[box type=’note’ fontsize=’16’] “పస వున్న తెలుగు సినెమాలు రావడంలేదూ అని ఫిర్యాదు చేస్తుంటాము కదా. ప్రస్తుతానికి ఇది చూడండి. ఇలాంటివి వైరల్ అయితే మెరుగైన చిత్రాలు మరిన్ని వస్తాయి” అంటూ ‘కలర్స్‘ షార్ట్ ఫిల్మ్‌ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]
[dropcap]ఈ[/dropcap] మధ్య లఘు చిత్రాల మీద వ్రాస్తున్నా కదా. ఎక్కువగా హిందీ లఘు చిత్రాలే వ్రాశాను. తెలుగులో నేను చూసినవి తక్కువ. వాటిలో నచ్చి, గుర్తుండిపోయినవి ఇంకా తక్కువ. ఇప్పుడు చర్చిస్తున్న లఘు చిత్రం “కలర్స్” ను ఇదివరకే చూశాను. అప్పటికి “ఘాజి” లో ఒక చిన్న పాత్రలో చూశాను తిరువీర్ ని. ఒక తెలుగు దర్శకుడు (సంకల్ప్ రెడ్డి), తెలుగు నటుడు (తిరువీర్) హిందీ మహామహులతో కలిసి పని చేసిన చిత్రం. సరే ఆ తర్వాత బర్బరీకుడు అనే నాటకం చేసినట్టు తెలిసింది. అది వచ్చినప్పుడు నేను ఢిల్లీలో వున్నా. ఈ కరపత్రం చూసినా, వచ్చి చూసే అవకాశం లేదు. సౌదా నాకు నచ్చిన రచయిత. అతని “అపురూప పురాణ గాథలు” లోని వొక కథే ఈ బర్బరీకుడు. కాబట్టి ఈ మనిషి పేరు గుర్తుండి పోయింది. నెట్ లో చూస్తే ఇదీ ఇంకొన్ని షార్ట్స్ వున్నాయి. ఈ వారం తెలుగు లఘు చిత్రం గురించి వ్రాద్దామనుకుని ఇది ఎంచుకున్నాను. నాకు చిత్రం పేరు గుర్తు లేదు. నెట్ లో వెతికితే ఇది తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కువగా బొమ్మల రామారం, సిన్ గురించే ఎక్కువ వస్తున్నాయి నా ఫైండ్ లో. ఇక అతన్నే అడిగా నా జ్ఞాపకం ఇలా వుందీ, ఆ సినెమా లింక్ ఇవ్వగలవా అని : “నువ్వు నటించిన ఒక షార్ట్ సైకాలజీ మీద ఆధారిత కథనం చాన్నాళ్ల క్రితం చూసిన గుర్తు. పేరు? ఒకే రూమ్ లో కుర్రాళ్ళ సీన్, చివర్న ఓ అమ్మాయి తలుపు తట్టదం etc”. వొక చిత్రం ఈ మాత్రం గుర్తుండిపోయినా, నా విషయంలో, గొప్పే. లేదంటే నేను సినెమాలు చూసినవి చూసినట్టే మరచిపోతుంటాను. (Blessing in disguise)
మల్లేశం, జార్జి రెడ్డి, పలాసల తర్వాత బాగా నోట్లో నలిగిన పేరు ఇతనిది. ఆసక్తి వుంటే దీన్ని చూస్తారని.
అర్జున్ తన ప్రియురాలితో ప్రేమలో పడ్డా చాన్నాళ్ళ వరకూ ప్రకటించలేకపోతాడు తన ప్రేమను. ఆత్మ న్యూనత. అపరాధ భావనలు. మందు అలవాటు. డ్రగ్స్ అలవాటూ. తప్పు చేస్తున్నాను అనుకుంటున్న వాటిని లేవు అని తనకుతాను చెప్పుకుని అణిచిపెట్టుకోవడం. ఇంకొన్నింటిని రహస్యంగా, సజీవంగా (ఆరకుండా కాపాడుకుంటున్న కొవ్వొత్తి) ఉన్న రహస్యాలను బీరువాలో దాయడం. తన తల లోనే సకారాత్మక, నకారాత్మక తానులు తనను చెరో వైపు లాగుతుంటే తలపట్టుకుని కూర్చుంటాడు. అన్ని రంగులనూ తనలో ఇముడ్చుకున్న తెలుపు తను. ఆహారం పెట్టకుండా వదిలేస్తే, పట్టించుకోకుండా వదిలేస్తే చేప పిల్లే కాదు ఏదైనా చనిపోతుంది. అతనిలోనే వున్న మౌనం మాటలను విని, వైద్యం చేయించుకుని దారిలో పడతాడు అర్జున్. అతని మనసులోని పసుపు సైకియాట్రిస్టులు మనల్ని వేరు చెయ్యలేరురా అని తప్పుదారి పట్టించడానికి చూస్తాడు. అసలు అందరిలో ఎక్కువ మాట్లాడేది అతనే. ఎంద్కంటే అర్జున్ కూడా ఎక్కువ వినేది అతన్నే. అతని మాటలకు పిచ్చెక్కి వెతుక్కుని మరీ పరుపుకిందనుంచి వొక పొట్లం (డ్రగ్స్?) తీస్తాడు, పసుపు వద్దని వారిస్తున్నా. ఎరుపు మాట్లాడుతాడు కాని, అతని మాటలను చెవిన పడనివ్వడు అర్జున్. నిద్రపుచ్చిన ఆకుపచ్చ మాట్లాడనే మాట్లాడడు, అప్పుడప్పుడు పసుపు చెవులు కొరికి ఎగదోయడం తప్ప. ఇక నలుపుకి వొకే వొక్క వాక్యం. కొవ్వొత్తిని ఆర్పేస్తూ అంటాడు బహుశా నేను వొక్కడినే నిజం, మీరంతా అబధ్ధం అని. నేను చెప్పాల్సిన నాలుగు ముక్కలూ చెప్పడానికి కథ చెప్పక తప్పింది కాదు. అది కూడా సగం చెబితే మీ తలలో నేను కూడా ఈ భూతాల్లా వొక భూతాన్ని అయ్యుండేవాడిని.
పద్నాలుగు నిముషాల్లో ఇంత చక్కగా కథ చెప్పిన మోటూరి సిద్దార్థ ను అభినందించాలి. కథ వ్రాయడంతో పాటు శాంతన్ రెడ్డితో కలిసి దర్శకత్వం చేశాడు. ఈ పేరు నేను మళ్ళీ వినలేదు. చూడాలి, ఇంకా ఏమైనా సినెమాలు చేశాడో ఏమో. దర్శకులలో ఒకడైన శాంతన్ రెడ్డి దీనికి చాయాగ్రహణం కూడా. అందరి నటనా బాగున్నా బాగా కొట్టొచ్చినట్టు కనబడేది తిరువీరే. తన నటనా స్థాయి ఏమిటో 2017 లోని ఈ లఘు చిత్రంలోనే చూపించేశాడు.
పస వున్న తెలుగు సినెమాలు రావడంలేదూ అని ఫిర్యాదు చేస్తుంటాము కదా. ప్రస్తుతానికి ఇది చూడండి. ఇలాంటివి వైరల్ అయితే మెరుగైన చిత్రాలు మరిన్ని వస్తాయి.