[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘చివరి క్షణం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]న[/dropcap]లుపు కేవలం ఓ రంగు కాదు
అది ఘనీభవించిన దుఃఖం
తెలుపూ ఒట్టి రంగు కాదు
విచ్చుకుని వికసించిన సంతోష పరిమళం
నిజానికి
సప్త వర్ణాలల్లో ఏ ఒక్కటీ
ఏదో ఒక రంగు మాత్రమే కాదు
ఒక్కో రంగూ ఒక్కో భాష మాట్లాడుతుంది
ఒక్కో భావాన్ని ప్రకటిస్తుంది
మనం
బతికే కోట్లాది క్షణాల్లో
ఏ క్షణమూ ఒంటరిది కాదు
బతుకు ఒక్క రంగునూ ప్రతిబింబించదు
ప్రతి క్షణం గతంలో
తాను గడిపేసిన క్షణాన్ని వెంటేసుకుని
రానున్న క్షణం లోకి దారి తీస్తుంది
దారీ తెన్నూ ఏ భవిష్యత్తూ లేనిది
ఒక్క చివరి క్షణమే
ఎప్పుడొస్తుందో తెలీని ఆ ఆఖరి క్షణం
తాను నడిచొచ్చిన క్షణాల్ని
చూస్తూ ఏడవకుండా
నవ్వుతూ కొవ్వొత్తిలా ఆరిపోతే
మనిషి బతుక్కి అంతకంటే ఆనందమేముంది
నలుపు తెలుపుల పరమార్థమేముంది