మేలైన సమాజం కోసం సృజించిన కవిత్వం – ‘చూస్తుండగానే’

3
3

[శ్రీమతి షేక్ కాశింబి గారి ‘చూస్తుండగానే’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని శ్రీమతి షేక్ కాశింబి గారి తాజా కవితాసంపుటి ‘చూస్తుండగానే’. ఇందులో 58 కవితలున్నాయి. “తనదైన దుఃఖాన్ని లోకానుభవంతో జోడించి కవిత్వం రాస్తున్న కవయిత్రి కాశింబి. నానాటికి కనుమరుగైపోతున్న మానవీయ విలువల పట్ల ఆర్తిగా, ఆర్ద్రంగా రాసిన కవిత్వమిది” అన్నారు డా. రాధేయ తమ ముందుమాటలో.

రైతులు, సైనికులు, యుద్ధాలు, కరోనా, అవినీతి, డ్రగ్స్, అనాథ బాలలు, స్నేహం, భారతీయత, మాతృభాష, అమ్మ, వంటి వస్తువులతో అల్లిన కవితలివి.

~

ఎన్నో కష్టాలకోర్చి, శ్రమపడి దేశానికి రక్షణగా నిలిచే సైనికుడిని నిత్యవందనం ఎందుకు చేయాలో ‘ముద్దు బిడ్డడు’ అనే కవితలో హృద్యంగా తెలిపారు. “రెప్ప వేయడం మరిచి/ముప్పు నదుపు చేస్తూ/చీకట్లోనూ చిరుతలా దుముకుతూ/సరిహద్దు నిఘా నేత్రమౌతాడు” అంటూ సైనికుల కృషిని గుర్తు చేస్తారు.

అది ఉండాల్సిన మనిషి మనసులో తప్ప – అన్ని చోట్లా – కనబడుతోంది ప్రేమ అంటూ ‘నేడు’ అనే కవితలో వ్యాఖ్యానించారు. వర్తమాన సమాజాన్ని అత్యంత సన్నిహితంగా పరిశీలించిన మీదటే ఈ కవిత పుట్టిందని అర్థమవుతుంది పాఠకులకి.

మద్యపాన ప్రియులు కూడే స్థలం ఎంత వేడుకగా ఉంటుందో ‘అక్కడ’ కవిత చెబుతుంది. ఆ స్థలం కళకళలాడిపోతుంటే, ఊరు చీకటితోనూ, వీధులు బురదతోనూ, ఇల్లు వైరాగ్య ధూపంతోనూ వెలవెలబోతుంటాయంటారు కవయిత్రి. లోతైన భావంతో, వేదన నిండిన ఉద్వేగంతో అల్లిన కవిత ఇది.

దుఃఖానికి సూచికే అయినా, దుఃఖానికి ఉపశమనం కూడా అదేనంటూ అశ్రుబిందువుని మెచ్చుకుంటారు ‘కన్నీటి చుక్కా’ అనే కవితలో. ‘ఆల్ట్రా మోడరన్’ అనే కవిత సాహితీకిరణం వారి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది కవితల పోటీలో తృతీయ బహుమతి ₹ 1500/- పొందిన కవిత. ఈ కవితలో ఆధునిక మానవుడు మాయతో చేసే నయవంచనని కళ్ళకు కడతారు.

పౌరులు అవినీతిపరులవుతుంటే, స్వార్థపరులవుతుంటే, వ్యామోహాల్లో కొట్టుకుపోతుంటే భారతమాత అంతరంగ వేదన ఎలా ఉంటుందో ‘ఫీనిక్స్’ కవిత చెబుతుంది. ఇంటి యజమానిలో తలెత్తుతున్న అవినీతి జాడలను కుటుంబ సభ్యులు ముందే పసిగట్టి సకాలంలో హెచ్చరిస్తే, తప్పుటడుగు వేసే ప్రమాదం ఉండదని ‘ఉరితాడు’ కవిత సూచిస్తుంది.

రష్యా – ఉక్రెయిన్, పాలస్తీనా-ఇజ్ర్రాయిల్ దేశాల మధ్య గత కొన్నేళ్ళుగా నడుస్తున్న యుద్ధం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తోందో మనకి తెలిసినదే. రణం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని ‘యుద్ధం’ అనే కవితలో విస్పష్టంగా తెలిపారు కవయిత్రి. “గెలిచినా తలెత్తి గర్వించనీయని పెనుబాధ ఇది” అంటారు. “ఒక్కసారైనా హితం కూర్చని సంపూర్ణ విపత్తు ఇది” అని అనడంలో కవయిత్రి లోని వేదన అర్థమవుతుంది.

తానెవరో, ఎందుకు, ఎక్కడ, ఎలా ఉంటాడో దేవుడు చెబుతున్నప్పటికీ, మానవుడు నిత్యశంకితుడై దైవం ఉనికిని గ్రహించలేకపోతున్నాడని ‘దేవుడు-మానవుడు’ కవితలో గొప్పగా చెప్పారు.

మాతృదినోత్సవం సందర్భంగా రచించిన ‘తొలి వందనం’ కవిత అమ్మలకి ప్రణమిల్లుతుంది. ‘తొలిమెట్టు’ కవిత మాతృభాష అవసరాన్ని, గొప్పతనాన్ని చాటుతుంది.

యువతరాన్ని మత్తుకు బానిసలుగా మారుస్తున్న డ్రగ్స్ వాడకంపై కవయిత్రి సంధించిన కవితాస్త్రం ‘చూస్తుండగానే’. స్వస్థ సమాజాన్ని పరిరక్షించుకునేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఈ కవిత సామాజిక బాధ్యతని గుర్తు చేస్తుంది.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన కొందరు వీరులను స్మరిస్తుంది ‘అమృతోత్సవ దీపాలు’ కవిత. ఆ దీపాల వెలుగులో భావితరాలకు దారి చూపాలంటారీ కవితలో.

రైతులని నిర్లక్ష్యం చేయటం ఎంత దారుణమైనదో ‘అమానుషం’ అనే కవిత చెబుతుంది. “ఆకలి దప్పులు/ సోకకుండా అమృతం తాగినవాళ్ళు/మెతుకుల సృష్టికి/బతుకుల్ని తాకట్టు పెట్టేవాళ్ళు” అంటూ కర్షకుల దైన్యాన్ని కళ్లకు కడతారు.

ఆధునిక స్త్రీ ఇదివరకటిలా సులువుగా మోసపోదని చెప్పే కవిత ‘ఆమె’. “అనురాగపు పాల గాఢతని/పరీక్షించాకే అంగీకరించే లాక్టోమీటర్” అనీ, “అందమైన అబద్ధాల ఆంతర్యాన్ని/ఇట్టే పసిగట్టి నడుచుకునే లై డిటెక్టర్” అనీ నేటి మహిళను అభినందిస్తారు కవయిత్రి.

క్రూరమృగాల కన్నా మానవులే ప్రమాదకరమని ‘మనిషే’ అనే కవిత చెబుతుంది. తమకి ఉన్నవాటిని వదిలి లేని వాటి గురించి బాధపడుతూ, జీవితాన్ని వ్యర్థం చేసుకునే మనుషుల స్వభావానికి ‘మానవ నైజం’ కవిత అద్దం పట్టింది.

ప్రముఖ సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. గుణగణాల్ని ప్రస్తావించిన కవిత ‘ఒక్కరు’. డా. బి. ఆర్. అంబేద్కర్ సేవలను మరోసారి స్మరించుకుంటూ వారికి నివాళి అర్పించిన కవిత ‘అతడే’.

నమ్మకం ఎంత విలువైనదో ‘అది’ అనే కవితలో చెప్తారు కవయిత్రి. ఆధునిక సమాజ పోకడల దుష్పరిణామాలకు పిల్లలు ఎలా బలైపోతున్నారో ‘భావి తరం’ కవిత వెల్లడిస్తుంది.

ప్రస్తుత కాలంలో మగమృగాల ఆలోచనలు ఎలా ఉంటున్నాయో చెప్పిన కవిత ‘ఔను.. మేం..’. ప్రైవసీ పేరుతో ఏకాంతాన్ని కోరుకుంటూ, అనుబంధాలకూ, స్నేహాలకు దూరమవుతున్న కొందరి యువతీయువకుల ఆలోచనా తీరుని చాటింది ‘ప్రైవసీ’ అనే కవిత.

అనాథ పిల్లలని ఉద్దేశించి వ్రాసిన ‘మనలో ఒకరు’ కవిత హృదయాన్ని బరువెక్కిస్తుంది, కళ్ళని చెమరింపజేస్తుంది. దసరా పండుగ సందర్భంగా గ్రామాలలో జరిగే వేడుకల్లో జనాలు వేసే దొంగ, పులి, పిట్టల దొర వంటి వేషాలు ఆధునిక మనుషులు వేస్తున్న వేషాల ముందు వెలవెలబోతున్నాయని ‘దసరా వేషాలు’ కవితలో అంటారు కవయిత్రి.

కరోనా వల్ల ఎంతో నష్టం జరిగినా, కాస్తో కూస్తో మేలు కూడా జరిగిందని చెబుతుంది ‘70 ఎం. ఎం.’ అనే కవిత. మనుషులలో వస్తున్న మార్పుల వల్ల తాను ప్రభావితమవుతున్నానీ, తనని వెంటనే స్వస్థపరచమని మనసు అడగడం ‘స్వస్థత’ అనే కవితలో చూస్తాం. చదువరులను ఆలోచింపజేస్తుందీ కవిత.

సెల్‍ఫోన్, ఇంటర్నెట్ – మనుషులని ఎంతగా ఏమారుస్తున్నాయో ‘తీరిక’ అనే కవితలో చెప్తారు కవయిత్రి. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుందీ కవిత. స్వార్థాన్ని విడనాడాలనీ,  నా అనే భావనని వదిలి మన అనే భావనని అలవర్చుకోవాలని సూచిస్తుంది ‘గెలుపు’ అనే కవిత.

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రాసిన ‘నిజమైన నేస్తాలు’ కవిత పుస్తకాల గొప్పదనాన్ని చాటుతుంది. మాతృభాష ప్రయోజనాన్ని స్పష్టం చేసిన కవిత ‘ఋతం’.

అనురాగం నిండిన అమ్మ ప్రేమని వెల్లడిస్తుంది ‘ఉమ్మడి సంపద’ కవిత. వృద్ధులను నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించే కవిత ‘గోడలు’. ఇంట్లోని పెద్దవాళ్ళుంటే ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ‘జీవన తత్వం’ కవిత చెబుతుంది.

~

వ్యక్తిగా ఎదగడానికి, కుటుంబానికీ, సంఘానికి ఉపయోగపడడానికి ఏం చేయాలో ఈ కవితలు చెప్తాయి. వ్యక్తి మారితే సమాజం మారుతుంది. వ్యక్తుల్లో వచ్చే మంచి మార్పు సమాజానికి హితకారిణి అవుతుంది. ఆ దిశగా ప్రేరేపిస్తాయి శ్రీమతి షేక్ కాశింబి కవితలు!

***

చూస్తుండగానే (కవిత్వం)
రచన: షేక్ కాశింబి
పేజీలు: 112
వెల: ₹ 120
ప్రతులకు:
షేక్ కాశింబి
ఫ్లాట్ నెం. 101, వైష్ణవి ఆర్చిడ్స్,
1వ లేన్, విజయపురి కాలనీ,
జె.కె.సి. కాలేజీ రోడ్,
గుంటూరు – 522 006
ఫోన్: 9052216044

 

~

శ్రీమతి షేక్ కాశింబి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-shaik-kasimbee/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here