[box type=’note’ fontsize=’16’] తమ కాలనీలో జరిగే సరదా ఘటనలనూ, వేడుకలను, కాలనీవాసుల ప్రవర్తనను చమత్కారంగా వివరిస్తున్నారు ఆనందరావు పట్నాయక్ ఈ ‘కాలనీ కబుర్లు‘ కాలమ్‌లో. [/box]
[dropcap]రా[/dropcap]విగుడ అప్పటికి జిల్లా కేంద్రం కాలేదు. కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ భారీ పరిశ్రమలు వెలిసాయి. వాటికి కావల్సిన విద్యుచ్ఛక్తి కోసం 132 కె.వి.లైను వేసి సబ్ స్టేషను నిర్మించారు.
ఇటువంటివి ఊరి శివార్లలో నిర్మించడం ఆనవాయితీ. స్థానిక గుత్తేదారు కాంట్రాక్టు తీసుకున్నాడు. అనుకొన్న సమయంలో పనులు పూర్తయ్యాయి. అయినా మెయింటెనెన్సు కోసం, అదనంగా కట్టాల్సిన స్టాపు క్వార్టర్సు కోసం తన గుమస్తా స్వామిని అక్కడే ఉండడానికి ఏర్పాట్లు చేసాడు ఆ కాంట్రాక్టరు.
నేను చూస్తున్న గోడౌనుకి ఆనుకొని రేకులషెడ్డు ఒకటి కట్టి ఇచ్చాడు యజమాని. నీళ్లకు, కరంటుకి లోటు లేదు. స్వామిది ఏ రాశో గాని నోరు, మెదడు లేని ప్రబుద్ధుడు. కాని స్వామి భక్తి పరాయణుడు. జీతంరాళ్లు భార్య చేతికి ఇవ్వడంతో తన బాధ్యత తీరిపోయిందనుకొనే బాపతు ఆ స్వామి. కన్న తలిదండ్రులు అతగాడికి కుచేలరావని పేరు పెట్టాల్సింది. ప్రతీ ఏడాది ఇంట్లో శిశురోదనం వినబడాల్సిందే. మొదట్లో బ్యాడ్మింటను టీం తయారయి రానురాను ఫుట్‌బాల్ టీం అయింది అతని సంతానం. మంది పెరిగింది గాని మనీ పెరగలేదు.
ఇంటి ఆవరణలో ఆనప, బీర, చిక్కుడుపాదులు వేసి కుటుంబాన్ని గుట్టుగా నడుపుతుండేది ఆ ఇల్లాలు. అప్పు చేసి ఆవు కొన్నారు. పాలను మాకు సప్లై చేసేవారు. కోళ్లు, బాతులు పెంచి వాటి గుడ్లు మాకే అమ్మేవారు. శ్రీమతి స్వామికి అత్యాశ. మొగుడుకి తెలియకుండా సొమ్ము వడ్డీలకు తిప్పేది. తీసుకున్నవాళ్లు మొదట్లో వడ్డీ మాత్రమే ఇచ్చి అసలు ఎగ్గొట్టేవారు.
స్వామి పెద్దకొడుకు ఓం. చురుకైనవాడు. స్కాలరుషిప్పు తెచ్చుకొని, స్కూలు పిల్లలకి ట్యూషను చెప్పి ఫ్యామిలీని ఆదుకొనేవాడు. ఆ రోజు ఆదివారం. మిట్టమధ్యాహ్నం. నిద్ర పట్టక కిటికీ గుండా చూస్తున్నాను. ఓం ఏడ్చుకొంటూ వెళ్లడం కన్పించించింది. టూ ఆర్ క్వార్టరులో సింగిలుగా ఉంటున్నాడు నాయక్. అతను గే. ఓం మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకొన్న కాలనీ పిల్లలు ఒకటయి నాయక్ క్వార్టరు మీదకు వెళ్లారు. అప్పటికే వాడు పెరటి గుండా పారిపోయి తప్పించుకుపోయాడు. ఆ క్వార్టరు అగ్నికి ఆహుతయిపోయింది.
స్వామికి ఇవేవీ పట్టవు. రోజూ లేచీలేవగానే దేవుడి ఫోటో ముందు నిలబడి ‘నిన్నటి దినం ఎలా గడిపానో ఈ దినం అలాగే గడిపేలాచెయ్ ప్రభూ’ అని ప్రార్థించేవాడు. అందుకే రోజులు నిరాటంకంగా, నిశ్చింతగా సాగిపోతున్నాయి అని బడాయి పోయేవాడు. ఈ కాలంలో కూడా అంత మంది పిల్లలా ఆపరేషను చేసుకో మగడా అని తోటివాళ్లు చెప్తే ‘నాకు వరిబీజం ఉంది, కూడదు’ అనేవాడు వెంగళలప్ప. ఆవిడగారేమో ‘నడుము నొప్పి వస్తుంది ఆప్రేసను అయ్యాక. ఇంటి పని, వంట పని ఎవరు చేస్తారు నీ తల్లా, పెళ్లామా’ అని రంకెలు వేసేది.
వినోదానికి ఇంట్లో రేడియో, టి.వి.లు లేవు. సినీమాకు పోతే టికెట్లకి, రిక్షాకి, చిరుతిళ్లకి బోల్డంత ఖర్చు. ఉన్న ఒకే ఒక్క సంబరం మైథునం. కానీ ఖర్చు లేనిది. వేసవిలోవానర సైన్యం బయట పడుకొంటే స్వామి దంపతులు ఇంట్లో పడుకొనేవారు. చలికాలంలో వైస్ వెర్సా. మరి ప్రతీ ఏడాదికి ప్రసవవేదన తప్పదు కదా.
“గడియ తీరదు గవ్వ రాదు మా ఆయనకు” అనేది ఓం తల్లి. ఆమెకి ఎప్పుడూ డబ్బు యావ తప్ప మరోటి ఉండేది కాదు. దానికి కారణం ఉంది. కూతురు ఎదిగొచ్చింది. గంతకు తగ్గ బొంతను చూసి ఆడపిల్లను అత్తారింటికి పంపించేసరికి సాలొచ్చింది వాళ్లకు. పెళ్లవడమే తరవాయి అమ్మాయి నెల తప్పింది. శ్రీమంతం చేసి పురిటికి కన్నారింటికి తీసుకొస్తే ఆ ఇంట రెండు కాన్పులవడం మాకందరికీ నవ్వు తెప్పించేది. నెలరోజుల బిడ్డను తీసుకొని అత్తారింట అడుగు పెట్టింది అమ్మాయి. కన్నవారి లేమి ఆమెను ఇంతగా కలచివేసింది, ఎలాగైనా వాళ్లను ఆదుకోవాలనని కోరుకొనేది. అందుకే దాసరి నారాయణరావు ఈ థీమ్ మీద మంచి సినిమా తీసాడనిపించేది.
“ఇంజనీరు సాబ్ క్యా సోచ్ విచార్ మే పడగయే..” అన్న పిలువుతో ఊహల ఊయల ఊగడం ఆపి చూసాను.
ఎదురుగా పిప్టు ఆపరేటరు కుమార్. నేను ఈ రాష్ట్రానికి ఉద్యోగానికి వచ్చిన కొత్తలో తెలుగేతర వ్యక్తులతో హిందీలో మాట్లాడేవాడిని. ఆ అలవాటు అలానే ఉండిపోయింది.
ఇక కుమార్ విషయానికి వద్దాం. అతగాడికి మరో పేరు బహూరూపి. పైలాపచ్చీసు మనిషి. డ్రామాలు ఆడేవాడు. ఆర్కెస్ట్రాలో పాడేవాడు. కార్తీకమాసంలో జరిగే పిక్నిక్‍కి సారథ్యం వహించేవాడు. పగలంతా కాకిలా తిరిగేవాడు. “సి” షిప్టు చేసి కంట్రోలురూంలోనే పడుకొనేవాడు. మిగతా ఇద్దరు ఆపరేటర్పు వివాహితులు. వాళ్లకి పగలు డ్యూటీ చేయడం మహదానందం.
(తదుపరి సంచికలో మళ్ళీ)