Site icon Sanchika

చూపుడువేలు కాక మిగతా నాలుగు వేళ్ళు

[dropcap]అ[/dropcap]న్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న మాధవ కొడుకు కిరణ్ ఏడుపు వినబడటంతో ఆ వైపు చూశాడు చిరాగ్గా.

అతడికి స్వంత ఇంట్లో గ్రిల్ బయట కూర్చుని తినటం ఇబ్బందిగా ఉంది. కోపంగా ఉంది. చిరాకుగా ఉంది.

అప్పటికే కాలనీలో వాళ్ళు వాళ్ళని అంటరానివారుగా చూస్తున్నారు.

“రోజంతా డ్యూటీ చేసి వస్తాడు. ఎక్కడెక్కడ ఏమేం అంటించుకుని వస్తాడో? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ఎలా వస్తుందో తెలియదు. ఒకడికి వస్తే అందరికి వస్తుంది. మీ వల్ల కాలనీ అంతా కరోనా ప్రభావంలో పడుతుంది” అంటూ అందరూ సూటీ పోటీ మాటలు అంటున్నారని దూరం పెడుతున్నారని అతని భార్య రాధ చెప్పింది.

“అనేవాళ్ళు అనుకుంటారు. మన జాగ్రత్తల్లో మనం ఉంటాం. అదీగాక అందరూ ఇళ్ళల్లో కూర్చుంటే ఎవరో ఒకరు బయట పనులు చేయాలి కదా!” రాధని సముదాయించేవాడు మాధవ.

కానీ ప్రజల ప్రవర్తన అతనికి విసుగు తెప్పిస్తోంది.

తమ మంచికోసమే ‘లాక్‍డౌన్’ విధించి ఇళ్ళల్లోంచి బయటకు రావద్దంటే ప్రతి ఒక్కరు బయటకు రాకపోతే ప్రాణాలు పోయేట్టు చేస్తున్నారు. వాళ్ళని బతిమిలాడి ఇళ్ళల్లోకి పంపించాలి. కొండకచో బలప్రయోగం చేయాల్సి వస్తోంది.

బలప్రయోగం చేస్తే అదో గొడవ.

మంచిమాటకు వినేవాళ్ళయితే ప్రధానమంత్రి లక్ష్మణరేఖ గీసి పసిపిల్లలకు చెప్పినట్టు చెప్పినప్పుడే వినేవారు.

అదీగాక డ్యూటీకి వెళ్ళి నప్పటినుంచీ  తాను కలవాల్సి వచ్చిన వారిలో ఎవరికి కరోనా ఉందో, ఎవరి నుంచి ఏం సోకుతుందో అని తెలియని భయం మనసుని వదలటం లేదు. అందుకే వీలైనంతగా పోలీసు స్టేషనులోనే ఉండిపోతున్నాడు.

రెండూ మూడు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చిపోతున్నాడు. అప్పుడు కూడా ఇంట్లోకి రావడం లేదు. బయట నుంచి అందరినీ పలకరించి వెళ్ళిపోతున్నాడు. స్వంత ఇంట్లో అంటరాని వాడయ్యాడు. రోజురోజుకీ విసుగు, కోపం, చిరాకు పెరిగిపోతుంది.

అందుకే కిరణ్ ఏడుపు విని అరిచాడు “ఎందుకు ఏడుస్తున్నాడు?”

వాడిని  లాక్కొచ్చి అంది రాధ, దూరంగా నిలబడి .

“పక్కింటి పిల్లలతో ఆడతానంటున్నాడు. వద్దంటే వినటం లేదు. వీడికి సోషల్ డిస్టన్సింగ్ ఎలా వివరించాలో అర్థం కావడం లేదు” అంది రాధ.

పక్కింటివాళ్ళు అనగానే మాధవ ఆలోచనలో పడ్డాడు.

పర్వేజ్, మాధవలు ప్రాణ స్నేహితులు. బాల్య స్నేహితులు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. చదువయిన తరువాత మాధవ పోలీసుల్లో చేరాడు. పర్వేజ్ తన తండ్రి చెప్పుల దుకాణం వ్యాపారం వైపు మళ్ళాడు.

ఇద్దరూ కలిసి ప్లాటు కొన్నారు. కలిసి పక్కపక్కనే ఇళ్ళు కట్టుకున్నారు. పర్వేజ్‍కి చిన్నప్పుడే పెళ్ళయింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళయ్యాయి. మనవళ్ళు ఉన్నారు.

మాధవకు పెళ్ళయి పదిహేనేళ్ళ తరువాత పిల్లవాడు పుట్టాడు. వాడికీ పర్వేజ్ మనవళ్ళతో దోస్తీ.

మాధవకు కిరణ్,  పర్వేజ్ ఇంటికి వెళ్తే అభ్యంతరం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితి బాగాలేదు. ఎవరిని కలిస్తే ఏమౌతుందో అన్న భయం మనుషుల మధ్య నెలకొంది. పర్వేజ్ ఇద్దరు కొడుకులూ ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు వెళ్ళారు. తిరిగి రాలేదు. లాక్‍డౌన్ విధించగానే పర్వేజ్ మాధవ దగ్గరకు వచ్చాడు. ఢిల్లీ నుంచి వాళ్ళు తిరిగి వచ్చేందుకు సహాయం చేయమని అడిగాడు.

మాధవ పై అధికారులను సంప్రదించి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేలోగా, మర్కజ్ సమావేశం విషయం బహిర్గతమయింది.

దేశమంతా మర్కజ్ విషయమై చర్చలు తీవ్రమయ్యాయి. వాదాలు, వివాదాలు, ఆవేశాలు, ఆక్రోశాలు పెరిగాయి.

వెయ్యిమంది మర్కజ్‍ల దోషం కోట్లమంది ముస్లింలపై రుద్ది రాజకీయాలు చేయటం మొదలయింది.

రెచ్చగొట్టటాలు మొదలయ్యాయి.  విచ్ఛిన్నకర వాదనలు తీవ్రతరమయ్యాయి.

ప్రభుత్వం ఒక వర్గం వారిపై దోషం నెట్టే ప్రయత్నం చేస్తోందని కొందరు వాదనలు ఆరంభించారు. సంబంధం లేని వారిలో భయాలు కలిగించి సంకుచితత్వం  పెంచే ప్రయత్నాలు ఆరంభించారు. మైనారిటీలను హింసించి, దేశం నుంచి తరిమే ప్రయత్నం ఇది అని కొందరు ఆరోపించారు. ఎక్కువమంది ఒకచోట గుమిగూడవద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించిన తరువాత అంతమంది ఒకచోట కలవాల్సిన అవసరం ఏముందని? కొందరు ప్రశ్నించారు. కనీసం ప్రభుత్వానికి ఈ విషయం చెప్పి అందరూ కరోనా సోకిందో, లేదో పరీక్షించమంటే బాగుండేదని ఇంకొందరు వాదించారు.

ఓవైపు ఇలా వాదాలు, వివాదాలు, ఆవేశాలు పెరుగుతుండగా మర్కజ్‍కు చెందిన వారనేకులు దేశం నలుమూలలకు వెళ్ళారు.

ఎక్కడ ఉన్నా సరే పరీక్షలు చేయించుకోమన్న విజ్ఞాపనలను పెడచెవిన పెట్టారు. తాము ఈ దేశంలోని ప్రభుత్వాన్ని ఖాతరు చేయం, చట్టాలను గౌరవించటం అన్నట్టు ప్రవర్తించసాగారు.

ఈ సమయంలో ఒకరోజు పర్వేజ్ మాధవ దగ్గరకు వచ్చాడు.

“భాయ్! సుహాన్, అఫ్రోజ్‍లు ఢిల్లీ వెళ్ళారని చెప్పాగదా…”

“అవును. వాళ్ల సెల్‍ఫోన్లు కూడా స్విఛ్ఛాఫ్ అయి ఉన్నాయి. ఢిల్లీలో దొరికిన వాళ్ళల్లో వీళ్ళిద్దరు లేరు” చెప్పాడు మాధవ. “ఎటువెళ్ళారో మీకేమైనా చెప్పారా?” అడిగాడు.

“లేదు భాయ్. నేను కూడా అదే విషయంలో కంగారు పడుతున్నాను. పోలీసులు ఎంతోమందిని పట్టుకుని జైళ్ళలో పెట్టేస్తున్నారని, ఆస్పత్రులలో పెట్టి ఇంజక్షన్లు ఇచ్చి చంపేస్తున్నారని , సమావేశానికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని  జైళ్ళలో పెట్టి కొడుతున్నారని  తెలుస్తున్నది. నాకు భయంగా ఉంది”

“పర్వేజ్ భాయ్! ఎవరో ఏదో చెప్తే అది నమ్మకు. ఇలాంటి సమయంలోనే తుచ్ఛులు నీలివార్తలను ప్రచారంలోకి తెస్తారు. దేశంలో మనుషుల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీసి దేశాన్ని బలహీనం చేయాలని చూస్తారు. అలాంటివేవీ నమ్మకు. ఎవరెన్ని విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించినా మనం లెక్క చేయద్దు. నేను మాధవ, నువ్వు పర్వేజ్… మనం భారతీయులం అంతే . పనిగట్టుకుని ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెచ్చే దుష్టులుంటారు. ఎవరేం చెప్తే దాన్ని నమ్మవద్దు. కానీ ఒకవేళ  నీకు సుహాన్ కానీ, అఫ్రోజ్ కానీ ఫోన్ చేస్తే వచ్చెయ్యమని చెప్పు. నేనున్నాను కదా. చూసుకుంటాను” భరోసా ఇచ్చాడు మాధవ్.”

అప్పుడు పర్వేజ్ అసలు  విషయం మెల్లగా బయట పెట్టాడు.

“భాయ్! సుహాన్ ఫోన్ చేశాడు. వాడికి రావాలని ఉందిట. కానీ భయంగా ఉందిట. ఎవ్వరినీ కలవకుండా ఆసుపత్రిలో బంధిస్తారని, ఏవేవో మందులిచ్చి చంపుతారని ముఖ్యంగా పోలీసులు జైల్లో పెట్టి కొడతారని…”

అతడి మాటలకు అడ్డువచ్చాడు మాధవ.

”చెప్పాగా, అవన్నీ అబద్ధాలు. జైళ్ళలో ఉన్నవాళ్ళనే వదిలేస్తున్న కాలం ఇది. విదేశాల నుంచి టూరిస్టు వీసా మీద వచ్చి మతప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. అంతే… సుహాన్‍కీ, అఫ్రోజ్‍కీ చెప్పు… ఏమీకాదు. వాళ్ళు ఢిల్లీలో సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో కొందరికి కరోనా ఉన్నట్టు తేలింది. కాబట్టి అక్కడ ఉన్నవారందరికీ కరోనా వైరస్ సోకి ఉంటుందన్న అనుమానం ఉంది. కాబట్టి పరీక్షలు చేస్తారు. కరోనా సోకి ఉంటే చికిత్స చేసి, బాగవగానే ఇంటికి పంపించేస్తారు. కరోనా లేకపోతే క్వారంటైన్ పీరియడ్ కాగానే ఇంటికి పంపేస్తారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సమావేశంలో పాల్గొనటం తప్పుకాదు. నేరం కాదు. .కరోనా సోకే అనుమానం ఉందని తెలిసి దాక్కోవటం తప్పు, నేరం. ఇతరులను కలసి వైరస్ ను విస్తరింపచేయటం నేరం. దేశ ద్రోహం కూడా”

కాసేపు మౌనంగా ఉన్నాడు పర్వేజ్. చివరికి మెల్లిగా అడిగాడు. “క్వారంటైన్ లేకుండా ఇంట్లోనే ఉండే అవకాశం లేదా? ఇంట్లో వేరుగా ఉంచుతాం.”

పర్వేజ్ వైపు సూటిగా చూశాడు మాధవ. “పర్వేజ్ భాయ్! తప్పు చేయనివాడు భయపడాల్సిన అవసరం లేదు. మర్కజ్ సమావేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కరోనా గురించి అవగాహన లేదు. అది ఇంత భయానకం అని తెలియదు. అంతెందుకు ముందుగా కరోనా వార్త విన్నప్పుడు ఎక్కడ వూహాన్, ఎక్కడి మనం అనుకున్నాను. కానీ ఇప్పుడు చూశావుగా. అది ఎలా విస్తరిస్తుందో. కాబట్టి సుహాన్, అఫ్రోజ్‍లను ఎక్కడ ఉన్నాసరే తిన్నగా పోలీసుల దగ్గరకో, కరోనా ఆస్పత్రికో వెళ్ళమను. ఎందుకంటే వాళ్ళు కరోనా సోకిన వాళ్ళ మధ్య ఉన్నారు కాబట్టి, కరోనా సోకే అవకాశం ఉంది కాబట్టి. కరోనా ఉందో లేదో, తెలియని స్థితిలో వారు ఎందరిని కలిస్తే ఆ ప్రమాదం అంత పెరుగుతుంది. కరోనా ఉంటే వాళ్ళు కలిసిన వాళ్లందరినీ వేరుగా ఉంచి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో కన్న అసలు ఉందో లేదో తేలేవరకూ ఆసుపత్రిలో ఉండటం మంచిది. ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరిపోదు. ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. అందులో మీ ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉన్నారు. అయినా సరే, నువ్వు జాగ్రత్తలు తీసుకుంటామని వాగ్దానం చేస్తే, నేను అధికారులతో మాట్లాడి, వాళ్ళిద్దరూ ఇంట్లోనే వేరుగా ఉండే ఏర్పాట్లు చేస్తాను” వాగ్దానం చేశాడు మాధవ.

కానీ తరువాత పర్వేజ్ ఏమీ చెప్పలేదు. మాధవ కూడా పనిలో బిజీగా ఉండి అడగలేదు.

“నాన్నా” కిరణ్ పిలుపు విని ఈ లోకంలోకి వచ్చాడు మాధవ.

తండ్రి తనవైపు చూడగానే గారాబంగా అడిగాడు కిరణ్.

“నాన్నా! నేను చున్నుతో ఆడుకుంటాను”

రాధ వైపు చూశాడు. కాంపౌండ్ వాల్‍కు ఆవైపు నుండి ఇటే చూస్తున్న పర్వేజ్  మనవళ్ళ వైపు చూశాడు.

ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అని ఆలోచించాడు.

“నేను ఆడుకుంటాను. వచ్చి  కంప్యూటర్ టీచర్ చెప్పిన హోమ్‍వర్క్ చేస్తాను. “

“చూడు కిరణ్! నేను ఇంట్లోకి ఎందుకు రావటం లేదు?”

“నువ్వు ఇంట్లోకి వస్తే నాకు కరోనా వస్తుందని” ముద్దుగా చెప్పాడు కిరణ్.

“అవునా! కానీ నాకు కరోనా ఉందో, లేదో తెలియదు. కానీ బయట తిరుగుతున్నాను. కాబట్టి వచ్చే అవకాశం ఉంది. అందుకని, నాకు వచ్చినా ఫరవాలేదు. మీకు రాకూడదని, బయటనే ఉండి వెళ్ళిపోతున్నాను. నేను తిన్న కంచం కడిగి పెడుతున్నాను. నేను కూర్చున్న స్థలంలో తరువాత అమ్మ మందు చల్లుతుంది. అవునా?”

“అవును ప్లేటు కూడా ముట్టదు”

“ఇదంతా ఎందుకంటే కరోనా బూచి నీకు రాకూడదని. నన్నే ముట్టనప్పుడు నువ్వు వేరేవాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం మంచిదా? కాదుకదా! కాబట్టి ఇంట్లో ఉండు. అమ్మ చెప్పినట్టు విను”

“కానీ చున్నూ, మున్నూ బయటికి వెళ్ళరు”

“వెళ్ళకూడదు కూడా. కానీ నేను ఇంటికి వచ్చి వెళ్తున్నాను కదా! నా నుంచి ఇంట్లో కరోనా వచ్చే అవకాశం ఉంది. అది కనబడదు కాబట్టి జ్వరం వచ్చేదాకా అది వచ్చిందో లేదో తెలియదు.  కాబట్టి ఎవ్వరినీ కలవకుండా ఉండటం మంచిది. చున్నూ, మున్నూ బయటికి వెళ్ళరు. కానీ వాళ్ళింట్లో వాళ్ళు బయటకు వెళ్తారు కదా!”

“అవును వెళ్తారు” ఉత్సాహంగా అన్నాడు కిరణ్.

బయట ఎండలో ఉన్న పాలప్యాకెట్లను, కూరగాయలను చూపిస్తూ చెప్పాడు మాధవ.

“చూడు ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర కొన్నా సరే, అమ్మ అన్నిటినీ ఎండబెట్టి వాడుతోంది. ఈ జాగ్రత్తలన్నీ మన కోసమే. ప్లీజ్! ఇంట్లోనే ఉండు” అన్నాడు మాధవ అనునయంగా.  అతడికి పిల్లవాడికి దగ్గరకు తీసుకుని హత్తుకోవాలని ఉంది. కానీ మనిషికీ మనిషికీ మధ్య కరోనా గోడ ఉంది.

“నా వల్ల మీకు వైరస్  వచ్చే అవకాశం వుందని నేను ఇంట్లోకి కూడా రావటంలేదు. ఒకవేళ అలా  నీ నుంచి వేరేవాళ్ళకు ప్రమాదం వచ్చే వీలుంటే నువ్వు వాళ్ళని కలుస్తావా? దూరంగా వుంటావా ? నీవల్ల వేరేవారికి కష్టం కలుగుతుందంటే నువ్వు ఆ పని చెయ్యవుకదా! నువ్వు కలిస్తే చున్నూ, మున్నూకి కూడా కరోనా రావచ్చు”

“ఓకే నాన్నా! నేను ఎవ్వరినీ కలవను” వాగ్దానం చేశాడు కిరణ్.

“పిల్లవాడికి ఉన్న తెలివి పెద్దలకు ఉంటే సగం సమస్య తీరేది”

వెనుకనుంచి మాటలు వినిపించడంతో ఆవైపు చూశాడు మాధవ.

గేటు బయట నుంచుని ఉన్నాడు మజీద్. మజీద్ మాధవ కోలీగ్.

“ఇటొచ్చావేమిటి? ఇంట్లోకి పిలవలేను” అన్నాడు మాధవ నవ్వుతూ.

“నువ్వే ఇంట్లోకి పోలేదు. నన్నేం పిలుస్తావ్? డ్యూటీ మీద వచ్చాను” అన్నాడు మజీద్.

ప్రశ్నార్థకంగా కళ్ళెగరేశాడు మాధవ.

“పర్వేజ్ భాయ్ ఇంటికి రాత్రి ఇన్నోవాలో ఎవరో వచ్చారట. కబురందింది. కనుక్కోవాలని వచ్చాను” చెప్పాడు మజీద్.

భార్య వైపు ప్రశ్నార్థకంగా చూశాడు మాధవ.

“నాకేమీ తెలియదు” అంది రాధ.

“ఛలో పర్వేజ్ భాయ్ సే బాత్ కరేంగే” అన్నాడు మజీద్ .

తను వెళ్ళాలా, వద్దా అని ఒక్కక్షణం తటపటాయించాడు మాధవ. కానీ వెంట వెళ్ళాడు. మజీద్‍ని సాదరంగా ఆహ్వానించిన పర్వేజ్ ముఖం మాధవని చూడగానే ముడుచుకుపోయింది. మజీద్ లోపలకు వెళ్ళలేదు.

“రాత్రి మీ ఇంటికి ఎవరో వచ్చారట. సుహాన్, అఫ్రోజ్‍లేమన్న వచ్చారా?” సూటిగా అడిగాడు మజీద్.

“ఎవరో అబధ్దం చెప్తున్నారు భాయ్ నీకు దుర్మార్గులు” అన్నాడు పర్వేజ్ కోపంగా మాధవ వైపు చూస్తూ.

”వచ్చారా? లేదా?” రెట్టించాడు మజీద్.

“ఎవ్వరూ రాలేదు భాయ్” అన్నాడు పర్వేజ్.

“పర్వేజ్! నీమాట మీద నాకు నమ్మకం ఉంది. కానీ రాత్రి మీ ఇంటికి ఇన్నోవా వచ్చినట్టు సమచారం వచ్చింది. భాయ్! ఇవి గడ్డురోజులు. సుహాన్, అఫ్రోజ్‍లు మర్కజ్‍కి వెళ్ళారని తెలుసు. తమంతట తాము ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేసుకోవడం, ఎవరిని కలిశారో నిజాయితీగా చెప్పడం దేశపౌరులుగా వారి బాధ్యత. వాళ్ళు నేరస్తులు కారు. దాక్కోవలసిన అవసరం లేదు. తప్పించుకుని తిరగాల్సిన అవసరం లేదు. సమావేశంలో పాల్గొన్నారు. అక్కడి వైరస్ సోకే ప్రమాదం ఉంది. పరీక్షలు చేసుకుని వైరస్ లేదని నిర్థారించుకుంటే ఎలాంటి సమస్యే లేదు. ఆ పరీక్షలు చేసుకోకుండా, అందరినీ కలుస్తూ చివరికి కరోనావైరస్ ఉందని తెలిస్తే తామే కాదు. ఎంతోమందిని ప్రమాదంలోకి నెట్టిన వారవుతారు. అది దేశద్రోహం కూడా. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారో తెలిసి చెప్పకపోవటం నేరం” తీవ్రంగా అన్నాడు మజీద్.

“భాయ్! నువ్వేమంటున్నావో నాకు తెలియటం లేదు. సుహాన్, అఫ్రోజ్‍లు ఎక్కడున్నారో నాకు తెలియదు. తెలిస్తే మాత్రం నీకు తప్పకుండా చెప్తాను” అన్నాడు పర్వేజ్.

సెలవు తీసుకుని వస్తుంటే మాధవ దగ్గరకు వచ్చి గుసగుసగా చెప్పాడు పర్వేజ్ “నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావనుకోలేదు”

మాధవకు అర్థం కాలేదు.

వాళ్ళిద్దరు బయటకు వస్తుంటే ఇద్దరికీ ఒకేసారి ఫోన్ వచ్చింది. ఫోన్లలో మాట్లాడి ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకున్నారు.

“నీవెక్కడికి?” అడిగాడు మాధవ.

“అబ్దుల్ రహమాన్ మసీదు. ముగ్గురు మర్కజ్‍లు మసీదులో ఉన్నారని సమాచారం వచ్చింది. నువ్వెక్కడికి”

“హబీబుల్ల రోడ్. అక్కడ మదర్సాలో అనారోగ్యంతో ఎవరో ఉన్నారట. కరోనా అని అనుమానం ఉందట”

“ఫిఅమానిల్లా” అన్నాడు మజీద్.

“ఖుదా హాఫీజ్” అన్నాడు మాధవ.

ఇద్దరూ చెరోవైపు తమ వాహనాలను దూకించారు.

***

ఆడి ఆడి నిద్రపోతున్నాడు కిరణ్.

రాధకు నిద్ర రావటం లేదు. ఈ కరోనా ఏమిటో ఆమెకు ఏదో తెలియని గాభరాగా అనిపిస్తోంది. దీనికితోడు మాధవ డ్యూటీలో ఉండటం ఆమె కలవరాన్ని పెంచుతుంది.

పోలీసు ఉద్యోగం అంటేనే అనుక్షణం ప్రమాదాలతో చెలగాటం అని తెలుసు. కానీ ఈ కరోనా లాంటి కనబడని శత్రువుతో పోరాటంలో భాగంగా అందరూ ఇళ్ళు కదలకుండా ఉంటే, తన భర్త ఇంట్లో అడుగుపెట్టకుండా అనుక్షణం ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావటం ఆమెలో భయాన్ని ఆందోళనను మరింత పెంచుతోంది. చూస్తున్న సినిమాపై ఆమెకు మనస్సు నిలవటంలేదు . ఛానళ్ళు తిప్పటం ప్రారంభించింది.

ఓ న్యూస్ ఛానల్లో చర్చ దగ్గర ఆపింది. మర్కజ్ గురించి చర్చ జరుగుతోంది.

“ప్రభుత్వం మైనారీటీలను అనవసరంగా వేధిస్తున్నది. ఇక గతమంతా చెరిగిపోయింది. మాకందరికీ అర్ధమయింది. అందరితో అన్ని బంధాలు, అనుబంధాలు చెరిగిపోయాయి. ఇప్పుడు ఈ దేశంలో ముస్లింలు ముస్లింలు మాత్రమే”  మాట మాటకీ అతని ఆవేశం పెరుగుతోంది.   ఆవేశంగా వాదిస్తున్నాడొకాయన. తనకు చికిత్స చేస్తున్న డాక్టర్లపై ఉమ్మివేయటం, నర్సులను వేధించటం అంతా కుట్రలో భాగం అంటున్నాడు.

రాధకు అర్థం కావడంలేదు అతని వాదన. తమకు చికిత్స చేసేవాళ్ళతో అనుచితంగా ప్రవర్తించడం ఏమిటి? రోగం వచ్చింది. డాక్టరు దగ్గరకు వెళ్తాం. మందులు తీసుకుంటాం. దానిలో ఇంత గొడవ ఏముంది? దాన్లో ఈ చర్చించే ఆయన అంటున్నట్టు “హిందూ – ముస్లిం గొడవ ఏముంది? మైనారిటీ అణచివేత ఏముంది? రోగాలకి మతం ఉందా? వైరస్‍కు ఎవరు ఏమిటో తెలుస్తుందా? అయినా వైరస్ వుందో లేదో పరీక్షించుకోమనటం, మీ వల్ల ఇతరులకు ప్రమాదంవుంది కాబట్టి , తప్పా? అలా అంటే ముస్లింలు వేరని వాదించి రెచ్చగొట్టాలా? అదీగాక తమ చర్యలవల్ల వాళ్ళు ప్రజలందరినీ, దేశాన్నీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని తెలిసీ లెక్కలేనట్టు ప్రవర్తిస్తున్న వారిని సమర్థించటం ఏమిటి? వారి పక్షాన వాదించటం ఏమిటి? తప్పు చేస్తున్నవాడికి బుద్ధీ చెప్పకుండా సమర్ధిస్తే తప్పు చేయటమే మంచిది అనుకోరా?   ఏమాశించి ఇలా సమర్థిస్తూ వాదిస్తున్నారు?

ఆలొచనల్లో ఆమె క్రింద స్ర్కోలింగ్‍లో కనిపించిన వార్తను చూసీచూడనట్టు చూసింది. ఆమె సరిగ్గా గమనించేలోగా వార్త వెళ్ళిపోయింది.

ఎందుకో ఆమె గుండె గుభేలుమంది.

తల తిరుగుతున్నట్టు అనిపించింది.

కడుపులో వికారంగా అనిపించింది.

ఆ వార్త మళ్ళీ తిరిగిరావటం కోసం ఆత్రంగా, అలవికాని భయంతో ఎదురు చూడసాగింది. ఇంతలో టీవీ తెరపై “బ్రేకింగ్ న్యూస్” అన్న అక్షరాలు పెద్దగా ఎరుపురంగు నేపధ్యంలో కనిపించాయి.

చర్చను ఆపి న్యూస్ రీడర్ వార్తను చెప్పడం ఆరంభించాడు.

ఆమె చెవులు వార్తను వింటున్నాయి.

మెదడు గ్రహించడం లేదు.

ఎందుకంటే ఆమె మెదడు తెరపై కనబడుతున్న దృశ్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. పోలీసులు, వైద్యులపై రాళ్ళు రువ్వుతున్నారు అల్లరిమూకలు.

కర్రలతో కొడుతున్నారు.

అంబులెన్స్ పై రాళ్ళు రువ్వుతున్నారు.

తెరపై కనబడుతున్న వాళ్ళు మనుషులు కారనిపిస్తోంది. వారు నాగరీకులులా అనిపించటం లేదు.

అయితే ఆమె దృష్టి వాటిపై లేదు.

తెరపై ఇద్దరు పోలీసులు రోగిని ఏంబులెన్స్ వరకూ తెస్తున్న పారామెడిక్స్ పై దాడి చేస్తున్న అల్లరి మూకలను నియంత్రిస్తున్నారు. మూకల రాళ్ళు, కర్రలు వారి వరకూ రాకుండా చూస్తున్నారు.. గుంపు వారిని కదలనివ్వటం లేదు. వాళ్ళపై రాళ్ళు రువ్వుతున్నారు. పోలీసులను కర్రలతో కొడుతున్నారు. ఆమె దృష్టి  మాధవపై ఉంది. అతడి ముఖమంతా నిండిన రక్తంపై ఉంది.

“వాడిని వదిలేసి రా మాధవ్. వాడిని చంపుకోవాలని వాళ్ళకంత పట్టుదల ఉంటే, వాడిని బ్రతికించాలని నీకెంత పట్టుదల ఎందుకు?” గట్టిగా అరచింది ఆమె మనసు. అంతలో ఆమె మనసు లోతుల్లోంచి ఒక విహ్వలమైన శబ్దం వెలువడింది. పెద్దగా అరిచాననుకుంది ఆమె.

కానీ ఆమె గొంతులోనుంచి శబ్దం రాలేదు. మిద్దెపై నుంచి కొందరు మహిళలు పెద్దపెద్ద రాళ్ళను క్రింద ఉన్న వారిపై విసురుతున్నారు. వారిలో ఒకామె ఓ పెద్ద బండను కష్టం మీద ఎత్తి కిందకు వదిలింది. అది తిన్నగా అన్ని ప్రతిబంధకాలను తట్టుకుంటూ రోగిని లాక్కువెళ్తున్న మాధవ్ తలపై పడింది. అతడి తలనుండి రక్తం ఫౌంటెన్ నుండి నీరు చిమ్మినట్టు ఎగచిమ్మింది.

స్పృహ తప్పి పడిపోయింది రాధ.

హఠాత్తుగా ఆమెకు స్పృహ వచ్చింది. తాను చూసిన భయంకరమైన సత్యం గ్రహింపుకు వచ్చింది.

ఆమె తల తిరిగిపోతుంది. ఒళ్ళంతా వణకిపోతుంది. ఏడుపు ఉప్పెనలా వస్తోంది. పిచ్చిపట్టిన దానిలా లేచింది. శరీరం తూగుతుంది. బయటకు పరుగెత్తింది. అంతలో గుర్తుకువచ్చింది. ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చింది. పెద్దకళ్ళతో ఆమెవైపు భయంగా చూస్తున్నాడు కిరణ్.

“ఏమైందమ్మా!” అడిగాడు.

ఆమె మాట్లాడలేదు. వాడిని ఎత్తుకుని ’పర్వేజ్‍భాయ్’ అంటూ పరుగెత్తింది.

“క్యాహువా భాబీ?” అడిగాడు పర్వేజ్ భాయ్ ఆమెను చూస్తూ.

“నేను బయటకు వెళ్తున్నాను నేను వచ్చేదాకా వీడిని చూడండి” అని మరోమాటకు ఆస్కారం ఇవ్వకుండా ఆమె పరుగెత్తింది.

ఆమె వదలుతూనే కిరణ్ చున్నూ, మున్నూల వైపు దూకాడు ఆటలకు.

***

మాధవ కు ప్రాణ భయం లేదని చెప్పారు డాక్టర్లు. కానీ, రాధను అక్కడ వుండనివ్వటంలేదు. తిరిగివెళ్తూన్న రాధకు ఇంకో వార్డులో  ఏడుస్తూన్న మజీద్ భార్య కనిపించింది.  మజీద్ కనిపించాడు.

“ఏమిటిది మజీద్‍ భయ్యా?”

ఆసుపత్రిలో మంచంపై విరిగిన కాలు, చేతులకు కట్లతో పడుకుని ఉన్న మజీద్‍ని ఆవేదనగా అడిగింది రాధ.

“డ్యూటీలో తగిలిన దెబ్బలు. మాధవ్ ఎలా ఉన్నాడు?” అడిగాడు మజీద్.

“ఆపరేషన్ గదిలో ఉన్నాడు. రక్తం చాలా పోయింది. తల చిట్లింది. పళ్ళు రాలిపోయాయి. ప్రాణానికి ప్రమాదం లేదంటున్నారు. కానీ మామూలు మనిషి అయ్యేసరికి అయిదారు నెలలు పడుతుంది అన్నారు. నీకెలా తగిలాయి దెబ్బలు?”

“క్యా కహనా బహన్ మసీదులో మర్కజ్‍లు ఉన్నారని తెలిసింది. మేం వెళ్ళేసరికి పెద్దగుంపు ఎదురు చూస్తోంది. దెబ్బలు తగిలాయి కానీ మొత్తానికి వాళ్ళందరినీ పట్టుకున్నాం”

“ప్రాణాలు తెగించి ఎందుకు భయ్యా వీళ్ళను పట్టుకోవటం?” కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అంది రాధ.

“వాళ్ళని వదిలేస్తే వాళ్ళ ద్వారా అందరికీ వ్యాపించే వీలుంది. వాళ్ళని పట్టుకొని కరోనా లేదని నిర్థారించుకోవటం మనకోసమే బహన్”

“ఒక్క మర్కజ్ వల్లనే కాదుకదా కరోనా దేశంలో వ్యాపిస్తున్నది. కానీ ఎక్కడ చూసినా ఒక్క మర్కజ్ పేరే వినిపిస్తోందెందుకు భయ్యా?” ఆవేదనగా అడిగింది.

“ఏం చేస్తాం బహెన్! ఖర్మ. ఒక వ్యక్తికి కరోన సోకిందని అనుమానం వచ్చింది. అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. పరీక్ష చేయించుకుంటాడు. అతడికి పాజిటివ్ వచ్చిందనుకో అతడు ఎవరెవరిని కలిశాడో వాళ్ళందరినీ దూరంగా పెడతారు. పరీక్షిస్తారు. కరోనా ఉంటే చికిత్స చేస్తారు. లేకపోతే వదిలేస్తారు. కానీ మర్కజ్ విషయంలో జరుగుతున్నది ఇందుకు భిన్నం. అందరూ కలిసి సమావేశమైనప్పుడు కరోనా తీవ్రత గురించి తెలియదు. తరువాత తెలిసింది. బాధ్యత కల పౌరులయితే స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి. స్వచ్ఛందంగా అందరికీ దూరంగా ఉండాలి. కానీ అలా జరుగలేదు. నేరస్తుల్లా దాక్కుంటున్నారు. వారికి వెతికి వెతికి పట్టుకోవాల్సి వస్తోంది. వారిని దాచిపెడుతున్నారు. వారిని పట్టుకోవడానికి వెళ్తే దాడులు చేస్తున్నారు. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బుద్ధిగా చెప్పింది వినేవాడిని ఎవరూ పట్టించుకోరు. అల్లరి చేసే వాడివైపే దృష్టి వెళ్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.  మిగతా అందరూ ప్రభుత్వం చెప్పినట్టు విని పరీక్షలు చేయించుకుంటున్నారు. క్వారంటైన్ కు వెళ్తున్నారు. మర్కజ్ కు వెళ్ళివచ్చిన వారు ఇందుకు భిన్నంగా ప్రవర్తించటం, దాక్కోవటం, తప్పించుకోవటం వల్ల అందరి దృష్టి వారిపైనే పడుతోంది. వాళ్ళు కేవలం ముస్లీం లన్న నెపంతో వారి తప్పును సమర్ధిస్తూ, వారిని మిగతా ముస్లీములందరికీ ప్రతినిధులుగా చేసి సమర్ధించి వాదించేవారివల్ల ఆవేశాలు, ద్వేషాలు మరింత పెరుగుతున్నాయి.  తిరుపతిలో లక్షల సంఖ్యలో రోజూ మనుషులు వస్తారు. ఒక కేసు వచ్చిందని తెలియగానే దర్శనాలు ఆపేసారు. ఎందుకని ఆపేరు? అలాగే దర్శనాలు కానిస్తే దేశమంతా వైరస్ ఇంకెంత తీవ్ర స్థాయిలో వ్యాపించేది? ఎవరయినా గుడి ఎందుకు మూసేరని వాదించారా? అలా వాదించినా, గుడి మూయకపోవటంవల్ల వైరస్ వ్యాపించినా అదీ ఒక పెద్ద వార్త అయ్యేది. కానీ అలా జరగలేదు. అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. మర్కజ్‌లు కూడా అలా ప్రవర్తించివుంటే సమస్య వుండేది కాదు. ఈ బాధ్యత మర్కజ్ కానీ, మర్కజ్ తప్పును సమర్ధిస్తూ, దాన్ని నేరం అనటం ఇస్లాం పై వివక్షత అని వాదించే  కొందరు మేధావులు, సంకుచిత మత పెద్దల   ప్రవర్తనవల్ల దేశం ముందు భారతీయ ముస్లిం సమాజం దోషిలా నిలచే పరిస్థితి వస్తోంది. వాళ్ళ ఈ అనుచిత ప్రవర్తన వల్ల వాళ్ళు ముస్లింలకు ఎంతో నష్టం చేస్తున్నారు.  కరోనాకి మతం, ప్రాంతం తెలియదు. కానీ చట్టాన్ని లెక్కచేయక తమవల్ల ఇతరులకు ప్రమాదం ఉందని తెలిసీ బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్ల, వీరి గురించే చర్చ జరుగుతోంది. వార్తలూ వారి గురించే. దాంతో అపోహలు, దురభిప్రాయాలు పెరుగుతున్నాయి. దేశంలో మనుషుల మధ్య మతం చిచ్చు రగిల్చి, విద్వేషాలు నింపి, విఛ్ఛిన్నం చేయాలనుకునే మతఛాందసులు, ఎల్లప్పుడూ దేశవ్యతిరేక కార్యకలాపాల గురించే ఎదురుచూసే మేధావులు, కళాకారులు, ఈ దేశం ఉప్పుతిని, ఈ దేశంలో పెరిగి పెద్దయి, పరాయిదేశం వెళ్ళగానే  మాతృదేశంలో పొందిన సౌకర్యాలను విస్మరించి,  తమ  మాతృదేశాన్ని తక్కువ చేసి, లేని అన్యాయాలను వికృతంగా చూపి లౌకిక పరదా మాటున లబ్ధిపొందాలనుకుంటూ   ప్రపంచమంతా దేశం గురించి దుష్ప్రచారం చేసే అపర మేధావులూ, కవులూ, కళాకారులూ దీన్ని అవకాశంగా తీసుకుని అసత్య ప్రచారం ప్రారంభించారు. గుప్పెడుమంది చేసిన తప్పును సమర్థిస్తూ, కోట్లమంది ముస్లింలను రెచ్చగొడుతున్నారు. ఇది మన దురదృష్టం బహన్. అసత్యం అరుస్తుంది. నిజం నిశ్శబ్దంగా ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మిగతా అంతా అల్లా చూసుకుంటాడు”

మజీద్ మాటల గురించి ఆలోచిస్తూ ఇల్లుచేరింది రాధ. బయట ఆడుతూ కనిపించాడు కిరణ్. పర్వేజ్ కు థ్యాంక్స్ చెప్పి కిరణ్‍ను ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది రాధ.

***

చటుక్కున మెలకువ వచ్చింది రాధకు.

టీవీ బంద్ చేయటం మరచిపోయినట్టుంది. మాటలు వినిపిస్తున్నాయి.

ఇంతలో బయట నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. నెమ్మదిగా తలుపు తీసి చూసింది. పర్వేజ్ ఇంటిముందు పోలీసుల వేన్లు, ఏంబులెన్స్‌లూ ఆగి ఉన్నాయి.

ఇంటి సభ్యులందరిని ఏంబులెన్స్‌లలో ఎక్కిస్తున్నారు. అందరూ మాస్కులు, పిపిఇలు వేసుకుని ఉన్నారు. కొందరు అంతరిక్ష ప్రయాణీకుల్లా ఉన్నారు. అంతలో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.

లోపల నుంచి స్ట్రెచ్చర్లపై అఫ్రోజ్, సుహాన్‍లను తీసుకువస్తున్నారు. వాళ్ళకు కరోనా సోకినట్టుంది. ఆమె గుండెలు ఆగిపోయాయి.

ఇంతకాలం వాళ్లు ఇంట్లోనే ఉన్నారా?

ఉంటే…. ఉంటే….

కిరణ్‍ను వాళ్ళింట్లో వదలి వెళ్ళింది ఇన్నిరోజులూ!!!!

గుండెలు అదిరిపోతుండగా ఇంట్లోకి పరుగుతీసింది.

మంచంపై పడుకున్న కిరణ్ నిద్రలో అమ్మా అంటూ  కదిలాడు.

ఆమె అలా స్థాణువులా నిలబడి కిరణ్ వైపు చూస్తూండిపోయింది.

Exit mobile version