ప్రాంతీయ సినిమా-4: చోలీవుడ్‌తో రాజకీయం!

    2
    3

    [box type=’note’ fontsize=’16’] “స్వర్ణ యుగంలా వెలిగిన 2000 – 2012 మధ్య కాలంలో 60 సినిమాలు నిర్మించారు. ఇవన్నీ మసాలా సినిమాలే. వాస్తవికత జోలికి వెళ్ళే సమస్యే లేదు” అంటూ చోలీవుడ్ సినీరంగపు ధోరణులను వివరిస్తున్నారు సికందర్. [/box]

    [dropcap]చో[/dropcap]లీవుడ్ సినిమా పరిశ్రమతో ఛత్తీస్‌ఘర్ ప్రభుత్వాలు విచిత్ర వైఖరి నవలంబిస్తున్నాయి. ఇక్కడ సినిమా పరిశ్రమని అభివృద్ధి చేస్తే, హీరోలు స్టార్లు అయిపోయి, రాజకీయాల్లోకి వచ్చేసి తమకే ఎసరు పెడతారని ప్రభుత్వాలు, నాయకులు సినిమా రంగం అభివృద్ధి వైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానిక ఛత్తీస్‌ఘరీ భాషలో సినిమాలు జన్మపోసుకోవడమే బాగా ఆలస్యంగా జరిగితే, ఆలస్యంగా పుట్టిన ఆ బిడ్ద మీద ప్రభుత్వాలకి ఏమాత్రం ప్రేమే లేకుండా పోయింది. ఆఖరికి 2000లో ఛత్తీస్‌ఘర్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, ఇది అవకాశంగా తీసుకుని నిర్మాతలు తమ డిమాండ్లు ముందు పెడితే, వాటిని కాంగ్రెస్, బిజేపీ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చి కూడా పట్టించుకోలేదు. చేసేది లేక అలాగే బీదల పాట్లు పడుతోంది చోలీవుడ్.

    దేశంలో మిగతా భాషల సినిమా రంగాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా, దేశానికి స్వాతంత్ర్యం కూడా లభించి దాదాపు రెండు దశాబ్దాలు గడిచిపోయాక, 1965లో తీరుబడిగా ప్రాణం పోసుకుంది తొలి ఛత్తీస్‌ఘరీ మాండలిక చలనచిత్రం ‘కహీ దేబే సందేశ్’ (సందేశాన్ని చాటుదాం).

    ఇది వెంటనే వివాదాస్పదమైంది. బ్రాహ్మణుల్లో ఒక వర్గం ఆటలు ప్రదర్శిస్తున్న మనోహర్ టాకీస్‌ని కాల్చేయ్యడానికి వీరావేశంతో బయల్దేరారు. ఆందోళన ఉధృతమైంది. బ్రాహ్మణ అమ్మాయికీ, షెడ్యూల్డ్ కులానికి చెందిన అబ్బాయికీ లంకె పెట్టి కులాంతర వివాహం మీద సినిమా తీస్తారా అని పోస్టర్లు చించేశారు. అప్పట్లో కేంద్రంలో సమాచార – ప్రసారాల శాఖా మంత్రిగా వున్న స్వర్గీయ ఇందిరా గాంధీ ఆ సినిమా చూసి అభినందిస్తే గానీ వివాదం సద్దుమణగ లేదు.

    దీని నిర్మాత, దర్శకుడు మనూ నాయక్ ఈ సినిమాకి హీరోగా సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌ని ఒప్పించారు. ఆయన షూటింగ్ ప్రారంభమవుతూండగా హిందీ సినిమా (హమారీ యాద్ ఆయేగీ )లో హీరోగా మంచి అవకాశం వచ్చిందని వెళ్ళిపోయారు. దీంతో నాటక రంగం నుంచి కాన్ మోహన్‌ని హీరోగా తీసుకున్నారు. ‘షహెర్ ఔర్ సప్నా’ అనే కేఏ అబ్బాస్ సినిమాలో నటించిన సురేఖని హీరోయిన్‌గా తీసుకున్నారు. స్వర్గీయ మహ్మద్ రఫీ చేత రెండు పాటలు పాడించుకుని నాల్గు వందల రూపాయలిచ్చారు. సినిమా నిర్మాణానికి లక్షా పాతిక వేలు ఖర్చయింది. ఇది అట్టర్ ఫ్లాపయ్యింది. అప్పులు తీర్చడానికి రెండేళ్ళు పట్టింది.

    మళ్ళీ ఆరేళ్ళ వరకూ రెండో చోలీవుడ్ సినిమా లేదు. 1971లో నిరంజన్ తివారీ ‘ఘర్ ద్వార్’ అని తీసినా అదీ ఆడలేదు. దీంతో 30 సంవత్సరాలు మళ్ళీ ఎవరూ ఛత్తీస్‌ఘరీ సినిమాల జోలికి వెళ్ళలేదు. 2000లో అనుకోని అదృష్టం పట్టింది. బస్తర్ వాస్తవ్యుడైన సతీష్ జైన్, ‘మోర్ ఛయ్యాఁ భూయిన్యా’ (భూమ్మీద నా నీడ) అనే పక్కా కమర్షియల్ తీస్తే ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. సినిమా విడుదలైన మూడో రోజు కేంద్రంలో ఎబి వాజపేయి ప్రభుత్వం ఛత్తీస్‌ఘర్ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించగానే – మన రాష్ట్రం, మన భాష అని నెత్తిన పెట్టుకుని సూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. ఇలా రాష్ట్రావతరణతో నిజమైన జన్మ పోసుకుంది చోలీవుడ్. ఇక్కడ్నించీ దశాబ్దమంతా సినిమాల నిర్మాణాలు పెరిగాయి. అయితే భాష మాత్రమే  మాండలికం, మిగతావి ఏవీ మా ఛత్తీస్‌ఘర్ నేటివిటీ గానీ, ఫ్లేవర్ గానీ కావని అంటారు ఇప్పుడు 77 ఏళ్ల మనూ నాయక్.

    పూర్తిగా కమర్షియల్స్ వైపు మళ్ళిన సినిమాల పరిస్థితి 2012 వరకూ బాగానే వుంది. ఏడాదికి 20 సినిమాలు నిర్మాణ మయ్యేవి కాస్తా, 2012 తర్వాత 10కి పడిపోయాయి. కారణం, కార్పొరేట్ రంగం రాకతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మల్టీ ప్లెక్సులుగా మారడం. వాటిలో హిందీ సినిమాల ప్రదర్శనలు జరగడం. రాజధాని రాయపూర్‌లో నైతే ప్రేక్షకులు ఛత్తీస్‌ఘర్ సినిమాల్ని వెతుక్కోవాల్సి రావడం. ఇప్పుడు రాష్ట్రంలో మిగిలినవి ఓ యాభై సింగిల్ స్క్రీన్ థియేటర్లు. పైగా స్థానికంగా ఇంకో సమస్య వుంది. ఛత్తీస్‌ఘరీ భాషని ఛత్తీస్‌ఘర్ సెంట్రల్ ప్రాంతంలోనే మాట్లాడతారు. ఇక ప్రభుత్వాలు సినిమాలు అభివృద్ధి చెంది స్టార్లు పుట్టుకు రాకూడదని ఎంత శాయశక్తులా ప్రయత్నించినా, అనూజ్ శర్మ స్టార్‌గా ఎదిగి పద్మశ్రీ కూడా అందుకున్నారు.

     

    ఈయనకూడా మహారాష్ట్రలో మరాఠీ సినిమాలే ఆడాలని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వు లిచ్చినట్టు, ఇక్కడా ఛత్తీస్‌ఘర్ సినిమాలే ఆడేట్టు ప్రభుత్వం జీవో తీయాలని చాలా ఉద్యమించారు. ఆయన మాటల్ని పెడచెవినే పెడుతున్నాయి ప్రభుత్వాలు. కార్పొరేట్ సంస్థలు ప్రవేశించి స్థానిక సినిమా పరిశ్రమని దెబ్బతీయడం ప్రభుత్వాలకి అనుకూలంగానే వుంది. పరిశ్రమ ఎదిగి స్టార్లు పుట్టుకు రాకూడదంటే, ఇప్పటికే అనూజ్ శర్మ స్టార్‌గా పుట్టుకొచ్చేశారు. ఇంకా ఆయన మాటల్ని ఎందుకు పట్టించుకుంటారు. ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్రారంభించాలనీ, సినిమా నిర్మాణాలకి సబ్సిడీలు ఇవ్వాలని కూడా అనూజ్ శర్మ డిమాండ్లు. ఎక్కడా లేని విధంగా నిర్మాతలు, దర్శకులు కాకుండా ఒక స్టార్ పోరాడ్డమన్నది ఇక్కడే చూస్తాం. ఐతే ప్రభుత్వం చోలీవుడ్ సినిమాలన్నిటి మీదా వినోదపు రద్దు చేసేసి, ఇక సంతోష పడండి పొమ్మని చేతులు దులుపుకుంది.

    2000లో సూపర్ హిట్టయిన ‘మోర్ ఛయ్యాఁ భూయిన్యా’ నిర్మాణ వ్యయం 30 లక్షలు, వసూళ్లు 2 కోట్లు. దీని తర్వాత దశాబ్ద కాలంలో తీస్తూ పోయిన మాయా, తుర రిక్షావాలా, లైలా టిప్ టాప్ – ఛైలా అంఘూటా ఛాప్ మూడూ సతీష్ జైన్ దర్శకత్వం లోనే సూపర్ హిట్టయ్యాయి. ఈ స్థానిక భాషలో ఏ కమర్షియల్ తీయాలన్నా 20 – 30 లక్షల బడ్జెట్ దాటేది కాదు. రిటర్న్స్ పదిరెట్లు వచ్చేవి. అలాటిది 2012 నుంచి కార్పొరేట్ సంస్థల పంజా దెబ్బకి ఛత్తీస్‌ఘరీ సినిమాల ఉనికికే ప్రమాదం తలెత్తింది. బాలీవుడ్ సినిమాల్లాగా తాము తీయలేరు. అలాటి సూపర్‌స్టార్స్ తమ దగ్గర లేరు.

    అయితే ఒక స్వర్ణ యుగంలా వెలిగిన 2000 – 2012 మధ్య కాలంలోనే కావాల్సిన మౌలిక సదుపాయాల్ని ఏ ప్రభుత్వ సాయం లేకుండానే సమకూర్చుకున్నారు. ఛత్తీస్‌ఘర్‌లో సినిమా తీయాలంటే రాజధాని రాయ్‌పూర్ లో అన్ని శాఖలూ వున్నాయి. కేవలం సెన్సార్ సర్టిఫికేట్ కోసమే ముంబాయి వెళ్ళాలి. ఈ స్వర్ణ యుగంలో 60 సినిమాలు నిర్మించారు. ఇవన్నీ మసాలా సినిమాలే. వాస్తవికత జోలికి వెళ్ళే సమస్యే లేదు. చత్తీస్‌ఘర్ రాష్ట్రం అధిక భాగం మావోయిస్టుల పట్టులో వున్నా, ఈ సమస్య ఫై సినిమా తీసే ధైర్యం చేయడం లేదు. ఇటు మావోయిస్టులు, అటు ప్రభుత్వం – ఎటు వైపు అవునన్నా, ఎటు వైపు కాదన్నా రెండు పైపుల నుంచీ సమస్యలు తప్పవని మిన్నకుండిపోతున్నారు. ఈ స్వర్ణ యుగంలోనే బ్లాక్ మనీ బాబులు కూడా యధావిధిగా యేతెంచి ‘కళాసేవ’ మొదలెట్టారు. నిర్మాణ వ్యయాల్ని 60 – 70 లక్షలు దాటించారు.

    ఇప్పుడు చోలీవుడ్ మనుగడ కోసం జోలె పట్టాల్సిన పరిస్థితి! కేవలం దక్షిణ రాష్ట్రాల్లో స్టార్లు రాజకీయ రంగాన్ని ఏలేస్తున్నారని, ఒక బూచిని ప్రభుత్వాలు తమకి తామే చూసుకునే ఖర్మ వల్ల!

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here