పాలగిరి విశ్వప్రసాద్ కథల్లో కనిపించని పాత్రలు – కరవు, డబ్బు!

1
1

[box type=’note’ fontsize=’16’] “సమాజ చలనాన్నీ, గమనాన్నీ, పరిణామాన్నీ, పరివర్తననీ కూడా తన ప్రాపంచిక దృక్పథం కోణంనుంచి కథాగతం చేశారు పాలగిరి విశ్వప్రసాద్” అని “చుక్క పొడిచింది” కథా సంపుటిని విశ్లేషిస్తున్నారు విహారి. [/box]

[dropcap]తె[/dropcap]లుగు కథా సాహిత్యంలో రాయలసీమకు చెందిన రచయితలది ప్రత్యేక స్థానం. అక్కడి ప్రజల జీవన విధానాన్నీ, వారి రాజకీయ, సాంస్కృతిక వారసత్వాన్ని అంతకు మించి ఆ ప్రాంతం ‘పేరు’ గడించిన స్పర్ధలూ, కక్షలూ, కార్పణ్యాల గురించీ, అతివృష్టీ అనావృష్టీ గురించి, సేద్యం లాటరీగా మారి రైతు బతుకుని అతలాకుతలం చేస్తున్న వైనం గురించీ – ఆ సీమ రచయితలు విస్తృతంగా కథానికలు రాశారు, రాస్తున్నారు. వారిలో ఎవరి స్వరం వారిది. ఎవరి ఆర్తి వారిది. ఎవరి కథాశిల్పం, భాషా వారిది. సీమ కథకుల్లో పాలగిరి విశ్వప్రసాద్ ఒక వేదనా స్వరం, ఒక భిన్న స్వనం. ఆయన ‘చుక్క పొడిచింది’ కథలు చదివినప్పుడు – ఒక రచయిత తన రచన ద్వారా పాఠకుని ఎంతగా ఆలోచనా ప్రేరకం చేయగలడో, ఎంతగా అతనికి తెలిసీ, తెలియని లోకాల్ని దర్శింపగలడో అర్థమవుతుంది. అంతేగాక, ఎంతగా చదువరి బుర్రని గిరికీలు కొట్టించగలడో కూడా అనుభవంలో కొస్తుంది.

మనిషి‘ కథలో రాంరెడ్డినీ, అతని బాధ్యా వ్యథల్నీ మనస్తత్వంలోని – లోపిరికివెలిపిరికి స్వభావాల్ని చూసి గుండెలు మండించుకుంటాము. రాంరెడ్డి సాధారణ రైతు. కొడుకు ఇంటర్‌లో ఉన్నాడు. పెళ్ళి చేయవలసిన ఇద్దరు కూతుళ్ళు. ఇప్పుడు తండ్రి హాస్పటల్లో ఉన్నాడు. రెండు వారాలైంది. నూర్లు నూర్లు బిల్లులు కడ్తున్నాడు. ఏం మాయదారి జబ్బో, ఎవరూ చెప్పరు. రోగం దారి రోగందీ, వైద్యం దారి వైద్యందీ ఉంది. అతని మనసు పరిపరి విధాల పోతోంది. ‘కాటికి కాళ్ళు చాచిన తండ్రి కోసం – నూరేళ్ళు బతకవలసిన పిల్లల కోసం దాచిన పిడికెడు శ్రమ ఫలితాన్ని ధారపోయలేడు. ముసిలోడి రోగం తనను నిలువునా బతికుండగానే పీల్చి పిప్పి చేసి, పీనుగును చేసేటట్లుంది… అంతకన్నా ముందే…’ తండ్రి శరీరానికి అమర్చిన ఒక పరికరాన్ని తానే తొలగిస్తే…? పీడ విరగడవుతుంది!! కానీ, ‘మనిషి’గా, కొడుకుగా తానా పని చేయవచ్చునా? సంక్లిష్టమైన వాతావరణం. మంచీ చెడుల మధ్య సంఘర్షణ. అసలు ఏది మంచి. ఏది చెడు? ఇవన్నీ ఆలోచిస్తూ కూచుంటే – బిల్లులకి ‘డబ్బు’…? రేపటి దుస్థితి…? చిత్రమైన సందర్భం! రాంరెడ్డి అడుగులు వేస్తున్నాడు! తనతో తాను పోరాడి, తనలో తాను వితర్కించుకుని – గెలిచి ఓడాడో, ఓడి గెలిచాడో తెలియని నిస్సహాయతలో కూరుకుపోయాడా ‘మనిషి’! రాంరెడ్డి బతుకు చిత్రాన్ని – ఇటు బాహిరమైన ఊగులాటనీ, అంటు అంతరంగంలోని కల్లోలంనీ – సంయమనంతో పఠితకు దృశ్యమానం చేశారు రచయిత. వైవిధ్యమైన వస్తురూపాల కలయికని చూపారు. కడప జిల్లా మాండలికంలోని జీవనాదం, దాని గుండెలోని శ్రుతిలయలూ చదువరికి అపూర్వానుభూతిని కలిగిస్తాయి.

అన్నం చూపి ఎదుటిమనిషిని ఆడించే దాతృత్వం – ఒక నీచ మనస్తత్వం. అందునా ఒక పిచ్చిదాని ఆకలితో వినోదించే సంబరం – దుర్మార్గానికి పరాకాష్ట. దాన్ని నిరసించి, ప్రతిఘటించబోతే ఎదురయ్యే ప్రశ్న “అది నీకేం చుట్టమా? చెల్లెలా?” అనేదయితే వినే మిత్రుడిలో ‘ముసురు‘ దట్టంగా, అగమ్యగోచరంగా – అలముకోదా మరి?! ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ కనుక దాన్ని చేరుకోవటానికి ఆకలి పడే తాపత్రయాన్నీ, దాన్ని చేర్చటానికి – ఉన్నవాడి ‘గుప్పిట చేసే విన్యాసాల్నీ’ – ‘ముసురు’ కథలో చూస్తాము. సమాజం పోకడ మీదా, మనిషి పశుప్రవృత్తి మీదా మొత్తని పులిలా నిరసన పంజాని ప్రయోగించారు విశ్వప్రసాద్.

‘చెప్పు కింది పూలు‘, ‘తోలు బొమ్మలు‘ – రెండు కథలూ దళిత జీవన ఛిద్ర దృశ్యాల్నే చూపుతాయి. “తమ కాళ్ళపై తాము నిలబడి… తమ అవసరాలు తీర్చుకుని… తాము కోరుకున్నట్టు తాము బతికే పరిస్థితి రానంత వరకూ దళితుల బతుకు పరాధీనమే…” అంటుంది ‘చెప్పుకిందిపూలు’. ‘ఎంత చెట్టుకు అంతగాలి’ అన్నట్టు ఎంత చిన్నవాడికి – అంత కోరిక ఉంటుంది. అది ‘పెత్తనం’ చెలాయించాలనే కోరిక. చిన్నవాడిలో ఈ కోరిక, బలహీనతనే పెద్దలు తమ స్వార్థానికి వాడుకుంటారు. అప్పుడిక చిన్నవాడు పైవాడి చేతిలో కీలుబొమ్మే! ఇదీ ‘తోలుబొమ్మలు’లోని ఇతివృత్తం. రెండు కథల్లోనూ – ప్రెసిడెంట్ల సన్నజీవాలతో ఎలాంటి వ్యూహరచనతో ఆడుకున్నారో చదివిన పఠిత పిడికిలి బిగుస్తుంది! ఈ కథల్లో సంఘర్షణకు గురి అయ్యే సంఘటనలూ, ఆ సంఘటనలు సంభవించే సన్నివేశాలూ ఎంత సహజంగానూ, సంభావ్యతతోనూ జరిగిపోతాయి. సెల్లెల్ని ప్రెసిడెంటు కాడికి పంపే – గున్నయ్యని ‘చెప్పుకిందిపూలు’ కథలోనూ, తన పెళ్ళాన్ని రాఘవరెడ్డి పక్కలోకీ, వదెన్ను ప్రెసిడెంటు పక్కలోకీ పంపేందుకు ఉత్సాహపడే సన్నప్పను ‘తోలుబొమ్మలు’ కథలోనూ చూసి – వారికా స్థితిని కల్పించిన శక్తుల మూలాల్ని వింగడించుకుంటాడు పఠిత. అప్పుడే అతనిలో భావాత్మకంగా, క్రియాత్మకంగా మార్పు రావటానికి అవకాశం కలుగుతుంది. సూక్ష్మదృష్టితో చూస్తే ఇదే – కథ సాధించే సామాజిక ప్రయోజనం!

ఫాక్షన్ రాజకీయాల్లో పైపైన కనబడే ఘటనలూ, దృశ్యాలూ వేరు, లోపల మనుషుల మనోవల్మీకాల్లో బుస గొట్టే కక్షలూ, పగలూ, ద్వేషాలూ వేరు! ఈ దుష్ట సంస్కృతికి చరమగీతం పాడాలనే ఆకాంక్షతో – రెండు కథల్లో – ఇద్దరు స్త్రీలు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. వారు ‘చుక్క పొడిచింది‘లో రవీంద్రారెడ్ది భార్య సుజాత, ‘కరువొచ్చె… కక్షలూ వచ్చె‘లో శ్రీరాంరెడ్ది భార్య శ్రీకళ. వీరిలో సుజాత భర్తను పోగొట్టుకున్న మహిళ. అయినా, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, ఏ కోశానా తనలో ప్రతీకార వాంఛని పెంచుకోకుండా, మెట్టినింటి నుంచీ బయటకి నడుస్తుంది. కాగా, శ్రీకళ – భర్త మదిలోకీ, తమ వారి బుర్రల్లోకీ – ఈ కక్షలకూ, కార్పణ్యాలకూ అసలు కారణాన్ని ప్రసరింపజేస్తుంది. చివరికి ఆ ఆలోచన సుడి ఆమె భర్త మనసులో – మసకమసగ్గనే అయినా – ‘మనం దేని కోసం కొట్టుకుంటాన్నెట్ట?’ అనే ప్రశ్నని రేకెత్తిస్తుంది. ఫాక్షన్ హత్యల అసలు కారణం ‘కరువు’ అని ధ్వనిస్తాడు రచయిత.

‘బతుకు బండి‘ ఒక గడుసు కథ. వస్తువులో ఒక సామాజిక దుర్మారగం కేంద్రకంగా నిలుస్తుంది. ఇతివృత్తం అద్భుతంగా ‘మనిషి’, ‘ఉదాసీనత’పైన విస్తరించింది. ఈ రెంటికీ లోపలి పొరల్లో – ఉన్నవాడు లేనివాడిని చూసే చూపు మానవతకే సవాలుగా తన వికృతాన్ని బహిర్గతం చేస్తుంది. కథ చదవడం పూర్తయినాక చదువరిని రచయిత అంతర్వేదన బాధిస్తుంది, వెంటాడుతుంది. ఇది సారథి కథ. ‘దాదర్ ఎక్స్‌ప్రెస్ అప్పుడే కదుల్తా ఉంది’తో మొదలవుతుంది. అతను సమాజం దృష్టిలో రౌడీ. ఐదేళ్ళ  పిల్లవాణ్నీ, మూడేళ్ళ పిల్లనీ అందిన రైలు పెట్టెలోకి తోసేసి, తానూ ఎక్కబోతుంటే లోపలున్న పెద్దమనిషి ఇంగ్లీష్‌లో, తమిళంలో కసురుకుంటూ ఇతన్ని క్రిందకి తోసేసే ప్రయత్నం చేస్తాడు. సారథికి తెగింపు వచ్చి జేబులో వున్న ‘బటన్ నైఫ్’ని ఒత్తి ఆయన్ని బెదిరించాడు. ఆ వ్యక్తి వెనక్కి తగ్గాడు. ఇతర్ను లోపలికి చేరాడు. అదొక ఫస్ట్ క్లాస్ బోగీ. ‘రైలు వేగం పుంజుకుంది’. సారథి గత జీవితచక్రం తిరుగుతోంది. మధ్య మధ్య స్టేషన్లలో ఆగటం, లోనున్న ‘పెద్దమనుషులు’ ఈ చిల్లర మనుషుల్ని చూసి తమ తమ ప్రకృతీవికృతులను ప్రదర్శించటం… జరిగిపోతున్నది. ఇంతలో దోపిడిదొంగల ముఠా ఒకటి బోగీలోకి ప్రవేశించింది. వారిలో ఒకరిని తన ‘నైఫ్’ చూపి, పట్టుకుని దోపిడినీ తప్పిస్తాడు సారథి. పోలీసుకు రంగప్రవేశం చేశారు. ముఠాని దించారు. వాళ్ళతో సారథినీ, అతడి పిల్లల్నీ కూడా దించారు. పోలీసుకు ఇతను చెప్పే తన కథనీ, నిజాన్నీ వినరు. బోగీలోని పెద్దలెవరూ ఇతను చేసిన సహాయాన్ని గురించి గానీ, సాహసాన్ని గురించిగానీ పెదవి విప్పరు. ఇంతలో ముఠాలోని వ్యక్తి ఒకడు – కసికొద్దీ – “వీ హమారా హీ ఆద్మీ హై సాబ్” అని చెబుతాడు, పోలీసులతో. వారు సారథిని ‘దోషి’గా నదిపిస్తున్నారు! ఇదీ కథ! తునకలు తునకలుగా చెప్పబడి ఉత్కంఠ అద్భుతంగా పోషించబడింది కథలో. రైలు ప్రయాణాన్ని జీవనగమనానికి అన్వయిస్తూ చేసిన కథన విధానం మనసుని ఆకట్టుకుంటుంది. ఈనాటి సమాజపు రీతీ రివాజునీ, మనుషుల స్వార్థాన్నీ కుడిఎడమల బలహీనునిపై డబ్బుగల వారి దాడినీ పారదర్శకం చేసింది కథ. ఐశ్వర్యం ఎదుట దారిద్ర్యం, అధికారం ఎదుట అసహాయత, ఆధిపత్యం ఎదుట అమాయకత్వం – తమ ఘోషనీ, నిర్దోషిత్వాన్నీ వ్యక్తీకరించే అవకాశం లేకుండా చేస్తున్న సంఘనీతినీ, వ్యవస్థ అన్యాయాన్నీ ప్రశ్నకు పెడుతూ విస్మయం కలిగిస్తుందీ – ‘బతుకుబండి’!

అసలే స్త్రీపురుషుల సంబంధాలు సంక్లిష్టమైనవి. అందునా వివాహేతర సంబంధాలు ఇంకా సంకీర్ణమైనవి. ఆ సంక్లిష్టతనీ, ఈ సంకీర్ణతనీ ఉపరితలానికి తెచ్చి, లైంగికతలోని ‘లోగుట్టు’నీ, ‘డబ్బు’ పాత్రనీ బహిర్గతం చేస్తూ ‘కరివేపాకు‘ కథని రాశారు విశ్వప్రసాద్. అలాగే, భార్యాభర్తలు ఇద్దరూ – నీతీ, అవినీతీ మధ్య విభజన రేఖల్నీ చెరిపేసుకుని కోర్కెల పాముల్లా పెనవేసుకుపోతే, బతుకు నికృష్టం కాక మరేమవుతుంది. అదొక పళ్ళచక్రం తిరుగుడు. ఈ వైచిత్రినే ‘పాములు‘ కథలో చిత్రించారు.  ‘డబ్బు సృష్టించే మయ సభలో ప్రతి మనిషీ దుర్యోధనుడే’ అనే సందేశంతో – కార్యకారణ సంబంధాల విశ్లేషణకి లొంగని – ‘చెదిరిన చిత్రం’ కథనీ శిల్పభరితం చేశారు.

కథారచన ద్వారా కడప జిల్లా సామాజిక చరిత్రని రికార్డు చేయాలనే నిబద్ధత కలిగిన రచయిత విశ్వప్రసాద్. అందుకనే, సమాజ చలనాన్నీ, గమనాన్నీ, పరిణామాన్నీ, పరివర్తననీ కూడా తన ప్రాపంచిక దృక్పథం కోణంనుంచి కథాగతం చేశారాయన. ఈ ‘ప్రాసెస్’లో భాగంగా – బహిరంతరాల్లో అతలాకుతలమైపోతున్న ఆ ప్రాంత ‘మనిషి’ స్వరూప స్వభావాల్ని – చదువరులకి ఆశ్చర్యజనకమైన చిత్రవర్ణపట్టకంలో దర్శింపజేశారు. శ్రీశ్రీ అన్నట్టు ‘బాధ కవిత్వానికి (మాత్రమే) పర్యాయపదం’ కాదు, కథకు కూడా అని తన రచనల్లోని అంతర్వేదన ద్వారా తేటతెల్లం చేశారు.

కథాసాహిత్యంలో అనేక కొత్త కొత్త అంశాలు చర్చకు వస్తున్న సందర్భంలో విశ్వప్రసాద్ – మధురధ్వనిని ప్రసరిస్తున్న సీమ భాషలో, సీమ మనిషి జీవితాన్ని కథాత్మక వాస్తవికతతో చిత్రిస్తున్నందుకు శతథా అభినందనీయులు!!

***

నేత్రం పబ్లికేషన్స్, కడప వారు ప్రచురించిన 2006లో ప్రచురించిన ఈ పుస్తకంలో 148 పేజీలున్నాయి. వెల రూ.40/-

ప్రతులు ఆనంద్ బుక్స్, గుంటూరు వారి వద్ద లభిస్తాయి.

http://www.anandbooks.com/Chukka-Podichindi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here