[డా. సి. భవానీదేవి గారి ‘చివరి వలస’ కథాసంపుటిపై సమీక్ష అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]క[/dropcap]థా, నవలా రచయిత్రి డా. సి. భవానీదేవి గారు తమ సాహితీ స్వర్ణోత్సవాల సందర్భంగా వెలువరించిన కథాసంపుటి ‘చివరి వలస’. “ఈ కథలన్నీ నా చుట్టూ ఉన్న సమాజంలో వివిధ సందర్భాలలో మానవ మనస్తత్వం, పరిస్థితులు, బలహీనతలు.. అంశాలుగా రాసినవి” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు రచయిత్రి.
ఇవి ప్రధానంగా కుటుంబ కథలు. అనుబంధాలలో చోటు చేసుకుంటున్న మార్పులు, ఆర్థిక సమస్యలతో విచ్ఛిన్నమవుతున్న బంధాలు, క్షీణిస్తున్న మానవత్వం తదితర అంశాలను స్పృశిస్తూ సాగుతాయీ కథలు.
~
భార్య చనిపోతే, కూతురు మాధవికి తల్లి కోసం మరో వివాహం చేసుకుంటాడు రామ్మూర్తి. రెండవ భార్యగా వచ్చిన సుభద్ర తొలినాళ్ళ నుంచే మాధవి పట్ల అకారణ ద్వేషం పెంచుకుని, ఆ పిల్లని అమ్మమ్మ ఇంటికి పంపేస్తుంది. అమ్మమ్మ ఇంట్లో చదువుకుని పెద్దదయ్యాకా, అమ్మమ్మ చనిపోతే, మాధవిని చూసుకోలేని మేనమామ తండ్రి వద్ద దింపి వెళ్ళిపోతాడు. ఇక మాధవికి మళ్ళీ సమస్యలు మొదలు. ఇన్ని సమస్యలను తట్టుకుంటూ మాధవి తండ్రి ప్రేమని తిరిగి ఎలా పొందిందో ‘రాతిలో తేమ’ కథ చెబుతుంది.
కొడుకు మీద అతి ప్రేమ పెంచుకుని కూతుర్లని నిర్లక్ష్యం చేసిన తల్లికి చివరి రోజుల్లో ఎదురైన అనుభవాలు ‘అపుత్రికస్య..’ కథలో చదువుతుంటే వేదన కలుగుతుంది. మగపిల్లాడిని అతి గారాబం చేసి – ఆడపిల్లలు, మగపిల్లలూ సమానమే అన్న వాస్తవాన్ని తెలీనీకుండా పెంచితే, పురుషాహంకారం తలకెక్కి ఈ కథలోని శివ లానే ప్రవరిస్తాడనడంతో సందేహం లేదు.
భర్త చనిపోతే దుఃఖం దిగమింగుకుని, ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది రాజేశ్వరి. ఈ క్రమంలో తానూ ప్రభుత్వోద్యోగం సంపాదించి ఆర్థికంగా స్థిరపడుతుంది. ఉద్యోగ బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను ఎంతో నిజాయితీగా నిర్వహించిన రాజేశ్వరి రిటైరయిన తరువాత జీవితాన్ని ఉత్తేజంగా, ఫలవంతంగా గడపడానికి ఏం నిర్ణయం తీసుకుందో ‘రెండో జీవితం’ కథ చెబుతుంది.
‘బతుకాట’ కథ నాణానికి రెండోవైపుని చూపిస్తుంది. తన ప్రేమ కోసం సంజన ఆడిన అమానవీయమైన ఆటకి బలైనది ఎందరో! అప్పటి దాకా తన బాస్ చాలా విశాల హృదయురాలు అనుకున్న సుజాతకి నిజం తెలిసాకా, ఎలా స్పందిస్తుందో ఈ కథ ద్వారా తెలుస్తుంది.
విధి వైపరీత్యం వల్ల కన్న కూతురికే ఆంటీ అయిన నవ్య – కళ్ళెదురుగానే కూతురు ఎదురుగానే ఉన్నా ఆమెతో అమ్మా అని పిలిపించుకోలేకపోతుంది ‘అమ్మనీడ’ కథలో. చిన్మయి మనసుకి కప్పిన పొరలు తొలగి వాస్తవం గ్రహించేసరికి ఆలస్యమైపోతుంది.
ముగ్గురక్కలకి ముద్దుల తమ్ముడిగా, వంశోద్ధారకుడిగా పుట్టిన సత్యం అంతరంగ వేదనని ఆవిష్కరిస్తుంది ‘వచ్చే జన్మలోనైనా’ కథ. మరుజన్మలో అతను ఆడపిల్లగా ఎందుకు పుట్టాలనుకున్నాడో తెలుసుకుంటే మధ్యతరగతి కుటుంబాలలోని మగపిల్లల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థమవుతుంది.
వృద్ధాప్యంలో మానసిక ఆసరాకి మరో తోడు ఎంత అవసరమో ‘తోడొకరుండిన’ కథ చెబుతుంది. కొంత నాటకీయత ఉన్నా, ఆసక్తిగా సాగుతుందీ కథ.
తెలుగు భాషని ప్రేమించే ముకుందరావుకి కార్యాలయంలో ఓ చిత్రమైన సమస్య ఎదురవుతుంది. అతనికి శత్రువులెందుకు ఎక్కువో ‘స్పర్శ’ కథలో తెలుస్తుంది. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటే ప్రయత్నమీ కథ.
ఓ కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, అత్తగారిగా అన్ని దశల్లోనూ కుటుంబ సభ్యుల స్వార్థానికి బలైపోయిన భాగ్యమ్మ – చివరి దశలో అనుభవించిన వేదన ఎవరికీ రాకూడని అనిపిస్తుంది. ‘మరణ గౌరవం’ కథ కొందరి ఆత్మీయతలు, అనుబంధాలు బూటకమని చెబుతూనే, మరికొందరి నిస్వార్థ ప్రేమని వెల్లడిస్తుంది.
‘అమ్మ పేరు’ ఆర్ద్రమయిన కథ. తప్పుదారి పడుతున్న కొడుకుని తల్లి హెచ్చరిస్తే, ఆమె వద్దన్న యువతినే పెళ్ళాడి తల్లికి నరకం చూపిన నాగులు ఏమయ్యాడు? అనాథగా ఎందుకు మిగిలాడు?
వావి వరసలు గతి తప్పుతున్న సంబంధాల నేపథ్యంలో అల్లిన ‘అవర్ణం’ కథని జీర్ణించుకోడం కష్టమే. కానీ ఆ కథలోని కొందరు వ్యక్తుల గురించి వార్తల్లో చదివిన ఉదంతాలున్నాయి. ఈ కథలో సుమతికి ఎదురైన సంఘటనలు ఎవరికీ ఎదురవకూడదనే కోరుకుంటారు పాఠకులు.
ఆత్మీయుడిలా నటిస్తూ, తనని కాటేయాలని చూసిన అంకుల్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతని చావుకి కారణమవుతుంది శాలిని. ధైర్యంగా పోలీసు స్టేషన్‍కి వెళ్ళి లొంగిపోతుంది. కోర్టులో జరిగిన దంతా స్పష్టంగా చెబుతుంది. ‘రాంగ్ టచ్’ కథ ఓ యువతి ధైర్యాన్ని, నిజాయితీని చాటుతుంది.
తన కూతురు సునీత జీవితాన్ని కాపాడుకోడానికి వరలక్ష్మి చేసిన ప్రయత్నాన్ని, సాధించిన విజయాన్ని ‘అత్తారింటికి దారేది’ కథలో చదవచ్చు. తర్వాతి కాలంలో సునీత కలెక్టర్ అయితే, చేసిన పాపాలకు ప్రతిఫలంగా సునీతని వేధించిన అత్తమామల బిచ్చగాళ్ళవుతారు. మాజీ భర్త అమెరికాలో జైల్లో పడతాడు.
ఈ పుస్తకానికి శీర్షికనిచ్చిన కథ ‘చివరి వలస’. జీవిత సత్యాలను చాటిన ఈ కథలో కొన్ని అద్భుతమైన వాక్యాలను రాశారు రచయిత్రి. అమెరికా వెళ్ళి అక్కడే ఓ ఆంగ్ల యువతిని పెళ్ళి చేసుకున్న సారథి – కరోనా కాలంలో తండ్రి చనిపోతే, రాలేకపోతాడు. కోడలు అత్తగారు సుజాతని పలకరించదు. తమది ‘బంధం లేని బంధుత్వం మరి’ అని అనుకుంటుంది సుజాత. తల్లికి కొడుకుకీ ‘మధ్యలో గిట్టనంత దూరం’ ఏర్పడిపోతుంది.
చివరి కథ ‘ఎవరో ఏదో చేస్తారని..’ తెలుగు సాహిత్య రంగంలోని కొందరి ధోరణులు, కొన్ని సాహితీ సంస్థల ‘సేవల’పై వ్యంగ్యాస్త్రం.
~
“మానవీయ విలువల పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉత్తమ సందేశాన్ని కథాగతం చేసే రచయిత్రి భవానీదేవి. మానవ సంబంధాలు మౌలికంగా నిలవాల్సి, గెలవాల్సిన, నిలిచి గెలిచి నడవాల్సిన, నీతి-నిజాయితీ, న్యాయం ధర్మం వంటి విలువల్ని కొన్ని కథల ద్వారా ప్రోది చేశారు రచయిత్రి.” అన్న శ్రీ విహారి గారి మాటలు నిజమనిపిస్తాయి ఈ కథలు చదివాకా.
ఈ కథల్లోని కొందరు స్త్రీలు తమ కష్టాలను నిశ్శబ్దంగా, పంటి బిగువన భరిస్తూ వేదనకి లోనయితే, మరి కొందరు తెగువ చూపి, బాధల అవరోధాలను అధిగమించి జీవితాన్ని తాము అనుకున్న రీతిలో గడుపుతారు. కాలక్రమంలో స్త్రీల ఆలోచనా దృక్పథంలో వచ్చిన మార్పుకి ఈ కథలు అద్దం పడతాయి.
ఈ కథల్లో మంచివాళ్ళున్నారు, చెడ్డవాళ్ళున్నారు. రచయిత్రి చూసిన యాబై ఏళ్ళ కాలంలో సమాజంలోని వ్యక్తులకు ప్రతిరూపం లాంటి పాత్రలు కనబడతాయి. ఆచారాలకీ, కట్టుబాట్లకీ, సాంప్రదాయాలకీ లొంగి జీవితాన్ని దుర్భరం చేసుకున్న వ్యక్తులున్నట్టే, అవసరమైన సందర్భాలలో పాతుకుపోయిన విశ్వాసాలను కాదని కొత్తబాటలో ప్రవేశించి జీవితాలను పండించుకున్న వ్యక్తులూ ఉన్నారు.
కుటుంబాలలో చాలా వరకు స్వార్థం మగపిల్లలదే అయినా, కొన్ని కథల్లో కూతుర్లు కూడా స్వార్థంగా ప్రవర్తించడం మనం చూస్తాం. సవతి తల్లి వేధింపులు, ఆడపిల్లలు మగ పిల్లల పెంపకంలో వివక్ష, కుటుంబ హింస, పురుషాహంకారం, లైంగిక వేధింపులు వంటి అవలక్షణాలతో పాటు చదువులో రాణించి, విద్యావంతులై తమని తాము తీర్చిదిద్దుకున్న యువతులు, భార్య మనసెరిగి ప్రవర్తించే పురుషాధిక్యతా భావం లేని మగవారు కనబడి సమాజంలో నాటి నేటి రీతులను వ్యక్తం చేస్తారు.
మన దగ్గర తెలుగుకి ఎదురవుతున్న నిరాదరణ, పరాయి దేశాల్లో లభిస్తున్న ఆదరణ; తెలుగు సాహిత్య రంగంలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ ధోరణులు సమకాలీన అంశాలుగా రెండు కథల్లో నిలుస్తాయీ సంపుటిలో.
మొత్తం మీద, ఆసక్తిగా చదివింపజేసే పుస్తకం! డా. సి. భవానీదేవి గారికి సాహితీ స్వర్ణోత్సవాల సందర్భంగా అభినందనలు.
***
చివరి వలస (కథాసంపుటి)
రచన: డా. సి. భవానీదేవి
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 152
వెల: ₹ 200
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు, విజయవాడ. ఫోన్: 0866-24366642/643, 8121098500
రచయిత్రి: 986684700
ఆన్‍లైన్‍లో
https://www.logilitelugubooks.com/book/chivari-valasa-dr-c-bhavani-devi
~
డా. సి. భవానీదేవి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-c-bhavanidevi/