Site icon Sanchika

చివరి తీర్పు

[dropcap]”ని[/dropcap]రంజనం మామయ్యకు నమస్కరించి వ్రాయునది. నేను మీ మేనకోడలు శర్వాణి. హైదరాబాద్ నుంచి.

మేమంతా కులాసాగా ఉన్నాము. ఏడాది నుంచీ, అందునా మరీ ఆరు నెలల నుంచీ మా అమ్మకి నీ ఆరోగ్యం గురించిన ఆందోళనే. నీ పేరే నిత్యస్మరణ అయిపోయింది. మా నాన్నేమో ఆమెపైన రుసరుసలాడుతున్నాడు. “ఇలా నిద్రాహారాలు మానేసి ఆయన్ని గురించే అఘోరిస్తుంటే ఛస్తావే” అని తిడుతున్నాడు. అమ్మ వయస్సిప్పుడు అరవై తొమ్మిదిట. నీ వయస్సు ఏభై నాలుగని చెబుతూ వుంటుంది.

అసలు మీకేం జరిగిందో, ఆమె మీ గురించి ఎందుకంతగా ఆందోళన చెందుతున్నదో మాకు చాలా రోజులు అర్థం కాలేదు. అసలు దేశంలోని ఏ డాక్టరుకి అంతుబట్టని జబ్బు నీకెలా వచ్చింది? ఢిల్లీలో ఎయిమ్స్ వారూ, ముంబైలో జస్లోక్ వారూ, చెన్నై, హైదరాబాద్ లోని కేర్, అప్పోలో వారు కూడా చెప్పలేక పోయారుట కదా! అంతగా నిర్ణయం చేయలేని రోగం నీకెట్లా వచ్చిందో అర్థం కావటం లేదు. చిత్రంగా వుంది.

మొన్న రాత్రి నేను నా చదువు ముగించి పడుకోబోతూ, హాల్లో టీవీ ఆన్ చేసి కనబడటంతో వెళ్లి లైట్ వేశాను.

టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగేసరికి కుర్చీలో అమ్మ! నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నన్ను చూసినట్టుగా అమ్మ స్పందించలేదు.

లైటు వేసి, టీవీ ఆపిన సంగతి కూడా ఆమెకి తెలియలేదు. దగ్గరికి వెళ్లి కదిలించాను. ఉలిక్కిపడి చూసింది. కళ్లనిండా నీళ్లతో, మొహమంతా పీక్కుపోయి వుంది. ‘ఏమిటమ్మా?’ అంటే – దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోయింది. నా చెయ్యి పట్టుకుని తన ఒడిలోకి లాక్కుని ఏడుపు మొదలెట్టింది. నేను తల్లినై అమ్మని సముదాయించాల్సి వచ్చింది. చాలా సేపటి తర్వాత – సంబాళించుకుంది.

నేను వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చాను. తాగి లేచి వెళ్లి సోఫాలో కూచుంది. నేనూ వెళ్లి ఎదురుగా కూర్చున్నాను.

అప్పుడు చెప్పుకొచ్చింది. అదంతా నీకు ఆమె మీద గల ప్రేమ, అనురాగాల చిత్రణ!

ఇంటి వెనుక చెట్లమీద కెక్కి కోతికొమ్మచ్చులాటలూ, ఇంటిముందు తొక్కుడుబిళ్లలూ, వసారాలో అచ్చనగాయలూ-ఆడుకోవటం, రాలిన నేరేడుపండ్లను ఏరుకోవటంలో గిల్లికజ్జా దగ్గర నుంచీ-చందమామ, ఆంధ్రపత్రిక వస్తే నాకు ముందంటే నాకు ముందని కొట్టుకుని ఏడ్చుకోవటం వరకూ చెప్పుకొచ్చింది. కొంచెం ఎదిగాక డాబామీద వెన్నెల్లో పుష్పవిలాపాలూ మొదలైనవి పాడుకోవటం-ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాల్ని తునకలుగా, తుంపరలుగా చెప్పింది.

ఆమెకు అమ్మవారు పోస్తే నువ్వు పొక్కులమీద నవనీతం పూసీ, అరచేతిలో పెరుగన్నం ముద్దలు పెట్టీ, వేపమండలతో లాలనగా వీచీ-చేసిన సేవల్ని గురించి చెప్తున్నప్పుడు ఆమె కంఠం రుద్దమైతే-వింటున్న నా గొంతు మూగబోయింది.

ఎప్పటికో తెప్పరిల్లి చెంగుతో కళైత్తుకుని, నావైపు చూస్తూ -వాడు ఎప్పుడు ఆటల్లో ఓడిపోయినా-కినుకుతో ‘ఇట్లాగైతే నీకు ఏడుగురు ఆడపిల్లలు ఖాయంగా పుడతారు’ అని ఉడుక్కునేవాడు. తనకు నవ్వొచ్చేదంటూ నవ్వింది.

నీ నోటిమాట నిజం కాలేదు మామయ్యా! అమ్మకు నేనొక్కదాన్నే కూతుర్ని, నీలాంటి అన్నా లేడు, తమ్ముడూ లేడు. అమ్మలాంటి అక్కచెల్లెళ్లూ లేరు.

అది సరే… అంత గాఢమైన ప్రేమానురాగాల బంధం-రవ్వంత తేడా వస్తే-శాశ్వతంగా తెగిపోవటమేమిటి మామయ్యా! నాకైతే వింతగానే వుంది.

అసలు మీ మధ్య ఉన్న అఖాతాన్ని గురించీ-నాకు రాత్రి అమ్మ మాటల్లోనే తెలిసింది.

పల్లెటూరులో పెరిగిన మనుషుల మధ్య మనసులు ఎంతో నిష్కల్మషంగా ఉంటాయనీ, అక్కడి వాతావరణమంతా ఎంతో ప్రశాంతత నిస్తుందనీ-నా భావన, మీ సంగతి విన్న తర్వాత అది అపోహ అని అర్థమైంది. చిన్న చిన్న తగాదాలూ, పట్టింపులతో చితికి పోయిన జీవితాలు అక్కడే ఎక్కువేమో-అని అనిపిస్తోందిప్పుడు.

అంతేకాదు-అతిచిన్న విషయానికే ఇతరుల జీవితాల్ని దుఃఖమయం చేసే మూర్ఖులూ ఎక్కువగానే ఉంటారనీ అర్థమైంది!

మా అమ్మ కోరిన కోరిక నీ దృష్టిలో ఎంతో తప్పు పనయిపోయింది. కానీ, నిలకడమీద ఆలోచిస్తే-అదేమీ నేరమూ కాదు, పాపమూ కాదు. కేవలం నీ ఆప్తమిత్రుడిని పెళ్లి చేసుకుంటాననటమేనట కదా!

చెప్పిందిలే-అది వీల్లేదని నువ్ చాలా వీరంగం చేశావుట… చివరికి అతడినే చేసుకుంటే ఇంట్లోంచి వెళ్లిపోవాల్సిందేనని పట్టుపట్టావటకదా! నీకు నచ్చజెప్పబోయిన అమ్మమ్మా, తాతయ్యా-వాళ్లని కూడా నువ్వు నెట్టేశావుట.

అవును. ధైర్యంగా అడుగుముందుకేసే ఆడపిల్లని ఎప్పుడైనా ఏ మగాడైనా హర్షించాడా! పోనీ, నీ వ్యతిరేకతకి కారణమేమిటో కూడా చెప్పనే లేదటకదా నువ్వు! చిత్రమైన మనస్తత్వం. పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని అమ్మ ఖచ్చితంగా చెప్పడంతో మళ్లీ జీవితంలో ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదని బయటికి గెంటేశావుట నువ్వు. ఆ దిగులుతోనే అమ్మమ్మా, తాతయ్యా ఇద్దరూ శాశ్వతంగా పైకి వెళ్లిపోయారని అమ్మ ఎంతో బాధపడ్తూ చెప్పింది.

నీకు తెలిసినా కారణం చెప్పకుండా పెళ్లివద్దన్నావు కదా నువ్వు. ఆ కారణం అమ్మకి మానాన్న ద్వారానే తెలిసిందిట.

‘అది జన్మతః నాన్నకి-గుండె కుడివైపు వుండటమేనట. మా నాన్న ఇప్పటికీ గుండులాగానే వున్నాడు. ఆరోగ్యంగానే వున్నాడు.

ఇన్ని విషయాలు చెప్పిన అమ్మ మరోమాటనీ అన్నది. ‘వాడికి తనంత సంపన్నుడు బంధువర్గంలో మరొకడుండకూడదనే పట్టుదల కూడా వుండేది’ అని.

చివరికి నీ పట్టుదలతో మా అమ్మని ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపి, అన్ని బంధాల్నీ తెంచేసుకోగలిగావు. గ్రేట్ మామయ్యా!

డబ్బు సంపాదనకోసం పల్లెలోని ఆస్తినంతా అమ్మేసుకుని పట్నం చేరి-బిజినెస్‌లో కోట్లు కోట్లు సంపాదించావట కదా! ఆ వ్యవహారాల్లో చాలా సమస్యలూ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట కదూ!

ఇంతకీ మా అమ్మ ఆవేదన నీ ఆరోగ్యం గురించే కదా!

ఇంత విశదంగా నీ ‘మనసుబొమ్మ’ని తెలుసుకున్న తర్వాత, నీకు ఒక ఉత్తరం రాయాలనిపించింది.

ఈ మధ్య అమ్మ విజయవాడ పెళ్లికి వెళ్లింది. అక్కడ నీ పాతమిత్రుడు పురుషోత్తం గారుట. అమ్మని గుర్తుపట్టి పలకరించాడట. అప్పుడు మాటల సందర్భంలో నీ ప్రసక్తి వచ్చి నీ వివరాలన్నీ చెప్పాడుట. అమ్మ నీ అడ్రస్ కూడా రాయించుకొచ్చింది. రాత్రి నీ గురించి – అమ్మమాటలు విన్న తరువాత – అమ్మ నీ అడ్రస్ ఎక్కడ పెట్టిందా – అని వెతికి తీసుకుని ఈ ఉత్తరం కూడా అమ్మకు తెలియకుండా వ్రాస్తున్నాను.

ఇప్పుడు-నీ జబ్బుకు నేను మందు చెబుతున్నాను. అత్తయ్య ఎప్పుడో చనిపోయిందిట. నీ పెళ్లికి అమ్మను పిలవలేదు. కనుక అమ్మకు అత్తయ్య అసలు తెలీదు. ఇప్పుడు ఆవిడ లేదు. నీకు పిల్లలు కూడా లేరు. ఒంటరి వాడివి. సంపద కోట్లల్లో వుంది మరి. ఒక పని చెయ్యి. ఉన్న సంపదనంతా సమాజపరం చెయ్యి. ధర్మకార్యాలకి వినియోగించు. ఆ తర్వాత హాయిగా మా ఇంటికి రా… లేదా ఏ ఆశ్రమంలోనో కూచుని కృష్ణా రామా అనుకో! అవును… ఇది ‘టెస్టెడ్ & ఫ్రూవ్డ్’ చికిత్స!

కావాలంటే రాక్ ఫెల్లర్ జీవిత చరిత్ర చదువు!

నెల తిరిగేసరికి నీ జబ్బు నయమౌతుంది. అప్పుడు నువ్వు తప్పకుండా నాకు థ్యాంక్స్ చెబుతావు!

ఒక్కమాట. మా ఇంటికి వస్తే మాత్రం నీ చెల్లెలికి కానుకలేమీ తీసుకురాకు. ఎందుకంటే, నీ ఆరోగ్యమే ఆమె మహద్భాగ్యం కదా! ఉంటాను. శర్వాణి!!!

Exit mobile version