Site icon Sanchika

చూడాలని ఉంది

[dropcap]పెం[/dropcap]డ్లి సందడి ముగిసింది. ఎవరికి వారు తమ తమ గదుల్లోకి విశ్రాంతి కోసం వెళ్ళిపోయారు. సరిగ్గా అదే సమయంలో పెళ్లి మంటపానికి ఆనుకుని ఉన్న గార్డెన్‌లో ఉన్న బెంచీపై ఒక జంట ఏదో మాట్లాడుకుంటున్నారు. అతను, ఆమెకు ఏదో చెబుతున్నాడు. ఆమె అంతే ఆత్రంగా వింటోంది. ఆ నీలి వెలుతురిలో ఇద్దరు భావాలు ఒకరికి, ఒకరు అర్థం అవుతున్నాయి. చాలా సుదీర్ఘంగా సాగిన అతని ఉపన్యాసం విన్న, ఆమె అలాగే చాలాసేపు స్థాణువులాగ నిలిచిపోయింది. కాసేపు వారి ఇద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలిన తరువాత, ఆమె లేచి తన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న ఒక పింక్ కలర్ ఉన్న సీల్డ్ కవరు అందించి, అతనిని గట్టిగా కొద్ది నిమిషాలు కౌగలించుకుంది. తపనలు తీరిపోయాయో, వేదనలు కరగి పోయాయో, అతనికి జరిగింది ఏమిటో అర్థం అయ్యేలోపే, కళ్ళు తుడుచుకుంటూ అక్కడ నుండి నిష్క్రమించింది. అతనికి ఏమి చేయాలో పాలుపోని స్థితిలో అలా కాసేపు ఉండిపోయాడు. ఆమె ఇచ్చిన పింక్ కలర్ కవరు నెమ్మదిగా తెరచి వెలుతురు ఉన్న వైపు బెంచీలో కూర్చొని చదవసాగాడు. అతని కళ్ళు ఆత్రంగా అక్షరాలా వెంట పరిగెత్తాయి. కొద్దిసేపటికి కళ్ళు మసకలు కావడం మొదలయ్యాయి.

చాలా కష్టపడి ఆ ఉత్తరాన్ని చదివి నిస్సహాయంగా అక్కడే కూలబడి పోయాడు. అతని ప్రమేయం లేకుండానే అతని కళ్ళు వర్షిస్తూ ఆ మంచు కురిసిన వేళ వెన్నెల్లో చెంపల వెంట జారిపోయాయి. అక్కడ నుండి నెమ్మదిగా, వెళ్లలేక, వెళ్లలేక తన గదివైపు భారంగా అడుగులు వేసాడు.

అప్పటిదాకా ఆ సన్నివేశాన్ని పరిశీలిస్తున్న ఓ జంట కళ్ళు నెమ్మదిగా అక్కడనుండి వెళ్లిపోయాయి.

***

“నువ్వు చేసిన పని నాకు వింతగా అనిపించింది. నేను తెలుసుకోవచ్చా” అంటూ కాస్త సందేహంగాను, కాస్త మోహమాటంగాను సునందను ఉద్దేశించి అడిగింది లక్ష్మి.

“ఏమిటి వింత? ఏమి అడుగుదలుచుకున్నావ్?” అంటూ ఒకింత ఆశ్చర్యం కనపరుస్తూ సునంద.

“అడగమంటావా? ఏమీ అనుకోవు కదా?” ఇంకా సంశయంగానే అడిగింది లక్ష్మి.

“అయ్యో.. నీ దగ్గర దాపరికాలు ఏమీ లేవు. అడుగు, ఏమీ అనుకోనులే.” అంటూ సునంద.

“అదే మొన్న రాత్రి, పెళ్లి అయిన తరువాత గార్డెన్‌లో, ఏం జరిగిందో నేను చూశాను” అంటూ నెమ్మదిగా, కుతూహలంగా అడిగింది లక్ష్మి.

లక్ష్మి మాటలకు ఒక్కసారిగా సునంద ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. ఒక్క క్షణం బెదురుగా, కంగారు, ఆత్రుత కలగలిసిన భావలన్నీ ముఖంపై చూపిస్తూనే నిశ్శబ్దంగా ఉండిపోయింది.

“నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టనులే. ఎవ్వరికీ చెప్పను. నీకు ఇష్టం అయితే చెప్పు, లేకుంటే లేదు” అంటూ లక్ష్మి భరోసా ఇస్తూ సునంద భుజం తట్టింది.

నెమ్మదిగా తేరుకున్న సునంద ఒక్క పెద్ద నిట్టూర్పు విడిచి “వదిలేయి లక్ష్మి. అదో కథ. శుభం పలకకుండానే కంచికి చేరిపోయింది” అంటూ తన మనసులో భావాల్ని అదిమిపడుతూ అంది.

“నేను అడిగిన దానికి ఎంత కలవరపడ్డావో, ఆ సంగతి కదపగానే నీ ముఖంలో ఎన్ని భావాలు పలికాయో తెలుసా? ఏమీ పరవాలేదు. స్నేహితుల దగ్గర అదీ ముఖ్యంగా నమ్మదగిన వారి దగ్గర అంత దాపరికం అవసరం లేదు. చెప్పుకోవడం వల్ల నీ మనసులో ఉన్న ఆ దిగులు కొంతైనా ఉపశమనం పొందుతుంది. పరవాలేదు. మాట్లాడు. ఎవ్వరికీ చెప్పనులే. నన్ను నమ్ము” అంటూ అనునయంగా అడిగింది లక్ష్మి.

గత రెండు రోజుల నుండి తీవ్రమైన ఒత్తిడిలో, ఎంతో దిగులు దాచుకున్న సునంద ఆ మాత్రం ఆప్యాయతకు కరిగిపోయి ఒక్కసారిగా లక్ష్మి చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతం అయ్యింది, కాసేపటికి తేరుకుని ఆ రోజు రాత్రి జరిగింది చెప్పడం మొదలు పెట్టింది.

“తను.. రాకేష్.. నేను డిగ్రీ చదివే రోజుల్లో మా మామయ్య గారి ఊరిలో ఇంట్లో ఉండి చదివేదాన్ని. తనను అప్పుడే చూసాను. తనను ఇష్టపడ్డాను. ఇది జరిగి ఇప్పటికే పాతికేళ్ళ పైన అయ్యింది. కాలం కలసిరాక దూరం అయిపోయాం” అంటూ ముక్తసరిగా జవాబు ఇచ్చింది సునంద.

“అది కాదు సునంద. మంచి భర్త, చక్కటి సంసారం, ముద్దులొలికే పిల్లలు, ఉన్న నీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఏమీ లోటు లేని జీవితంలో ఉండి, మళ్లీ అతని గురించి ఆలోచించి దగ్గరకు చేరటం మంచిది కాదుగా? అసలు ఏమయ్యింది? మళ్లీ మీరు ఇలా కలుసుకోవటంలో అర్థం ఏమిటి? అంటే మీ మధ్య ఆ బంధం ఇంకా కొనసాగుతోందా? ఒకవేళ అదే అయితే ప్రమాదం, తప్పు. నీ హితురాలిగా హెచ్చరిస్తున్నాను. అయినా నీ విషయం ఏమిటో? పూర్తిగా చెప్పు. నీ గురించి తెలిసి కూడా, ఎందుకో నిన్ను అనుమానిస్తున్నానేమో.” అంటూ కంగారుగా లక్ష్మి.

“లేదు.. నేను ఏమీ తప్పు చేయలేదు. వివరంగా చెబుతాను. అంతా విన్న తరువాత నువ్వే నిర్ణయం చేసుకో” అంటూ సునంద ఆ రోజు రాత్రి జరిగిన విషయం చెప్పడానికి సిద్ధం అయ్యింది.

***

పెళ్లి అంతా సందడిగా ఉంది. లక్ష్మి, సునంద తమ స్నేహితురాలు పద్మ కొడుకు పెళ్లికి వచ్చారు. రాత్రి పెళ్లి.

మగపెళ్లి వారు కావడంతో, ఆడపెళ్ళివారు వాళ్ల బంధువులను, స్నేహితులను గుర్తించి మరీ గౌరవ మర్యాదలు చూపుతున్నారు.

అంతా చాలా కోలాహలంగా, సరదాగా సాగిపోతోంది. మగపెళ్లి వారివైపు ఉండటం వల్ల పెద్దగా పనిలేక ఆటపాటలతో గడిపేస్తున్నారు లక్ష్మీ, సునందలు.

సాయంత్రం అయ్యేటప్పటికి పెళ్లికి రావలిసిన స్థానికంగా ఉండే మిత్రులు, బంధువులు రావటం మొదలుపెట్టారు.  అలా వస్తున్న స్నేహితులను, బంధువులను పలకరిస్తూ పద్మ తీరికలేకుండా ఉంది. మధ్యమధ్యలో తమ స్నేహితురాళ్లకు చేయి ఊపుతూ సౌజ్ఞలు చేస్తోంది.

ఇంతలో పెళ్లికి వస్తున్న గుంపులో ఒకతను రావటం గమనించి సునంద గుండె ఒక్క క్షణం ఝల్లుమంది. మళ్లీ కళ్ళు నులుపుకుని మరోసారి తేరిపార చూసి ఆశ్చర్యం పోయింది. తనకు తెలియకుండానే అరచేతిలో చమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరిగింది. కనిపించిన అతనిలో ఏదో తెలిసిన పోలిక కనపడగానే ఏం చేయాలో అర్థం కాలేదు.

“తనే కదా.. అవును. తనే.. రాకేష్” అని మెల్లగా పెదవులపై అతని పేరు అప్రయత్నంగా ఉచ్చరించింది సునంద.

సరిగ్గా అదే సమయంలో రాకేష్ కూడా సునంద వైపు చూడటం, యథాలాపంగా ముందుకు వెళ్లిన వాడు, అకస్మాత్తుగా ఆగి ఆమె వైపు చూసాడు. అచ్చంగా సునంద పరిస్థితే రాకేష్‌ది కూడా.

“తను.. సునంద.. కదూ? అవును” రాకేష్ కూడా అప్రయత్నంగానే సునంద పేరు మెల్లగా ఉచ్చరించాడు.

ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఏవో తెలీని భావాలు, అనుమానాలు, అభిమానాలు ముసురుకుని మౌనంగా ఉండిపోయారు. అంతలోనే చూపు తప్పించుకుని, మళ్లీ మళ్లీ చూసుకోవడం మొదలు పెట్టారు. అలా ఒక పావుగంట గడచిన తరువాత సునంద అతనికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటుండగానే రాకేష్ కూడా లేచి సునంద వైపు అడుగులు వేసాడు.

ఇంతలో పెళ్లి మంటపంలో అల్లరి, ఈలలు కేకలు.. కాబోయే వధూవరులు రిసెప్షన్ నిమిత్తం స్టేజిపైకి వచ్చారు. ఇద్దరూ కలుద్దామనే అనుకుంటూ అక్కడి వాతావరణం చూస్తూ కొద్దీ క్షణాలు ఉండిపోయారు.

ఇంతలో రాకేష్ చొరవ తీసుకుని ముందుకు దగ్గరగా వచ్చి “మీరు.. సునంద” అంటూ తత్తరపాటుగా అడిగాడు.

సునంద ఆశ్చర్యంగా చూస్తూ “అవును. మీరు రాకేష్.. కదూ” అంటూ ఆగిపోయింది.

అంతే అక్కడ కొన్ని క్షణాలు ప్రపంచం ఆగిపోయిందన్నట్టుగా, మాటలు లేకుండా మూగ భావాలే ఎగిసాయి.

ఇద్దరి మనసుల్లో ఒక్కటే ప్రశ్న.. “ఎన్నాళ్లు అయ్యింది తనను చూసి? ఇన్నాళ్లు ఏమై పోయావు?” అని తలచుకుంటూ

“నన్ను గుర్తు పట్టావా?” అని రాకేష్ అడిగిన ప్రశ్న తనే వేసుకుంటూ సునంద ‘ఎలా మరచిపోగలను?’ అని మనసులో అనుకుంటూనే గుర్తుపట్టినట్లుగా తల ఊపింది.

ఇంతలో పెండ్లి హడావుడిలో, లక్ష్మి సునందను వెతుక్కుంటూ రావటంతో మళ్లీ కలుద్దాం అని అనుకుంటూ ఇద్దరూ వీడిపోయారు.

దూరం అయ్యారే కానీ ఇద్దరిదీ ఒక్కటే ఆలోచన ‘ఎన్నాళ్ళయింది.. కాదు ఎన్ని ఏళ్ళు అయ్యింది తనను చూసి, దేముడా! ఇన్నాళ్లకు మళ్లీ కలిసే అవకాశం ఇచ్చావా?’ అని ఏదో తెలియని ఉద్వేగంతో ఒకరినొకరు చూసుకుంటూ, ఎన్నో భావాలను మూగగా పంచుకొంటూ ఉండిపోయారు.

భోజనాల సమయంలో కూడా ఇద్దరికీ కలిసే అవకాశం రాలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తుండగానే పెళ్లి పూర్తిగా అయిపోయింది. అందరూ అక్కడ నుండి వెళ్లిపోతుండగా ఇద్దరూ ఒకరి కొకరు సైగలు చేసుకుంటూ అక్కడే పెళ్లి మంటపానికి ఉన్న గార్డెన్‌లో బెంచీ దగ్గరకు చేరుకుని కూర్చున్నారు.

కొద్దీ నిమిషాలు ఒకరికొకరు తనివితీరా చూసుకున్న తర్వాత, అక్కడి నిశ్శబ్దం ఛేదిస్తూ రాకేష్ గొంతు సవరించుకుని

“సునందా!.. బాగున్నావా? ఎన్నాళ్ళయింది? ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్, మన మధ్య పరిచయం ఏమిటో గుర్తుందా?” అంటూ ఆత్రంగా అడిగాడు.

అతని మాటలు విన్న సునంద మెల్లగా “బాగున్నాను. నేనూ అదే అడగాలని అనుకుంటున్నాను. నేను ఇంకా గుర్తున్నానా? అసలు మన మధ్య పరిచయం ఉందా? నిజం చెప్పాలి అంటే ఇవాళే మన మధ్య తొలి సంభాషణ. మన ఇద్దరం ఒకరికొకరు చూసుకుని పాతికేళ్ళ కాలం కరిగిపోయింది. నన్ను గుర్తు పెట్టుకుని అడిగినందుకు చాలా కృతజ్ఞరాలిని.” అంటూ గద్గదస్వరంతో పలికింది.

“అవును సునందా!.. మన జీవితంలో ఇదే తొలిసారిగా మాట్లాడుకోవడం. మన ఇద్దరికీ మాటల పరిచయం లేదు కానీ, మనసు పరిచయం ఉంది. అసలు ఈ జీవితానికి మళ్లీ నిన్ను చూస్తానని అనుకోలేదు. అయినా నా గురించి నువ్వు కూడా బాగా గుర్తుపెట్టుకున్నావు కదా. ఇన్నాళ్లు ఎక్కడకి వెళ్లావు. నువ్వు చదువుకునే రోజుల్లో ఒకరోజు హఠాత్తుగా ఊరు వదలి వెళ్లిపోయావ్. అప్పటి నుండి మళ్లీ ఇదే.. మళ్లీ ఆ ఊరు రావాలని అనిపించ లేదా?” అంటూ ఆత్రంగా ఆమె సమాధానం కోసం ఎదురు చూసాడు రాకేష్.

“అవును. నా డిగ్రీ చదువు మా మామయ్య ఊరిలో జరిగింది. ఒకనాడు మా నాన్నగార్కి ఆరోగ్యం బాగోలేని కారణంగా మా ఊరికి వెళ్ళిపోయాను. ఇక వెనుతిరిగి రాకుండానే అక్కడే చదువు పూర్తి చేసాను. మళ్లీ నేను ఆ ఊరికి రాలేదు, అక్కడ ఎవరు నాకోసం ఉన్నారని రావాలి? చుట్టాలు తప్ప నాకు  కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ వయసులో మన ఇష్టాలు అన్నీ మనకు భారంగానే ఉంటాయి. ఎందుకంటే అప్పటికి మనం అంతా పెద్దవాళ్లపై ఆధారపడి ఉంటాముగా.” అంటూ తన మనసులో బాధను దిగమింగుకుంటూ పలికింది సునంద.

అప్పటిదాకా నర్మగర్భంగా మాట్లాడుతున్నరాకేష్ విచలితుడయ్యి “సునందా! నిజం చెప్పు.. ఎవ్వరూ లేరా నీకు, నీకోసం. అంటే నీకేమి ఉద్దేశం లేదా? నీకోసం ఒకరు పరితపిస్తారని ఊహ కూడా రాలేదా? సరే.. ఇప్పుడైనా విను. సునందా!.. నువ్వంటే నాకు ఇష్టం.. కాదు ప్రాణం. ఎలా మొదలయ్యిందో తెలియదు నీ మీద ఇష్టం ఆ రోజుల్లో మళ్లింది. కనీసం మన మధ్య పరిచయం కూడా లేని రోజుల్లో.  కారణాలు అడగకు. ఎలా పుట్టిందో నీపైన ప్రేమ మనసంతా నిండిపోయింది. మనం ఒక క్లాసులో చదవలేదు, నీ వివరాలు పూర్తిగా తెలియలేవు. నన్ను చూసి నవ్వుతూ నువ్వు వెళ్లి పోయేదానివి. ఆ నవ్వుకోసం నేను పరితపించే వాడిని. అప్పట్లో ఇదే నా దినచర్య. అలాంటిది నువ్వు ఒక్కసారిగా కనిపించకుండా వెళ్లిపోయావు. ఎక్కడికి వెళ్లావో? ఎలా ఉన్నావో? ఎలా తెలుసుకోవాలో? నాకు అర్థం కాలేదు. ఏదో నవ్వినంత మాత్రాన ప్రేమించేయటమేనా అని అడగకు, ఒకరిని ప్రేమించడానికి ఇది అంటూ కారణం ఉండదు. అది ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది. అలా నీపై పెంచుకున్న ప్రేమ, కనీసం నీకు వ్యక్తపరచకుండానే సమాధి అయిపొయింది. ఎన్నో రాత్రులు నీగురించి పరితపించాను. నీ ఊసులు తెలియకుండా, ఎలా నిన్ను చేపట్టాలో అర్థం కాక ఒక దారుణ పరిస్థితి ఎదుర్కొన్నాను. ఇష్టపడిన వారికి,  ఇష్టపడ్డాను అని చెప్పుకోలేని అలాంటి  స్థితి ఏ ప్రేమికుడకు రాకూడదు. అప్పట్లో నాకు ఉద్యోగం ఉండేది కాదు. నిన్ను చేరాలని ప్రయత్నం చేయాలన్న, ధైర్యంగా ఎవరికైనా చెప్పి ముందుకు సాగలన్నా అర్ధబలం, అంగబలం రెండూ లేవు.

ఆ తరువాత కొన్నాళ్ళకు నాకు ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాను, అయినా నీ ఆచూకీ తెలియలేదు. కాలం మారిపోతూ నాకూ పెళ్లి అయిపోయింది. మంచి భార్య, చక్కటి సంసారం, బంగారం లాంటి పిల్లలు. ఏ బాధ లేని మంచి జీవితం. ప్రస్తుతం నాకు ఏమీ లోటు లేదు. అన్నీ అద్బుతంగా తీర్చిదిద్దినట్టు అమిరాయి. కానీ నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఉద్వేగం నా మనసులో కలిగేది. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని  తపించేది. కానీ ఎలా?  నా వైవాహిక జీవితంలో ఏ ఇబ్బందీ లేదు, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదేమో కానీ, నన్ను ప్రాణంగా చూసుకునే భార్య నా జీవితంలో అడుగుపెట్టింది. నడివయసుకు వచ్చేసాను, నిన్ను కలుస్తానన్న ఆశ రోజారోజుకి సన్నగిల్లిపోతోంది, అలాంటిది నిన్ను చూడంగానే ఈరోజు నా మనసు ఆగలేదు. ఎన్నేళ్ల నా కలో ఒక్కసారిగా వాస్తవంలో ఎదురయ్యింది. బహుశా నీ జీవితం కూడా బాగా ఉండి ఉంటుంది.

అలాంటిది ఇలా నేను ఈ వయసులో నీతో మాట్లాడటం సబబు కూడా కాదు. నా ఆలోచన నన్ను వద్దని చెబుతున్నా, నా మనసు లో గూడు కట్టుకున్న ప్రేమ నన్ను ఉండనివ్వటం లేదు. అందుకే ఆగలేక, ఇలా నీ దగ్గర  మాట్లాడాల్సి వచ్చింది. నిన్ను చూడాలని ఉంది అన్న కోరిక ఫలించిన క్షణమేమో మతి తప్పిన మనసు పిచ్చి మాటలు పలుకుతోంది. అయినా ఒక్క మాట చెప్పు. ఈ జన్మకు అది చాలు. నిజంగా నేను నీకు గుర్తు ఉన్నానా? నేనంటే నీకు ఇష్టం ఉండేదా? కనీసపు పరిచయం లేని మనకు ఈ ప్రేమలు ఏమిటి అని అంటావా?, పిచ్చి ఆలోచనలు పెట్టుకుని నా సమయాన్ని పాడుచేసుకోన్నానని అంటావా? ఏమైనా చెప్పు? నువ్వు నన్ను ఇష్టపడక  పోయినా పరవాలేదు.. నేను నిన్ను  ఇష్టపడ్డాను అది చాలు..” అంటూ ఆత్రంగా కళ్ల వెంబడి నీళ్ళు సుడులు తిరుగుతుంటే తన బాధ అంతా సునంద ముందు వెళ్లగక్కేసాడు.

ఎన్నాళ్లు అతని మనసులో దాగి అల్లరి పెట్టాయో, వెచ్చటి కన్నీళ్లు కంటికి చిల్లు పడిందేమో అన్నట్టు కారిపోతూ, ఆ వెన్నెల రాత్రిలో ముఖంపై పడుతున్న మంచును కడిగివేస్తూ అతని చెంపల వెంట జారిపోయాయి.

గుండెల్లో పేరుకుపోయిన భారం దిగిందేమో, మాటలు రొప్పుతూ ఆగిపోతే. అతని కళ్ళు, సునంద కళ్ళలోకి చూస్తూ, సమాధానం కోసం, ఏళ్ల తరబడి పెంచుకున్న ప్రేమని ఆమెపై అభిషేకం చేస్తూ తన్మయత్వంతో నిలిచిపోయాయి.

అంతా విన్న సునందకు మాటలు రావడం లేదు, ఏం చేయాలి, ఏం చెప్పాలి, అర్థం కాని పరిస్థితి. రాకేష్‌ను ఎలా సముదాయించాలి, తనను తాను నిబ్బరంగా ఎలా ఉంచుకోవాలి, ఎలాగో తెలియని సంకట స్థితి లో మళ్లీ కాసేపు వాళ్ళ ఇద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలింది.

అలా కొన్ని నిమిషాలు గడిచిన తరువాత సునంద ముఖంలో చిన్న చిరునవ్వు విరిసింది. ఏదో తెలియని ఆనందం ఆ కళ్ల వెంబడి కన్నీరు కారుస్తుండగానే ఉదయించింది. నెమ్మదిగా తన భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసి లోపల ఎక్కడో భద్రంగా ఉన్న ఒక పింక్ రంగు సీల్డ్ కవరు బయటకు తీసింది.

సునంద మాటల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న రాకేష్‌కు, సునంద చర్యలు అర్థం కాలేదు. ఆమె ముఖంలో ఆతృతగా ఆమె మాట కోసం తపన చెందుతూ ఉండగానే, సునంద లేచి ఆ కవరు రాకేష్ చేతిలో పెట్టి ఒక్కసారిగా రాకేష్‌ను గట్టిగా కౌగలించుకొంది. అలా కొద్ది నిమిషాలు వాళ్ళు ప్రపంచం మరచి ఏదో లోకంలో ఉండిపోయారు. ఇద్దరికీ అంతుపట్టని ఆరాధనతో, సునంద రాకేష్ పేరు పలుకుతూ నెమ్మదిగా అతనిని వదిలి దూరంగా జరిగింది. కళ్ల నిండా కన్నీటి వరదలు పొంగుకు వస్తుంటే అతని చెంపలు నిమిరి, అతని చేతులు గట్టిగా పట్టుకుని, వెంటనే విడిచేసి అక్కడ నుండి వెనక్కు చూసుకుంటూ వెళ్ళిపోయింది.

సునంద చేసిన ఆ పనికి, చేతిలో పెట్టిన  కవరు ఏమిటో అర్థంకాక, ఏం చేయాలో పాలుపోక చాలాసేపు స్థాణువులా నిలిచి తన చేతిలో ఉన్న కవరును పరిశీలనగా చూస్తూ, నెమ్మదిగా దాన్ని తెరిచి అందులో ఉన్న రెండు పేజీల ఉత్తరాన్ని ఆత్రంగా చదవటానికి  బెంచీవైపు వెలుతురు వచ్చే చోట వెళ్లి కూర్చుని చదవటం మొదలు పెట్టాడు.

లేఖలో మొదటి రెండు లైనులు చదవంగానే అతని కళ్ళు కన్నీటి పర్యంతం ఆయి సహకరించడం మానివేశాయి. అలా ఆ లేఖ సారాంశం అంతా చదివిన రాకేష్, ఆ నిర్మానుష్య ప్రదేశంలో, నిశ్శబ్దం చీలుస్తూ వెక్కి, వెక్కి రాగాలు పెట్టాడు. కాసేపటికి భారంగా అడుగులు వేస్తూ తాను ఉండే గది వైపు నడిచాడు.

***

ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పిన సునంద, లక్ష్మి ఒడిలో తలపెట్టుకుని ఘొల్లుమని ఏడ్చేసింది. సునందను సముదాయిస్తూ నెమ్మదిగా సునందతో అనునయంగా..

“సునందా.. నువ్వు అతనిని ప్రేమించావా? ఎందువల్ల మీరు ఇద్దరూ దూరం అయ్యారు? మరి అతని ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వకుండా ఆ కవరు ఇచ్చావేమిటి. అందులో ఏముంది. నీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పు” అంటూ బుజ్జగించింది లక్ష్మి.

కొంత సమయం తర్వాత తెరిపిన పడిన సునంద మెల్లగా “తను. రాకేష్. నేను నా డిగ్రీ చదువు మా మామయ్య గారి ఊళ్ళో, చదివాను. అలా చదువుతున్నప్పుడు అతనిని చూసాను. ఎందుకో చూడంగానే అతను అంటే ఇష్టం పుట్టింది. అలా మూగగా అతనిని ఆరాధించేదాన్ని. తనకు ఈ విషయం తెలీదు. ఒకరోజు అతని స్నేహితులు  ఎవరో నన్ను గమనించి అతనికి చెప్పినట్టు ఉన్నారు. అలా ఒకరికొకరు చూసుకోవటం మొదలు పెట్టాం. ఒకరోజు నేనే ధైర్యం చేసి అతనిని చూసి చిరునవ్వు నవ్వేసాను. అలా ఇద్దరం ఎదురు పడినప్పుడల్లా ఒకరికొకరు చిరునవ్వుతో పలకరింపులు చేసుకొనేవాళ్ళం. నిజం చెప్పాలి అంటే, తను నన్ను ఇష్టపడుతున్నాడో లేదో తెలీదు, మా మధ్య మాటల పరిచయం లేదు, నా గురించి వివరాలు తెలుసో లేదో కూడా అనుమానమే. అలా మా మధ్య దోబూచులాటలు జరుగుతున్నప్పుడే ఒకరోజు మా నాన్నగారికి ఆరోగ్యం బాగోక, హఠాత్తుగా మా నాన్నగారు

ఉన్న ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అలా వెళ్లిన నేను మళ్ళీ తిరిగి ఆ ఊరు రాకుండానే చదువు సాగించాను. ఆ ఊరు వెళ్లే అవసరం అయితే పడలేదు కానీ , అతని ధ్యాస మాత్రం పోలేదు. మనసులో అతనిపై ఇష్టం కొండలా పెరిగింది కానీ, ఎలా ఈ సమస్యను గెలవాలో అర్థం కాలేదు. అలా అర్థం కాని సమయంలోనే నా వివాహం జరిగిపోయింది. మంచి భర్త, చక్కటి జీవితం, ఏమీ ఇబ్బంది లేని సంసారం..అలా గడిచిపోయింది. కానీ ఏమైనా, తొలి ప్రేమ కదా, ఎక్కడో గుండెల్లో తను అల్లరి చేసేవాడు. అలా నాలో గూడు కట్టుకున్న ప్రేమను అంతా ఒక లేఖలో రాసి నా దగ్గరే ఉంచుకునే దాన్ని. అదే లేఖను తనకు ఇచ్చేసాను.” అంటూ అతను అప్పట్లో ఎలా ఉండేవాడో, అతనికి తెలియకుండా ఎలా చూసేదో అన్నీ వివరంగా లక్ష్మికి చెబుతూ ఊరట పొందింది సునంద.

***

అప్పటికి ఎన్ని సార్లు చదివాడో ఆ లేఖను. చదివినప్పుడల్లా రాకేష్‌కు కన్నీటి వరదలే పొంగాయి, అయినా మరోసారి ఆ ఉత్తరం చదవసాగాడు.. ముత్యాల కోవలాంటి అక్షరాలతో, పొందికగా రాసిన ఆ ఉత్తరంలో..

డియర్,

ఈ లేఖ నువ్వు చదువుతున్నావంటే, నా జీవితంలో నేను, నిన్ను మరోసారి కలుసుకున్నానన్నమాట. నాలో దాగి, అణగారిన నా ప్రేమకు ప్రతి రూపాన్ని చూసానన్నమాట. నిన్ను చూస్తానా? లేదా?, ఈ జీవితానికి కనీసం ఇలాంటి చిన్న కోరిక తీరుతుందా? లేదా?అని అనిపించేది.

ఇంతకూ నేను ఎవరో గుర్తున్నానా? కనీసం నా పేరు అయినా తెలుసా? ఎప్పటికైనా ఈ జీవితం లో నిన్ను కలుస్తానని, ఒక్క క్షణమైనా నీ ముందు నా ప్రేమను వెలిబుచ్చుతానని ఎక్కడో నాలో ప్రగాఢ విశ్వాసం, ఆశ, నన్ను ఇలా ఒక లేఖ రాసేలా పురిగొల్పాయి.

అప్పుడు నీతో సమయం చిక్కుతుందో లేదో, అలాంటి మధుర క్షణం ఎదురైతే అప్పుడు ఏం చేయాలి..అందుకే నా మనసులో భావాన్ని ఇలా ఉత్తర రూపంలో దాచుకున్నా.

నిజం డియర్, నువ్వు అంటే అమితమైన ఇష్టం, రోజూ నిన్ను గమనిస్తూనే గడిపేదాన్ని. అదే క్రమంలో ఓ రోజు ధైర్యం చేసి చిరునవ్వు కూడా నవ్వేసాను.

నాకెందుకో బాగా నమ్మకం ఉండేది నువ్వూ నన్ను ఇష్టపడుతున్నావని. దానికి ప్రతిగా నువ్వు, నన్ను చూసి నవ్విన చిరునవ్వే, ఒక గెలుపు చిహ్నంగా భావించి, ఎంతో ఆనందంగా, నువ్వు ఎప్పుడు తారసపడతావోవని ప్రతీ క్షణం ఆశగా ఎదురు చూసేదాన్ని. నా ప్రేమను వ్యక్తపరిచే సమయం వచ్చింది అనేలోపు, నా జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. మా నాన్నగారికి ఆరోగ్యం బాగోని కారణంగా, ఆ ఊరునుండి వెళ్లిపోవడం, మళ్లీ రాలేక పోవడం జరిగిపోయాయి.

నీ గురించి ఏ స్నేహితులకూ చెప్పక పోవడంతో, నీ వివరాలు నాకు తెలియలేదు. ఎంతైనా ఆడపిల్లను. నీ వివరాలు తెలుసుకుని  కలిసే ధైర్యం కూడా కలగలేదు. అలా మూగగా ఎన్నో రాత్రులు గడిచిపోయాయి.

నీతో చెబుదామని అనుకున్న ఊసులన్నీ, నా కలల్లోనే ఆగిపోయాయి. అలా కాలం పరిగెత్తి నాకు పెళ్లి అనే బంధాన్ని కట్టబెట్టింది. మంచి భర్త, చక్కటి సంసారం, అన్నీ దక్కాయి, ఒక్క నీవు తప్ప.

నిన్ను చాలా మటుకు మరచిపోయాను, డియర్.. ఎక్కడ నీకు దగ్గర అవుతాను అని అనుకుందో.. కాలం మరింత వేగంగా నా జీవితంలో సంవత్సరాలని కరిగించేసింది. అందుకే ఎవ్వరికీ తెలియకుండా కొన్ని జ్ఞాపకాలను నా మనసులో భద్రంగా దాచేసుకున్నాను.

ఎన్నోసార్లు నిన్ను చూడాలని అనిపించేది. ఏం చేయను?ఎలా కలువగలను? ఈ రెంటికి నా దగ్గర సమాధానం లేదు. అయినా ఎక్కడో చిన్న ఆశ, జీవితంలో ఒక్కసారైనా కాలం కలిసి రాకపోతుందా? చచ్చేలోగానైనా నా ఈ చిన్న కోరిక తీర్చకపోతుందా అని? అనిపించేది.

మన జీవితాలని దూరం చేసిన ఈ సమయమే మరల మనను కలిపింది. కానీ అప్పటికే ఎవరి వ్యక్తిగత జీవితాలకు, వాటికే బద్ధులై ఉన్నాం. ఇక ఈ జన్మలో మనం చేసేది ఏమీలేదు. నిన్ను మరోసారి కలవటమే పెద్ద వరంగా భావిస్తాను. ఇంతకూ నువ్వు నన్ను ఇష్ట పడ్డావా? లేదా? నువ్వు కూడా నన్ను ప్రేమించినట్లు చెప్పు నేస్తం. నా మనసుకు ఎంతో న్యాయం చేసినవాడివి అవుతావు. నువ్వు ప్రేమించినా, లేకపోయినా నేను మాత్రం నిన్ను ప్రేమించాను. పరితపించాను. నా కలల్లోనూ,. ఊసుల్లోనూ ఎప్పుడో బందీగానే ఉన్నావు. అందుకే నిన్ను చూడాలని పరితపించేది. 

ఇది చాలు డియర్, ఇన్నాళ్లకయినా నిన్ను కలిశాను. ఇద్దరి జీవితాలు విభిన్న ధ్రువాల వద్దకు చేరుకుపోయాయి. ఇప్పడు మనం చేసేది ఏమీ లేదు. అందుకే ఇక నీకు వీడ్కోలు పలుకుతున్నాను. నేను నీవు ఎక్కడ ఉన్నా హాయిగా ఉందాం.

ఇప్పటి నుండే తపస్సు చేద్దాం. వచ్చే జన్మకైనా, మళ్లీ ప్రేమికులుగా కలుద్దామని, కలసి జీవితం పంచుకుందామని.

..సునంద

ఆ ఉత్తరం చదివినప్పుడల్లా రాకేష్‌కు కన్నీళ్లు ఆగటం లేదు. ప్రమేయం లేకుండానే కళ్ళు చమర్చు కుంటున్నాయి.

సరిగ్గా అలాంటి సమయంలోనే రాకేష్ భుజంపై అతని భార్య రేఖ చేయి వేసింది. ఒక చిన్నటి తువ్వాలు చేతికి ఇస్తూ “మీ అప్పటి జ్ఞాపకాలను నేను తుడిచివేయలేను కానీ, ఇప్పటి ఈ కన్నీళ్లను  తుడవగలను” అంటూ అనునయంగా మాట్లాడిన ఆమెకు రాకేష్ క్షమాపణలు చెబుతూ ఆమె ఒడిలో ఒదిగిపోయాడు.

Exit mobile version