సినారె వచన రచనా శిల్పం

2
2

[29 జూలై డా. సి. నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా డా. గండ్ర లక్ష్మణ రావు రచించిన ‘సినారె వచన రచనా శిల్పం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]‘గ[/dropcap]ద్యం కవీనాం నికషం వదన్తి’ అని సంస్కృతోక్తి. సంస్కృతంలో గద్యం రాయడమే కవులకు ఒక ఒరపిడి వంటిది. పరీక్ష వంటిది అని. శ్లోకాలు రాయడం తేలిక. గద్యం రాయడం కష్టం. తెలుగులో కూడా మొదటి నుండీ పద్యాలు, పాటలు, దేశీయమైన రగడలు వంటివే వచ్చాయి కాని వచన రచనలు రాలేదు. భారత రామాయణ భాగవత ప్రబంధాలలో అక్కడక్కడా వచనం కనిపించినా అది కూడా పద్యశైలిలో ఉన్నట్లుగా ఉండేది. అనవుడు, అంత, వంటి ఒకటిరెండు మాటలు ఉన్న దగ్గర తప్ప సుదీర్ఘంగా సాగిన వచనాలు పద్యాలకంటే కష్టంగా ఉండేవి. వచనంలో రచనలు రాకపోవడం కూడా వ్యావహారిక భాష సాహిత్యంలోకి చేరడానికి ఆలస్యం పట్టిందనవచ్చు. నవలలు, కథలు, వ్యాసాలు వచ్చినప్పుడే భాషలో సరళత, వాడుక ఏర్పడింది. ఆధునిక కాలంలో కూడా చిన్నయసూరి గాని కందుకూరి గాని రాసిన వచనాలు వ్యాకరణ దోషాలు లేని గ్రాంథికతకు దగ్గరగానే ఉన్నాయి. తరువాతి కాలంలో వచనం వచ్చినా మంచి వచనం రాసే వారు కొద్ది మంది మాత్రమే అని విశ్లేషకుల అభిప్రాయం. మీ దృష్టిలో మంచి వచనం రాసిన వారెవరని చేకూరి రామారావుగారిని అడిగితే “బాల వ్యాకరణానికి వ్యాఖ్యానం రాసిన దూసి రామమూర్తి, అనంతుని ఛందస్సుకు వ్యాఖ్యానం రాసిన శ్రీ భాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యులు, భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి” అని చెప్పారు. (వచనరచన తత్వాన్వేషణ- చే.రా). “బాలవ్యాకరణ వ్యాఖ్యానాలలో దువ్వూరి వేంకటరమణ శాస్త్రిగారిని అందరూ ఇష్టపడతారు కదా, మరి దూసి వారి వచనం మంచిదని ఎట్లా అంటున్నారు?” అని అడిగారు. “దూసి వారి రచనలో ప్రిసైజు ఉంటుంది. అనవసరమైన పదాలు, వాక్యాలు ఉండవు. ఎంత అవసరమో అంత మాత్రమే రాయగలరు” అని అన్నారు. చేరా గారు ఈ మాటలు చెప్పేనాటికి చలం, విశ్వనాథ, కొడవటిగంటి, అడవిబాపిరాజు, నోరి ,వేలూరి మొదలైన వారి రచనలు వచ్చాయి. కాని వారి వచనాలు ఎవరికి వారివే ప్రత్యేకశైలి అన్నారు.

సినారె కూడా కవిత్వంలో తనదైన భాష, శైలి ఉన్నట్లుగా వచనంలో కూడా తనదైన శైలిని పాటించాడు. సినారె పూర్వ కావ్యాలు ప్రబంధాలు చాలా ఇష్టంతో చదివిన వారు. పాఠాలు బోధించిన వారు. వాటిలోని పదాలను అబ్బురంగా చూసి ఒంట పట్టించుకున్న వారు. అంతకన్నా ఎక్కువ మక్కువతో పల్లెటూరి భాషను ఆత్మీయం చేసుకున్నవారు. పల్లె భాష, ప్రబంధ భాష కలగలిపిన శైలి వచనంలోను, కవిత్వంలోను, పాటలలోను, మాటలలోను స్పష్టమయ్యేవి. సినారె  పాటలు, కవిత్వం ప్రచారంలోకి వచ్చిన రోజుల నుండి చివరి దాకా ఆయన ప్రసంగాలంటే ఇష్టపడే వారు శ్రోతలు. విద్యార్థుల నుండి పండితుల వరకు కూడా ఆయన ప్రసంగానికి చెవియొగ్గేవారు. అందుకు కారణం ఆయన వచన శైలి. ఆయన భాషాప్రయోగంలోని నేర్పరితనం. నొక్కి పలుకుతూ పదాలు చెవులకు, హృదయాలకు ఆనందాన్ని కలిగించే ఉచ్చారణ. ప్రతి మాటా, ప్రతి వాక్యం ఒక కవితా వాక్యం వలె కవితా చరణం వలె ఉండటం .ప్రేక్షకులకు సమ్మోహనంగా ఉండి విషయభారం తగ్గిందా? హెచ్చిందా? అనే విచారణకు అవకాశమివ్వకుండా సినారె ప్రసంగాలు సాగేవి. అందుకే సినారె మాట్లాడితే కవిత్వమే, కవిత్వంలోనే కవిత్వంతోనే మాట్లాడతాడు అనే ప్రచారం కూడా వచ్చింది.

సినారె కవిత్వం ఎక్కువ. వచనం తక్కువ. వచన కవిత్వంలోని వచనాల్లాంటి వాక్యాలుండవచ్చు. కాని అది కవితాభివ్యక్తిలో అంతర్భాగమే అవుతుంది.

సినారె సిద్ధాంత గ్రంథం ‘ఆధునిక కవిత్వము, సంప్రదాయములు – ప్రయోగములు’ అనేది సుదీర్ఘమైన వచన రచన. ‘మా ఊరు మాట్లాడింది’ తన ఊరిలోని భాషాపదాలపై సంభాషణ వ్యాఖ్యానాత్మకంగా సాగిన వచనం. సాహిత్య విమర్శ వ్యాసాలు ‘సమీక్షణం’, ‘దృక్పథం’, ‘పాశ్యాత్యదేశాల్లో యాభైరోజులు’, ‘మందార మకరందాలు’, ‘పోతన పద్యాలకు వ్యాఖ్యానం’ అనేవి ఆయన వచన రచనలు. ఇవికాక వేలాది పుస్తకాలకు రాసిన ముందుమాటలు, ఉత్తరాలు.

ఈ అన్నింటిలో విషయ వైవిధ్యం ఉన్నప్పటికీ ఆయన వచనశైలిలో ఒక ఆలంకారికత ఉంటుంది. కవితాత్మకత తొంగి చూస్తుంది. పొడి వాక్యాలు తక్కువగా ఉంటాయి. కవిత్వంలో ముఖ్యంగా గేయకావ్యాలలో కనిపించే లయాత్మకత, అనుప్రాసల ప్రయోగాలు వచన వాక్యాల్లో చేరి ఆయన వాక్యాలు ఆలంకారికతను కలిగించాయి. సాధారణంగా కావ్యాలంకారాలు ఉంటాయి. కాని వాక్యాల్లో ఆలంకారికత ఉంటే వాటిని వాక్యాలంకారాలు అని వాక్యాలంకార శైలి అని అనవచ్చు అని భాషాశాస్త్ర వేత్త, విమర్శకులు చేకూరి రామారావు ఒక కొత్త నిర్వచనం చెప్పారు. (వచనరచన, తత్వాన్వేషణ- చేరా). సినారె పాఠం చెప్పినా ప్రసంగం చేసినా అదే ఒరవడి కనిపించేది. శ్రీనాథుని శృంగారనైషధంలో  అందులో అంతఃపుర కన్యలు ఒక్కసారిగా లేచి నిలబడిన దృశ్యాల వర్ణన గల ఒక పద్యం చదివి “అందెలు మోవగ అందరు లేచిరి, అంతే దీని తాత్పర్యం” అని ముక్తసరిగా ముగించినా భావమంతా అందమైన మాటల్లో చెప్పగానే విద్యార్థులంతా మురిసి పోయేవారు (ఆ తరగతిలో నేను కూడా ఒక విద్యార్థిని).

చేరాగారు దూసి వారి ప్రిసైజు పద్ధతిని మెచ్చుకొని మంచి వచనం అన్నట్లుగా సినారె వచనంలో ప్రిసైజుతో పాటు నాద స్పర్శ (మ్యూజికల్‌ టచ్‌) కూడా ఉండడం విశేషం. అవి అనుప్రాసలతో సాధించాడు. ‘పలికెడిది భాగవతమట’ పద్యానికి వ్యాఖ్యానం రాస్తూ “ఏదైనా ఒక విష్ణుకథ వ్రాయాలని కుతూహలంతో ఉన్నాడు పోతన్న. అప్పుడు కలలాంటి మెలకువలో కట్టెదుట నిలిచాడు రామన్న.. పండి మగ్గిన వ్యాస భాగవత ఫలం పోతన్న వంటి చిలుకలకు లభించడం దైవనియోగం. ఆంధ్ర రసికుల అదృష్ట యోగం”.  ఈ జంట వాక్యాల తూగులో నిర్మాణంలో ఉన్న సామ్యాన్ని చూడవచ్చు. అంత్యప్రాసగా పోతన్న, రామన్న, నియోగం, యోగం ప్రయోగాలు. ఈ ప్రయోగాల వల్ల ఇవి కవితా వాక్యాలవలె అందంగా ఉండటం. ఇవి ఆయన వాక్యాలంకార శైలికి ఉదాహరణలు. ఇట్లా చాలా చోట్ల వ్యాఖ్యానంలో కనిపించడం ఆయన విశేష వాక్య రచనా శిల్పం.  పోతన్న ఏదైనా ఒక విష్ణుకథ రాయాలనుకున్నాడు అనవచ్చు కాని క్రియాంత వాక్యాలు కూడా తక్కువగా ప్రయోగిస్తాడు సినారె. అన్నారు, విన్నారు. చూశారు, అయింది, జరిగింది, బడింది. ఇట్లాంటి క్రియాంత వాక్యాల కన్నా విశేషణాంతాలుగా, కర్త, కర్మాంతాలుగా ముగించడం సినారె వచనంలో ప్రత్యేకంగా కనపడుతుంది. కర్త, కర్మ, క్రియ అనేవి వాక్య నిర్మాణంలో ఒక క్రమంగా నేర్చుకునే వాళ్ళం. కాని అవి ఒక మూస వాక్యాలుగా ఉంటాయని ఆయన భావన. ‘ఇందుగలడందులేడని’ పద్యాన్ని వ్యాఖ్యానిస్తూ “మొత్తం పద్యాన్ని పిండితే చేతికందే సారం చిటికెడే –దేవుడంతటా ఉన్నాడు. చక్రి, సర్వోపగతుడు, దానవాగ్రణి, వంటి మూడు నాలుగు పదాలు తీసివేస్తే మిగిలే మాటలు ఇందులు, అందులు, ఎందెందులు, అందందులు, ఈ బిందుపూర్వక ద కారాల పొందికలే ఈ పద్యంలో పొదిగిన అందాలు.”… ఈ వాక్యాలలో ముక్తసరితనంతో పాటు పద్యంలోని నాదాత్మకత వచనంలో కూడా అందించారు సినారె. ఇట్లా మందార మకరందాల వ్యాఖ్యానంలో పోతన్న పద్యాల మాధుర్యంతో పాటు సినారె వచనరచనా సౌందర్యం కూడా అనుభవ యోగ్యం. ఇది వ్యాఖ్యాన వచన రచనా శిల్పం. అంతకు ముందు ప్రబంధాలకు వ్యాఖ్యానాలు రాసిన వారెందరో ఉన్నారు. కాని సినారె వచనం ఆలంకారిక శైలి. అది ఆయనకే ప్రత్యేకం.

‘మా ఊరు మాట్లాడింది’ తన ఊరిలోని వారి మాటల్లో దాగిన మూలాలను, అర్థాలను పరిణామాలను వెలికి తీస్తూ సాగిన భాషాన్వేషణ రచన. కాని ఇది భాషా శాస్త్ర గ్రంథంలా అనిపించదు. మాట్లాడుతూ మాటల్లో మాటల గురించి విప్పిన అర్థాల మూటలు. “గా.. అయ్య సిన్నోడు గాడయ్యా – కైత్కాలోడు” అన్న పోశమ్మ మాటలకు సినారె అంతర్మథనంలోనుండి వెలువడిన వ్యాఖ్య చూడండి.

“కైత్కాలోడు అంటే కవిత్వాల వాడు అన్నమాట. కవిత్వం అబద్ధమా? ఔను చాలావరకు. Poetry is half lie అన్నారెవరో. నవ్వులా అవి కావు నవపారిజాతాలు అంటే నిజమని సామాన్యుడు నమ్ముతాడా? కేవలం సత్యం చెప్పడానికి కవిత్వం అవసరం లేదు. అది చరిత్ర చెపుతుంది. పత్రికా ప్రకటన చెపుతుంది. గణితశాస్త్రమూ చెపుతుంది. అయితే ఈ అనృతం భావుకులకు ఆలోచనామృతం. అది విషయాంతరం. కవిత్వాల వాడు అంటే చల్లని చమత్కారి. కమ్మని అబద్ధాల కోరు. మెత్తని వంచనా శిల్పి..”. ఈ వాక్యాలు కవి లేదా కైత్కాలోడు అన్నపదానికి వివరణల వంటివి. ఇవన్నీ చిన్న వాక్యాలు. చెపుతుంది అనే క్రియతో ముగించిన వాక్యాలు మూడు వరుసగా రాశారు. అదే విషయాన్ని చరిత్రా, పత్రికలూ, గణితశాస్త్రమూ చెపుతాయి అనవచ్చు కాని మూడు విడి వాక్యాలు రాయడం వల్ల విషయాన్ని బలపరచిన తీరు కనబడుతుంది. పైగా ఒకే తూగు గల వరుస వాక్యాల వల్ల ఒక లయ ఏర్పడుతుంది. వాక్యాలు లయాత్మకంగా రాయడం కూడా సినారె వచనరచనా విశేషం.  చమత్కారానిక చల్లదనం, అబద్దానికి కమ్మదనం, వంచనకు మెత్తదనం అనే విశేషణాలు అర్ధాన్ని ఒక సముచ్ఛయంగా చెప్పడం. ఇది ఉల్లేఖాలంకారం.

మా ఊరు మాట్లాడింది లోని విషయం పల్లె పదాల గురించి, రాసిన వాక్యాలలో కొన్ని మాట్లాడినట్లు, కొన్ని వ్యాకరణ ఛందోలంకార విశేషాలతో సమన్వయం చేసిన రీతులు ఆయన పాండిత్యాన్ని పదాలపై నిశిత దృష్టినీ ప్రకటిస్తాయి.

మాయిల్లం అనే మాటకు “విచిత్రమైన సంధి కార్యం నా మనసులో మెరిసింది. మహా+వైళం= మాయిల్లం. అక్షరాలు ఎలా అరిగిపోయాయో. ఎలా కుదింపుగా ఒదిగి పోయాయో ఆశ్చర్యం వేసింది. మహా మా గా పరిణమించింది. లోప దీర్ఘత అన్నమాట.” అని వివరణ. ఈ వాక్యాలలో సంధి, లోపదీర్ఘత, అక్షరాలు అరిగిపోవడం అనేది అక్షర విపరిణామం.. అయినా ఇది వ్యాకరణమో భాషా శాస్త్రమో అన్నట్లుగా కాకుండా చాలా సాదా సీదాగా వివరించగలగడం సినారె వాక్యాలలోని చాతుర్యం. దీర్ఘానికి లోపం అనే బదులు దీర్ఘలోపత అనడం సంక్షిప్తం సుందరం. సినారె వాక్యాలలో శాస్త్ర విషయం కూడా సారళ్యత సౌందర్యత సంతరించుకోవడం ప్రయోగ వైవిధ్యం.

సినారె తన పాటలో ఏముంది అనే సినిమా పాటల వ్యాఖ్యానంలో కూడా ఇటువంటి శైలి కనపడుతుంది. సంగీత శాస్త్ర విషయాలు, పాత్రౌచితి వంటి నాటకీయ విషయాలు కూడా సాధారణ పాఠకునికి అందేంత అందంగా ఉంటాయి వాక్యాలు.

‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే..’ అనే పాట గురించి రాస్తూ.. “ఆ రోజుల్లో జనానాందానికి డ్యూయెట్లు రాసినా అవి పాత్రల స్వభావాన్ని ఆశ్రయించి ఉండేవే. గాలిలో ఎగురుతూ పాడుకునే పాటలే అయినా గాలివాటంగా రాసినవి కావు. రాముడు – భీముడు విభిన్న మనస్తత్వాలున్న పాత్రలు. ఒకటి అదిరి పడేది. మరొకటి అదరగొట్టేది.” అని రాశారు. గాలిలో ఎగురుతూ, గాలివాటంగా అనే పదాలను ఎంత చమత్కారంగా కుదిరించారు. చివరికి రెండు పదాలతోనే రెండు వాక్యాలు రాశారు. ఇక్కడ సంక్షిప్తత, స్పష్టత, తేడా అన్నీ అవగతం. వాక్యాలలో చమత్కార ప్రయోగాలు కొన్ని కవితాచరణాలా? గేయ పంక్తులా అన్నట్లు రాయడం సినారెకు వెన్నతో పెట్టిన విద్య.

‘అందాల నారాజ అలుకేలరా’ అన్న పాటకు వ్యాఖ్య. “మాటల విరుపులకు సరిపడే స్వర రచన ఇందులో ఉంది. జావళీల నెన్నడుములు మోపితో ఊగాడి పోతాయి, జావళీల్లో అందుకే అలంకార ప్రయోగాలు తక్కువ. ఉన్నా అవి భారంలా కాకుండా గళహారంలా ఉంటాయి”. మాటల విరుపులు,  సరిపడు.  స్వర రచన, ఈ పదాలో ఏర్పడిన వాక్యంలో ర అక్షరం పదే పదే రావడం అన్ని చిన్న అక్షరాలు కావడం వలన విరుపులు ఎట్లా ఉంటాయో వాక్యం వల్లనే తెలిసేటట్లు చేయడం. భావానుగుణమైన అక్షరాలు, పదాలు ఉపయోగించడం కనపడుతుంది. ఇది కవిత్వానికి చెప్పుకునే లక్షణమే అయినా సినారె వచనంలో కూడా పలికించడం పదప్రయోగ ఔచిత్య నైపుణ్యం.

పాశ్యాత్య దేశాల్లో యాత్రానుభవాల రచన కూడా ఆకర్షణీయం. నయాగరాను చూసినపుడు కలిగిన అనుభూతిని “ఏమి దూకుడది! అడుగంటిందో లేదో ఏడు తాటి చెట్ల ఎత్తున నీటి పొగలు. అటు హోరూ ఇటు పొగలు లేచే తీరూ కర్ణనయనాలకు కమనీయ రసేంద్రజాలాలు”.  హోరు, తీరు రెండు మాటలు ఒకటి శబ్దం మరొకటి దృశ్యం అందువలన కర్ణ నయనాలకు అని ఆ వరుసకు ఈ ఇంద్రియాల వరుసను చెప్పాడు. అలంకార శాస్త్రంలో ఇట్లా చెప్పడాన్ని క్రమాలంకారము అంటారు. చిన్నయ సూరి నీతి చంద్రికలో ఇట్లాంటి అలంకారాల వాక్యాలున్నాయి. ‘వ్యాళియు శార్దూలియు నిజాండ శాబకంబుల భక్షించు’ అనే వాక్యంలో పాము, పులి తమ స్వంత గ్రుడ్లను, పిల్లలను తింటాయి అని అర్థం. పాము గ్రుడ్లను, పులి పిల్లలను అనేది క్రమం. ఇట్లాంటి అలంకార శాస్త్ర యుక్తంగా చెప్పిన అలంకార వాక్యాలు సినారె వచనంలో సుకుమారంగా పలుకుతాయి.

ప్యారిస్‌ లోని ఒక అనుభవాన్ని చెపుతూ “ఇక్కడ ఫ్రెంచివారు మనం ఇంగ్లీషులో మాట్లాడిస్తే ఫ్రెంచిలో బదులిస్తారు. ఇంగ్లీషు బొత్తిగా తెలియక కాదు. సమాధానం తమ భాషలోనే చెప్పాలనే దృష్టి అది”. బొత్తిగా అనే వాడుక పదాన్ని తగినచోట వాడినారు. తరువాతి వాక్యం ‘సమాధానం తమ భాషలోనే చెప్పాలనే దృష్టి వారిది’ అనవచ్చు. కాని అట్లా అనకుండా సమాధానం అనే కర్మను కర్త స్థానంలో చేర్చి వారి దృష్టి అది అని క్రియాస్థానంలో చేర్చడం వల్ల వాక్యంలో ఫ్రెంచి వారి దృష్టిని మరింత నొక్కి చెప్పినట్లయింది. ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి కర్త, కర్మ క్రియలు మార్చడం వంటి వాక్యాలు సినారె ప్రయోగాలు.

సిద్ధాంత గ్రంథంలోను, సాహిత్య వ్యాసాలలోను సినారె వచన రచన తనదైన ప్రతిభను ప్రతిబింబిస్తుంది.

“సంప్రదాయ పుష్టమైన ఏ జాతియు సంప్రదాయములకు దూరముగా నుండలేదు”.  ఉండలేదు అనడం గతంలో ఎప్పుడూ ఉండలేదు అని ఒక అర్థం కాగా ఉండలేదు అంటే మనలేదు,  నిలువలేదు అని మరొక అర్థం ధ్వనిస్తుంది. ఈ ధ్వన్యర్థం రావాలనే వాక్యంలో ఇటువంటి ‘ఉండలేదు’ పదం ముగింపుగా ప్రయోగం.

“నాగరికత ముదిరిన జాతులలో కొంతవరకు సంప్రదాయోల్లంఘన తత్త్వము మొనలు చూపుట సహజము” ఈ వాక్యం సాధారణ వాక్యమే. కాని నాగరికత ముదురుట, సంప్రదాయాన్ని ఉల్లంఘించుట అనేవి జరగడాన్ని మొనచూపుట అని, సహజము అనడం వల్ల అట్లా ఉల్లంఘించడం తప్పని సరియవుతుంది అనీ నిర్ధారించడమే. మొన చూపుట అనేది పైకి తేలేది పొడసూపుట కనిపించి కనిపించనిది అందుకే మొనచూపుట అన్నారు. ఈ పదాలతో సాధారణ వాక్యాలతో నాగరిక జాతులు సంప్రదాయాలను మార్చుకుంటాయనే సిద్ధాంతాన్ని నిర్ధారణ చేసినట్లు.

ఇవి నిర్ధారణా వాక్యాలుగా చెప్పవచ్చు. అయితే సూటిగా నిర్ధారించడం కాకుండా హేతువును చూపి సమర్థించడం ఇందులో చర్చాసారాంశంగా చెప్పడం. ఇట్లా సిద్ధాంత గ్రంథం కూడా ఏ మాత్రం విసుగు లేకుండా విషయ నిర్ధారణలతో చదివింపజేస్తుంది.

సమీక్షణం వ్యాస సంపుటిలో జాషువా కవిని గురించి రాశారు. “జాషువా అజ్ఞాతుడుగా అనాదృతుడుగా సంఘం మాటున బ్రతికాడు. చేదు బాధల చిగుళ్ళను మేసి స్వాదు కవితలు ఆలపించాడు.” జాషువా కవికోకిల అనే మాటను సార్థక చేసే వాక్యం. ఎంతో విపులంగా రాయాల్సిన అవసరంలేని కవిని ఆవిష్కరించిన వాక్యం. మరో వాక్యంలో “సాలీళ్ళు గిజిగాళ్ళు కముజులు తన నేస్తగాళ్ళై కన్నీళ్ళు తుడిచినప్పుడు, జాషువా తరుణ హృదయంలోచెలరేగిన ఒక్కొక్క వేదనా స్ఫులింగం ఒక్కొక్క ఖండ కృతిగా రూపొందింది. జాషువా కవితకు ఊపిరి అతని శ్వాస కోశాలు ఎగజిమ్మిన ఆవిరి”. కవిని ఆవిష్కరించిన వాక్యాలివి. ళ్ళ అక్షరం కన్నీళ్ళ దాకా నిండి, వేదనా స్ఫులింగం అనే అగ్నికణంగా మారిన తీరు ఆయా అక్షరాలలోనే అక్షరాలతోనే అర్థం చేయించాడు సినారె. ఊపిరి, ఆవిరి అనే అంత్య ప్రాసలు ఆయన సహజ ప్రయోగాలే అయినా ఇక్కడ అవి కృత్రిమం కాకపోవడం ప్రధానం. ఒక కవిని గురించి కవితాత్మక వాక్యాలలో చెప్పిన ప్రయోగమిది. తరువాతి కాలంలో ఇంతగా కాకపోయినా కవులను గూర్చి వేదికలమీద ఇటువంటి మాటలు పొగడ్తలకు ఉపయోగించి వ్యాఖ్యానాలు చేయడం అలవాటైంది. డడ

ఇంకా ఆయన ముందుమాటలు, ఉత్తరాల రాతలలో కూడా అందాలు, అర్థాలు చిందే వాక్యనిర్మాణాలుంటాయి. ఆయన భావాలపైగాక అక్షరాలు, పదాలు, వాక్య నిర్మాణాలను పరిశీలిస్తే వాక్యనిర్మాణ వైవిధ్యం వైశిష్ట్యం మనలను మరిపిస్తాయి. కవిత్వంలోను , సిద్ధాంతంలోను, మాటలలోను, పాటలలోను, వచన రచనలలోను ప్రయోగం మానలేదు. సంప్రదాయం విడువలేదు.

అక్కడక్కడా సంప్రదాయపు వ్యాకరణ నియమానుసారం వాడిన సమాసాలు, క్రియలు చోటుచేసుకున్నా సరికొత్త ప్రయోగాలతో కొత్తగా కనిపించే వాక్యాలుంటాయి. సినారె కవిత్వంలోగాని, వచనంలో గాని సంభాషణలో గాని, ప్రసంగంలో గాని వ్యాకరణ దోషాలుండవు. నియమంతో సంయమనంతో పదాలనాడించగల పాడించగల కవి సినారె.

సంప్రదాయాన్ని జీర్ణించుకున్న
ప్రయోగాన్ని
ప్రయోగంలో జీవిస్తున్న
సంప్రదాయాన్ని.. నేను

అని చెప్పుకున్న మాటలు ఆయన వచనరచనా శిల్పానికి కూడా వర్తిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here