కరోనా నేపథ్యం – కథలు

2
4

 [box type=’note’ fontsize=’16’] డా.వి.ఆర్.రాసాని వ్రాaసిన ఈ వ్యాసం 13-9-20వ తేదీన శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి వారు నిర్వహించిన ‘కరోనా నేపథ్యం – తెలుగు సాహిత్యం’ అన్న అంతర్జాల జాతీయ సదస్సులో సమర్పించబడింది. [/box] 

నేపథ్యం

[dropcap]ఈ[/dropcap]నాడు తప్పనిసరిగా, అత్యవసరంగా ఆలోచించాల్సిందీ, చర్చించాల్సిందీ కోవిడ్-19 గురించే. అలాగే దాని పైన వస్తున్న సాహిత్యం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతయినా వుంది.

ఏ కాలంలోనైనా సమాజంలో వచ్చిన మార్పులకనుగుణంగానే సాహిత్యంలోను మార్పులు వస్తుంటాయి.

రెండు ప్రపంచ యుద్ధాల మూలంగా ఎంతో సాహిత్యం వచ్చింది. యుద్ధ కాలంలోనే కాదు, ఆ తరువాతా ఆ ప్రభావంతోను కొంత కాలం పాటు సాహిత్యం వచ్చింది.

ఈ కరోనా ఉత్పాతం వల్లనూ సమాజంలో గతంలో కనీవినీ ఎరుగని మార్పులు సంభవించాయి. ఈ ప్రభావంతోను ఎంతో సాహిత్యం వస్తోంది. ఈ వైరస్‌కి వ్యాక్సిన్ వచ్చి, కరోనా అంతమైనా, కొంత కాలం వరకూ దీని ప్రభావంతో కూడిన సాహిత్యం వస్తుంది. గతంలో మన సాహిత్యంలో వచ్చిన దిగంబర కవిత్వం, విప్లవ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, దళిత బహుజన సాహిత్యం లాగానే ఒక ప్రత్యేకమైన సాహిత్య విభాగంగా ‘కరోనా సాహిత్యం’ అనేదీ ఏర్పాటు చేయబడుతుంది.

ఇప్పుడు కొనసాగుతున్నది అదృశ్య విధ్వంసాన్ని, మానవ సామాజిక నాశనాన్ని సృష్టిస్తున్న సూక్ష్మక్రిముల బీభత్స కాలం. ఆ సూక్ష్మక్రిమి పేరే కోవిడ్ -19. అది కలిగించే వ్యాధి కరోనా వ్యాధి.

ఈ కరోనా వైరస్ అతి సూక్ష్మజీవుల్లోకంతా బలమైన సూక్ష్మ బాహుబలి. ఇలాంటి వైరస్‌లు మనుషుల పై బడడం కొత్తేమీ కాదు.

1885లో ప్లేగు ఇలాంటి వైరస్ వల్లనే వచ్చిది. వీటి వల్లా గ్రంథులు వాచిపోయి సూదుల్లాంటి సన్నని పురుగులు కూడా వచ్చేవట. ‘నీ నోట్లో పురుగులు బడా’ అన్న తిట్టు పదం అప్పుడు పుట్టిందే.

1910లో వచ్చిన వైరస్ వల్లా 150 కోట్లున్న ప్రపంచ జనాభాలో 30 కోట్లు మంది చనిపోయారట.

కరోనా వైరస్ మొదట 1930లో కోళ్ళలో కనిపించింది. దీన్ని ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్ వైరస్ (IBV) గా పిలిచారు. 1931లో 90% కోళ్ళు చనిపోయాయట టర్కీలో.

1937లో కోళ్ళను ఐసోలేట్ చేసి నివారించారట.

ఈ కరోనా వైరస్ 1940లో జంతువుల్లో కనిపించింది. అప్పటికి రెండు రకాలుగా రూపాంతరం చెందింది. అందులో ఒకటి మౌస్ హెపటైటిస్ వైరస్(MHV). రెండోది ట్రాన్స్‌మిసిబల్ గ్యాస్ట్రో ఎంటిరైటిస్ వైరస్ (TGEV).

1960లో మరి కొంత మార్పు జరిగి ఇదే వైరస్ మనుషులకు సోకింది.

దీనికి హ్యూమన్ కరోనా వైరస్ 229E, OC43 అని పేర్లు పెట్టారు.

ఇదే వైరస్ 2003లో సార్స్‌ వైరస్‌గా రూపాంతరం చెంది SARS – Covid గా పిలువబడింది. అలాగే 2004లో ఇంకా మార్పులు చెందుతూ H Covid H263, H Covid I, MERS-Covid గా పిలువబడి 2019 లో SARS– Covid 2 గా వ్యవహరించబడింది. 2019లో నవంబర్‌లో గబ్బిలాల్లో వుండే ఇదీ, పాముల్లో వుండే వైరస్‌తో సంపర్కం చెంది శక్తివంతమైన నేటి కోవిడ్-19 గా రూపాంతరం చెందింది. ఇప్పుడిది మరి కొంత మార్పు చెంది ‘D614G’ మ్యూటేషన్ వైరస్‌గా స్వరూపాన్ని మార్చుకుంది. ఇలా నిరంతరం మార్పు చెందుతుండడం వల్లా దీనికి తగిన వాక్సిన్ కనుకోలేకపోతున్నారు శాస్త్రజ్ఞులు.

చైనాలోని యూహాన్ పట్టణంలో వున్న అంతర్జాతీయ బయోరీసెర్చ్ ల్యాబ్ నుంచే ఈ వైరస్ బయటి కొచ్చింది. ఈ ల్యాబ్‌లో చైనా ముందుగానే వాక్సిన్ కనిపెట్టి, ఈ వైరస్‌ను తయారు చేసి ప్రపంచం పైన వదిలి వ్యాపారం చేసుకోవాలనీ, ఆ విధంగా, వాణిజ్యపరంగా ప్రపంచం పైన ఆధిపత్యం సాధించాలని చైనా చేసిన ‘బయోవార్’ అని కొందరు చెబుతున్నారు. కాకపోతే తాము తవ్వుకున్న గోతిలో తామే పడినట్లుగా తాము సృష్టించిన వైరస్ లీకై ముందుగా వారినే కబళించిందని కూడా చెప్పేవారూ వున్నారు.

ఇక రాబోయే ప్రపంచ యుద్ధాలన్నీ ఆయుధాలతో, అస్త్రాలతోగాక ఇలాంటి ‘బయోవెపన్స్‌’తోనే సాగుతాయనీ, దానికిదే ఆరంభమనీ మేధావులు చెబుతున్నారు.

ప్రాచీన సాహిత్యాన్ని చూస్తే యుద్ధ సామాగ్రితో గాకుండా మొదట జలయుద్ధాలు (water war) జరిగినట్లుగా చెప్పవచ్చు.

భాగవతంలో వ్రేపల్లె యాదవులు కొండ చుట్టు ఉత్సవం జరుపుకుంటూ కృష్ణుణ్ణి దేవుడితో సమానంగా చూస్తుంటే అది సహించలేని ఇంద్రుడు తన అధీనంలో వుండే మేఘాలను పంపించి వ్రేపల్లె పైన ప్రళయ వర్షాన్ని కురిపిస్తాడు. కృష్ణుడు గోవర్ధనగిరిని చేతితో లేపి గోవుల్ని, గోపాలురుల్ని కాపాడుతాడు.

క్రీ.పూ.1500 నాటికి చెందిన బాబిలోన్ సాహిత్యంలో The Epic of Gilgamesh అన్న కావ్యంలో మనుషుల పైన కోపగించుకున్న దేవతలు వరదల్ని సృష్టించి ప్రపంచాన్ని జలమయం చేసేస్తారు. ఇవి మనకు తెలిసిన జలయుద్ధాలు.

ఈ జల యుద్ధాల తర్వాత జీవ యుద్ధాలు (Bio-wars) ఆరంభమైనాయి. ఇలాంటి యుద్ధ ప్రసక్తి ఛాయలు కూడా భాగవంతంలోనే కనిపిస్తాయి.

శిశుపాలుడు మనువాడబోయే రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకొచ్చి రాక్షస వివాహం చేసుకుంటాడు. ఆ కారణంగా పాండవుల రాజసూయ యాగ సందర్భంగా కృష్ణుణ్ణి దూషించి, అతని చక్రాయుధం చేత చంపబడతాడు శిశుపాలుడు. అది చూసి సహించలేని శిశుపాలుని ప్రాణమిత్రుడు సాళ్వుడు శివుని గురించి తపస్సు చేసి, ప్రసన్నం చేసుకుని కిన్నెర, గంధర్వ, పశుపక్ష్యాదుల చేతగానీ, మానవ సూరాసురుల వల్లగానీ మరణం వుండకూడదని. ఒక మాయా విమానాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. శివుడు ‘తథాస్తు’ అని మయున్ని పిలిపించి ఒక మాయా విమానాన్ని తయారు చేయించి ఇప్పిస్తాడు. సాళ్వుడు ఆ విమానంలో కూర్చొని ‘మధుర’ పైన చెట్లు చేమలను, సర్పకీటకాదులను కురిపించి యుద్ధం చేస్తాడు.

1898లో H.G Wells రాసిన నవలలో అంగారక గ్రహవాసులు భూమి పైన దాడి చేసి భయంకర ఉత్పాతాలు సృష్టిస్తారు. సైనికులూ, సైంటిస్టులూ ఏమీ చేయలేరు. చివరికి ఒక భయంకర వైరస్ కారణంగా ఆ గ్రహం వాసులు అంతమైపోతారు.

కరోనా లాంటి సూక్ష్మక్రిముల కారణంగా ప్రపంచమంతా కళ్ళు పోగొట్టుకుని అంధులైపోయిన వైనాన్ని 1995లో José Saramago రాసిన ‘Blindness’ అన్న పెద్ద కథలో చెప్పడం జరిగింది.

ఇలాగే ప్లేగు, క్షయ, మలేరియా, పోలియో, హెచ్.ఐ.వి వైరస్‌ల నేపథ్యంలోనూ చాలా సాహిత్యం సృష్టించబడింది.

ఈ క్రమంలో ఆల్బర్ట్ కామూ రాసిన ‘ది ప్లేగ్’ అన్న నవల గొప్ప పేరు తెచ్చుకుంది. 1885లో ప్రపంచాన్ని నలిపేసిన ప్లేగు వల్లా మనుషులెలా చనిపోయారో, ఆ వైరస్‌ను ఆపడానికి ఆనాడు జనం పాటించిన భౌతిక దూరం, మాస్కులూ, శానిటైజర్లు వంటి విధానాన్నే ఈనాడు కరోనా విషయంలో పాటించడం విశేషం.

ఇప్పుడు మూడో మహమ్మారి కంత్రీ కరోనా పైనా సాహిత్యం వస్తోంది. కరోనా ఉత్సవం వల్లా మనుషులకొచ్చిన బాధలు చెప్పనలవి కానివి.

2020 మార్చి 22న లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఇప్పటి వరకు రైతులు, వలస కూలీలు, చిన్నా చితక వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నడూ విననన్ని ఆకలి చావుల్ని ప్రపంచం చవిచూస్తోంది. నిలవ నీడ లేక ఎందరో నిరాశ్రితులయయారు. కోవిడ్ పాజిటివ్, కోవిడ్ మరణాలు రోజు రోజుకీ మితిమీరిపోతున్నాయి. ఈ దురవస్థను చూసి సాహిత్యకారులు కూడా చలించి పోతున్నారు. దీనిపైన ఎంతో మంది కవితలు రాస్తూన్నారు. ఏ సామాజిక మాధ్యమం చూసినా, ఏ పేపరు చూసినా ఇవే కవితలు కనిపిస్తున్నాయి. వాటిలో దీర్ఘకవితలు కూడా వున్నాయి. నవలలూ వస్తున్నాయి. కథలూ వస్తున్నాయి.

ఇంత వరకూ మూడు నవలలు వచ్చినట్లు తెలుస్తుంది. అందులో ఆచార్య కొలకలూరి ఇనాక్ రాసిన ‘వలస’, ముప్పాల సూర్యకుమారి రాసిన ‘కరోనా శాపమా –వరమా’ నవలలు ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాయి. రమణ రాసిన ‘కరోనా ఆత్మకథ’ దీర్ఘకవిత కూడా పలువుర్ని ఆకర్షించింది. కథలయితే యాభై పైనే వివిధ పత్రికల్లోను, మరికొన్ని ఇంటర్‌నెట్ వెబ్ సైట్‌ పత్రికల్లోనూ ప్రింటయ్యాయి. వీటి పైన కొన్ని విశ్వవిద్యాలయాల్లో అప్పుడే పరిశోధనలు కూడా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన ఆరు కథల్ని గురించి మీకు తెలియ చేస్తాను.

ఆ కథలు ఇవీ.

1)         అసలు స్వరూపాలు – డా.శాంతి నారాయణ

2)         అద్వైతం – డా. మనోహర్ కోటకొండ

3)         రాలిన గెలలు – డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి

4)         అందనంత దూరం – డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి

5)         క్షమించండి – సుంకోజి దేవేంద్రాచారి

6)         కాసెపుల్ల – వెల్దండి శ్రీధర్

అసలు స్వరూపాలు:

ఈ కథ విశాలాక్షి సాహిత్యమాస పత్రికలో జూన్ 2020వ సంచికలో ముద్రింపబడింది.

మొదటి లాక్‌డౌన్ కాలంలో నెల్లూరులోని ఒక డాక్టర్ కరోనా రోగులకు సేవాదృక్పథంతో వైద్యం చేసి, చివరికి తానూ కరోనా బారిన పడి చెన్నైలోని ఒక హాస్పటల్‌లో వైద్యం పొందుతూ మరణిస్తే, ఆ డాక్టర్ శవాన్ని కూడా అతని ఊర్లోకి రానీకుండా జనం అడ్డుకోవడంతో పోలీసులే దానికి దహన సంస్కారాలు చేసిన వార్త రాష్ట్రంలో సంచలనాన్ని రేపింది.

బహుశా ఈ సంఘటను ఆధారం చేసుకునే శాంతినారాయణ ఈ కథను రాసినట్లు చెప్పడాని కవకాశం వుంది. నిజానికి ఈనాడు కరోనా రోగిని రక్త సంబంధీకులైనా సరే శత్రువులాగా భావించి నిరాదరించడం సహజమైపోయింది. ఈ కథలోనూ అంతే.

పేరు మోసిన గొప్ప డాక్టర్‌గా పేరు పొందిన డాక్టర్ సుబ్బయ్యది అనంతపురానికి పదిమైళ్ళ దూరంలో వున్న రంగాపురం అనే పల్లెటూరు. చిన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సుబ్బయ్య ఎంతో కష్టపడి చదివి జనరల్ మెడిసిన్, ఆ తర్వాత ‘పల్మనాలజీ’లో పీ.జీ. చేసి ప్రభుత్వ వైద్యశాలలో చేరి శ్వాసకోశ వైద్య నిపుణుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా భావించి ప్రైవేటు ప్రాక్టీసు పెట్టకుండా అడిగిన వారికి ఉచిత సేవలందిస్తూ బిడ్డల్ని బాగా చదివించుకుంటాడు. అతని భార్య శకుంతలమ్మ మహా ఇల్లాలు. వారికిద్దరు కొడుకులు. పెద్ద కొడుకు భాను ప్రకాష్. అతని భార్య లలిత. అతను ఎ.సి.టి వోగా పని చేస్తుంటాడు. రెండో కొడుకు చంద్ర ప్రకాష్, అతని భార్య పేరు రోహిణి. సుబ్బయ్యకు అనంతపురంలో డూప్లెక్స్ హౌసున్నా, పల్లెలో మాత్రం వున్న భూమిలో పండ్ల తోటలు పెట్టి సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయిస్తుంటాడు. ప్రతి ఆదివారమూ అక్కడే వున్న ఫామ్ హౌస్‌లో భోజనాలు వండి, ఆ తోటలోనే వున్న సుబ్బయ్య తల్లిదండ్రుల సమాధుల దగ్గర అతని మనవళ్ళు మనవరాండ్రు అడుకుంటూ ఆనందంగా వుంటే అందరూ అక్కడే భోంచేసుకుని వెళుతుంటారు.

పెద్ద కోడలు లలిత భర్త ద్వారా వప్పించి, సుబ్బయ్యను పల్లెలో నుంచే హాస్పిటల్‌కు వచ్చేటట్టుగానూ, టౌన్లోని డూప్లెక్స్ హౌస్ తమకు ఇచ్చేట్లుగానూ వప్పించుకుంటుంది. ఆమెప్పుడూ పల్లెల్ని, పల్లెటూరి వారినీ విమర్శింస్తూ స్వార్ధంగా ప్రవర్తిస్తూ తన బిడ్డల్ని వాళ్ళ ముత్తాత, ముత్తవ్వ సమాధుల దగ్గరకీ పోనీకుండా సుబ్బయ్యనూ వి.ఆర్.ఎస్ తీసుకొని ప్రైవేటు ప్రాక్రీసు పెట్టి డబ్బు సంపాదించమని వత్తిడి తెస్తుంది. సుబ్బయ్య ‘నాకు డబ్బులు ముఖ్యం కాదనీ, ప్రజలకు వైద్య సేవ చేయడమే ప్రధానమ’ని నొక్కి చెబుతాడు. దాంతో భాను ప్రకాష్, లలితలు కోపగించుకుని ఆ తర్వాత పల్లెకి రావడం మానేస్తారు.

ఇలాంటి తరుణంలో కరోనా విజృంభించి, లాక్‌డౌన్‌తో జనాలు ఉక్కిరి బిక్కిరైపోతుంటారు. సుబ్బయ్య తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా రోగులకు ఉచిత సేవలు చేస్తూ ఆ మండలంలోనే ప్రజల చేత దేవుడిలాగా పూజింపబడుతుంటాడు. అనంతపురం ఏరియా అంతా కరోనా భయంతో అల్లాడిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితిలో మామగారు పనికిరాని వాడని అసహ్యించుకుని వెళ్ళిపోయిన పెద్దకోడలు ఒక రోజు ఏడుస్తూ వచ్చి, భానుప్రకాష్, పిల్లలూ అందరూ కరోనా బారిన పడినారనీ, ఎలాగైనా కాపాడమని వేడుకుంటుంది. సుబ్బయ్య వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టి దగ్గరుండి చూసుకుని వ్యాధినుంచీ బయట పడేస్తాడు. లలిత పశ్చాత్తాపపడి అప్పటి నుంచీ అత్త మామలతో బాగుంటుంది. ఇలాంటి తరుణంలో సుబ్బయ్య కరోనా బారిన పడి మరణిస్తాడు. కరోనా నుంచీ ఎందరినో కాపాడిన అతను కరోనాకే బలైపోయాడు.

డాక్టర్లు, పోలీసులు శవాన్ని తీసుకుని రంగాపురానికి వస్తే, అంబులెన్సును పల్లె ప్రజలు, కరోనా మాకూ అంటుకుంటుందని ఊర్లోకి రానివ్వరు. బతికున్న రోజు క్రితం వరకూ దేవుడిలా అతన్ని గౌరవించిన ఆ జనమే ఆయన శవాన్ని కూడా చూడడానికిష్టపడరు. దాంతో పోలీసులు, డాక్డర్ల సహాయంతో ఊరికి దూరంగా సుబ్బయ్య శవాన్ని పూడ్చేస్తారు అతని కొడుకులు, కోడళ్లు.

మనిషి మంచితనం, మనిషి చేసే సాయంలాంటివేవీ కరోనా ఫలితంగా నిష్ప్రయోజనాలైపోయిన దుర్భరస్థితిని ఈ కథ తెలియ జేస్తుంది.

అద్వైతం

కడపలో అల్లోపతి వైద్యాధికారిగా పని చేస్తున్న డా. మనోహర్ కోటకొండ తన స్వీయానుభవంతో రాసిన కథ ఇది. ఇది 30, ఆగష్టు, 2020 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ముద్రింపబడింది.

కిరణ్ ఢిల్లీలోని ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషాలటీ రెండో సంవత్సరంలో వున్నాడు. వర్ష కడప మెడికల్ కాలేజీలో గైనకాలజీ పీ.జీ చేస్తోంది. అవి విద్యా వైద్యం కలగలసిన కోర్సులు. ఆ యిద్దరూ ప్రేమికులు. సమయం దొరికినప్పుడంతా ఫోన్లో మాట్లాడుకుంటూ వుంటారు. వారిద్దరి మధ్యా దూరం ఎంత వున్నా వీడియో కాల్స్ ద్వారా వారి కళ్ళు కళ్ళు కలుసుకుంటూనే వుంటాయి. వర్ష కడప విశేషాలు చెబుతే, ఢిల్లీలో తన కెదురైన అనుభవాలను కిరణ్ చెబుతుంటాడు.

ఆరోజు వర్ష “ఈ రోజు కోవిడ్ డ్యూటీ అన్నావు కదా. జాగ్రత్త మరి” అని హెచ్చరిస్తుంటే, ‘మన డ్రస్సులు, గ్లౌజులు, గాగుల్స్, శానిటైజర్లూ ఇన్ని అడ్డాలుంటే పాపం వైరస్ మనల్నేం చేయలేక ఏడ్చుకుంటూ చైనాకు వెళ్ళిపోతుంద’నీ అంటాడు కిరణ్.

ఇలా వారి మధ్య ఢిల్లీలో జరిగిన తబ్లిగీ ఇన్సిడెంట్ ప్రసక్తి, దేశ విదేశాలనుంచీ ఆ మజీద్ కొచ్చిన కొందరి వల్లా కరోనా ఇండియాలో ఎలా ప్రాకిందన్న విషయం, దానికీ మతం రంగు అద్ది కొందరు రాజకీయం చేసిన తీరు అన్నీ సంభాషణ రూపంలో దొర్లుతాయి.

కిరణ్ హాస్పిటల్ కొచ్చేసరికే కరోనా వ్యాధిగ్రస్థులు క్యూ కట్టివుంటారు. అందరికీ ఓపిగ్గా టెస్టు చేయించి, మందులు రాసిచ్చి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేబుతుంటే ఓ ముస్లిం పెద్దావిడ టెస్టింగ్‌కు వస్తుంది. ఆమె కళ్ళలో దీనత్వం అతన్ని బాధిస్తుంది. కారణం అంతకు ముందు రోజే అదే ఆసుపత్రిలో అతని పర్యవేక్షణలోనే వున్న ఆమె భర్త షేక్ అబ్దుల్ జుబేర్ కరోనాతో చనిపోయి వుంటాడు. ఆమె పేరు ‘జబీనా’. ఆమె కొడుకు బీహార్లోని సొంత ఊర్లో సేద్యం చేసుకుంటూ వుంటాడు. అబ్దుల్ జుబేర్ ఖురాన్ పాఠాలు చెప్పుకుంటూ 20 సంవత్సరాలుగా భార్యతో పాటు జీవిస్తూండి నిన్న రాత్రి మరణించాడు. దాంతో ఆ బడేమా ఒంటరిదైపోయింది. ఆ బాధంతా ఆమె కళ్ళలో కనిపించింది. “మేరా బేటా సే బాత్ కరో” అంటూ ఫోను కూడా యిచ్చి మాట్లాడిస్తుంది. లాక్‌డౌన్ వల్లా అతను రాలేని పరిస్థితి. ఆ బడేమాకు కిరణ్ అండగా నిలుస్తాడు. ఆమెకు ధైర్యం చెప్పి, గొంతులో నుంచీ దూది పుల్ల అద్ది, ఆ తేమను టెస్టుకు పంపమని దాన్ని సిస్టర్ కిచ్చి, బడేమాను రేపు రమ్మంటాడు.

ఆమె ఆ మరునాడొస్తే ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలుతుంది. ఆమె ముఖంలో దీనం, దుఃఖం కనిపించి, రాత్రి ఎక్కడుండి వుంటుందోనని ఆమెను అడ్మిట్ చేయించి క్యాంటీన్ నుంచీ టిఫెన్ తెప్పిస్తే ఆమె ఆకలితో ఆవురావురమని తినేస్తుంది. రెండు రోజులుగా పస్తులున్న బడేమాకు అజీర్తి చేసి కడుపులో తిప్పేసి టాయ్‌లెట్ పోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రి ముందే బీటిలో తెరలు కట్టించి, ప్లాస్టిక్ కవరిచ్చి పంపి, ఆ అశుద్ధాన్ని అతనే డస్ట్ బిన్‌లో వేసి, ఆమె తలను నిమిరి భయపడొద్దని ధైర్యం చెబుతాడు.

ఆ సమయంలో అతనికి చిత్తూరు జిల్లాలోని తన తల్లి సుభద్రమ్మ గుర్తొస్తుంది. జబీనా బీహార్‌లో వున్న కొడుకును కిరణ్‌లో చూసుకుంటుంది. వార్డులోని గదిలో అంతకు ముందు రోజే చనిపోయిన ఆమె భర్త చెప్పులు అలాగే వుంటాయి. వాటిని టక్కున ఎత్తుకుని జబీనా తన సంచిలో వేసుకుని ఏడుస్తూ వాటిని తన గుండెకు హత్తుకుంటుంది.

ఇవన్నీ టీ టైంలో ‘స్కిన్ టూ స్కిన్’ ఆపరేషన్ పూర్తి చేసుకొని వచ్చి వున్న వర్షకు చెబుతాడు కిరణ్. ఆ రాత్రి వర్ష చెప్పిన ‘కష్టాలకీ, కన్నీళ్ళకీ కులమూ మతమూ, వర్ణభేదాలూ వుండవు. స్పందిచే మనసుకే, సాయపడే చేతులకీ అవి అంటవూ’ అన్న మాటలు అతనికి గుర్తుకు రావడంతో కథ ముగుస్తుంది.

ఈ కథలో డాక్టర్లు, కరోనా కాలంలో ఎంత కష్ట పడుతుంటారో, నిస్వార్ధంగా రోగులకు ఎంత సేవ చేస్తుంటారో చిత్రింపబడింది. నిజానికి ఈ కరోనాను అడ్డుకోవడంలో పారిశుధ్య కార్మికులు, పోలీసులు, డాక్టర్లు చేస్తున్న సేవకు విలువ కట్టలేం. ఈ కథలోను బడేమాలో తన తల్లిని చూసుకున్న కిరణ్ మానవత్వానికీ విలువ కట్టలేము.

రాలిన గెలలు

డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి రాసిన ఈ కథ అరుణతార జూలై, 2020వ సంచికలో ముద్రింపబడింది.

ఈ కరోనా మహమ్మారి మూలంగా రైతుల జీవితాలు ఎలా కుదేలవుతున్నాయో చిత్రించిన కథ ‘రాలిన గెలలు’. ముందే రాయలసీమ రైతు ఒక వైపు కరువులతోను, అష్టకష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతోను, మరో వైపు కక్షలు కార్పణ్యాలతో పట్టణాలేగాక పల్లెల్లోను వర్ణాలు, వైషమ్యాలతోను సతమతమైపోతున్నాడు. అలాంటి పరిస్థితిలో కనా కష్టాలు పడి ఒక బక్క రైతు అరటి పంట పెట్టుకుంటే, లాక్‌డౌన్ కారణంగా ఫలాన్ని అమ్మకోలేక లక్షల అప్పుల బారిన పడి వలసకూలీగా మారిపోయి పడిన బాధల్ని కళ్ళు చెమర్చేలా రాసిన కథ ‘రాలిన గెలలు’.

పాలకొండల వరుస పల్లెల్లో కసంపల్లె ఒకటి. ఆ పల్లెకి కొంత దూరంలో వున్న బీళ్ళలో గొర్రెల్ని మేపుకునే బతికే బయ్యన్న, ఆదెమ్మ రైతు దంపతులు. గొర్రెలు మేపుకుంటూనే కొడుకును బాగా చదివించుకుంటూ వుంటాడు. అతని కొడుకు బెంగుళూరులో బీటెక్ చదువుకుంటుంటాడు. కూతురికి పెళ్ళయ్యి పిల్లలు కూడా. ఆమె పెళ్ళికీ, కొడుకు చదువుకూ చేసిన అప్పు అలాగే వుంటుంది. ఊగాది పండుగకు వచ్చిన అల్లుడు తన ద్వారా తీసుకున్న అప్పును గుర్తు చేస్తాడు. ఇలాంటి సమయంలోనే గొర్రెల్ని అమ్మి పాలకొండల బీళ్ళలో కంపాకట్టే కొట్టి, ఎర్ర గరుగునేల తయారు చేసి, మిట్ట రాళ్ళ సందులోని ఎచ్చు తగ్గుల్ని చదును చేయించి, బోరు వేయిస్తాడు. మంచి జల కళ్ళచూస్తాడు. పాలకొండల అరటి పండ్లంటే లోకానికి ఇష్టం గనక కిలోమీటరు దూరం దాకా పైపులు వేసి నీళ్ళు పెట్టి అరటి తోటలు వేస్తాడు బయ్యన్న. ఆ తోటలు బాగా పెరిగి కారడవిలా తోస్తాయి. గెలల్ని విరగకాస్తాయి. బ్రోకరు వచ్చి తోట చూసి మంచి లాభాలొస్తాయని మురిసిపోతాడు. ఆ బ్రోకరే అరటికాయల్ని బొంబాయికి తీసుకెళ్ళి మార్కెట్ వ్యవహారమంతా బ్రోకరే చూసుకుంటాడు. తొలికాపు గెలల్ని కోసి ఒక లారీ కెక్కించి బొంబాయికి బయలు దేరతాడు బ్రోకర్. ఉగాది పండుగ రోజునే సగం ప్రయాణం అయిన తర్వాత బ్రోకర్ ఫోన్ చేసి “లాక్‌డౌన్ వల్ల రోడ్లన్నీ బంద్ చేశారానీ, ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని ముందుకు పోనీయకుండా వెనక్కి రానీకుండా ఆపేశారనీ” చెబుతాడు. బయ్యన్న గుండె నీరైపోతుంది. లారీ కాయలు నేలపాలైపోయాయి. ఇంక చేసేది లేక బయ్యన్న, అతని కొడుకు ఒక ట్రాక్టర్‌ను బాడుగకు మాట్లాడుకొని మలి కోత కాయల్ని పులివెందులకు తీసుకెళ్ళి వీధి వీధీ తిరిగి వచ్చిన కాడికి రానీ అని అయినకాడికి అమ్మేయాలని చూస్తుంటారు. వీధులన్నీ లాక్‌డౌన్ వల్లా ఖాళీగా వుండి బీనీకాయలు, నిమ్మకాయల లారీలన్నీ అలాగే నిలచిపోయాయి. అక్కడా బయ్యన్నను పోలీసులు అడ్డుకుంటారు. వచ్చిన దారినే మర్యాదగా వెళ్ళిపోమ్మంటారు. లేకుంటే ట్రాక్టర్‌ని సీజ్ చేస్తామంటారు. ఇక చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్లోను, గుడిలోనూ గెలల్ని దింపి వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఆ విధంగా మలి కాపు పోయింది. బయ్యన్న అన్నీ కోల్పోయిన వాడిలా అయిపోతాడు. సుబ్బయ్య శెట్టి అంగడి దగ్గర గుమికూడిన జనం కరోనా గురించీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం గురించీ నానారకాలుగా మాట్లాడుకుంటుంటారు.

“కరువు నేలలో పంటలు పండిచ్చేదే కష్టమైతుంటే, పండిన పంటమ్ముకోవడం మరింత బరువైపోతాంది. ఈ కరోనా అందిరికీ ఏమోగానీ, రైతులకు చానా అన్యాయం చేసేసనప్పా” అని వారితో అంటాడు బయ్యన్న.

అప్పటికే బోర్లోను నీళ్ళు తగ్గిపోయివుంటాయి. బయ్యన్న కొడుకు పొలానికి వెళ్ళి, అరటి తోటను కొట్టేసి కూరగాయ లేద్దామంటాడు.

బయ్యన్న కొడుకు అప్పయ్యను అడ్డుకొని ఇక వ్యవసాయం లాభం లేదని సిమెంట్ లారీ ఎక్కించి బెంగుళూరుకు పంపిచేస్తాడు.

వారం తర్వాత పలు కంపెనీలు పాలకొండల పల్లెల్లో దిగిపోయి, పెద్ద మనుషులు, రాజకీయమోళ్ళు ఎకరాకు రెండు లక్షలు చొప్పున రైతుల భూముల్ని కొని ఐదారు లక్షలకు కంపెనీలకమ్ముకుంటుంటారు. బయ్యన్న తన భూమిని అమ్మేసుకొని వున్న అప్పులు తీర్చి, సుబ్బయ్య సెట్టి దగ్గర తిరిగి అప్పు చేసి, గాలివీడు సంతకెళ్ళి గొర్రెల్ని తోలుకొచ్చి ‘ఇవే మనకిక దిక్కు’ అని వాటిని తోలుకొని తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోతాడు.

ఇలా ఈ కథలో కరోనా ఫలితంగా అల్లకల్లోలమైపోయిన సీమ రైతు జీవితాన్ని హృదయవిదారకంగా చిత్రించాడు అప్పిరెడ్డి.

అందనంత దూరం

ఈ కథనూ అప్పిరెడ్డి హరినాథరెడ్డే రాశాడు. ఈ కథ సాహిత్య ప్రస్థానం, జూన్, 2020వ సంచికలో ముద్రింపబడింది.

వలస కార్మికుడిగా మారిపోయి కన్న కష్టాలు పడ్డ మరో రైతు జీవితం గురించి రాసిన కథ ‘అందనంత దూరం’.

కర్నూలు జిల్లా దక్షిణభాగాన, ఎర్రమలకొండల అంచున దుర్గం గ్రామంలో మల్లయ్య, కరెక్కలనే రైతు దంపతులుంటారు. ఆ ప్రాంతపు ఎర్ర నేలలకు వర్షమే ఆధారం. ఆ ఊరి చెరువు ఎండిపోయి ఏడేండ్లయింది. ఒకటే కరువు. కొండల్లోని కాయలు, గడ్డలు, ఆకులు అలములు, తేనే, బోదగడ్డి, కట్టెలతో కొంత కాలం నెట్టుకొచ్చారు జనం. చాలా మంది రైతులు బతుకులు గడవక సుగ్గి (వలస)కి పోవడానికి ఆరంభించారు. ఆ ప్రాంతపు రైతుకు ఎంత ఎక్కువ భూమి వుంటే అంత ఎక్కువ అప్పులుంటాయి. ఆ కారణంగా సంక్రాంతి తర్వాత జీవనం గడవక, భూమిని వదలిపోలేక మల్లయ్య దంపతులు చివరికి బెంగుళురుకు, గుంతకల్లు రైలెక్కి వలసల కెళ్ళిపోతారు. పదో తరగతి, ఏడో తరగతి చదుతున్న కొడుకుల్ని, మూడో తరగతి కూతుర్ని, ముసలిదైన తల్లి దగ్గరే వదిలేసి వెళ్ళి బెంగుళూరులో దిగుతారు. తమ ఊరివారితో కలిసి అక్కడి నుంచీ హోసురు ప్రాంతంలోని అత్తిబెల్లి వైపుకి పోయి కూలి పనుల్లో కుదిరిపోతారు. మగాడికి రోజుకి 400, స్త్రీకి 300 చొప్పున కూలీ.

దుర్గంలో ధాన్యం అయిపోయి చాలా కష్టపడుతుంటుంది ముసలి తల్లి. ఒక నెల జరిగిన తర్వాత ఆరు వేలు మల్లయ్య దంపతులు సంపాదించిన పిదప కరోనా ఫలితంగా లాక్‌డౌన్ ప్రకటిస్తారు.

ఇంటి పరిస్థితుల్ని ఫోన్ ద్వారా తెలుసుకుంటూనే వుంటాడు మల్లయ్య.

ఈ తరుణంలో ఇంటి బాడుగ కట్టి బ్యాగులు సర్దుకొని ఇంటికి బయలుదేరుతారు. పల్లెలోను కరోనా వచ్చి దుర్గంను రెడ్ జోన్‌గా పెట్టారని ఫోన్ ద్వారా తెలుసుకుంటాడు. పోలీసులు పట్టుకుంటారని తోటి కూలీలు చెప్పినా వినకుండా అక్కడి నుంచీ హోస్పేట దాటి దేవనహళ్ళి కాడికి రాగానే పోలీసులు అడ్డుగుంటారు. అది దాటుకోగానే మల్లయ్యకు జ్వరం. దానికే మందులు కర్చు. మద్యలో ఒక రౌడీ వాడికి రెండు వేలిస్తారు.

దుర్గంలో ధాన్యం లేక కోడిగుడ్లు, కోళ్ళు తిని పిల్లలు అల్లాడుతుంటారు. ఎన్నో కష్టాలు పడి ఊరి కాడ పెన్నారు రిజర్వాయరు దగ్గరికి వెళ్ళి ‘సీమ నీళ్ళ సాధన సంఘం’ అన్నబోర్డును చూసి ఇలా వలసలు పోయేకంటే తమ ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ కోసం పోరాడడం మేలని నిశ్చయించుకుని తన పొలంలోకి వెళ్ళి ఎర్రమట్టిని తీసుకొని, ఇంటికి వెళ్ళి పిల్లలని హత్తుకొని ఇక వలసలు పోనంటాడు మల్లయ్య, కరెక్క అతన్నే సమర్థిస్తుంది.

క్షమించండి

అమెరికాలోని ‘నాటా’ అనే సంస్థ నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ ఇది. దీని రచయిత ప్రసిద్ధ రచయిత సుంకోజి దేవేంద్రాచారి.

కడప జిల్లాలోని ఒంటిమిట్టలో వున్న రామాలయానికి నాలుగు ఫర్గాంగుల దూరంలో శృంగిమల పర్వత పాదం వద్ద, రహదారి పక్కన పదహరు స్తంభాలతో నిర్మించబడి వున్న ‘రామ తీర్థమంటపం’ అనబడే ఒక మంటపం స్వతహాగా అక్కడికి చేరే ప్రయాణికుల్ని, వారి బాధల్ని చూసి తనకు తాను బాధపడి, వారికి సాయం చేయాలేని తన అచలతత్వ్తనికి చింతిస్తుంది. ఇంతకీ అక్కడికి వచ్చిన జనం కరోనా మూలంగా బొంబాయి నుంచీ వస్తున్న వలస కూలీలు.

ఎప్పుడో బొంబాయికి వలస వెళ్ళిన కడప జిల్లాలోని కోడూరు ప్రాంతపు కూలి జనం లాక్‌డౌన్ కరాణంగా దాదాపు వెయ్యి మైళ్ళు పిల్లా జల్లాతో నడుచుకుంటూ ఒంటిమిట్ట దగ్గరున్న రామతీర్థ మంటపానికి చేరుకుంటారు. ఆ పాలకొండల దారే అడవిలో దూరి తిరుమలకు చేరుకుంటుంది. ఆ దారెంటా ఒకప్పుడు వచ్చిపోయే భక్తుల్ని రాజుల్ని, ఆ ఆలయాన్ని వృద్ధి పరచిన బుక్కరాయల వైభవాన్ని, భిక్షమెత్తి గుడిని పునర్మించిన వాసుదాసు గురించీ, ఆ మంటపం మననం చేసుకుంటుంది. ప్రస్తుతం అక్కడికి చేరిన వలస కూలీలు బిడ్డలకు అన్నం కాదు కదా, మంచినీళ్ళు కూడా ఇవ్వలేని తల్లిదండ్రుల దుస్థితినీ, నడచి నడచి కాళ్ళు పుండ్లయిపోయి రక్తం కారుతున్న దీనావస్థను చూసి బాధపడుతుంది. వారికి సాయం చేయలేని తన అచలత్వానికి చింతపడి వారికి క్షమాపణలు చెబుతుంది.

కాసెపుల్ల

కాసెపుల్ల అనేది పల్లెల్లో ఒకప్పుడు పిల్లలు ఆడుకున్న ఒక శైశవ క్రీడ. దీన్నే తెలంగాణాలో ‘బంగారు పుల్ల’ అని కూడా అంటారు. రాయలసీమ ప్రాంతంలో ‘కుచ్చుకుచ్చు పుల్ల’ అంటారు. బెత్తడెత్తుతో, మూరెడు పొడవు మట్టిని తీసి ఒకరు ఒకటిన్నర పుల్ల అందులో దాచి పెడితే, దాన్ని మరొకరు కనుక్కోవాలి. అలా కనుక్కోక పోతే ఆ పుల్లను ఆ వ్యక్తి అరచేతిలో పోసిన మట్టిలో ఎంగిలి ఊది అందులో ఆ పుల్లను చొక్కి, అ వ్యక్తికి కళ్ళు మూసి పెట్టి ‘ఎంతెంత దూరం దిబ్బంత దూరం’ అనుకుంటూ ఒక చోట పోయించి తిరిగి బయలుదేరిన స్థానానికొస్తారు. ఆ పుల్లను ఎక్కడ పోసింది ఆ ఓడిన వ్యక్తి కనిపెట్టాలి. ఇదే కాసెపుల్లాట.

ఈ కరోనా కాలంలో మనిషి ప్రాణం కూడా కాసెపుల్ల లాంటిదే. దాన్ని భద్రంగా కనిపెట్టుకొని కాపాడుకోవాలన్న భావానికి ప్రతీకగా ఆ పేరు పెట్టినట్టుగా ఆ రచయిత నాకు దూరవాణి ద్వారా వివరించాడు. ఆ రచయిత వెల్దండి శ్రీధర్.

రమణ, శకుంతల అనే దంపతులు ఒక పెద్ద అపార్డమెంట్‌లో కాపురం వుంటారు. అతను లెక్చరర్, వారి కొడుకు వాసు. అతను ఇంజనీరు. అతని భార్య నీరజ టీచర్. కూతురు చైత్రిక ఇంటర్. మనవడు నాని.

లాక్‌డౌన్ వల్లా రమణ తన కంప్యూటర్ ద్వారా లెసన్స్ ఇంట్లోనుంచే చెబుతుంటాడు. కొడుకు ‘వర్క్ ఫ్రం హోం’ పేరుతో తన లాప్‌టాప్ ద్వారా ఆఫీసు వర్క్ చేసుకుంటుంటాడు. కోడలు తన సెల్ ద్వారా ఇంట్లోనుంచే లెసన్ ప్లాన్స్ పంపుతుంటుంది. చైత్రిక ఆన్‌లైన్ పాఠాలు వినడంలో మునిగిపోయి వుంటుది. వీరందరికీ వంటావార్పు చేసి, ఇంటి పనులు చేసుకుంటూ విసిగిపోతుంటుంది శకుంతల. ఒక్కరూ హెల్ప్ చేయరు. అందుకనీ, రమణ ఒక రోజు టవునుకు వెళ్ళి సరుకులు తీసుకొస్తే పెద్ద రాద్ధాంతమే చేస్తుంది. ఈ తరుణంలోనే ఆ అపార్ట్‌మెంటులో వున్న మరో వ్యక్తి “కిందున్న కమ్యూనిటి హాల్‌లో నా బర్తడే రండి” అని పిలిచి అందరికీ డిన్నర్ పెడతాడు. ఆ డిన్నర్ అయిపోయిం తర్వాత డిన్నర్ పెట్టిన రామారావు, డిన్నర్ తిన్న మరి కొందరు దగ్గు జ్వరాలతో కింద పడతారు. దాదాపు 20 మందికి కరోనా పాజిటివ్. కొందరు ఆసుపత్రిల్లో వుంటే మరి కొందరు ఆ కమ్యూనిటి హాల్లోనే వుంటారు. శకుంతలా కరోనా బారిన పడి ఆ కమ్యూనిటి హల్లోని క్వారంటైన్ పేషంటుగా వుంటుంది. అయిదారు మంది చనిపోతారు. నగరంలోని డాక్టర్లు, మునిస్పాలిటీ వాళ్ళు దిగిపోతారు. ఆ సమయంలో తనింటి వారు ఏమీ పట్టించుకోకుండా వదిలిస్తే ఆమె చెల్లెలు కొడుకు జూనియర్ డాక్టర్, అతనొచ్చి తన పెద్దమ్మకు దగ్గరుండి వైద్యం చేసి బతికించుకుంటాడు.

ముగింపు:

ఇప్పటికి నేను సేకరించిన కథలివి. నిజానికి 50కి పైగానే కరోనా కథలు వివిధ పత్రికల్లో ముద్రింపబడ్డాయి. వాటిలో అఫ్సర్ లాంటి ప్రసిద్ధులు రాసిన కథలూ వున్నాయి. అఫ్సర్ ‘చూపుడు వేలు’ కథ, స్కైబాబా ‘ఐసోలేషన్’ కథ వంటివి మంచి కథలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇంకా అఫ్సర్, రెంటాల కల్పన నడిపే ‘సారంగ’ వెబ్ వీక్లీ జూన్ సంచికaలో ఎం.వి.రామిరెడ్డి ‘అభావం’ అనే కథ కూడా రాశాడు. ఇంకా ఇలాంటి కరోనా కథలు మరి కొన్ని వెబ్ మ్యూగజైన్స్‌లో వచ్చాయి. వీటన్నింటినీ సేకరిస్తే పెద్ద పరిశోధనే చేయవచ్చు.

మొత్తానికి రాబోయే కాలంలో మన కథా సాహిత్యంలో ‘కరోనా కథలు’ అనే ఓ ప్రత్యేక విభాగం తప్పకుండాఅ ఏర్పడి సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకం వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here