Site icon Sanchika

కరోనా మాటున నా భావజాలాలు

[dropcap]మ[/dropcap]నిషి మేధస్సు పరంగా ఎంతో శక్తివంతుడవచ్చు. ఎన్ని పరిశోధనలు చేసి ఎన్నెన్నింటినో కనిపెట్టి ఉండొచ్చు, చంద్రమండలంపై అడుగు పెట్టి ఉండొచ్చు, అంగారక గ్రహం మీద అడుగు పెట్టడానికి తహతహలాడుతూ ఉండొచ్చు. ఇంత శక్తిమంతుడూ ప్రకృతి చెంత తల వొంచవల్సిదే.

ప్రకృతిని శాసించే అధికారం, శక్తి మనిషికి లేదు. ఉప్పెనలను, పెను తుఫానుల్ని, సునామీలను, భూకంపాల్ని ఆపగలిగే శక్తి మనిషికి ఉందా అంటే, లేదు అని సమాధానం వస్తుంది. అదంతా ఎందుకు పడిలేస్తున్న సముద్రంలోని కెరటాల్ని ఆపగలిగే శక్తి మనిషికి లేదు. చిగురుటాకుల్ని, పెద్ద పెద్ద వృక్షాల్ని కూకటి వేళ్ళతో సహా పెకిలిస్తున్న ప్రచండ వాయువుల్ని ఆపగలిగే శక్తి మనిషికి ఉందా అంటే అదీ లేదు.

అది తెలుసుకోకుండా మనిషి ప్రకృతిని తన చేతుల్లోకి తీసుకుని వికృతిగా మార్చేస్తున్నాడు. ప్రకృతి విధ్వంసానికి పూనుకుంటున్నారు. ఈ విపరీత పరిణామాల ఫలితమే ఈ మహమ్మారి కరోనా విళయతాండవం అని నేను అనుకుంటాను.

కరోనా వైరస్ జన జీవితాన్ని కకావికలం చేస్తోంది. అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయి. ఈ వైరస్ బారిన పడిన ఎంత మందో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. మరి కొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. మరి కొందరు తిరిగి జీవించడానికి ఆ వైరస్‌ని జయించడానికి ఆశతో జీవిస్తున్నారు.

ఈ హఠాత్ పరిణామానికి ప్రపంచ దేశాధిపతుల నుండి సామాన్య ప్రజానీకం వరకూ, రెక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవులెందరో ఇక్కట్లకి గురి అవుతున్నారు. ఇది ప్రతీ ఒక్కరినీ కలవరపాటుకి గురి చేస్తోంది.

కష్ట సుఖాలు, చిరునవ్వులు, కన్నీళ్ళతో నిండి ఉన్నదే మానవ జన్మ. కష్టాల్ని అనుభవించిన తరువాత మనిషిలో నిరాశ నిశ్పృహ పేరుకుపోతాయి. అతనిలో వైరాగ్యభావం కలుగుతుంది. ఒక విధంగా చూస్తే మనిషి జీవితంలో ఈ కష్టాలు, ఆపదలు పరీక్షల్లాంటి వనిపిస్తుంది. ఇవే లేకపోతే మనిషి భగవంతుని అస్తిత్వాన్ని పూర్తిగా మరిచిపోయి ఉండేవాడేమో. అందుకే ఆ భగవంతుడే అప్పుడప్పుడు ఇలాంటి వాటిని కలిగిస్తాడు.

అలా కలిగిస్తే ఆ సమయంలోనేనా తనని ప్రజలు గుర్తిస్తారు, తలుచుకుంటారని భగవంతుడు ఇలాంటి వాటిని కలిగిస్తూ ఉంటాడు అని కొందరి భావన. మరి కందరు కర్మ సిద్ధాంతాన్ని సమర్థించినవారు ఎలా జరగవల్సింది అలా జరుగుతుంది, ఏదీ మన చేతిలో లేదు అంటారు.

అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ కరోనా మహమ్మారి వల్ల అస్తవ్యస్తమైన మనిషి జీవితంలో ఆధ్యాత్మిక భావాలు మొలకెత్తాయి. దైవ ప్రార్థనలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాదులు, హోమాలు, జపతపాలు మొదలయ్యాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం పరమత దేశమైన పాకిస్తాను లాంటి పొరుగు దేశంలో మన దైవం మీద విశ్వాసం పెరిగి పురాతన శివాలయంలో పూజలు జరిపించడం. పాకిస్తానులోని ఆ శివాలయం ఎన్నో వందల సంవత్సరాల క్రితం తలుపులు మూసి, పూజా పునస్కారాలు లేకుండా ఉందని విన్నాను. ఇది సర్వమత సమభావానికి సూచకం, మంచి విషయమే.

ఈ కరోనా వైరస్ రాక మనిషి జీవితంపై చూపిన ప్రభావ ఫలితంగా మనిషిలో మానవత్వం, మంచితనం పెరిగాయి అని చెప్పుకోవచ్చు. దాతృత్వం పెరిగింది. దానికి ఫలితమే రెక్కడాతే కాని డొక్కాడని బడుగు జీవులను ఆదుకోడానికి, వారి ఆకలి బాధల్ని తీర్చడానికి ముందుకురావడం. స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా ఆదుకోవడం కూడా శుభసూచకం అని నేను అనుకుంటాను.

మంచి ఎక్కడుంటుందో, చెడు కూడా దాన్ని అంటి పెట్టుకుని అక్కడే ఉంటుంది. మనిషిలోని భావాల్ని కలుషితం చేయడానికి మనోవికారాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఎప్పుడూ పడగ విప్పి కాటు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. మనం చేసిన ప్రతీ పనిని, నిశితంగా పరిశీలిస్తూ, దానిలో ఏ పాటి చిన్న పొరపాటు, తప్పు దొర్లినా దాన్ని బూతద్దంలో చూపిస్తూ పాలకపక్షాన్ని అపహాస్యం చేయడానికి ప్రయత్నించిన ప్రతిపక్షం ఉంటుంది. వారికి తాము పరిపాలన చేసినప్పుడు తాము చేసిన తప్పులు అగుపించవు. వారిలో ఉన్న భావ మనోవికారాలే దానికి కారణం.

కరోనాని అవకాశంగా తీసుకుని ప్రజల దృష్టిలో మంచి సంపాదించాలన్న తాపత్రయం పడుతున్న స్వార్థపరులు కూడా ఉన్నారు సమాజంలో. తాము అక్రమంగా సంపాదించిన సంపదలో ఒక శాతాన్ని పేద ప్రజలకు ఇలాంటి ఆపద సమయంలో దానం చేస్తునట్లు నటించి ప్రజల మన్ననలను పొంది, రేపొద్దున్న ఎన్నికల సమయంలో ప్రజల దగ్గర ఓట్లు దండుకోవాలని చూసే స్వార్థపరులూ ఉన్నారు ఈ సమాజంలో. ఇలాంటి వాళ్ళందరూ ఈతకాయ ఇచ్చి, తాటికాయ లాక్కొవలని జూచిన మనుష్యులు అని నేను అనుకుంటాను.

అలా అని నిస్వార్ధ భావంతో ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిన దాతలందర్నీ ఒక గాటన కట్టలేము. నిస్వార్థంగా దానం చేస్తున్న వాళ్ళు కూడా కొందరున్నారు.

కంటికి కనిపించని ఈ వైరస్‌ని అరికట్టడానికి తోచక తలలు పట్టుకుంటున్నారు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, దేశాధిపతులు, మహా మహా గొప్ప వాళ్ళందరూ. ఈ వైరస్‌కి మందే లేదట. మందు కనిపెట్టాలంటే మరింత సమయం పడుతుందట. మన దేశ ప్రధాని మదిలో మెలిగిన ఓ గొప్ప ఆలోచన, వజ్రాయుధం లాక్‌డౌన్, ఇంకా సామాజిక దూరం పాటిచడం.

అనేక సమాజిక సమస్యల్ని కథా వస్తువులుగా మలుచుకుని అనేక కథలు కథానికల్ని రచించిన నాకు ఈ కరోనా పైరస్ గురించి తలుచుకోడానికే భయమేస్తోంది. ఇది సామాజిక సమస్య కంటే జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచ సమస్య, ఈ సమస్యకి పరిష్కారం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలే ప్రస్తుత పరిస్థితుల్లో పరిష్కారం కనుక్కోవాలి. పరిస్థితుల్లో ఈ సమస్య గురించి ఆలోచించే శక్తి నాకు లేదు. రచయితగా నేను ఏమీ చేయలేను. శాస్త్రవేత్తలే పరిష్కార మార్గం కనిపెట్టాలి అని నేను అనుకుంటాను.

రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు నేను పుట్టలేదు. అప్పటి దేశ పరిస్థితులు నాకు తెలియవు. అయితే అప్పటి పరిస్థితుల్ని చూసిన వారిని బట్టి నేను తెలుసుకున్నదేంటంటే అప్పటి ఆర్థిక పరిస్థితులు కన్నా ఇప్పటి ఆర్థిక పరిస్థితులు ఎన్నోరెట్లు మెరుగ్గా ఉన్నాయనిపిస్తుంది. అప్పటి దేశ జనాభా కూడా ఇప్పటి జనాభాకంటే చాలా తక్కువ. అయినా జనాలకి సరియైన తిండి లభించేది కాదుట. అదీ ఒక్కపూటే భోజనంట. ఆ ఆకలి తట్టుకోలేక జనలు విలవిల్లాడిపోయేవారట.

అప్పటి పరిస్థితుల్ని వింటున్న నాకు ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల స్థితి బాగానే ఉంది అని అనుకుంటాను. తన కుటుంబం తింటూ బడుగు జీవులకు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు దానం చేసే స్తోమతగల వారు నేటి సమాజంలో ఉన్నారు.

గాంధీజీ దేశ స్వాతంత్య్ర సముపార్జనకి అహింసతో కూడిన శాంతియుత పోరాటం ఆయుధంగా తీసుకునట్టు మన దేశ ప్రధాని లాక్‌డౌన్‌ని ఆయుధంగా చేసుకుని కరోనా మహామారిని తరిమి వేయడానికి ప్రయత్నించడం హర్షించవల్సిన విషయం. అతనికి డాక్టరు, పోలీసుశాఖ, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు అందరూ చేయూతనిస్తూ, అతని సూచనల్ని పాటించడం ఈ వైరస్‌ని తరిమి గొట్టగలం అనే ఆత్మవిశ్వాసం మనలో కలుగుతోంది.

ఏది ఏదైతేనేం ఈ సమస్య తీరడానికి లాక్‌డౌన్ మార్గం. అందరూ ఇళ్ళల్లో బందీలై ఉండిపోవడమే. ఇన్నాళ్ళూ ప్రతీ ఒక్కరికీ చేతినిండా పని ఉండేది. తోచేది కూడా. ఈ విషమ పరిస్థితిలో ఇంట్లో కూర్చుంటే తోచదు. ఇంత వరకూ వంటింటి ముఖం చూడని మగవాళ్ళు వంటింటిలోకి చొరబడి రకరకాల తినుబండారాలు చేస్తూ హడావిడి పడ్తున్నారు. ఆ పదార్దాలు రుచి చూపిస్తున్నారు. అవి బాగుంటే పరవాలేదు. బాగోలేకపోయినా బాగున్నాయని చెప్పే వరకూ వదలటంలేదు. ఇది ఇబ్బందికరమైన విషయమే. మరికొందరు తమలోనున్న సృజనాత్మకతను జోడించి, ఆలోచనల్ని చూపించి రుచికరమైన తినుబండారాల్ని తయారు చేసి నలబీములను కూడా మరిపిస్తున్నారు.

ఇక వంటల జోలికి పోని వాళ్ళు స్మార్ట్ ఫోన్లలో రకరకాల మెసేజ్లు, కామెంట్లు, భక్తి పాటలు, నీతి వాక్యాలు పెడ్తూ కాలక్షేపం చేస్తున్నారు. అలాగయితే ఎవ్వరికీ ఏ ఇబ్బందీ లేదు. అంతటితో ఊరుకోకుండా మరికొందరు పుకార్ల చిక్కుల్లో పడేస్తున్నారు. ‘తిరుపతిలో అఖండ జ్యోతి ఆరిపోయింది. ఇది అరిష్టం, అందుకు నివారణగా చెంబుడు నీళ్ళలో పసుపు కలిపి తులసి మొక్కలో పోయాల’ని ఒకరు; మరొకరు ‘ఆడవాళ్ళు మెళ్ళో పసుపు కొమ్ముకట్టిన త్రాడు ధరించాలని లేకపోతే అరిష్టమ’ని. ఈ పుకార్లని ఖండించిన మఠాదిపతులు, దేవాదాయ, ధర్మాదాయ శాఖాధిపతులు ప్రజల్లో కలిగిన సందేహాలు, భయాలు పటాపంచలు చేసేరు. అది వేరే విషయం. ఇలాంటి పుకార్లు ఎందుకు పుడ్తాయో అర్థం కాదు. ఇలాంటి రకరకాల వింత పోకడల్తో లాక్‌డోన్ రోజులు గడిచిపోతునాయి.

ఈ లాక్‌డౌన్ వల్ల కొంత మంది ఆడవాళ్ళు గృహహింసకి గురి అవుతున్నారని కూడా విన్నాను. కొంతమంది శాడిస్టు భర్తలుంటారు. చేతి నిండా పని ఉండదు. ఇంట్లో కూర్చుని, అమాయక ప్రాణి భార్య మీద తమ జులుం చూపిస్తూ ఉంటారు.

ఈ మధ్యనే నాతో పని చేసిన అవధాని మాష్టారు ఫోను చేసేరు. తన భావాలు నాతో పంచుకున్నారు… “మూర్తీ, ఈ లాక్‌డౌన్ సమయంలో బడుగు జీవులకి వలస కార్మికులకి ఇలా రోజు ఇంత తిండి పడేయడం, కష్టకాలంలో నిత్యావసర వస్తువులు దాతలు, ప్రభుత్వం ఇస్తున్నారు. ఎంతో కొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది, బాగానే ఉంది. అలా కాకుండా ముందర మూత పడిన మిల్లుల్ని, చిన్న పరిశ్రమల్ని తెరిపించి వాళ్ళకి పని కల్పించాలి.

చేతి నిండా వాళ్ళకి పని ఉంటే వారి జీవనోపాది వారే సంపాదించుకుంటారు. అంతే కాని లాక్‌డౌన్ ఉన్నన్న రోజులా వాళ్ళకి ఇంత తినడానికి ఇంత తిండి పడేసి నగదు ఇస్తే చాలదు. ఈ లాక్‌డౌన్ తరువాత వారి జీవన స్థితిగతులు ఏంటి? చిన్నకారు, సన్నకారు రైతుల్ని ఆదుకుని వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచాలి” అన్నారు. అతని మాటలు నాకు నిజమే అనిపించాయి.

అంతే కాదు ప్లాస్టిక్‌ని ఎలాగూ బేన్ చేసిన ప్రభుత్వం పూర్వం లాగే నార సంచులు, గుడ్డ సంచులు, కాగితం సంచులు ఉపయోగిస్తే వాటిని తయారు చేసిన వారికి ఉపాధి దొరుకుతుంది. పూర్వం చేకుతో తయారు చేసిన సంచులు తయారు చేసేవారు. వాటిని తయారు చేసే చిన్న చిన్న పరిశ్రమల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే కార్మికులకి, బడుగు జీవులకి ఉపాధి లభిస్తుంది. వారి జీవితాలు చక్కగా సాగుతాయి. ప్లాస్టిక్‌ని నిషేధించి భూమాతను రక్షించిన వాళ్ళమి అవుతాము అని అనుకుంటాను నేను.

ఈ లాక్‌డౌన్‌లో బడుగు జీవుల గురించి ఆలోచిస్తున్న నాకు ప్రస్తుతం ఇంటిలో బందీగా ఉన్న నా నిజ జీవితం గుర్తుకు వచ్చింది. ఏడు పదుల వయస్సులో ఇపుటి వరకూ ఇంత ఆరోగ్యంగా జీవితం గడిపేస్తున్నానంటే దానికి కారణం నా నడక. ఎక్కడికి, ఎంత దూరమేనా నడుచుకునే వెళ్తాను.

అలాంటి నేను ఇంట్లో ఇప్పుడు బందీ అయికూర్చోడం వల్ల తిన్నది అరక్క అనారోగ్య సమస్య. దానికి తోడు వినోదం పొందడానికి టి.వి ఆన్ చేస్తే వెగటు కలిగించే పోగ్రాములు. కరోనా గురించి గగుర్పాటు కలిగించే వార్తలు. ప్రస్తుతం షూటింగులు లేకపోవడం వల్ల కొత్త పోగ్రామ్లు లేవు. పాతవే రిపీట్ చేస్తున్నారు.

అవేనా జుగుప్స, వెగటు కలిగించే కొన్ని పోగ్రామ్లు. అవి కొంత మందికి వినోదాన్ని కలిగించి ఉండవచ్చు. కాని, నాకు మాత్రం వెగటు జుగుప్స కలిగిస్తున్నాయి. సినీ చాన్సులు లేని కొంత మంది యాంకర్సు అవతారం ఎత్తి టి.వి సామ్రాజాన్ని ఏలేస్తున్నారు. వారి కొన్ని పోగ్రామ్‌లలో విరగబడి నవ్వుతున్న వెకిలి నవ్వులు, ద్వందార్థ మాటలు నాకు ఆహ్లాదం కలిగించే బదులు వెగటు కలిగిస్తున్నాయి.

కొంత మంది ప్రేక్షకులు వారి పోగ్రామ్ చూసి వినోదిచడం నాకు చిరాకనిపిస్తుంది. అలా పగలబడి వెర్రి నవ్వులు నవ్వడం, యాంకరమ్మ, యాంకరయ్య జబ్బచరచడం నాకు వెగటు అనిపిస్తుంది.

మరో పోగ్రాంలో యాంకరయ్య చిన్న పిల్లలచే రతి భంగిమల్ని కూడా తలదన్నే విధంగా రకరకాల భంగిమల్లో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించేవారు. నాకు అలాంటి పోగ్రామ్‍ల మీద కాదు అలాంటి పోగ్రామ్‍లకి తమ పిల్లల్ని పంపిన తల్లిదండ్రుల మీద పిచ్చికోపం వచ్చేది.

తమ పిల్లల్ని ఇలాంటి పోగ్రామ్‌లకి పంపి ఆ షోల్లో తమ పిల్లలు కనిపించి కుప్పిగెంతులు వేస్తుంటే పొంగిపోతున్నారు, కానీ తమ పిల్లల చేత ఇలా అర్ధ నగ్న నృత్యాలున్న షోలకి పంపి నైతికంగా వాళ్ళను ఎంత దిగజారుస్తున్నామో అని ఆలోచించటం లేదు అని తల్లిదండ్రుల మీద విసుక్కునే వాడిని.

కరోనా కారణం చేత యాంకరయ్య మరో కొత్త టి.వి షో ఎంచుకున్నాడు. చిన్న పిల్లల్ని వదిలి దంపతుల్ని ఎంచుకున్నాడు. వాళ్ళ చేత అనేక విన్యాసాలతో డాన్సులు చేయించడం, ఆటలు, పాటలూ, మరి కొంత మందుకు వెళ్ళి భార్య చేత భర్త వేషం, భర్త చేత భార్య వేషం వేయిస్తూ వారి చేత అనేక వినోదాలు పండిస్తూ మరింత ఇబ్బంది పెట్టిస్తున్నారు. ఈ పోగ్రామ్ కొంత మందికి వినోదాన్ని పండిస్తూ ఉంటే నాలాంటి వాళ్ళకి ఎబెట్టుగా ఉంది.

‘మీ ఒక్కరికి నచ్చకపోతే అందరికీ ఇష్టం లేనట్టయినా ఇలాంటి వాటిని చూసి వినోదించే వారున్నారు’ అంటారు మా కుటుంబ సభ్యులు. దీన్నే అంటారు పిల్లికి చెలగాటం ఎలకకి ప్రాణ సంకటం అని.

లాక్‌డౌన్ సందర్భంలో స్కూళ్ళని మూసివేసారు. అందుచేత ఇళ్ళల్లో కొంత మంది పిల్లలు కూడా ఇలాంటి పోగ్రామ్‌లకి అంకితం అయిపోతున్నారు. మరి పిల్లలు ఏం చేస్తారు. వాళ్ళకి ఇంట్లో పెద్ద వాళ్ళతో గడిపే అవకాశం పెద్ద వాళ్ళే కల్పించటం లేదు. వారికి కథలు చెప్పటం, మంచి మాటలు చెప్పడం మానివేసి, వాళ్ళతో కొంత సమయం గడపటం విడిచిపెట్టి ఇలాంటి టి.వి పోగ్రామ్‌లు చూస్తుంటే ఏం అనటం లేదు. వాళ్ళూ చూస్తున్నారు పిల్లలు చూస్తుంటే ఊరుకుంటున్నారు.

ఇలాంటి పోగ్రామ్స్ ఇష్టపడని పిల్లలు స్మార్ట్ ఫోన్లు పట్టుకుని గేమ్స్ ఆడుతున్నారు. కరోనా కారణం చేత పరీక్షలు లేకుండా వాళ్ళని పై క్లాసులకి ప్రమోటు చేయడం వలన పరీక్షల భయం కూడా వాళ్ళకి లేదు. ఒక్క టెన్తు క్లాసుకి మాత్రమే పరీక్షలు జరగలేదు.

ఈ కార్పొరేటు స్కూళ్ళ ఆధిపత్యం, ప్రభుత్వంపై వాటి ఒత్తిడి వల్ల ప్రస్తుతం టెన్తు క్లాసు పరీక్షలు స్పాట్ వేల్యుయేషను సవ్యంగా జరగటం లేదు. ఎంత సేపూ గ్రేడులు, ర్యాంకులే చూస్తున్నారు. ‘మీరు ఏం చేస్తారో మాకు తెలియదు స్కూలుకి పర్సెంట్ రావాలి’ అని ప్రభుత్వం విద్యాధికారులు మీద, విద్యాధికారులు ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తెస్తుంటే ఉపాధ్యాయులు సెంట్ పర్సెంట్ తీసుకురావడానికి చేస్తున్న పనులు, పాట్లూ చూస్తుంటే ఈ పరీక్షల బెడద లేకుండా టెన్త్ క్లాసు వాళ్ళని కూడా పై క్లాసులకి ప్రమోట్ చేసేస్తే బాగుండునని నేటి విద్యావిధానం చూస్తున్న నాకు అనిపిస్తుంది.

ఇరవై సంవత్సరాల సమయంలోనే ఈ విద్యావిధానం భ్రష్టు పట్టిపోయింది. అప్పుడే టెన్తు క్లాసు ఇన్విజిలేషనుకి వెళ్తే అప్పటికే క్లాసు రూమ్‌లో బిట్ పేపరుకి ఆన్సర్లు చెప్పే అవినీతి, స్లిప్లు వ్రాస్తుంటే చూసి, చూడనట్లు ఊరుకునే పరిస్థితి, ఎదుటి విద్యార్థి పేపర్ని మరో విద్యార్థి కాపీ చేసే పద్ధతి వచ్చింది.

మరో విచిత్రం సెవెన్తు క్లాసుకి పబ్లిక్ పరీక్ష ఉండేది. ఆ జిల్లాలోని ఉపాధ్యాయులు అందరూ జిల్లా కేంద్రానికి వచ్చి ఆ పరీక్ష పేపర్లు దిద్దేవారు. ఇక వివిధ గ్రామాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు తమ పని వదిలి పెట్టి వాళ్ళ విద్యార్ధుల నెంబర్లు ఉన్న చీటీలను పట్టుకుని అన్ని సబ్జెక్టు ఉపాధ్యాయుల్ని కలిసి ఈ నెంబరు వాళ్ళకి మంచి మార్కులు వచ్చేటట్టు చూడండి అని మనం పేపర్లు దిద్దుకోకుండా ఇబ్బందికి గురి చేసేవారు. నాకు ఇలా మనకి ఆటంకం కలిగించిన వాళ్ళ మీద చాలా కోపం వచ్చేది. ఆ తరువాత సెవెన్తు క్లాసు పబ్లిక్ పరీక్షలు రద్దయ్యాయి. ఇదీ ఒకందుకు మాలాంటి వాళ్ళకి మంచిదే అని ఆ రోజుల్లో నాకు అనిపించింది. అప్పటికన్నా ఇప్పుడు విద్యా వ్యవస్థ మరింత దిగజారిపోయింది అని అనుకుంటాను నేను.

మా సమయంలో విద్యా విధానం ఎంతో కఠినంగా ఉండేది. కొన్ని సబ్జెక్టులు రోజుకి రెండు పేపర్లు ఉండేవి. ఆ పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే మరో ఆరు నెలల వరకూ ఆగవల్సి వచ్చేది. మార్చికి, అక్టోబరుకి పరీక్షలు జరిగేవి. ఒక సబ్జెక్టు పోయినా తిరిగి అన్ని సబ్జెక్టులకి ప్రిపేరు అవవల్సి వచ్చేవి. మరి ఉత్తీర్ణత శాతం పరీక్ష వ్రాసిన వారిలో సగం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యేవారు. అందులోనూ ఫస్టు క్లాసులో పాసయిన వారిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఆరు వందలకి మూడు వందల అరవై మార్కులు వస్తే ఫస్టు క్లాసు. ఆ మార్కులు రావడమే ఎంతో కష్టంగా ఉండేది. ఉత్తీర్ణతా శాతం కూడా తక్కువ.

మరి ఆ తరువాత మారిన కాలంలో విద్యావిధానం మారింది. ఒక సబ్జెక్టుని రెండు భాగాలుగా విభజించి రెండు రోజులు ఒక్కొక్క సబ్జెక్టు పరీక్ష జరగుతోంది. పరీక్షలో ఏ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదో ఆ సబ్జెక్టు ఒక్కటే ప్రిపేరు అవుతే చాలు. అంతే కాదు వెంటనే తిరిగి పరీక్ష పెడ్తున్నారు. ఉత్తీర్ణత సాధించలేకపోయినా వారికి సంవత్సరం మునపటిలా వృధాకాకుండా ఆ వెసులుబాటు ఇప్పటి విద్యార్ధులకి కల్పించింది ప్రభుత్వం.

అందుకే ఇప్పటి విద్యార్ధులు ఆరువందలకి ఆరువందలు మార్కులు వచ్చినా ఆశ్చర్యపోవల్సిన విషయం లేదు. నేటి విద్యా విధానంలోని స్పాట్ వేల్యూయేషను పరీక్షలు జరిగిన విధానం చూస్తుంటే అని అనుకుంటాను.

లాక్‌డౌన్ గురించి, కరోనా గురించి ఆలోచించ వల్సిన సమయంలో తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అని అడిగితే దూడ గడ్డి కోసం అని ఒకడు సమాదానం ఇచ్చాడట. ఇప్పుడు నా ఆలోచన్లు కూడా అలాగే ఉన్నాయి అని ఎవరైనా అనుకోవచ్చు కాని తీగ లాగుతే డొంకంతా కదిలినట్టు ఈ కరోనా వైరస్సు వల్ల లాక్‌డౌన్ అమలు, దాని వల్ల విద్యావ్యవస్థ కుంటుబడ్డం, విద్యార్ధులు ఇంట్లో కూర్చుని బందీల్లా ఉండటం అన్నీ ఒకదానికి మరొకటి లింకు.

విద్యా సంస్థల మూసివేత ఒక విధంగా మంచిదే. లేకపోతే బియ్యం బస్తాల్ని తలదన్నే బరువుగల పుస్తకాల బ్యాగ్‌లని వీపుల మీద పెట్టుకుని తడబడ్తూ నడుస్తూ మరో చేతో భోజనం కేరియర్లను పట్టుకుని స్కూలుకి వెళ్తున్న పిల్లల్ని చూస్తుంటే ఎంతో జాలి. వెన్ను నొప్పుల్తో పిల్లలు బాధపడ్డం వింటూనే ఉన్నాము. ఈ లాక్‌డౌన్ వల్ల తాత్కాలికంగానైనా వారికి ఆ బాధ తగ్గతుంది.

అంతే కాదు జైలు గోడల్ని తలదన్నే సరిగా వెలుతురు రాని ఇరుకు క్లాసురూమ్‌లలో బందీలుగా మారి చదువులు సాగిస్తున్న విద్యార్దులకి తాత్కాలికంగానైనా విముక్తి లభించింది. ఇంటి పట్టున తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వారి ఆప్యాయతానురాగాల మధ్య వారి దగ్గర మంచి మంచి విషయాలు, నీతి కథలు వినే అవకాశం లభించింది అని అనుకుంటాను నేను.

అందుకే మా మనవల్తో మాట్లాడాలని మా అమ్మాయికి ఫోను చేసేను. “స్కూలు వాళ్ళు ఆన్లైన్లో స్టడీ మెటీరియల్ పంపిస్తున్నారు. ఆన్సరు చేస్తున్నారు” మా అమ్మాయి అంది.

“ఈ స్కూలు వాళ్ళు ఈ సెలవు రోజుల్లో పిల్లల్ని ప్రశాంతంగా ఉండనీయరేంటి? కొంత సేపు వాళ్ళని ఆటలకి వదలచ్చు కదా? మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది వాళ్ళకి” అన్నాను.

“స్కూలు వాళ్ళు అలాగైనా పిల్లలకి పని కల్పించడం బాగుంది. లేకపోతే కొట్టుకొనడం, టి.విల దగ్గర కూర్చుండిపోయి చెత్త పోగ్రామ్‌లు చూడ్డం, అదీ కాకపోతే సెల్ పట్టుకుని కూర్చుంటారు” మా అమ్మాయి అంది.

ఇప్పటి పిల్లల పరిస్థితి తెలిసిన నాకు ఏం అనలేని పరిస్థితి. ఈ కార్పొరేట్ స్కూలు వాళ్ళు ఇలా పిల్లలకి ఆన్లైనులో స్టడీ మెటిరీయల్ పంపిస్తూ మరో కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. సెలవుల్లో కూడా పిల్లల్ని వదలరు. పాపం పూర్ ఫెలోస్ ఈ పిల్లలు అనుకున్నాను.

లాక్‌డౌన్ సమయంలో ప్రతీ ఒక్కరూ బౌతిక దూరం పాటించాలి అని అన్నారు. ఇది నాకంటే మా శ్రీమతి లాంటి వాళ్ళకి అలవాటు అయిన పద్ధతే. అంతకు పూర్వం ఆవిడ నెలకు మూడు రోజులు ఈ పద్ధతి పాటించేది. ఆ మూడు రోజులూ వేరే చీకటి కొట్టులాంటి గదిలో చాప పరుచుకుని తలక్రింద దుప్పటి పెట్టుకుని పడుకునేవారు. భోజనం అక్కడే. దేవుడు గదిలోకే కాదు, ఇల్లంతా తిరగడం నిషిద్ధం. ఆ పద్ధతులు ఆచారాలు అప్పుడుండేవి. ఒక విధంగా ఇది బహిష్కరణే.

ఆ మూడు రోజుల్లో పగలు అమ్మ వంట చేసి పిల్లలకి పెడ్తే రాత్రి పూట నేను వంట చేసే వాడిని. ఇప్పుడు కూడా ఆ పద్ధతి లేకున్నా పాతకాలం మనుష్యుల నోటి వెంబడి ‘పిదప కాలం పిదప బుద్దులు. అంటూ, ముట్టూ లేకుండా అందరూ కలగాపులగం అయిపోతున్నారు. అందుకే ఈ అనేక అనర్థాలు, అరిష్టాలు, అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి’ అని గొణుక్కుంటూ ఉంటారు.

ఇది మా తరం నాటి భావజాలం. ఆ తరువాత తరాల భావజాలాలలో ఎంత మార్పు. స్త్రీకి ఆ మూడు రోజులు నీరసంగా ఉండకుండా విశ్రాంతిగా ఉండాలని ఆ పద్ధతి పూర్వీకులు పెట్టారు. కాని మరేంలేదు. ఇది ప్రకృతి ధర్మం అంటూ కొట్టి పడేస్తున్నారు. అందరితో కలిసి తిరుగుతూ అన్ని పనులూ చేసుకుంటున్నారు.

ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఈ లాక్‌డౌన్ మగకి, ఆడకి అందరికీ భౌతిక దూరం పాటించే విధానమైనది. ఈ నాగరికతా ప్రపంచంలో ఇది కూడా ఒక విధంగా మంచిదే.

అయితే ఒక విషయం పోలీసులంటే జనాలు భయపడ్తారు. వాళ్ళు ప్రజల దృష్టిలో కఠినాత్ములు. ఎవరింటికేనా పోలీసులు వస్తే బిక్కుబిక్కుమంటారు. నేరస్థులకి జైలు గోడల్లో శిక్షించే విధానం వాళ్ళ కళ్ళెదుట కదలాడుతుంది. అలాంటి పోలీసులు ఈ కరోనా సమయంలో చూపిస్తున్న శ్రద్ధ, అందిస్తున్న సహకారం చూస్తే ప్రశంస చేయకుండా ఉండలేము.

అలాగే డాక్టర్లను దేవుడు అంటారు. అలాంటి డాక్టర్లు వల్ల పొరపాటున ఏ మాత్రం పొరపాటు జరిగినా వారి మీద దాడి చేస్తారు. ఈ పోలీసులు, డాక్టర్లు కూడా మానవులే. వాళ్ళ వల్ల ఏ పొరపాట్లు జరిగినా మానవతా దృక్పదంతో చూడాలి.

గతంలో మా తరంలో కూడా కో-ఎడ్యుకేషను ఉండేవి. అయితే ఇప్పుడున్నంత విచ్చలవిడితనం అప్పుడు లేదు. అబ్బయిలూ, అమ్మాయిలూ బౌతిక దూరం పాటిస్తూ నీతి నియమాలు పాటించేవారు.

మా తరువాత తరం వాళ్ళకి కాలం తెచ్చిన మార్పు వల్ల అబ్బాయిలకి ఆడ స్నేహితులు, అమ్మాయికి మగ స్నేహితులూ ఏర్పడ్డారు. వాళ్ళని బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని ముద్దుగా పిలుచుకున్నారు. అయితే హద్దులు దాటకుండా స్నేహితుల్లాగే ఉండేవారు.

మరి ఇప్పటి వారో – ఆకర్షణ మరేదో తెలియదు కాని అమ్మయిలూ, అబ్బాయిలూ ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకుని తిరుగుతున్నారు. వారి మాటలు, చేతలూ వెగటు కలిస్తున్నాయి. స్కూళ్ళకి డుమ్మా కొట్టి ఇక్కడా, అక్కడా కాదు అన్ని చోట్లా వీళ్ళే. వయస్సు ప్రభావం వల్ల ఆకర్షణని, ప్రేమ అనుకుంటున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. ఆ ప్రేమ ఫలించకపోతే ఆత్మహత్యలకి పాల్పడేవారు కొందరయితే, అలాంటి ప్రేమల్ని అంగీకరించని పెద్దలు పరువు హత్యలకి పాల్పడుతున్నారు. ఒక వేళ అమ్మాయి అబ్బాయి ప్రేమన తిరస్కరిస్తే అమ్మాయిని అబ్బాయి అంతం చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇది నేటి సమాజం తీరుతెన్నులు.

ఈ లాక్‌డౌన్ కారణం చేతయినా అమ్మాయిలూ, అబ్బాయిలూ భౌతిక దూరం పాటిస్తారు కొన్ని రోజులు అని అనుకుంటున్నాను నేను.

కరోనా మాటున ఇలా సాగాయి నా భావాలు!

Exit mobile version