కరోనా కాలంలోను సాహసం చేసిన అనురాధ

3
3

[box type=’note’ fontsize=’16’] కరోనా కాలంలోను సాహసం చేసి కుద్రేముఖ్ శిఖరాన్ని అధిరోహించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు కోల అనురాధ గురించి వివరిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box] 

ఆమె ఒక వ్యాయామ ఉపాధ్యాయురాలు. యన్.సి.సి. ఆఫీసర్. గుడివాడలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పురపాలక బాలికోన్నత పాఠశాల విద్యార్థినులకు వ్యాయామ విద్యను బోధిస్తారు. అంతేకాదు, సహ పాఠ్య కార్యక్రమాలకు తయారుచేసి పోటీలకు పంపిస్తారు. విద్యార్థినులు క్రీడలలోను, యన్.సి.సి. లోని జాతీయస్థాయి వరకు ఎదిగారు. ఖోఖో క్రీడలో జాతీయ ఛాంపియన్‌లుగా మలిచారు. 2017లో అసోంలో జరిగిన యన్.సి.సి. ఆధ్వర్యంలో జరిగి యన్.ఐ.సి. (నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ తీసుకొచ్చారు.

ఆమె కోల అనురాధ. తల్లిదండ్రులు రమణమ్మ, కోటేశ్వరరావుగార్లు.

కరోనా కలోల కాలంలో అందరూ మాస్క్‌తో నోరు మూసుకుని కూర్చుంటే, అనురాధ మాత్రం సాహసం చేసి ఔరా! అనిపించుకున్నారు. అదే కుద్రేముఖ్ శిఖరాన్ని అధిరోహించడం! ఈ సాహసాన్ని గురించి ఈమె మాటల్లోనే…..

***

కుద్రేముఖ్ పర్వత ఆరోహణ ఒళ్ళు జలదరించే మధుర అనుభూతి

“ట్రెక్కింగ్ అంటే ముందు నుంచి నాకెంతో ఇష్టమైన సాహస ప్రక్రియ. సాహస క్రీడల్లో పాల్గొనడాన్ని ముందు నుంచి నేను ఇష్టపడతాను. రెండేళ్ళ క్రిందట కేదార్‌నాథ్‌కు కూడా నా స్నేహితురాలితో కలిసి ట్రెక్కింగ్ ద్వారా వెళ్లాను. మంచి అనుభవాన్ని మిగిల్చిన యాత్ర అది.

తమిళనాడులోని ట్రెక్కింగులు నిర్వహించే ‘టిఎస్-3 క్లబ్’ ద్వారా ఈ అవకాశం నాకు దక్కింది. గుడివాడ నుండి బెంగుళూరు అక్కడ నుండి చిక్ మంగుళూరు. మొత్తం బస్సులో 20 మంది ప్రయాణించాం. అందరూ వేర్వేరు భాషలవారం. కుద్రేముఖ్ బేస్ క్యాంపులో అందరూ టెంట్లలోనే ఆ రాత్రి గడిపాం.

నవంబర్ 6 ఉదయాన్నే మూడు టీములుగా విభజించి అడవిలో ట్రెక్కింగ్‌కు బయలుదేరాం. ప్రతి టీము వెనుక ఒక డాక్టరు మరియు టీమ్ గైడు తప్పనిసరిగా ఉంటారు. ఆ దారి ఎంతో ఇరుకుగా, ఒక చేతి మూర కంటే వెడల్పు లేదు. నేలంతా చిత్తడిగా ఉండటంతో ఏమాత్రం జారినా లోయలోకి పడిపోతారని అత్యంత జాగ్రత్తతో నడవాలని గైడ్ సూచించారు. క్రింద రక్తాన్ని పీల్చే జలగలు లాంటి పురుగులు అనేకం ఉంటాయి. అడవిలో పులులు, ఎలుగుబంట్లు, నక్కలు ఎక్కువగా సంచరిస్తూ వుంటాయి. సాయంత్రం మూడున్నర కల్లా చీకటి పడిపోవడం విశేషం.

ఉదయం 5 గంటలకే బయలుదేరిన మేము అతి కష్టమైన దారిలో నడుచుకుంటూ ఖచ్చితంగా 1.00 కల్లా కుద్ర్రేముఖ్ శిఖరానికి చేరుకున్నాం. అటవీశాఖ నిబంధనల ప్రకారం తిరిగి 5.30 కల్లా బేస్ పాయింట్ వెళ్లిపోవాలి. మామూలుగా ట్రెక్కింగ్ ఎక్కడమే కష్టం అనుకుంటాం, కానీ దిగటం అంతకన్నా కష్టం అనిపించింది. అడుగులు తడబడిపోతూ, కాళ్లు వణికిపోతున్నాయి. కాళ్లమీద పడే రక్తం పీల్చే పురుగుల్ని తీసివేసుకుంటూ, నిర్దేశిత సమయానికి బేస్ క్యాంప్‌కి అందరం క్షేమంగా చేరుకున్నాము.

రెండవ రోజు:

‘హోరానాడ క్యాతన మక్కి ట్రెక్కింగ్’కి బయల్దేరాం. ఆ పర్వత సానువుల్లో 360 డిగ్రీలు ఎటుచూసినా అంతా పచ్చదనమే. భూదేవికి ఆకుపచ్చ చీర కడితే ఎలా వుంటుందో అలా ఉంటుంది. ఆ ప్రదేశంలో కాసేపు నిలబడితే మన మనసు మరో లోకంలోకి వెళ్లిపోతుంది అనడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. మధ్యాహ్నం కల్లా శిఖరాన్ని కూడా అధిరోహించిన తర్వాత సాయంత్రానికి మళ్లీ బేస్ క్యాంపు చేరాం. ఆ రాత్రి నైట్ క్యాంప్ ఫైర్ నిర్వహించారు. భాష తెలియని వాళ్లు అయినా అందరూ కుటుంబ సభ్యులవలే కలిసిపోయారు. ఈ మధురానుభూతులను నెమరువేసుకుంటూ సేద తీరారు.

మూడవ రోజు :

‘సామ్ సే ఎలనీరు జలపాతం’ వద్దకు వెళ్లాం. కొండకోనల్లో నుండి 60 మీటర్ల ఎత్తు నుండి పడే ఈ జలపాతం నీళ్లలో అందరూ కేరింతలు కొట్టాం. ఆ నీళ్లు కొబ్బరినీళ్లులా తియ్యగా వుండడం విశేషం. ఈ జలపాతం చూస్తే మనల్ని మనమే మైమరచిపోతాం.

ఈ జలపాతమే ధర్మస్థల వద్దనున్న నేత్రావతి నది. నది అందాలు మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. తిరిగి అందరం బేస్ క్యాంపు చేరుకుని బ్యాగేజ్‌లు అన్నీ జాగ్రత్తగా సర్దుకుని ఎవరి ఊళ్లకు వారు బయలుదేరాం. అందరం కలిసి ఇంత అద్భుతమైన క్యాంప్ ఏర్పాటుచేసిన ‘టక్కారు స్పోర్ట్స్ స్కూల్, చెన్నై’ డైరెక్టర్ ఉదయ్ గారికి ధన్యవాదాలు చెప్పాం.

ఇలాంటి సాహస కార్యాలకి నాకు స్ఫూర్తినిచ్చింది మా ఎన్.సి.సి. లెఫ్టినెంట్ కమాండర్ జితేంద్ర కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

హిమాలయాల ట్రెక్కింగ్ నా తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నా. నన్నెంతో ప్రోత్సహిస్తూ, అభినందిస్తున్న ఉపాధ్యాయ మిత్రులు ఇచ్చే ప్రోత్సాహంతో మరింత సాహస కార్యాలకు ధైర్యంగా అడుగులు వేస్తాను.”

***

కరోనా కాలంలోను వేరే రాష్ట్రానికి ఒంటరిగా వెళ్ళి ధైర్యంగా ఈ సాహసం చేసి ట్రెక్కింగ్ విజేతగా నిలిచిన ఈమె ముందు ముందు తను కోరుకున్నట్లు హిమాలయాలను అధిరోహించాలని ఆశిస్తూ విజయాభినందనలను తెలియజేద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here