చూపుడు వేలు ఉండకూడని మనుషులు

9
2

ఈ కథ రచయిత స్వరంలో తెలుగులో:
https://youtu.be/dzESBuaY5uA

ఈ కథ రచయిత స్వరంలో ఆంగ్లంలో:
https://youtu.be/n-hMD2EX6Eg

*****

[dropcap]“చూ[/dropcap]పుడు వేలు చూపించిన వాడిని ఏం చేయాలి?”

“చూపుడు వేలు కత్తిరించేయాలి”

భూ మనుషులను అవమానించిన వాడినేం చేయాలి??

చూపుడు వేలు కోయాలి!! చూపుడు వేలు కోయాలి!!!

పెద్ద సంఖ్యలో అరుస్తున్నారు భూ మనుషులు ఉత్సాహంగా. ప్రశ్న అడిగేది ఒకడు. సమాధానం ఇచ్చేది వేల సంఖ్యలో.

శుక్రగ్రహంలో చాలా కాలమయింది ఇలాంటి చూపుడు వేలు కత్తిరించే కార్యక్రమం జరిగి. దాంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఉద్వేగం ఉప్పెనలా ఉంది. ఉద్రేకం ఉరకలు వేస్తోంది. భూగ్రహవాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. వాళ్ళు మనుషుల్లాలేరు. పశువుల్లా అనిపిస్తున్నారు.

కానీ చూపుడు వేలు ఉండకూడని శుక్రగ్రహవాసులు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిస్సహాయంగా నిట్టూరుస్తున్నారు. జరుగున్నది ‘ఋతం’కు అర్థం కావటం లేదు.

“అమ్మా… మనమంతా ఎందుకని భయంతో వణికిపోతున్నాం?” అని అమాయకంగా అడిగాడు ఋతం, వాళ్ళమ్మని. ఇంకా భయం అంటే ఏమిటో పూర్తిగా అర్థం కాని వయసతనిది. ద్వేషం, క్రోధం అంటే అవగాహన లేని వయసది. వివక్షత అంటే విజ్ఞానం లేని వయసు అతనిది.

అమ్మ మౌనంగా ఉంది. ఆమె కంట్లో నీరు, నిప్పు సహజీవనం చేస్తున్నాయి.

బయట అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.

“ఇంకెవరికయినా చూపుడు వేలు మొలిచిందో? మొలిస్తే కోసేస్తాం” అరుస్తున్నారు.

“ఏమవుతోందమ్మా?” మళ్ళీ అడిగాడు ఋతం.

ఆమె పిల్లవాడి వైపు జాలిగా చూసింది.

“నీకెన్ని వేళ్లున్నాయి?” అడిగింది.

“ఒకటి, రెండు, మూడు, నాలుగు… నాలుగు వేళ్ళు”, లెక్కలు రెండు రోజుల క్రితమే నేర్చుకున్నాడు ఋతం. అందుకని ఉత్సాహంగా లెక్కించి చెప్పాడు.

“నీతో పాటు ఆడే ‘జీవా’కి ఎన్ని వేళ్ళున్నాయి?”

“ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు… అయిదు వేళ్ళున్నాయి” జీవా చేతిని తన జ్ఞాపకాల అద్దంలో చూస్తూ లెక్కించాడు  ఋతం.

“చూశావా… మనకు నాలుగు వేళ్ళు. వాళ్ళకి అయిదు వేళ్ళు. వాళ్ళకి ఉండి, మనకు లేని వేలు ఏమిటి?”

మనసులో అన్ని వేళ్ళ పేర్లు చెప్పుకుంటూ లెక్కించాడు ఋతం. “చూపుడు వేలు” చెప్పాడు మెల్లిగా.

“వాళ్ళు భూమివాసులు. మన గ్రహానికి వచ్చారు. మనం  శుక్రగ్రహవాసులం. వారిని రానిచ్చాం. ఆదరించాం. ఆశ్రయమిచ్చాం. కానీ భూమి మనుషులు అంత మంచివాళ్ళు కారు. వారు క్రూరులు. స్వార్థపరులు. ఆశ్రయమిచ్చిన మనపైనే ఆధిక్యం సాధించారు. వారికీ మనకీ తేడా తెలిసేందుకు మనకు చూపుడు వేలు ఉండకూడదని నియమం విధించారు. మన పెద్దలు ఒప్పుకున్నారు. అందుకని మనకి చూపుడు వేలుండదు. ఒకవేళ మనలో ఎవరికయినా చూపుడు వేలు మొలిస్తే, వాళ్ళు దాన్ని వెంటనే కత్తిరిస్తారు.”

“చూపుడు వేలు మనకు ఎందుకు ఉండకూడదు?”

“చూపుడు వేలితో ఏం చేస్తాం?”

“చూపిస్తాం”

“వారి తప్పులు ఎత్తి చూపించకూడదు. వారిని ప్రశ్నించకూడదు. వారిని విమర్శించకూడదు, వారిని ఏమీ అనకూడదు. అందుకని మనకి చూపుడు వేలు ఉండకూడదు” కసిగా చెప్పిందామె.

ఆమె మాటల్లోనే, ఆ అన్యాయం పట్ల ఆవేదన, ఆక్రోశం, ఆవేశాలు తెలుస్తున్నాయి.

“ఎందుకని?”

“అదంతే… మన పూర్వీకులు ఇలాంటి నియమాలకు ఒప్పుకున్నారు. ఒప్పుకోకపోతే వాళ్ళు మనమీద దాడిచేస్తారు. మనల్ని ఊచకోతకోస్తారు. అంతాచేసి, మనం వాళ్ళకి అన్యాయం చేశామంటారు. మనమే వాళ్ళని రెచ్చగొట్టామని వారి చర్యలను సమర్ధించుకుంటారు. అందరూ మనదే తప్పంటారు. మనవాళ్ళుకూడా మనదే తప్పంటారు. అనకపోతే వాళ్ళనీ చంపుతారు. అందుకని భూగ్రహం వాళ్ళని గొప్ప వాళ్ళన్నారు. అప్పటి నుంచీ వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు. మనం చూపుడు వేలు లేని వాళ్ళమయ్యాం. కానీ అప్పుడప్పుడు మనలో ఎవరికో ఒకరికి చూపుడు వేలు మొలుస్తుంది. వాళ్ళని ప్రశ్నిస్తాం. ఎప్పుడూ వాళ్ళు మనవైపు చూపుడు వేలు చూపించటమేనా, మనం కూడా మన చూపుడు వేలు చూపించగలం అని చూపిస్తాం. అప్పుడు వాళ్ళకి మన వాళ్ళే తోడయి మన చూపుడు వేళ్ళని కోసేస్తారు. కానీ ఎంతగా కోసినా, ఎవరో ఒకరికి చూపుడు వేలు వస్తూనే ఉంది.” నిస్పృహగా చెప్పిందామె. తాను చెప్తోంది ఋతంకు అర్థమవుతోందో లేదో అని గ్రహించే స్థితిలో లేదు.

తల్లి మాటలు వింటున్నాడు ఋతం. అతనికి అర్థమవుతున్నట్లుంది. అర్థమవుతున్నట్లు లేదు. కానీ బయట అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరి చూపుడు వేలు కత్తిరిస్తున్నప్పుడు వాళ్లు పెట్టే కేకలు హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి. వెంటనే సంతోషంతో, ఆగ్రహంతో భూగ్రహవాసులు పెడుతున్న కేకలు ఆ హృదయ విదారక ఆక్రందనలను ముంచేస్తున్నాయి.

ఋతం  ఒళ్ళు వణుకుతోంది.

మనసులో గుబులు గుబులుగా ఉంది.

తన చేతిలో చూపుడు వేలు ఉండాల్సిన ఖాళీ జాగాను చూశాడు.

అతని కళ్ళు చిన్నవయ్యాయి.

ఖాళీగా ఉండే జాగా ఉబ్బినట్లుంది…

తనకు చూపుడు వేలు మొలుస్తోందా?

భయంతో వణికిపోయాడు ఋతం.

***

ఋతంకు నిద్ర పట్టడం లేదు. ఋతంతో పాటు ‘చూపుడు వేలు’ భయం ఎదగసాగింది. అంతే కాదు, తనకు చూపుడు వేలు మొలుస్తుందన్న భయం పెరుగుతోంది.

ఎదుగుతున్న ‘ఋతం’, తన వయసు వారి కన్నా భిన్నంగా అందరినీ పరిశీలిస్తున్నాడు. తమ శుక్రగ్రహవాసుల చరిత్రను అధ్యయనం చేస్తున్నాడు. శుక్రగ్రహ సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

తాను కలిసిన ప్రతి ఒక్కరి చూపుడు వేలుని పరిశీలించడం ‘ఋతం’కు అలవాటయింది. అంతే కాదు, చూపుడు వేలు లేకపోవడం వల్ల తాము ఎదుర్కుంటున్న వివక్షత అతనికి తెలుస్తోంది. చూపుడు వేలు ఉండటం వల్ల భూగ్రహవాసులు తమను ఇష్టం వచ్చినట్టు విమర్శించటం, ప్రతి చిన్న విషయంలో తప్పులను ఎత్తి చూపించి, దూషించటం, తమకు సంబంధించిన ప్రతి అంశాన్ని చులకన చేయటం తెలుస్తోంది. ఇంత చేసీ, శుక్రగ్రహవాసులు భూగ్రహం నుంచి వచ్చినవారికి అన్యాయం చేస్తున్నారనీ, వారిని అణచివేస్తున్నారని భూగ్రహవాసులు ఆగ్రహం ప్రదర్శించటం, వారికి ఆగ్రహం కలిగినప్పుడు అందిన  శుక్రగ్రహవాసిని అందినట్టు హింసించటం, చంపటం, నివాసాలను దగ్ధం చేయటం, అమాయకులను పీడించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతా జరిగేక వారికి ఆగ్రహం తెప్పించినందుకు తమకు శిక్ష పడటం, దాడులకు గురయి నష్టపోయిన వాడి వల్లనే దాడులు జరిగేయని తీవ్రమైన అణచివేతలకు గురవటం తెలుస్తోంది. చూపుడు వేలు ప్రాధాన్యం అర్థమవుతోంది. భూగ్రహ్రవాసులు శుక్రగ్రహవాసులకు చేస్తున్న అన్యాయం అర్థమవుతోంది.

‘ఋతం’కు అర్థమవుతున్న మరో విషయం, తమవారే తమకు అన్యాయం చేయటం. తామెందుకూ పనికిరానివారమనీ, తాము అణిగిమణిగి ఉండాలని, భూగ్రహవాసుల ఆధిక్యాన్ని ఆమోదించాలని తమ శుక్రగ్రహవాసులలో కొందరు తమకు చెప్తూండటం ‘ఋతం’కు అర్థమయింది.

ఒకరోజు ఉండబట్టలేక పాఠాలు చెప్పే అధ్యాపకుడిని అడిగాడు.

“భూగ్రహవాసులు మనల్ని తక్కువ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. మనుషులలో అహంకారం ఉంటుంది. కానీ మన శుక్రగ్రహవాసులే మనల్ని కించపరచటం, తక్కువ చేయటం ఎందుకు? మనకు ఆత్మగౌరవం ఉండదా?” అడిగాడు ఋతం.

అధ్యాపకుడు ‘ఋతం’ వైపు పరిశీలనగా చూశాడు.

“ఏమన్నావు? చివరి పదం చెప్పు?” అడిగాడు.

“ఆత్మగౌరవం”, మనసు కీడును శంకిస్తుండగా మెల్లిగా చెప్పాడు ఋతం.

“ఏది నీ చెయ్యి చూపించు” అడిగాడు అధ్యాపకుడు. ఋతం  వేళ్ళను పరిశీలనగా చూశాడు. “నువ్వెళ్ళు” అన్నాడు.

కానీ ఆ రోజు నుంచీ అధ్యాపకుడే కాదు, తనతో చదివేవారు  అధికులు తనను అనుమానంగా చూడటం, తనకు దూరంగా ఉండటం, తానెవరో తెలియనట్టు ప్రవర్తించటం గమనించాడు ఋతం. భూగ్రహం మనుషులే కాదు, శుక్రగ్రహం వాళ్ళు కూడా తనని దూరం పెట్టటం, అసలు తనలాంటి వాడొకడు శుక్రగ్రహం మీద ఉన్న విషయం గుర్తించనట్టు ప్రవర్తించటం అనుభవించాడు.

‘ఋతం’కు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఎవరిని అడగాలో తెలియటం లేదు.

ఒకరోజు అనుకోకుండా అతడికి శుక్రగ్రహం ఉపరితలం క్రిందవున్న రహస్య గుహలో  ఓ భాండాగారం దొరికింది. పనికిరాని విజ్ఞానాన్ని గుట్టలు గుట్టలుగా పారేసే స్థలం అది. దారి తప్పి అక్కడికి వెళ్ళాడు ఋతం. కుతూహలం కొద్దీ ‘ఏమిటా, పనికిరాని విజ్ఞానం’ అని చూశాడు.

అతని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఆ పనికిరాని విజ్ఞానంలో దొరికాయి. అతని సమస్యలన్నింటికీ పరిష్కారాలు ఆ పనికిరాని విజ్ఞానంలో లభించాయి.

‘ఋతం’లో ఆలోచనలు పెరిగాయి. ఆ ఆలోచనల ఫలితంగా అతనికి తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు తెలుస్తున్నాయి. ఏ రకంగా తామెందుకు పనికిరానివారని, తాము తెలివిలేనివారు, మూఢులు, మూర్ఖులని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారో అర్థమయింది.

అతనిలో పెరుగుతున్న ఆలోచనలు, అవగాహనలను అనుసరించి అతని చూపుడు వేలు ఖాళీ స్థలంలో అభివృద్ధి చెందుతోంది.

చిన్నప్పుడు చూపుడు వేలు మొలుస్తుందేమోనని భయపడ్డాడు. ఇప్పుడు చూపుడు వేలు మొలుస్తున్నందుకు గర్విస్తున్నాడు. కానీ తనకు వేలు మొలుస్తుందన్న నిజం ఎవ్వరూ గమనించకుండా, గ్రహించకుండా జాగ్రత్తలు పడుతున్నాడు. అప్పటికే అతడికి చూపుడు వేలు మొలుస్తున్నదని అనుమానించేవారు ఎక్కువయ్యారు.

“నీకు చూపుడు వేలు పెరుగుతున్నదని నాకు అనుమానం” ఓ రోజు అతని ప్రేయసి అంది.

“ఎందుకు అలా అనిపిస్తోంది?” భయాన్ని అణిచిపెడుతూ అడిగాడు.

“ఎందుకంటే… నీకు భూగ్రహవాసుల్లో స్నేహితులు లేరు. నీ గురించి శుక్రగ్రహ మేధావులు, పేరు పొందినవాళ్ళు, పెద్దలు ఎవ్వరూ మాట్లాడడంలేదు. నీకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు. నువ్వు మాట్లాడితే పట్టించుకోవటం లేదు. అసలు నువ్వనే వాడివి ఒకడున్నట్లు వాళ్లు తెలియనట్టే ఉంటున్నారు. నువ్వు కూడా వాళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళన్న మాటలకు మద్దతునిస్తూ, భూగ్రహవాసులను మెప్పించాలని ప్రయత్నించటం లేదు. ఇది కూడా నాకు అనుమానం కలిగిస్తోంది. ఏదీ నీ చెయ్యి చూపించు” అడిగింది.

‘ఋతం’ మాట్లాడలేదు. చెయ్యి చూపించలేదు. ఆ రోజు నుంచి ఆమెను  కలవటం మానేశాడు.

ఇంతలో ఒకరోజు ఓ అపరిచితుడు ‘ఋతం’ను కలిసాడు.

“నీతో పని ఉంది. రా” అన్నాడు.

“ఏం పని? ఎందుకు నీ వెంట రావాలి?” అడిగాడు ఋతం. చూపుడు వేలు మొలిచినవాళ్లను ఇలా ‘‘పని ఉంద’ని పట్టుకుపోవటం, అలా వెళ్ళినవాళ్ళు మళ్ళీ కనబడకపోవటం ఋతంకు తెలుసు. అతని ప్రేయసితో అనుభవం ఋతం లో అభద్రతాభావం పెంచింది.

‘ఋతం’ మాటలకు ఆ అపరిచితుడు నవ్వాడు. చుట్టూ చూశాడు. ఎవ్వరూ తమని పట్టించుకోవటం లేదని నిర్ధారించుకుని తన చూపుడు వేలు చూపించాడు.

ఋతం అతడిని అనుసరించాడు మౌనంగా…

అప్పుడే అతడికి తెలిసింది, అంతమంది చూపుడు వేలున్నవారు తమ శుక్రగ్రహంలో ఉన్నారని.

“మన చూపుడు వేలంటే భూగ్రహవాసులకు భయం. ఎందుకంటే, భూగ్రహవాసుల్లా మనం చూపుడు వేలు శిక్షించటానికో, హింసించటానికో, ఆరోపణలు చేయటానికో ఉపయోగించం. మన చూపుడు వేలు సత్యం వైపు చూపిస్తుంది. అదీ కాలంతో ఉంటూ మారని శాశ్వత సత్యం వైపు చూపిస్తుంది.  భూగ్రహవాసులు సత్యాన్ని భరించలేరు.  సత్యాన్ని చూపించే చూపుడువేలు   మన శక్తి. అందుకే మనకు చూపుడు వేలు లేకుండా చేయాలని భూమి మీద మనుషులు కంకణం కట్టుకున్నారు. భూమి మీదుండే ఓ మేధావి ఓ సిద్ధాంతం చెప్పాడు. జీవులలో ఏదైనా అంగాన్ని వాడకపోతే అది కొన్నాళ్ళకి ఆ జీవులలోంచి అదృశ్యం అవుతుందని, మళ్ళీ మళ్ళీ మొలవకుండా చేయాలంటే, దాన్ని వేర్లతో సహా పెకిలించాలనీ భూగ్రహవాసులు అర్థం చేసుకున్నారు. అందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని తరాలుగా మనం చూపుడు వేలు లేనివాళ్ళుగానే ఎదుగుతున్నాం.  కానీ, వృక్షాన్ని వ్రేళ్ళతో సహా పెకిలించివేసినా దాని బీజం ప్రకృతిలో అంతర్లీనంగా వుంటుంది. అనుకూల పరిస్థితులు నెలకొనగానే మళ్ళీ మొలకెత్తుతుంది. అందుకే,  ఎంతగా ప్రయత్నించినా చూపుడు వేలు ఎవరో ఒకరిలో ఏదో ఓ రకంగా మొలవటం మానలేదు. మనమందంరం చూపుడు వేళ్ళను పెంచుకుంటే, శుక్రగ్రహం నుంచి భూగ్రహం వారిని తరిమికొడతామని వారి భయం. అందుకే మన చూపుడు వేలు పెరగకుండా, మనల్ని అణచిపెట్టాలని చూస్తున్నారు. మనలో మనకి రకరకాల తగవులు పెట్టి మనం ఒకటి కాకుండా అడ్డుపడుతున్నారు. అందుకే మనం చూపుడు వేలు ఎదిగినవాళ్లం కలసికట్టుగా ఉండాలి. ఆవేశం ప్రదర్శించకూడదు. తెలివి ప్రదర్శించకూడదు. మిగతావారిలోనూ చూపుడు వేలు మొలిచేటట్టు చేయాలి. అప్పుడు కలిసికట్టుగా మనం భూగ్రహవాసుల వైపు మన చూపుడు వేళ్ళు చూపించవచ్చు. వాళ్ళకి తెలివి నివ్వటం ద్వారా, వారి నైచ్యం వారికి గ్రహింపుకు వచ్చేట్టు చేయవచ్చు. వాళ్ళంతట వాళ్ళే మన గ్రహాన్ని వదిలిపోయేట్టు చేయవచ్చు” ఓ వయసు మళ్ళినాయన చూపుడు వేలు చూపిస్తూ చెప్పాడు.

అదంతా విన్న ‘ఋతం’కి సందేహం వచ్చింది.

“మీరు చెప్పిందంతా నాకు అర్థమయింది. మనం భూవాసుల నుంచి విముక్తి పొందటంలో చూపుడు వేలు ప్రాధాన్యం అర్థమయింది. కానీ అహంకారం, ఆవేశం, అనౌచిత్యం, అనాలోచన అన్నవి భూవాసుల రక్తంలో జీర్ణించుకుపోయాయి. మనం చెప్తే విని బుద్ధి తెచ్చుకుని మనల్ని వదిలి వెళ్ళిపోతారా వాళ్ళు?” అడిగాడు.

“నీ సందేహం సమంజసమైనదే. కానీ హింస మన శుక్రగ్రహవాసుల లక్షణం కాదు. హింస మనిషి జీవలక్షణం. వాళ్ళు పశువుల నుండి మనుషులయ్యారు. వారిలో పశులక్షణం పోలేదు. ఆ పశు లక్షణం వదుల్చుకోవటం వాళ్ళ అంతిమ లక్ష్యం. కానీ మనం స్వతహాగా సౌమ్యులం. పశు లక్షణాన్ని వదుల్చుకున్న వాళ్ళం. కాబట్టి ‘హింస’ అన్న ఆలోచన మనకు శోభనివ్వదు” చెప్పారాయన.

‘ఋతం’కి ఆయన సమాధానం రుచించలేదు. మొదటి సమావేశంలోనే వాదించటం బాగుండదని మౌనంగా ఉండిపోయాడు.

ఆ వయసు మళ్ళినాయన తన సహచరుడితో చెప్పాడు “ఈ ఋతం  అనేవాడిపై ఓ కన్నేసి ఉంచండి. ప్రమాదకరంగా ఉన్నాడు. ఇతని వల్ల మనందరికి నష్టం కలగకుండా చూడండి” అని.

ఆ సమావేశం అయి ఇంటికి వస్తున్న ‘ఋతం’ను ఓ   వ్యక్తి కలిశాడు.

“సమావేశంలో నీ సందేహం విలువైనది. అందుకే మేము రహస్యంగా కొందరం ఒకటిగా పని చేస్తున్నాం. మా మాట వింటావా?” అడిగాడు.

తల ఊపి అతని వెంట వెళ్ళాడు ఋతం.

“భూమి మీద మనుషులతో మాటల్తో పని కాదు. వాళ్ళు హింసిస్తూ, బెదిరించి మనల్ని అదుపులో పెడుతున్నారు. మనం ఏ మాత్రం వాళ్ళన్నది కాదన్నా, వాళ్ళలో తప్పుల్ని చూపించినా వాళ్ళు హింస చేసి మనల్ని భయభ్రాంతులని చేసి, వాళ్ళ మాట నెగ్గేట్టు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ హింసకు ప్రతిహింస చేయాలి మనం. వాళ్ళు మన వేలు కోస్తే మనం వాళ్ళ వేలు కోయాలి. వాళ్ళు మనల్ని భయభ్రాంతులని చేసి లొంగదీసుకుంటున్నట్టే, మనం కూడా  భయభ్రాంతులని చేసి, వాళ్ళు మనల్ని వదిలి పారిపోయేట్టు చేయాలి.” అక్కడ ఉన్నవారికి మరో వయసు మళ్ళినాయన చెప్తున్నాడు.

ఇదీ ఎందుకో రుచించలేదు ‘ఋతం’కు.

తనలో తాను ఆలోచించకోసాగాడు. ‘హింస’, నచ్చటం లేదు. మంచిమాట మనిషికి పనికిరాదు. మరి ఎలా శుక్రగ్రహం నుంచి మనిషిని భూమికి తరిమివేయాలి? లేక, ఎలాగ, మనుషులు శుక్రగ్రహం లోని వారిని కూడా సమానంగా, మనిషిలా భావించేట్టు చేయాలి?

‘ఋతం’ ఆలోచన తెగడం లేదు.

భూమి చరిత్ర చదివాడు. భూమి లోని వివిధ దేశాలు, వాటి నడుమ గొడవల గురించి తెలుసుకున్నాడు. భూమి మీద కూడా మనుషుల నడుమ బోలెడన్ని విద్వేషాలు, వివక్షతలు ఉన్నాయని తెలుసుకున్నాడు. వాళ్ళల్లో కూడా అణచివేతలు, అక్రమాలు, సంకుచితాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. భూమి మీద కూడా ‘హింస’ ద్వారానే ఇతరులను మనుషులు అదుపులో ఉంచుకుంటారని తెలుసుకున్నాడు. ఎవరు ‘హింస’కు దిగుతారో, వారికి భయపడి మిగతావారు ఒదిగి ఉంటారని గ్రహించాడు.

‘తనవారిపైనే హింస జరిపి భయంతో అదుపులో పెట్టే మనిషి శుక్రగ్రహవాసులను భయభ్రాంతులను చేసి అదుపులో పెట్టటంలో ఆశ్చర్యం లేదు’ అనుకున్నాడు.

అతడికి చూపుడు వేలు ప్రాధాన్యం అర్థమయింది.

తన చూపుడు వేలును జాగ్రత్తగా కాపాడుకోవాలని, దానికి ప్రమాదం కలిగించే చర్య ఎలాంటిది చేపట్టకూడదని నిశ్చయించుకున్నాడు.

తన అభిప్రాయాలు ఎవ్వరితో చెప్పటం మానేశాడు. అధిక కాలం ఒంటరిగా, విజ్ఞానార్జనలో గడపసాగాడు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ‘ఋతం’కు చూపుడు వేలు ఉందన్న అనుమానం శుక్రగ్రహం అంతా పాకిపోయింది.

ఒకరోజు ‘ఋతం’ను పరిశీలనకు పిలిచారు.

‘ఋతం’ తన చూపుడు వేలును వారు గుర్తు పట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఎంత పరిశీలించినా భూమి మనుషులకు ‘ఋతం’ చూపుడు వేలు కనబడలేదు. అయిష్టంగానే ‘ఋతం’ను వదిలిపెట్టక తప్పలేదు.

ఋతం  బయటకు వస్తుంటే, ఓ మానవ పరిశీలకుడు ‘ఋతం’తో అన్నాడు –

“మీరు చూపుడు వేలు ప్రలోభంలో పడకండి. అది మీకు మేలు కన్నా హాని ఎక్కువ చేస్తుంది. భూమనుషులతో కలసి మెలసి బ్రతకటం నేర్చుకోండి. శుక్రగ్రహవాసులం అని అహంకారం చూపకండి” అని.

ఎందుకో ఎంత వద్దనుకున్నా ఆ మాటలకు సమాధానం ఇవ్వకుండా ఉండలేకపోయాడు ఋతం.

“నాకు మీ భూగ్రహవాసుల గురించి అంతా తెలుసు. మీలో మీరు కలసి ఉండలేరు. అహంకారాలతో, సంకుచితాలతో ఒకరినొకరు హింసించుకుంటూ భయపెట్టి అణచి ఉంచుకుంటారు ఒకరినొకరు. మీతో మమ్మల్ని కలసి మెలసి ఉండమంటారు. మేము కలసి శాంతిగానే ఉంటాం. కలసి సహజీవనం చేయటం మీరు నేర్చుకోవాలి” అనగానే తాను చేసిన తప్పు అర్థమయింది ‘ఋతం’కు.

అతని మాటలు పూర్తయ్యేలోగా భూమనుషులు అతడిని చుట్టుముట్టారు.

“ఏదీ ‘చూపుడు వేలు’ చూపించు” అని అరిచారు.

విచక్షణ కోల్పోయి మాట జారటంతోటే, అంతవరకూ అణిగి ఉన్న చూపుడు వేలు పొడుచుకుని వచ్చింది.

వెంటనే ఋతంను బంధించారు.

ఋతం  చూపుడు వేలును మూలాలతో సహా పెకిలించి వేయాలని తీర్మానించారు.

ఋతం  ఏం చెప్పినా వినలేదు. అతనికేమీ చెప్పే అవకాశం ఇవ్వలేదు.

తాను అన్నది నిజం అనీ, భూగ్రహానికి చెందిన గ్రంథాలన్నింటిలో ప్రస్తావించిన విషయమే తాను ప్రస్తావించాడు తప్ప కొత్తగా ఏదీ అనలేదనీ, అసత్యం చెప్పలేదనీ వివరించాలని ప్రయత్నించాడు ఋతం.

కానీ ఋతం  ఎంతగా వివరణలు ఇస్తున్నాడో, ఎంతగా నిజం చెప్తున్నాడో అంతగా అతడి చూపుడు వేలు  పెరిగిపోసాగింది.

“భూగ్రహ వాసులవైపు వేలు చూపిస్తావా? భూగ్రహవాసులను అవమానిస్తావా? నీ చూపుడు వేలు కత్తిరిస్తేకానీ నీ మెదడు మామూలుగా కాదు”,  అరుస్తున్నారు భూగ్రహవాసులు కోపంతో, పశు ఆవేశంతో…

పెరిగిపోతున్న చూపుడు వేలు భూవాసులలో కలవరం కలిగిస్తోంది. అప్పటికప్పుడే అతడి చూపుడు వేలు కత్తిరించాలని నిశ్చయించారు.

“శుక్రగ్రహవాసులారా, చూపుడు వేలు మన హక్కు. మనం అందరం కలిస్తే భూగ్రహవాసులు మనల్ని ఏమీ చేయలేరు” ఆక్రోశించాడు ఋతం.

“నిన్ను ఎవరు చూపుడు వేలు పెంచుకోమన్నారు? పెంచినా ఎవరు చూపించమన్నారు? నీ వల్ల శుక్రగ్రహవాసులందరూ ప్రమాదంలో పడ్డారు” విమర్శించారు కొందరు.

“చూపుడు వేలు ఉన్నవాడు శుక్రగ్రహవాసి కాడు. వాడికీ మాకూ సంబంధం లేదు” తీర్మానించారు కొందరు.

“చూపుడు వేలుండటం నేరం కాదు. కానీ అంతగా చూపుడు వేలుండటం తప్పు” అన్నారు కొందరు సామరస్యంగా.

“శుక్రగ్రహ వాసులకు చూపుడువేలుండటం భూమనుషులకు నచ్చదని తెలిసికూడా మనం ఎందుకని చూపుడువేలు పెంచుకోవాలి?” శుక్రగ్రహ వాసులే ఋతంను తప్పుపట్టారు.

చివరికి చూపుడు వేళ్ళు పెరిగి రహస్యంగా ఉన్నవారు కూడా ‘ఋతం’ను దూషించారు.

“చూపుడు వేలును విచక్షణతో వాడాలి. లేకపోతే ఇలాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి” అన్నారు.

“నిజాన్ని నిజమని ధైర్యంగా చెప్పలేనివారికి చూపుడు వేలుండే అర్హత లేదు. నా చూపుడు వేలు కత్తిరించేయండి” అభ్యర్థించాడు ఋతం  నిర్లిప్తంగా.

చాలా కాలం తర్వాత ఇంతగా పెరిగిన చూపుడు వేలున్న శుక్రగ్రహవాసి దొరికాడని, వాడి చూపుడు వేలు కత్తిరించే వీలు దొరికిందని శుక్రగ్రహంలో భూ మనుషులంతా సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంబరాలతో ‘ఋతం’ చూపుడు వేలు కత్తిరించేందుకు బయలుదేరారు.

***

“అమ్మా… బయట ఏం జరుగుతోంది?” ఓ పిల్లవాడు వాళ్ళమ్మను అడిగాడు.

“చూపుడు వేలు కోస్తున్నారు. మన శుక్రగ్రహం వారికి చూపుడు వేలుండ కూడదు. ఉంటే కోసేస్తారు.”

భయం భయంగా తన చేయిలో చూపుడు వేలుండాల్సిన స్థలంలోని ఖాళీని చూశాడు పిల్లవాడు. అతడికి అక్కడ చూపుడు వేలు మొలుస్తున్నట్లనిపించింది. భయంగా అమ్మ ఒళ్ళో తల దాచుకున్నాడు.

“భయం లేదు. అందరం చూపుడు వేళ్ళు పెంచుదాం. అప్పుడెందరి వేళ్ళు కోస్తారో చూద్దాం” అంది ఆమె పిల్లవాడిని దగ్గరకి తీసుకుంటూ.

***

చూపుడు వేలుపయోగించి, చూపుడు వేలితోపాటూ మెడలపై తలలకు ముప్పు తెచ్చుకుంటున్న శుక్రగ్రహవాసులందరికీ ఈ కథ అంకితం..

—–రచయిత

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here