Site icon Sanchika

చోళీ కే పీఛే క్యా హై????

[dropcap]సి[/dropcap]కింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు నెమ్మదిగా బయలుదేరింది. ఏసీ కంపార్టుమెంట్ కావడం వల్ల జనం కిక్కిరిసి లేరు. సగం పైగా ఖాళీగానే ఉంది.

ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం తర్వాత ఇచ్చిన సెలవుల్లో అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చారు రాజారావు, సౌభాగ్య. ఉదయం నుంచీ హైదరబాద్‌లో షాపింగ్ చేస్తూ అటూ ఇటూ తిరిగి ఇక ఇంటికి బయల్దేరారు.

నిధి కిటికీ దగ్గర కూర్చొని బయటికి చూస్తోంది. లైట్ వెలుగులో ఆమె నవ్వులు ఆ బోగీకే కళ తెస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్లో ఏదో కామెడీ సినిమా చూస్తోంది కాబోలు అనుకుంది సౌభాగ్య. ఇంతలో ఎవరో అబ్బాయి “ఇది B3 నా అండీ” అని నిధి వైపు చూస్తూ అడిగాడు.

“అవును బాబూ” అని బదులిచ్చాడు రాజారావు. ఆ అబ్బాయి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. అతను అప్పటికే రెండు మూడు సార్లు ఇదే దారిలో నడవడం చూసాడు. ఇక్కడ చెట్టంత మనిషిని తనుండగా అమ్మాయినే అడగాలని ప్రయత్నించడం రాజారావుకి నవ్వు తెప్పించింది.

ముగ్గురూ కలిసి భోంచేసారు. ఇంతలో నిధి ఫోన్‌కు నోటిఫికేషన్లు వస్తున్న చప్పుడు. ఈ టైంలో ఎవరు మెసేజ్ చేస్తారో తనకు తెలుసు. ఫోన్ సైలెంట్‌లో పెట్టింది.

భోంచేసిన తరువాత నిధి పై బెర్త్‌లో పడుకుంటాను అని చెప్పి బెడ్ షీట్ కప్పుకుని పడుకుంది.

తను షాపింగ్ చేసిన వస్తువుల సంచీని మరొక్కసారి చూసుకుని సౌభాగ్య మధ్యలో ఉన్న బెర్త్ చేరుకుంది.

ఇంతలో నిధి ఫోన్లో మెసేజ్. ఒక్కసారి ఫోటో పంపమని.

హాస్టల్లో చాలా జాగ్రత్తగా దాచుకుని వాడుతున్న ఫోన్ అది. ఇంట్లో వాళ్ళు అడిగితే అందరూ హాస్టల్లో అలా దాచిపెట్టుకుంటాం అని చెప్పింది కాబట్టి, అమ్మా నాన్నా ఏమీ అనరు. ఓసారి తన ఫోన్ అమ్మ తీసుకుని చూస్తుంటే “ఛా.. నాకు ప్రైవసీ లేదు” అని తను గట్టిగా అరిచింది. అప్పట్నుంచీ అమ్మ తన ఫోన్ ముట్టుకోదు.

“అబ్బా. ట్రైన్లో ఎలా తీస్తాను” అని ఆ మెసేజ్‌కి బదులిచ్చింది.

“హలో..”

అటు వైపు నుంచి సమాధానం లేదు.

“అలిగావా..”

“అలగరా మరి.”

“నేనేమైనా వేరే వాళ్ళను అడుగుతున్నానా. నిన్నే కదా. నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నాను” అని సమాధానం వచ్చింది.

ఇక తప్పదన్నట్టు బేబీ అని సేవ్ చేసుకున్న ఆ నెంబరుకు తన ఎద భాగం ఫోటో తీసి పంపింది.

క్లీవేజ్ కొంచెం కనిపించేలా పంపిన ఆ ఫోటోకు వచ్చిన ముద్దుల ఎమోజీలు చూస్తూ నవ్వుకుంది.

రోజూ ఫోటో పంపకపోతే పక్క క్యాంపస్‌లో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. పాపం నిద్రపోడు కూడా. మెసేజ్లు చేస్తూ తననూ నిద్రపోనివ్వడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు కదా అని తనకు తనే సర్దిచెప్పుకొని ఇలా అలవాటు చేసుకుంది. కాసేపయ్యాక నిధి ఇంకో వైపు తిరిగింది.

***

రాజారావుకి నిద్ర పట్టకపోవడంతో పక్కన ఖాళీగా ఉన్న బెర్త్ మీద కూర్చుని ఫోన్ చూస్తున్నాడు.

స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఓ అమ్మాయి ఎద భాగం దాదాపు కనిపించేలా డ్రెస్ చేసుకున్న వీడియో కనిపించింది. కిందకి స్క్రోల్ చేశాడు. మళ్లీ దాదాపు అలాంటిదే ఓ క్లిప్. ఎవరైనా చూస్తే బాగోదు అని ఫోన్ కొద్దిగా కిందికి పట్టుకుని చూడసాగాడు.

ఎప్పుడో తను కాలేజీలో ఉన్నప్పుడు చదివిన శృంగార కథలో ఓ వాక్యం గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు.

అప్పట్లో ఏదో మాసపత్రికలో వచ్చే కథల్లోని లైన్లే వారి శృంగారోద్దీపనకు మార్గం. ఇప్పటిలాగా అరచేతిలో అన్నీ ఇమిడే స్మార్ట్ ఫోన్ అప్పుడు లేదుగా. ఇప్పటి జనరేషన్‌కి అన్నీ అతిగానే దొరుకుతున్నాయి.

ఇప్పడు ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో సగం పైగా శరీర భాగాల్ని చూపించడమే పనిగా ఉంది. అసలు ఈ సోషల్ మీడియా అప్లికేషన్‌ల అల్గారిథం చాలా వరకూ ఒకేలా పని చేస్తుంది. నువ్వు ఏదైనా ఒక సంగతిని చూసినా, ఇష్టపడినా అలాంటివి వందలు, వేలు పుంఖాను పుంఖాలుగా చూపిస్తుంది. మొదట అసలు నువ్వేం ఇష్టపడ్డావో, ఎందుకు ఇష్టపడ్డావో నీకు గుర్తు లేకపోయినా అది నిన్ను సమాచార ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేస్తుంది.

రాజారావు తనలో తను ఇంకా ఆలోచించసాగాడు.

ఎన్ని సేఫ్టీ సెర్చ్ సెట్టింగ్స్ పెట్టినా అంతు లేని అడల్ట్ కంటెంట్ ఇంటర్నెట్లో ఉంటూనే ఉంటుంది కదా. మొన్నో రోజు ఆఫీస్ మెయిల్ చూస్తుండగా ఇంకో టాబ్‌లో ఏదో క్లిక్ చేసాడు. సంబంధమే లేకుండా అమ్మాయిల లోదుస్తుల ప్రకటనలు. ఖర్మ కాలి అదే సమయంలో మేనేజర్ సీసీటీవీ ద్వారా జూమ్ చేసి మరీ తనేం చేస్తున్నాడో చూసాడు. “ఏమిటయ్యా ఆఫీసు టైంలో నువ్వు చేసే పని” అంటూ చీవాట్లు పెట్టాడు. “అయ్యో సార్. నేను కావాలని క్లిక్ చేయలేదండీ. అయినా అమ్మాయిల లోదుస్తుల గురించి నాకెందుకు” అని చెప్పినా ఒప్పుకోడే.

ఎలాగోలా నచ్చజెప్పి తను బయటపడ్డాడు. అయినా ఆ మేనేజర్ ఏమీ తక్కువ తిన్నవాడు కాదు. నెల రోజుల క్రితం ఆఫీసులో పని చేసే శైలజతో ఫోటో దిగి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. వారం రోజుల తర్వాత శైలజ క్యాంటీన్‌లో ఒక్కతే కూర్చొని బాధపడుతూ కనిపించింది. కారణం ఏంటి మేడం అని అడిగితే ఈ పెద్ద మనిషి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫోటో కింద ఎవరో తొడ సంబంధం తొంభై ఏళ్ళు అని కమెంట్ వ్రాసాడట. దాన్ని డిలీట్ చేయించడానికి రోజుకు నాలుగు సార్లు ఆ మేనేజర్‌ను బతిమిలాడుతూ ఆయన తిరిగింది. రిపోర్ట్ కొట్టినా ఆ కమెంట్ తీసేయడానికి చాలా సమయం పట్టింది అని తన బాధ చెప్పుకుంది. ఇంతలో ఆ కమెంట్ చూసి ఆఫీసులో ప్రతి వెధవా తనను చూసి అదోలా పళ్ళికిలిస్తున్నారు అని చెప్పింది.

తనూ ‘జరిగిందేదో జరిగిపోయింది, ఇక బాధపడద్దులెండి’ అని చెప్పి వచ్చేసాడు. ఆ తర్వాతో రోజు రెస్ట్ రూమ్‌లో అసలు సంగతి బయటపడింది. మేనేజర్ ఎవరితోనో ఫోన్లో చెబుతుంటే విన్నాడు తను. శైలజను ఏడ్పించడానికి కావాలనే ఫేక్ అకౌంట్ పేరుతో అతడే ఆ కమెంట్ చేసాడని.

ఆ విషయం అప్పుడప్పుడూ గుర్తు చేస్తూ ఉంటే గానీ మేనేజర్ తనను లెక్క చేయడు.

“ఏంటోయ్! ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తు చేసి నన్ను ఇబ్బంది పెడుతుంటావ్” అని విసుక్కుంటూ లీవ్ లెటర్ మీద సంతకం పెడతాడు.

తను కావాలనే ఈ విషయం శైలజకి చెప్పలేదు. చెప్తే ఆ అమ్మాయి జాబ్ మానేసి వెళ్ళిపోతుంది. ఇంకో చోటైనా ఇలాంటి శాడిస్ట్ ఉండడని గ్యారెంటీ లేదు కదా.

ఇలా ఆలోచించుకుంటూ ఆ వీడియో క్లిప్ చూస్తూ ఉండిపోయాడు.

నిధి తన తండ్రి చూస్తున్న వీడియో క్లిప్ వైపు చూసి నవ్వుకుంది. అది ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్. తనెప్పుడో చూసేసింది. తనకు తానే ఎంత అడ్వాన్స్‌డ్ కదా అనుకుని మురిసిపోయింది.

ఇంతలో రాజారావు వాట్సాప్ గ్రూపులో ఒక ఫోటో వచ్చింది.

బ్యాడ్ బాయ్స్ అనే ఆ గ్రూపులో ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు, శృంగార వీడియోలు వస్తుంటాయి. తనేం అడిగి మరీ ఆ గ్రూపులో చేరలేదు కానీ, వద్దన్నా ఇలాంటి గ్రూపులు ఏర్పరచి అందులో ఏదో ఒకటి పోస్టు చేస్తూ తమ ఫాంటసీలను ఒకరి మీద ఒకరు రుద్దుకుని కమెంట్ చేసుకునే బ్యాచ్ ప్రతి ఏజ్ గ్రూప్ లోనూ ఉంటూనే ఉంటారు. మరి ఆడదాని శరీరాన్ని గురించి సామూహికంగా చర్చించడం మగాడి జన్మహక్కుల్లో ఒకటి అనే భావన అందరికీ ఉందిగా. కాలేజీకి వెళ్ళేటప్పుడు చూడ్రా ఫిగర్ ఎలా ఉందో అని నడిచి వచ్చే అమ్మాయి శరీరాన్ని వర్ణిస్తూ స్నేహితులతో చర్చిస్తాడు. ఇప్పుడు బయటికి కమెంట్ చేస్తే ఏ సమస్య వస్తుందో అని భయపడే కేటగిరీ వాళ్లకు ఈ వాట్సాప్ గ్రూపులు ఆనంద సంగమాలు.

ఇందులో తమ ఆఫీసులో పని చేసే కుర్రాళ్ళ దగ్గర నుంచీ మేనేజర్ వరకూ అందరూ ఉన్నారు. ఇలాంటి గ్రూపులు చాలా మంది లాక్ చేసి పెట్టుకుంటారు. ఎవరైనా చూస్తే, ఈ వయసులో ఇదేం బుద్ధి అంటారని భయం. అయినా కొన్నిటికి వయసుతో పనేముంది. శరీరాన్ని వస్తువులా చూసి కమెంట్ చేయడానికి వయసు కావాలా? తానెప్పుడూ కమెంట్ చేసింది లేదు. ఏదో నయననానందం అంతే. కొంత మందికి నయన హస్తానందం కూడా.

రాజారావు ఆ ఫోటో చూద్దామని దాని మీద క్లిక్ చేసాడు. అది డౌన్లోడ్ అవుతూ ఉంది.

***

సౌభాగ్యకు నిద్ర పట్టలేదు. సొంత తల్లితండ్రులు తమ ఫోన్ చూస్తే తట్టుకోలేని టీనేజర్స్ తమ శరీర భాగాల్ని చాలా సులభంగా ఫోటోల్లో, వీడియోల్లో అబ్బాయిలకి పంపడానికి వెనుకాడకుండా ఎలా రిస్క్ తీసుకుంటారో అర్థం కాకుండా ఉంది. బహుశా అదే ప్రైవసీ అనుకుని పొరబడుతున్నారో ఏమో అని వ్రాసిన వార్త ఒకటి ఆమె తన ఫోన్లో చదువుతోంది.

భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తన బాయ్ ఫ్రెండ్ అడిగాడు అని నగ్న దృశ్యాలు పంపి వాటి ద్వారా బ్లాక్‌మెయిల్ చేయబడిన అమ్మాయి గురించి సైబర్ క్రైమ్ పోలీసుల వివరణ పూర్తిగా చదివింది.

ఇంతలో ఏదో ప్రకటన వచ్చింది. ‘మీకు నేను కావాలంటే ఈ నెంబరుకు కాల్ చేయండి’ అంటూ దాదాపు ఏ ఆచ్ఛాదన లేని ఓ మగ శరీరం ఫోటో ప్రత్యక్షమయ్యింది.

సౌభాగ్య ఆలోచిస్తూ ఉంది.

‘ఖర్మ. ఖర్మ. ఈ ఇంటర్నెట్ ఉందే. ఇది సరిగ్గా వాడుకుంటేనే. లేదంటే మనకు అక్కర్లేని విషయాలన్నీ మన మెదళ్ళలో కూరి, అసలు మనకు అస్థిత్వం లేకుండా చేసి పారేస్తుంది. టీవీలో యాంకర్ కాస్త పొట్టి గౌన్ వేసుకుంటేనే సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఇలాంటి బట్టలు వేసుకుని వచ్చింది అంటూ బుగ్గలు నొక్కుకుని తిట్టుకునే మనం, అసలు పిల్లలు ఇంటర్నెట్లో ఏం చూస్తారో, ఏమేం చూడగలరో ఊహించుకుని ప్రశాంతంగా ఉండగలమా.’

ఆమె వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు.

మోహపు వ్యసనాలకు లోబడితే అంతర్జాలం ఒక పెద్ద విష వలయమే కదూ. అనుక్షణం ఏదో ఒక రూపంలో అది మన ఆలోచనలకు వల వేస్తూనే ఉంటుంది. మనమే జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని పక్కింట్లో ఉండే మామ్మగారు చెప్తూ ఉంటారు. ఇంటర్నెట్ మనిషి   సామాజిక సంబంధాల పైన ఎంత తీవ్ర పరిణామం చూపగలదో అనే అంశం పైన ఆ మామ్మగారు పరిశోధన కూడా చేస్తున్నారు. మా ఊరిలో రామలక్ష్మి గారంటే తెలీని వాళ్ళు లేరని చెప్పొచ్చు. తను మామ్మగారూ అని పిలుస్తుంది. ఆవిడకు ఎన్ని సేవా పురస్కారాలు వచ్చాయో అసలు లెక్కే లేదు. ఒకప్పుడు ఆవిడ గొప్ప రచయిత్రి అని కూడా పేరు తెచ్చుకుంది. ఆడంబరం లేని మనిషి.

ఓరోజు రోట్లో నూరిన పచ్చడేదో ఇద్దామని వాళ్ళింటికి వెళ్ళింది. అక్కడ కనిపించింది రీతూ. పక్కనే ఓ స్టూడెంట్ కూడా ఉన్నాడు.

రీతూకి ఈ మధ్యే ముప్పయ్ దాటింది. పెళ్లి మీద ఆసక్తి లేదని ఆ అమ్మాయే చెప్పిందని, కొందరు వీధిలో మాట్లాడుకోవడం తానూ వింది. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే రీతూ భావప్రాప్తి కోసం వైబ్రేటర్ వాడుతుందట. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో పంచుకున్నట్లు ఈ విషయం గురించిన అభిప్రాయం పంచుకుంది.

అది చూసిన ఆమె స్టూడెంట్ ఒకడు ‘నేనుండగా నీకు వైబ్రేటర్ ఎందుకు?’ అంటూ ఇంకొన్ని అసభ్యకరమైన మాటలు మెసేజ్ చేసాడు. రీతూ కాలేజీలో కంప్లయింట్ చేస్తే ఆ కాలేజీకి సలహాలిచ్చే కమిటీలో రామలక్ష్మి గారు ఉండడంతో ప్రిన్సిపాల్ గారు కౌన్సిలింగ్ కోసం మామ్మ గారి దగ్గరికి పంపించారు.

వాళ్ళిద్దరికీ కొన్ని విషయాలు విడిగా చెప్పి ఆవిడ పంపించేసారు.

వాళ్ళు వెళ్ళిపోయాక తను ఆశ్చర్యపోయి అడిగింది. ‘మీరు ఆ అమ్మాయిని తిడతారనుకున్నాను’ అంది.

“ఎందుకు? ఆ అమ్మాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది కాబట్టా” అని నవ్వింది మామ్మ.

“అవునండీ. తప్పొప్పులు చెప్పాల్సిన వృత్తిలో ఉండి ఇలా..” అంటూ పచ్చడి గిన్నె టేబుల్ మీద పెట్టింది.

“సరే సౌభాగ్యా. నువ్వన్నట్టే ఆ అమ్మాయి బాధ్యత కలిగిన వృత్తిలో ఉందే అనుకుందాం. అంత మాత్రాన ఆమె కోరికలను మనం కాదనలేం కదా. కాకపోతే అన్ని విషయాలూ బయటికి చెప్పినప్పుడు వాటిని అంగీకరించే సమాజం చుట్టూ ఉండకపోవచ్చు. కొన్ని మంచి చెడులు ప్రతి చోటా ఉంటాయి.

తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునేప్పుడు కొన్ని నియమాలు పాటించమని చెప్పాను. ఆ అబ్బాయికి కూడా ఎవరితో ఎంతవరకూ ఎలా ప్రవర్తించాలో చెప్పి ఇలాంటి విషయాలు మరోసారి రిపీట్ కాకూడదని వార్నింగ్ ఇచ్చాను. సరేనని వెళ్ళిపోయారు.

కాస్త వయసు రాగానే పిల్లలు మరీ ఆరింద లాగా తయారవుతున్నారు అని బయటికే అన్నాను.

వయసు కంటే ఎక్కువ ఇంటర్నెట్లో విపరీతంగా దొరికే శృంగార చిత్రాలు, సినిమా,టీవీ వినోదంలో పెరిగిన నగ్న దృశ్యాల పాళ్ళు సులభంగా చిన్నప్పటి నుంచీ వాళ్లకు దొరుకుతున్నాయి.

వాళ్ళ మెదడు మీద శృంగారం అనేది ఎలాగైనా కోరిక తీర్చుకునే శరీరాల రాపిడిలా ముద్ర పడుతోంది.

పెద్దయ్యాక వాళ్ళు అనుకున్నట్టు భాగస్వామి ప్రవర్తించకపోతే వారిలో హింసాత్మక ప్రవృత్తి పెరుగుతోంది.

ఈ విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా ఏమీ లేదు. వారు చూసిన శృంగార చిత్రాల్లో లాగా తమ జీవిత భాగస్వామి పడక గదిలో ప్రవర్తించాలి అని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అసహజమైన కోరికలు ఉన్నప్పుడు కాపురాలు ఆందోళనమయం కావడంలో ఆశ్చర్యం ఏముంది.”

మామ్మ చెప్పుకుంటూ పోతున్నారు.

“హై స్పీడ్ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక పెరిగిన ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ అడిక్షన్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మనమింకా ఈ విషయంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది” అని చెప్పారు మామ్మ.

“దీనికి వేరే పరిష్కారం లేదా?” అని అడిగింది సౌభాగ్య. తన మనసు కల్లోలంగా ఉంది. ఇప్పటి పిల్లల గురించిన అభిప్రాయం తనకు రోజు రోజుకూ మారుతూ ఉంది.

కొద్ది వరకూ స్మార్ట్ ఫోన్లో, కంప్యూటర్లో parental control సెట్టింగ్స్ వాడి మనకు హాని అనిపించే వెబ్సైట్లను పిల్లలు చూడకుండా బ్లాక్ చేయొచ్చు. కానీ సినిమా, టీవీ, వెబ్ సిరీస్ అంటూ ఎక్కడికక్కడ వయసు తేడా లేకుండా శృంగార ఉద్దీపనలు కలిగించే కంటెంట్‌తో పోరాడడం కష్టమే.

ఇవన్నీ కూడా సెక్స్ టాయ్స్ అమ్మకాలు పెంచుతాయనీ, కొన్ని కంపెనీలు కావాలనే వయసు తేడా లేకుండా ప్రజల్ని శృంగారం వైపు ప్రేరేపించేలా ఇంటర్నెట్లో కంటెంట్ సృష్టిస్తున్నాయి అనే థియరీ కూడా ఒకటుంది.

ఏది ఏమైనా శృంగారం ఒక్కటే జీవిత పరమావధి అని కాకుండా మిగతా విషయాల మీద కూడా ఆసక్తి పెంచుకుని ముందుకు వెళ్ళేలా సమాజంలో మార్పు రావాలి. అది కూడా జీవితంలో భాగమే. కానీ అదే ఆలోచన మన రోజుని తినేయకూడదు కదా.

No fap అంటూ కొంత మంది యువత శృంగార ఆలోచనల నుండి, అలవాట్ల నుండి తమను తాము దూరం పెట్టుకుని క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని ఎంచుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఎంత వరకూ ఇదొక్కటే పరిష్కారాన్ని ఇస్తుందో చూడాలి అన్నారు మామ్మగారు.

ఇంకాసేపు వింటే తనకు ఉన్న మతి పోతుంది అనుకుని ఇంటికి వచ్చేసి చన్నీళ్ళతో స్నానం చేసిన విషయం ఆమెకు జ్ఞప్తికి వచ్చింది.

నిధికి రామలక్ష్మి గారి గురించి చెప్తే అసలు పుస్తకాలు వ్రాయడం గొప్ప సంగతా అంటూ తీసి పారేస్తుంది. పొరపాటున తన ఫోన్ ఒక్కసారి ముట్టుకుంటేనే పిచ్చికుక్క కరిచినట్లు అరిచి రచ్చ రచ్చ చేసింది. ఎలాగోలా ఈ సెలవుల్లో మామ్మ గారిని నిధికి పరిచయం చేసి కాస్త మంచి విషయాలు చెప్పించి ఫోన్ వాడకం తగ్గించేలా చేయాలి అని అనుకుంది సౌభాగ్య.

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సౌభాగ్య ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి సిద్ధమైంది. ఆదిశంకరాచార్యుల వారి భజగోవిందం గురించి వ్యాఖ్యానిస్తూ ప్రవచనకర్త దేహం మీద ఉన్న మోహం వీడమని చెబుతున్నారు.

***

ఇంతలో రాజారావు ఫోన్లో ఫోటో డౌన్లోడ్ అయ్యింది. ‘ఫ్రెష్ మాల్’ అంటూ క్యాప్షన్‌తో ఉన్న ఆ ఫోటో ఓ టీనేజ్ అమ్మాయి ఎద భాగం చూపిస్తోంది. నీలం రంగు డ్రెస్ వేసుకుని ఉంది ఆ ఫోటోలో.

పరాగ్గా రాజారావు పై బెర్త్ వైపు చూసాడు. బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఫోటో అడగడంతో ఈ సారి ఫోటో తీయడానికి ఫోన్ పట్టుకుని సెల్ఫీ కెమెరా ఆన్ చేసింది నిధి.

రాజారావుకి ఒక్కసారిగా తను ఇందాక గ్రూపులో చూసిన ఫోటో గుర్తొచ్చింది. కంగారుగా నిధి వేసుకున్న డ్రెస్ రంగు చూసాడు. ఆకుపచ్చ. హమ్మయ్య అనుకున్నాడు. అయినా తన కూతురి గురించి అలా ఆలోచించినందుకు సిగ్గేసింది.

అవతల ఫోటోలో ఉన్న అమ్మాయి కూడా మనిషే కదా. ఆమెకు తెలిసే ఆమె ఫోటో ఇలా గ్రూపులో వచ్చిందా. ఏ ప్రశ్నకు ఏది జవాబు. ఇదో పెద్ద వలయం కదా. ఎవరో ఎవరికో ఫోటో పంపుతారు. అందులో అందాల ప్రదర్శన ఉంటే చూడ్డానికి ప్రతి ఒక్కరూ ఎగబడతారు. అందరం విటులమే. కాకపోతే అప్పట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి వేశ్య వాటికలకు వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు మనం ఇల్లు, స్కూలు, కాలేజీ అనే తేడా లేకుండా చేతిలో ఫోన్ పట్టుకుని ఎక్కడయినా శృంగార ఉద్దీపన పొందే ఉచిత విటులమవుతున్నాం. అందరిలో నేనూ ఒకణ్ణి కదా. ఇలా ఆలోచించగానే అసలు తాను ఎందుకు ఇంకా ఆ గ్రూపులో ఉన్నాడా అనిపించింది.

“నిధీ! ఇంకా పడుకోలేదా” అన్నాడు. నాన్న గొంతు వినగానే నిధికి గుండె దడదడలాడింది. ఎక్కడ నాన్న తను ఇలా ఫోటో పంపడం చూసాడో అని భయం హెచ్చింది. “పడుకుంటున్నా నాన్నా” అని దుప్పటి కప్పేసింది. రైలు పట్టాల శబ్దం ఆమెకు భయంకరంగా వినిపించసాగింది.

రాజారావు ఆ గ్రూపులోంచి బయటికి వచ్చేసాడు.

సౌభాగ్య కళ్ళు మూసుకుని ప్రవచనం వింటూ ఉంది.

స్త్రీ ఛాతీ భాగంలో పొడుచుకు వచ్చిన రెండు మాంసపు ముద్దలను పొందే ధ్యాస, ఆలోచనల్లో పురుషుడు ఎంత అవివేకంగా కాలమును పోగొట్టుకుంటాడో ప్రవచనంలో చెబుతున్నారు.

ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించాలని చెబుతూ పెళ్లి గురించి, మంగళ సూత్రాల గొప్పతనం గురించి వివరించారు. సౌభాగ్య తాదాత్మ్యత చెంది తన భర్త క్షేమం తలచి మంగళ సూత్రాలు కళ్ళకు అద్దుకుని, తన కూతురు భవిష్యత్తు బాగుండాలని దణ్ణం పెట్టుకుని నిద్రపోయింది.

ఆమె ఎద భాగంలో మంగళ సూత్రాలు మసక వెలుతురులోనూ తళుక్కున మెరిసాయి.

ఎవరో కొద్దిపాటి శబ్దంతో పాత హిందీ పాట వింటున్నారు.

చోళీ కే పీఛే క్యా హై..

ఎవరినీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న యతిలా రైలు వెళ్ళిపోతోంది.

Exit mobile version