Site icon Sanchika

చూస్తుండగానే..

[శ్రీమతి షేక్ కాశింబి రచించిన ‘చూస్తుండగానే..’ అనే కవితని అందిస్తున్నాము.]

[dropcap]వి[/dropcap]లువైన మన రేపటి తరం
మాటల మామిళ్ళలో పరుగుల వేగం
బుగ్గల నిగనిగల్లో గులాబీల నిగ్గులు
మెరిసే కళ్ళల్లో సంతోషపు దివ్వెలు
క్షీణిస్తున్నాయి.. చూస్తుండగానే..!

వడలిన తరువుల్లా.. వడబడిన తనువులు
నెర్రెలుబారిన బీడుల్లా.. ఎండిన అధరాలు
నిస్సహాయతకి నిలువుటద్దాల్లా.. చిన్నబోయిన వదనాలు
నిర్లిప్తతా పర్వతాల్లా స్పందించని హృదయాలు
వృద్ధి చెందుతున్నాయి.. చూస్తుండగానే..!

వారి నరాలపై మత్తుమందులు పెత్తనం సాగిస్తూ..
వారి మెత్తని మనసుల్ని మొత్తంగా గుప్పిట బంధిస్తూ..
వాళ్ళు మరల లేనంతగా వ్యసనాలపై మరులు రేపి
వార్ని మరల్ని చేసి రిమోట్‌తో ఆడిస్తున్నాయి
కీలుబొమ్మలుగా మారుస్తున్నాయి.. చూస్తుండగానే..!

చిన్నారుల జీవన చివుళ్ళు వేటగాళ్ళ ఘాతాలకి
చిరిగి చీలికలై.. ఉనికి కోల్పోవడం
చిరుమొగ్గలు విరియకనే వంచకుల ఉచ్చులో
చిక్కి, నేలరాలి, మట్టిలో కలవడం
నిత్యకృత్యంగా మారింది.. చూస్తుండగానే..!

పదునైన చట్టాల వలకి కంతలుపెట్టి
పకడ్బందీ నిఘానేత్రాలకి గంతలు గట్టి
మామూళ్ళ మత్తులో అధికారుల్ని జోకొట్టి
మదిమెచ్చే కానుకల్లో నేతల్ని కాకాబట్టి
బలుస్తున్నారీ నరహంతక బేహారులు.. చూస్తుండగానే..!

సాంతం మునిగేదాకా.. మీనమేషాలు లెక్కిస్తుంటే..
నష్టపు శాతం నూటికి.. నూరవదా?
ఎవరికి వారు చేతలుడిగి చోద్యం చూస్తుంటే..
చేవలేని యువతతో దేశం నిర్వీర్యమవదా?
అంటువ్యాధిలా ప్రబలిందీ జాడ్యం.. చూస్తుండగానే..!

ఇప్పటికైనా స్పృహలో కొచ్చి..
జనజాగృతే సంస్కరణ కాద్యమని..
నవతరం శ్రేయస్సే దేశ మూలధనమని గ్రహిద్దాం!
అంజనీ పుత్రులమై.. లోనిశక్తిని వెలికి దీసి
బొరియల్లో నక్కిన జిత్తులమారి నక్కల పని బడదాం!
స్వస్థ సమాజాన్ని స్వయంగా పర్యవేక్షించుకుందాం..
ఇంకేమాత్రమూ ఉపేక్షించకుండా!

Exit mobile version