Site icon Sanchika

ఆకట్టుకోని ‘చూసీ చూడంగానే’

[dropcap]మ[/dropcap]న భారతీయ సంప్రదాయంలో వివాహ ప్రక్రియలో శుభ ముహూర్తానికి ముందు వధూవరుల మధ్య ఒక తెర కడతారు. కుటుంబ పెద్దలు, ఊరి పెద్దలు వారి వివాహాన్ని నిర్ణయిస్తారు కాబట్టి అప్పటివరకు వారు ఒకరికొకరు అపరిచితులే!

అలా తెర కట్టటంలో పరమార్థం… ఆ తెర తియ్యగానే మొట్టమొదటిసారిగా వధూవరులిరువురూ ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు జరిగే మొదటి వీక్షణం పవిత్రమైనదని, వారిద్దరిలో కలిగే మధురమైన ప్రకంపనలు వారిలో ప్రేమని, ఆకర్షణని, తాము ఎదుటి వ్యక్తికి సంప్రదాయబద్ధంగా, సామాజికంగా చెందినవారమని, ఒకరికొకరం తోడు-నీడ అని ఒకరి పట్ల ఒకరికి కలిగే భావం వల్ల వైవాహిక బంధం గట్టిగా పదికాలాల పాటు భద్రంగా నిలబడుతుందని నమ్మకం. అందుకే దాన్ని ‘శుభ ముహూర్తం’ అన్నారు.

ఇప్పుడు పెళ్ళి చేసుకోదల్చుకున్న స్త్రీ పురుషులు ముందుగానే (ఎక్కువ భాగం) పరిచయస్థులవుతున్నారు. కలిసి తిరుగుతారు… వీలైతే కొన్నాళ్ళు కలిసి బతుకుతారు… ఇక మిగిలిన విషయాలు చెప్పక్కరలేదు. పెళ్ళయ్యేటప్పటికే అన్నీ అయిపోతాయి.

అయినా పెళ్ళి తంతులో తెరలూ ఉంటున్నాయి… దొంగ చూపులు, మధురమైన చూపుల బదులు వెకిలి చూపులు, కోపపు చూపులు ఉంటున్నాయి… కాశీ యాత్రలూ ఉంటున్నాయి… వీడియోల కోసం అన్నమాట! అన్నీ ప్రదర్శనలే… అంతా పటాటోపమే!

సరే ఇప్పుడు మన సినిమా కథలోకొచ్చేద్దాం.

ఆ మధ్య ‘గమనం’ చిత్రం గురించి రాసినప్పుడు ‘శివ కందుకూరి’ గురించి నెట్‌లో వెతుకుతుంటే ఈ చిత్రం పేరు కనిపించింది.

మరీ పూర్వకాలం అంత చాదస్తంగా ఆలోచించకపోయినా టైటిల్ చూసి కథేమిటో తెలుసుకుందామని, సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారో అనుకుంటూ చూశాను.

ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాజ్ కందుకూరి గారి ‘ధర్మపధ’ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించబడి 2019 లో విడుదల అయింది. కథ-కథనం-దర్శకత్వం ‘శేష సింధు రావు’.

హీరో తల్లిదండ్రులుగా ‘పవిత్ర లోకేష్’, ‘అనిష్ కురువిళ్ళ’ నటించారు.

నాయకుడుగా ‘శివ కందుకూరి’, ‘వర్ష బొల్లమ్మ’ కథానాయికగా నటించారు.

***

ఈ రోజుల్లో వస్తున్న అన్ని సగటు ప్రేమ కథల సినిమా లాగానే హీరో ఏం చదవాలో.. ఏం చెయ్యాలో తెలియని కన్‌ఫ్యూజన్‌లో ఉండగా.. అందరు తల్లిదండ్రుల్లాగే అతని తల్లి ర్యాంక్ సరిగా రాని కొడుకుని చాలా ఎక్కువ ఫీజు కట్టి అతన్ని ఇంజనీరింగులో చేర్చాలనే ప్రయత్నాల్లో ఉంటుంది. అది మన హీరో గారికి ఇష్టముండదు. తను ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కావాలనుకుంటాడు. ఇక వారి మధ్య ఘర్షణ మొదలు.

తల్లి బలవంతాన్ని తట్టుకోలేక ఇంజనీరింగులో చేరిన మన కథానాయకుడు అయిష్టంగా కాలేజికి వెళుతూ కనీసం అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యచ్చు అనుకుని ఆ పనిలో ఉంటాడు.

కథానాయకుడు చూస్తుండగా కాలేజి ముందు బస్ దిగిన ఇద్దరు అమ్మాయిల్లో ఒకమ్మాయిని ఇతను ఇష్టపడితే… ఇంకో అమ్మాయి ఇతన్ని ఇష్టపడుతుంది.

కథకి టైటిల్ సమకూర్చిన ‘చూసీ చూడంగానే’లో మొదటి ‘చూపు’ అదన్నమాట!

ఇతన్ని ఇష్టపడిన అమ్మాయి ఇతని స్నేహితుని ద్వారా తన ఇష్టాన్ని తెలియపరుస్తూ సందేశం పంపిస్తే… ఆ వయసులో చేసే ఆకతాయి చేష్టగా ఆ స్నేహితుడు అసలు నాయికని కాక, మన నాయకుడు ఇష్టపడిన అమ్మాయినే చూపించి ‘ఈమెకి నువ్వంటే పిచ్చి’ అని చెబుతాడు.

నాయకుడికి తన పట్ల ఉన్న పిచ్చిప్రేమని అవకాశంగా తీసుకుని ఆ అమ్మాయి అతనితో ఒక ఆట ఆడుకుంటుంది. ఆ అమ్మాయి ఇతర మగపిల్లలతో చనువుగా ఉండటం, హద్దు మీరి ప్రవర్తించటం చూసిన అసలు ప్రేమించిన అమ్మాయి… ఈ అమ్మాయితో అతను పడే తిప్పలు చూడలేక ఆ అమ్మాయికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.

అతను ప్రేమించిన అమ్మాయి, తను ఇష్టపడి ప్రేమించిన వ్యక్తి కాదు కనుక నాయకుడిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ భగ్న ప్రేమతో ఇంజనీరింగ్ చదువుకి మధ్యలో స్వస్తి చెప్పి, తనకిష్టమైన ఫొటోగ్రఫీ రంగంలోకి వెళతాడు.

అప్పుడు అసలు నిజంగా అతన్ని ప్రేమించిన అమ్మాయి రంగంలోకి దిగి, తన వివరాలు చెప్పకుండా తన వైపు ఆకర్షించటానికి ప్రయత్నిస్తుంది.

ఆ భగ్న ప్రేమికుడు తన పాత కథ అంతా ఆమెకి చెప్పి తన రెండో ప్రేమ కథ నడుపుతూ ఉంటాడు. తలవని తలంపుగా ఒక హోటల్లో కొత్త ప్రేమికురాలు.. పాత ప్రేమికురాలు కలిసి మాట్లాడుకోవటం చూసిన కథానాయకుడు కొత్త అమ్మాయి తనని మోసం చేసిందనుకుని దూరం జరుగుతాడు.

తరువాత జరిగే నాటకీయతలో ఆమె వేరే అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకోవటం వల్ల నాయకుడి పట్ల ప్రేక్షకులకి జాలి కలిగించి… మళ్ళీ అది క్యాన్సిల్ చేసి ముగింపులో వారికి పెళ్ళి జరిపించి…. మొదటి చూపులోనే సీరియస్‌గా, సిన్సియర్‌గా నాయిక ప్రేమించినట్లు.. అది చూసీ చూడంగానే ఏర్పడే పవిత్ర ప్రేమగా చెప్పాలని ప్రయత్నించినట్లు అనిపించింది.

అతని తల్లి కూడా అతనితో చిన్నప్పటి నించీ దండించినట్లుగా మాట్లాడి అతని భావోద్వేగాలని అర్థం చేసుకోనందుకు చింతించటం… వగైరా వగైరా చూపించి తల్లిదండ్రులు పిల్లల భావాలని అర్థం చేసుకోవటం అవసరం అన్నట్టు చూపించారు.

ప్రేమని పంచి, బాధ్యతగా పెంచి, వారి భవిష్యత్తు బాగుండాలని లక్షలు ఫీజులు కట్టి చదివించే తల్లిదండ్రులు కొంత దూకుడుగా ఉన్నా… వారిని ఎలా ఒప్పించాలో పిల్లలు కనీసం ప్రయత్నించినట్లు చూపించకుండా చివరలో తప్పంతా వారిదే అని చూపించటం… పిల్లలకి ఒక లక్ష్యం లేకుండా ప్రేమ అనేదే ముఖ్యమైన విషయంగా చూపించటం ఈ కాలపు సినిమాల ట్రెండ్!

ఈ కాలంలో అందరి ఇళ్ళల్లో ఉన్నట్టే కూతురో, కొడుకో ఎవరో ఒకరే ఉంటారు. పిల్లల గొంతెమ్మ కోరికలు తీర్చటానికి తల్లిదండ్రులు ఉద్యోగాల్లో పుష్కలంగా సంపాదిస్తూ ఉంటారు కనుక పిల్లలకి బాధ్యత తెలియక్కరలేదు. ఒక రూపాయి సంపాదించక్కరలేదు. ఎప్పుడూ చేతిలో బీర్ సీసాతోనో… విస్కీ గ్లాసుతోనో కనిపిస్తూ అది అవసరమన్నట్టు, అదే మన సంస్కృతి అన్నట్టు చూపిస్తున్నారు.

***

యువతకి ఆర్థిక అవసరాలు తీర్చడానికి తల్లిదండ్రులు… బాధ్యతా రహితంగా తిరుగుతూ ప్రేమలు అని తిరగటానికి యౌవనం, ఫ్రెండ్స్ ముఖ్యం అన్నట్టు చూపిస్తున్నారు. అలా యౌవనాన్ని వృథా చెయ్యటం అనేది ఎంత వరకు సబబు అనేది సూచనగా కూడా ఏ చిత్రంలోనూ స్పృశించట్లేదు!

అవసరాలు అనేవి స్వార్జితంతో తీర్చుకోగలిగే బాధ్యత కలిగిన ప్రేమ మధురంగా ఉంటుంది.

ఈ కాలపు యువతని ఆకర్షించటానికి కావలసిన మసాలా అంతా కథలో చొప్పించి… ఆడ-మగ విచ్చలవిడి స్నేహాలు… చేతిలో ఎప్పుడు చూసినా మద్యంతో నిండిన గ్లాసులు… అర్ధరాత్రి దాకా ఒకే రూంలో ఒకే మంచం మీద అర్ధనగ్న వస్త్రాలతో గడపటం చూపించారు. అది అవసరామా? కథకి అది ఏ విధంగానూ ఉపయోగపడదు.

తమకి యౌవనపు ప్రేమ తప్ప బాధ్యతగా బతకటానికి ఏం కావాలో తెలియని స్థితిలో బాధ్యతా రహితంగా తిరిగే యువతకి ప్రతినిధులుగా నాయకుడిని, అతని స్నేహితులని చూపించారు.

సినిమా అంటే ఈ పడికట్టు చట్రంలోనే ఉండాలా?

మంచి కథలని ఎన్నుకుంటే బాగుంటుంది.

యువతకి స్ఫూర్తిదాయకంగా ఉండే చిత్రాల కథల లోపమా?

నిజంగానే యువత ఇలాగే బాధ్యతా రహితంగా ప్రేమల వెనక తిరుగుతున్నారనే భావన వ్యాపిస్తున్నది.

మంచి సినిమాల కోసం ఎదురుచూద్దాం!

Exit mobile version