తోచిన విధంగా వారు అనుకోసాగారు.

కామేశ్వరిని తన కిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగి భంగపడిన దూరపు చుట్టం చక్రవర్తికి ఈ సంఘటన చాలా ఆనందం కలిగించింది.

“తండ్రి చితి దగ్గర కాకుండా గంగన్న గాడి చితి దగ్గర చేరి బాధపడుతోందంటే మనెవరికీ తెలియని గాథ ఏముందో?” అన్నాడు వ్యంగ్యంగా చక్రవర్తి.

నీలకంఠం చక్రవర్తికేసి తిరిగి “నోర్మూయ్. వెధవ మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను.” అన్నాడు కోపంగా.

“వీడు మన బంధువు కాబట్టి నోరు మూయించగలవు. కానీ లోకులు కాకుల్లాంటివారు. ఎంతమంది కారుకూతలకి ఏం సమాధానం చెప్పగలవు?” నీలకంఠాన్ని నిలదీసాడు మరో బంధువు.

బంధువర్గంలోని పెద్ద తలకాయలన్నీ ఒకచోట చేరాయి. పది నిముషాలు తీవ్రంగా చర్చించాయి. చివరికి ఓ నిర్ణయానికి వచ్చి నీలకంఠం వద్దకు చేరారు.

“నీలకంఠం నీ చెల్లెలు చేసిన పని వల్ల బంధువర్గంలో మచ్చ ఏర్పడింది. బ్రాహ్మణ్యం కూడా మంటగలిసే దుర్దశ కలిగింది. దీనికి ఒకటే పరిష్కారం కనిపిస్తోంది.” అన్నాడు నరసింహశర్మ.

“ఏమిటి?” అన్నాడు నీరసంగా నీలకంఠం.

“కామేశ్వరిని కులం నుంచి వెలివెయ్యడమే.” తాపీగా చెప్పాడు నరసింహశర్మ.

ఆమాట వినగానే నెత్తిన పిడుగు పడ్డట్లు చలించిపోయాడు నీలకంఠం. ‘తండ్రి గారాల పుత్రిక, అన్నదమ్ములందరికీ అభిమాన చెల్లెలు కామేశ్వరిని వెలివేయడమా? ఎంత ఘోరం.’ అంటూ తనలో తనే కుమిలి పోసాగాడు నీలకంఠం.

“కామేశ్వరి ఈ ఇంటికి తిరిగి వస్తే ఇల్లు అపవిత్రమవుతుంది. ఆమె ఇక్కడికి రాకుండానే మనందరి నిర్ణయం ఆమెకి చెప్పాలి. నీలకంఠం ఏమంటావు?” రెట్టించి అడిగాడు నరసింహశర్మ.

గత్యంతరం లేని పరిస్థితుల్లో ‘అంగీకారం’ తెలిపి ఒక్కసారిగా ఘొల్లుమన్నాడు నీలకంఠం. తమ్ముళ్ళు అన్నగారిని సముదాయించ సాగారు.

నరసింహశర్మ, వ్యాఘ్రిశాస్త్రి సైకిళ్ళమీద గోదావరి ఒడ్డుకి బయల్దేరారు.

గంగన్న చితి దగ్గర చాలాసేపు దుఃఖపడింది కామేశ్వరి. గంగన్న మరణానికి తానే కారణమన్న భావన ఆమె మనసులోంచి తొలగిపోవడం లేదు.

గంగన్న కొడుకు పదేళ్ళ రమణ తండ్రి చితి దగ్గర బిగ్గరగా ఏడుస్తున్నాడు.

“అయ్యా, నువ్వు లేకపోతే నేనెల్లా బతకాలి? నాకు దిక్కెవరు?” అంటూ. కామేశ్వరి వాడ్ని దగ్గరకు తీసుకుని ఓదారుస్తోంది.

సరిగ్గా ఆ సమయంలో అక్కడికి వచ్చారు నరసింహశర్మ, వ్యాఘ్రిశాస్త్రి. ఆ దృశ్యం చూడగానే వాళ్ళిద్దరికీ చాలా ఆగ్రహం కలిగింది.

కామేశ్వరి వాళ్ళని చూసి లేచి నిలబడింది.

“’వ్యాఘ్రి’ అన్నయ్యా, ఈ కుర్రాడు వాళ్ళ నాన్న గురించి బాధపడుతుంటే ఓదార్చాను. ఇంటికి వచ్చేస్తాను.” అంది.

“నువ్వు ఇంటికి రానవసరంలేదు. నువ్వు చేసిన వెధవపనికి మేం తలెత్తుకోలేకపోతున్నాం.”

“అంత తప్పు పని నేనేం చేసాను.”

“ఈ గంగన్న గాడి చితి దగ్గరకు నువ్వు రావడమే పెద్ద తప్పు.”

“అది కాదన్నయ్యా… ఇతను…”

“నువ్వు చెప్పనవసరం లేదు. మేం చెప్పేదే నువ్వు వినాలి. నిన్ను కులం నుండి, మీ కుటుంబం నుండి ‘వెలి’ వేసారు. మీ పెద్దన్నయ్యే నీకు ఈ విషయం చెప్పమని మమ్మల్ని పంపాడు. జీవితంలో మళ్ళీ ఎప్పుడూ ఈ ఊరికి రాకు. ఇట్నుంచి ఇటే వెళ్ళిపో.”

నిష్కర్షగా చెప్పి నరసింహశర్మతో కలిసి ముందుకు వెళ్ళాడు వ్యాఘ్రిశాస్త్రి.

అతని మాటలకి నోట మాట లేకుండా ఉండిపోయి వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తుండి పోయింది కామేశ్వరి.

తన ప్రాణదాతయైన గంగన్నకి నివాళి అర్పించడమే తన అపరాధమా? కులం కట్టుబాట్లు కాదన్నందుకు శిక్షా ఇది?

ఉన్నట్టుండి రమణ తండ్రి చితి దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఏడవసాగాడు. ‘అయ్యా, నాకెవరు దిక్కు?’ అంటూ.

పదేళ్ళ ఆ చిన్నారి వేదన కామేశ్వరిని కదిలించింది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చింది. రమణ దగ్గరకెళ్ళి వాడి కన్నీళ్ళు తుడిచింది.

‘బాధపడకు బాబూ? నీకు అండగా నేనున్నాను. మా ఇంటికి వెళ్లాం పద.’ అని ఆ కుర్రాడి చేయి పట్టుకుని ముందుకు నడిచింది.

కామేశ్వరి గోదావరి ఒడ్డుకు వచ్చినప్పటినుండీ జరుగుతున్న సంఘటనలు పరిశీలిస్తున్న పల్లెకారులు రమణని తీసుకుని ముందడుగు వేసిన కామేశ్వరి వెనుకే బయల్దేరారు.

రంగన్న పడవ సిద్ధం చేసాడు.

కామేశ్వరి, రమణ ఎక్కగానే పడవ కోటిపల్లి కేసి బయల్దేరింది. రేవులోని మిగతా పడవలు కూడా ఆ పడవ వెనుకే బయల్దేరాయి వారికి తోడుగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here