Site icon Sanchika

కాలనీ కబుర్లు – 5

[box type=’note’ fontsize=’16’] తమ కాలనీలో జరిగే సరదా ఘటనలనూ, వేడుకలను, కాలనీవాసుల ప్రవర్తనను చమత్కారంగా వివరిస్తున్నారు ఆనందరావు పట్నాయక్ ఈ ‘కాలనీ కబుర్లు‘ కాలమ్‌లో. [/box]

[dropcap]అం[/dropcap]త్యాక్షరిలో బహుమతులు కొట్టుకొచ్చారు మా వాళ్లు. ఎంతయినా అమరావతి వాళ్లం కదా – మాట్లాడం, పాటలు పాడడంలో మాకు మేమే సాటి. ఆటలు, పాటలు మాకు మా నేతలు నేర్పిన విద్య. ఓం జేబులోంచి చాక్లెట్ బార్ తీసి మా మనవళ్లకు ఇచ్చాడు. రావిగుడ విశేషాలు అడిగారు మా వాళ్లు. తలిదండ్రులు పోయారు. అతనికి ఇద్దరు పిల్లలు, చదువుకొంటున్నారని చెప్పాడు. తమ్ముళ్లందరూ చిన్నా చితక ఉద్యోగాలు చేసుకొంటూనే ఆ ఊర్లోనే ఉంటున్నట్లు చెప్పాడు. పాప ఎక్కడుందని అడిగింది మా ఆవిడ. స్వామి కూతురి పేరది. అక్క ఎక్కడుందో చెప్పి ఆమె కూతురినే ఒక తమ్ముడు చేసుకొన్నాడట. దరిద్రానికి మించి దరిద్రం లేదట. అటువంటి బురదలో పుట్టిన పద్మం మా ఓం.

మా రూంకి వచ్చాయి చపాతీ, కుర్మా. ఆబగా, ఆతృతగా తినేసరికి పొలమారాను. మా ఆవిడ సన్నగా గొణుగుతూ నెత్తిన రుద్దుతున్నట్లు నాలుగు టెంకిజెల్లలు కొట్టింది. రసగుల్లా వచ్చింది. ఆ స్వీటుకు ఆ ఊరు ప్రసిద్ది. మీకు షుగరుందని చెప్పి నోట్లో పెట్టుకోబోతున్న రసగుల్లాని లాక్కుంది ఇల్లాలు. లక్కీ చేస్తున్న ఈ అతిథి మర్యాదలకు డంగయిపోయాం మేమంతా. తనని ఫ్యామిలీతో పిక్నిక్‌కి పిలవలేదని ఛార్జి చేసాడు ఓం. నీవు కాలనీ కన్న కొడుకివా, ఇంటల్లుడివా అని కౌంటరిచ్చాడు లక్కీ. వాళ్లిద్దరు క్లాసుమేట్సు అని ఆ పరాచికాలు. చాలా రాత్రి వరకు కాలనీ కబుర్లాడుకొంటూ గడిపాం. పాత విషయాలు, అప్పటి స్టాపు సంగతులు పేరు పేరునా చెబుతున్నాడు ఓం.

నాయుడు సంగతి పడింది. ఆఫీసు క్లర్కు అతను. పల్లె నుంచి వచ్చాడు. భాష భయంకరంగా ఉంటుంది. ఆ తండ్రికి తగ్గ తనయులిద్దరు నాయుడికి.

“ఒరేయ్ బావూ.. బట్టలు మాసిపోనాయి. ఇస్కూలుకు ఎట్టాలతాను నీ..” అని తిడుతున్న కొడుకిని బుజ్జగించి, “నానేటి కూకున్నానా బాడుకోవ్, సిటం ఆగు” అనేవాడు.

“రే అయ్యా.. మరస్టినాటికి మడేలుగారు మనింటికి నాకపోతే నానొల్లను” ఇలా ఉండేది వాళ్ల సంభాషణ. అవి గురుర్తుకొచ్చి పగలబడి నవ్వుకొన్నాం.

బంకు నాయుడు అని అతనిప్పుడొక సీటు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పెట్రోలుబంకు, రెండు ట్రక్కులు, టాంకరు నడుపుకొంటూ లక్ష్మీదేవిని తనింటి అండరుగ్రౌండులో బంధించి ఉంటారని కిట్టనివాళ్లు చెప్పుకుంటుంటారట.

పాణిగ్రాహి సంగతి పడింది. తులసీవనంలో గంజాయి మొక్కలా మా ఇంజనీరు జాతికే మచ్చ తెచ్చిన మహా నీచ, నికృష్ట మానవుడు. పెళ్లాం రోగిష్టిది. ఆ దుష్టుడి కళ్లన్నీ ఆడాళ్ల మీదనే. సంసార స్త్రీలు అతగాడి మొహం మీదనే ధడాలున తలుపులు వేసుకోవడం మాకెరిక.

మేరీ మేడమ్‌కి ఆ కీచకుడి లైంగిక వేధింపులు తప్పేవికాదు, సాటి ఇంజనీరు ఇంట్లో సి.సి. ఆరర్లు రాసుకొంటానని మభ్యపెట్టి పగలంతా క్వార్టరులో గడిపేవాడు. చికెను తెచ్చి పకోడా బాగా చెయ్యగలనని చెప్పి ఆ ఇంటి ఇల్లాలిని లోబరచుకోడానికి ప్రయత్నిస్తే పెద్ద రాద్దాంతమయి పోయింది. అవమానానికి మ్యానేజిమెంటును బ్రతిమాలి రాత్రికి రాత్రి బదిలీ చేయించుకొని పారిపోయాడు పాణిగ్రాహి.

కాలనీలో ఉరమని పిడుగులా దొంగల బెడద వచ్చిపడింది. మేమంతా తరతమ భేదాలు లేక గ్రూపులుగా ఏర్పడి నైట్ డ్యూటీ చేసేవాళ్లం. రాత్రి భోజనాలు కానిచ్చి దుర్గా మండపం వద్ద గుమిగూడేవాళ్లం. చేతుల్లో కర్రలు, తలకి మంకీ క్యావులు వేసుకొని గస్తీ కాస్తుంటే మమ్మల్ని దొంగలనుకొని బడిత పూజ చెయ్యొచ్చునని జోకు వేస్తే అంతా నవ్వారు.

ఒకరోజు రాత్రి పండెండయింది, కాలనీ మెయినుగేటు దగ్గర కూచుని దమ్ము కొడుతున్నాం. హఠాత్తుగా ఎంకడు “…సారూ, అటు సూడండి దొంగలమంద” అని వేలితో చూపాడు.

చెప్పొద్దూ మా గుండెలు జారి ముడుకుల మీదకి వచ్చాయి. పొదల వెనుక ఏవేవో శాల్తీలు కదులుతున్నాయి.

అటువంటి క్లిష్ట సమయంలో మా ఆవిడిని గుర్తు తెచ్చుకొన్నాను. కాస్త గుండెకు బలం చేకూరిన పిదప, బుర్రకి అందులోని మెదడుకి పని అప్పజెప్పాను.

అక్కడ నీళ్ల మడుగు ఉంది. అంత రాత్రి వేళ స్వచ్ఛభారత్‌కి మోడీగారికి ద్రోహం చేసేవాళ్లు ఎవరూ ఉండరు. ఇకపోతే దొంగలు దోచుకొనేందుకు అనువైన సమయం కాదది. వేకువజామున మాత్రమే డ్యూటీలో హాజరవుతారు.

అయితే దీని అంతు తేల్చాల్సిందే అనుకొని ధైర్యే సాహసే సుసర్ల లక్ష్మి అనుకొని ముందుకు కదిలాను(స్మూలులో చదివేటప్పుడు లక్ష్మికి నేను భగ్న ప్రేమికుడిని). టార్చి లైటు వెలుగులో కర్ర టక్కు టక్కు లాడిస్తూ ముందుకు వెళ్లసాగాను. నా చొక్కా పట్టుకొని ఎంకడు, వాడి చొక్కా మరొకడు పిల్లలు ఆడుకొనే ట్రెయినులా కదిలాం. తీరా చూస్తే అవి గేదెలు. నల్లని గేదెలు ఆ చీకటిలో దట్టంగా మొలిచిన గడ్డి మేస్తున్నాయి…

“సారూ.. జాగారం సేస్తే తమరు డ్యూటీ సెయ్యనేరు. ఎల్లిపోండి బాబయ్యా!” ఎంకడు తొందర చేసాడు. వాడు పొరబాటున మా డిపార్టుమెంటులో ఉన్నాడు కాని రాజకీయాల్లో రావలసినవాడే మరి.

(సశేషం)

Exit mobile version