[dropcap]గుం[/dropcap]టూరు: అనువాద అకాడమీ స్థాపించాలని ఆరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.
స్థానిక లాడ్జి సెంటర్‌లో ఉన్న ఏఎల్ బిఈడి కళాశాలలో ఏర్పాటు చేసిన గుంటూరు విశాలాంధ్ర 22వ పుస్తక మహోత్సవంలో భాగంగా అరసం ఆధ్వర్యంలో అభ్యుదయ సాహితీవేత్త ముత్యాల ప్రసాద్ సాహిత్య వేదికపై డిసెంబర్10 శనివారం సాయంత్రం చలపాక ప్రకాష్ ‘కరోనా నానీలు’ హిందీ అనువాదం ‘కరోనా కా కొహరామ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య అధ్యక్షతన జరిగింది.
పెనుగొండ లక్ష్మీనారాయణ కరోనా నానీలు హిందీ అనువాదాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇతర భాష సాహిత్యాలను ఇప్పటివరకు తెలుగులోకి అనువదించుకున్నామని, తెలుగు భాషలోని ఉన్నతమైన సాహిత్యాన్ని హిందీ తదితర భాషల్లోకి తర్జుమా చేయాల్సిన అవసరాలను ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అందుకోసం ఇప్పటికైనా అనువాద అకాడమీ స్థాపించాలని కోరారు.
సభకు అధ్యక్షత వహించిన సోమేపల్లి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తెలుగు సాహిత్య ప్రక్రియలో నానీలు అత్యాధునికమైనవని, అవి తెలుగుకే సొంతమన్నారు.
పుస్తకాన్ని సమీక్షించిన షేక్ కాసింబి మాట్లాడుతూ నానీలు రచనాపరంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని అన్నారు. అయినప్పటికీ అత్యంత సూక్ష్మమైన మూలభావాన్ని ప్రతిభావంతంగా హిందీలో అనువదించారని పేర్కొన్నారు. నానీలు హిందీ అనువాదం ద్వారా భారతీయ సాహిత్యానికి మరింతగా పరిచయం అవుతాయని అన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఈ పుస్తకాన్ని తెలుగు నుంచి హిందీలోకి అనువదించిన డాక్టర్ వెన్నా వల్లభరావు మాట్లాడుతూ కరోనా కల్లోల్లాన్ని చలపాక ప్రకాష్ తెలుగులో నానీల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. దీనికి సంబంధించిన అన్ని రకాల కీడు మేలుల్ని ప్రతిఫలింప చేశారని తెలిపారు. తెలుగు కవిత్వాన్ని హిందీ భాష లోకి అనువదించడం ద్వారా తెలుగు భాషా సాహిత్యం గొప్పతనాన్ని జాతీయస్థాయిలో ఆవిష్కరించినట్లు అవుతుందని చెప్పారు. గోవా సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు నుంచి హిందీలోకి అనువాదమైన కవితా గ్రంథాన్ని పార్టీ పుస్తకంగా నిర్ణయించాలని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కరోనా నానీల గ్రంథకర్త చలపాక ప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే కరోనా కల్లోలం అత్యంత విషాద భరితమని, దానిని కవిత్వీకరించకుండా ఉండలేకపోయారన్నారు. తన నానీలను హిందీలోకి అనువదించిన వల్లభరావుకు.. అరసం వేదికపై ఆవిష్కరించిన పెనుగొండ లక్ష్మీనారాయణకు.. సమీక్షించిన కాసింబికి.. అధ్యక్షత వహించిన సోమేపల్లి వెంకటసుబ్బయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. అరసం రాష్ట్ర కార్యదర్శి కె. శరత్ వక్తలను వేదికపై ఆహ్వానించారు.