అందరూ చూసి ఆనందించదగ్గ సినిమా ‘కరోనా వైరస్’

10
2

[dropcap]రాం[/dropcap]గోపాల్ వర్మ అంటేనే ఒక సంచనలం కదా.

కరోనా వైరస్ సినిమాని కుటుంబసభ్యులందరితో కల్సి చూడొచ్చు. నేను అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను, ఒక దశలో డాక్యుమెంటరీ లాగా అనిపించినప్పటికీ.

ఇది రాంగోపాల్ వర్మ తీసిన ’కరోనా వైరస్’ అన్న సినిమా గూర్చి ఒక వ్యాసం. నా వ్యాసాలన్నీ ఆవు మీద వ్యాసం లాగా నాకు తెలిసిన కోణంలోనే విశ్లేషిస్తూ నాకు తెలిసిన విషయాలే వ్రాస్తాను అని అంటూ ఉంటుంది నా శ్రీమతి.

ఏది ఏమైనా తిరిగే కాలు, తిట్టే నోరు ఊరికే ఉండవు కద, అలా ఒక సినిమా నచ్చాక వ్రాయకుండా ఉండలేని బలహీనత నాది.

మొత్తానికి ఈ ‘కరోనా వైరస్’ అందరూ చూసి ఆనందించదగ్గ సినిమా.

మనం ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, కరోనా మన దేశంలో కొత్తగా వచ్చిన కొత్తల్లో ఉన్నకథాకాలాన్ని, మనం అప్పుడు ఎలాంటి మానసిక స్థితిలో ఉండినామో అలాంటి మానసిక స్థితిలో ఉన్న పాత్రలని అర్థం చేసుకుంటూ చూడాలి ఈ సినిమాని.

ఇప్పుడంటే మనం అందరం ముదిరి పోయాం కానీ, అప్పట్లో ఎన్నో నిద్ర లేని రాత్రులు, చీమ చిటుక్కుమంటే భయం, కూరగాయలు కడుక్కోకుండా వాడుకోవాలంటే భయం, వార్తాపత్రికని, పని మనుషుల్ని మానేసి, గేటుకి తాళం వేసేసి, గాలిని కూడా బంధించేసి, ఎందుకు పుట్టాంరా భగవంతుడా అని బిక్కు బిక్కుమంటూ గడిపిన రోజుల్ని గుర్తు తెచ్చుకోండి. బయటకిపోతే పోలీసులు చావగొడుతున్నారు. టీవి పెడితే క్షణ క్షణానికి పెరిగి పోతున్న మృతుల స్కోరు. వాక్సిన్ ఇంకా తయారు కాలేదు, మేధావిగా పేరు తెచ్చ్చుకున్న ఒక వాక్సిన్ తయారీ కంపెనీ అధినేత తాము వాక్సిన్ తయారు చేయలేమని, అసలు వాక్సిన్ రావటానికి ఒక అయిదారేళ్ళు పట్టచ్చు అంటాడు, ఇంకో పెద్ద మనిషి ఇండియా అసలు వాక్సిన్ తయారు చేయలేదు ఎన్నటికి అంటాడు.

ఇదిగో కరోనా, మన రాష్ట్రంలోకి వచ్చే, ఇదిగో పక్క వీధిలోకి వచ్చే అని భయపడుతూ ఉండేవారం. కంటెయిన్‍మెంట్ జోన్, రెడ్ జోన్, ఆ జోన్, ఈ జోన్ అంటూ అందరం మన నీడనే చూసి భయపడుతున్న కాలం అది. ఇలాంటి నేపథ్యంలో జరుగుతుంది కథ.

***

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్త్యంగా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ కట్టడి నిభందనలు (కంప్లీట్ లాక్ డవున్) ప్రకటించిన నేపధ్యంలో, ఊరికే కూర్చోకుండా నిభందనలు పాటిస్తూనే ’కరోనా వైరస్’ అనే సినిమా నిర్మించాడు మన ఆర్జీవి.

పూర్వం మన తెలుగు రచయిత్రుల గూర్చి ప్రస్తావిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్రాసే రచయిత్రి అని పేర్కొనే వారు, ఒకింత వెటకారంగా. ఈయన్ని కూడా ఇటువంటి గౌరవ సంబోధనతోనే ప్రస్తావిస్తాయి మన ఇంగ్లీష్ పత్రికలు, ‘ప్రోలిఫిక్ ఫిల్మ్ పొడ్యూసర్ అండ్ డైరెక్టర్’ అని. అంటే, అలుపెరుగక అవిశ్రాంతంగా ఒక ఫాక్టరీలాగా సినిమా తర్వాత సినిమా తీసి అవతల పారేస్తూ ఉంటాడు, క్వాలిటీ విషయం మమ్మల్ని అడగకండీ అన్న ధ్వని ఉంది ఆ గౌరవ ప్రస్తావనలో.

‘ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నాకు నచ్చినట్టు నాకోసం నేను సినిమాలు తీసుకుంటాను(?)’ అని చెప్పి మరీ సినిమాలు తీస్తున్న ఆయన సినిమాల గూర్చి మనమేం ఇంకేం వ్రాయగలం?.

కానీ అప్పుడప్పుడు ఆయన మన సెన్సిబిలిటీస్‌ని కూడా తృప్తి పరిచే సినిమాలు కూడా తీస్తూ ఉంటాడు. ఈ సినిమా ఆ కోవలోనిదే. నేను ఇది వరకు కూడా ఒకసారి చెప్పినట్టు రాములో ఒక ఆధ్యాత్మికవేత్త దాగి ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అయితే ఏమి, కిల్లింగ్ వీరప్పన్ అయితే ఏమి, మిర్యాలగుడా హత్య నేపథ్యంలో తీసిన ‘మర్డర్’ అయితే ఏమీ వీటన్నింటిలోనూ రాములో ఒక తత్వవేత్త కనిపిస్తాడు నాకు.

ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ ‘కరోనా వైరస్’ సినిమాలో చివరి పదిహేను నిమిషాలు కంట తడిపెట్టని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. హృదయాల్ని ద్రవింపజేస్తుంది ఈ చిత్రం చివర్లోని శబ్ద సందేశం (ఆడియో మెసేజ్).

కథ ఏమిటి?

క్లుప్తంగా కథ చెబుతాను. నో స్పాయిలర్స్.

ఆనందరావు (శ్రీకాంత్ అయ్యంగార్) గారు ఒక రెస్టారెంట్ యజమాని. ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు. బాగా స్థితిమంతులు. ఆయనది చక్కటి కుటుంబం. భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకుల మధ్య ఒక కూతురు (సోనియా ఆకుల), విధవరాలైన ముసలి తల్లి, కోడలు (పెద్దకొడుకు భార్య) వీళ్ళు ఆయన కుటుంబ సభ్యులు. అప్పుడప్పుడు కనిపించే పనిమనిషి. ఇవే పాత్రలు ఈ చిత్రం ఆద్యంతం. ప్రారంభ సన్నివేశంలోనే కోడలు (దక్షి గుత్తికొండ) అత్త మామలతో ఏదో విషయంలో తగవుపడి, వేరు కాపురం పెట్టే దిశగా భర్తని ప్రేరేపిస్తూ ఆవేశంగా కనిపిస్తుంది. వాతావరణం చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. కానీ కూతురు శాంతి అన్ని వర్గాలను శాంతింపజేస్తూ ఇటు వదిన గారిని, తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడిని సముదాయిస్తూ వయసుకి మించి మెచూరిటీ ప్రదర్శిస్తూ, చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కంటికి ఇంపుగా ఉంటుంది ఆ పిల్ల. ప్రేక్షకులని మొదటి చూఫులోనే ఆకట్టుకుంటుంది ఈ పిల్ల. టీనేజ్ లో ఉన్న ఆ పిల్ల తండ్రికి వాట్సప్‌లో ఆడియో మెసేజ్ ఎలా పెట్టాలో నేర్పిస్తుంది. ఆయనకి తెలిసిన ఆ జ్ఞానం చివర్లో ఎలా ఉపయోగ పడిందో తెలివిగా వాడుకున్నాడు దర్శకుడు. మనకు కంట తడిపెట్టించేది ఈ అంశమే.

ఇంతలో టీవీలో మోదీగారు సంపూర్ణ లాక్ డవున్ ప్రకటన చేస్తారు. అందరూ హతాశులవుతారు. మనకే ఒక విధమైన ఇబ్బంది కల్గుతుంది. అరెరె వీళ్ళు అందరికీ ఒకరంటే ఒకరికి పడదు, కేకలు వేసుకుంటూ కీచులాడుకుంటూ ఉన్నారే ఈ లాక్ డవున్‌లో వీళ్ళ ఇల్లు సాక్షాత్తు నరకప్రాయమేనబ్బా అని మనకు అనిపిస్తుంది.

ఇదిలా ఉండగా సమస్య వేరే వైపు నుంచి వస్తుంది. ఒకరాత్రి నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతున్న శ్రీకాంత్ అయ్యంగార్‌కి కూతురు గది నుంచి దగ్గు వినిపిస్తుంది. అది ప్రారంభం. అక్కడ్నుంచి అసలైన టెన్షన్ మొదలవుతుంది. కథ కొన్ని మలుపులు తిరిగి చివరికి ఎలా అంతం అయింది అన్నది మిగతా సినిమా అన్న మాట.

ఈ సినిమాలో ముఖ్యాంశాలు:

ఈ చిత్ర నిడివి కేవలం 88 నిమిషాలు. ఇది ప్రేక్షకులని గొప్ప గా ఊరించే అంశం. చూసేద్దాం పట్టు అన్న తెంపరితనాన్ని, ఉత్సాహాన్ని కల్గజేస్తుంది.

కానీ దర్శకుడి కోణంలో ఇది ఒక పెద్ద చాలెంజ్. ఆ కాస్త సమయంలోనే పాత్రలని ఎస్టాబ్లిష్ చేయాలి. డ్రామా పండించాలి. మూడ్ క్రియేట్ చేయాలి. పైగా దీనికి థ్రిల్లర్ అనే పేరు ఒకటి పెట్టుకుని కూర్చున్నారు కాబట్టి వీలయినంత త్వరలో, కథలో మెలిక పెట్టేసి, ప్రేక్షకుడిని కుర్చీకి కట్టి పడేసేలా కథనాన్ని అల్లుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే దర్శకుడికి నూటికి నూరు మార్కులు.

వాస్తవానికి ఒక డాక్యుమెంటరీని మించి తీయటానికి ఏమీ లేదు ఈ కథలో. స్టార్ కాస్ట్ కూడా ఏమీ లేదు. పాటలు, డాన్సులు అస్సలు లేవు. ఒకే ఒక మాంటేజ్ సాంగ్ ఉంది. అది మ్యూజిక్ హోరులో ఎలాగు వినిపించలేదు.

ఇందులో నటించిన వారందరూ కొత్తవారే. ఒక్క శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రమే మనకు తెలిసిన మొహం. రావుగోపాల్రావు గారిని కోట గారు రీప్లేస్ చేస్తే, కోటశ్రీనివాసరావు గారిని ప్రకాష్ రాజ్ గారు రీప్లేస్ చేశారు. ఇక ప్రకాష్ రాజ్ బోర్ కొట్టేశాడు అనుకుంటున్న సందర్భంలో మంచి సమయంలో ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ అయ్యంగార్. కాస్తా కృషి చేస్తే ప్రకాష్ రాజ్ ప్లేస్‌ని ఈజీగా ఆక్రమించుకోగలడు. కానీ ఇండస్ట్రీ రాజకీయాలు మనకు తెలియవు కద. ఈయన ఆర్జీవి కాంపు నుంచి వచ్చాడు అన్న ముద్ర ఆయనకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో కాలమే నిర్ణయించాలి.

పాత్రల్ని మలచిన తీరు అద్భుతం. ఒక చిన్న హైయ్యర్ మిడిల్ క్లాస్ ఇంటి వాతావరణం ఎంత అందంగా చూపవచ్చో అంత అందంగా చూపాడు దర్శకుడు. ‘సంసారం ఒక చదరంగం’ ‘మాతృదేవోభవ’ కంటే గొప్ప ఫామిలీ డ్రామాలు వస్తాయి గట్టిగా అనుకుంటే ఆర్జీవి కాంప్ నుంచి. కానీ ఆయన పదే పదే ‘నాకు సెంటిమెంట్ అంటే తెలియదు’ అంటూ ఫాల్స్ ఇమేజి క్రియేట్ చేసుకున్నాడు.

అతివేగంగా సినిమాలు తీసే కళ పూరి జగన్నాధ్ స్వంతం అంటుంటారు అందరూ. అతని గురువు ఎలా ఉంటాడు ఇక. అనుకుంటే రాము ఎలాంటి సినిమాలు అయినా తీసి రంజింపజేయగలడు.

నిజానికి ఈ సినిమాకి దర్శకుడు రాము కాదు. అగస్త్య మంజు. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది అన్నది నిర్వివాదాంశం అని లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసినప్పుడే అనుకున్నాను.

విక్రంభట్, రాంగోపాల్ వర్మ, మణిరత్నం వీళ్ళు నిర్మాతలుగా వ్యవహరించినప్పటికీ తమ సినిమాలకి సంబంధించిన ప్రతి అంశం విషయంలో కర్త కర్మ క్రియ అన్నట్టు వ్యవహరించటం వల్ల కావచ్చు వారి ముద్ర ప్రతి అంగుళంలో కన్పిస్తుంది.

నటన విషయంలో శ్రీకాంత్ అయ్యంగార్ పోషించిన ఆనందరావు పాత్రకి ఎక్కువ స్కోప్ ఉంది, ఆ పాత్ర మేరా ఆయన చక్కగా నటించాడు. కోడలిపాత్ర మీద మనకి కోపం రావాలి అన్న లక్ష్యంతో తీశారు, ఆ అమ్మాయి కూడా చక్కగా నటించింది. ఆ కోడలి పాత్ర కుంకుమ బొట్టు పెట్టుకుని, ఎప్పుడు జీన్స్, టీ షర్ట్ వేసుకుని, ఆ టీ షర్ట్ పై తాళి వేలాడేలా తిరుగుతూ, ప్రతీ దానికీ చిర్రుబుర్రులాడుతూ, అత్తమామల మీద కస్సు బుస్సు మంటూ, తన కంటి సైగల ద్వారానే మొగుడ్ని అత్త మామల మీదకి ఎగదోస్తూ, ప్రేక్షకులకి ఆ పాత్ర మీద కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తుంది. ఈ పాత్రని రూపుదిద్దటంలో దర్శకుడు కృతకృత్యుడు అయ్యాడు.

ఈ పాత్రకి కాంట్రాస్ట్‌గా శాంతి ఇంకా పెళ్ళి కాని, టీనేజ్ అమ్మాయి అయినప్పటికీ, పైటా పావడా (లంగా ఓణీ) వేసుకుని, ఒద్దికగా చిరునవ్వు నవ్వుతూ, అందర్నీ శాంతింపజేస్తూ, అందరికీ తలలో నాలుకలా ఉంటూ, తమ్ముడితో చిలిపిగా ఉంటూ, వదినతో చనువుగా ఉంటూ, తల్లి తండ్రులని సముదాయిస్తూ; ఈ పిల్ల భలే మంచిది అనే ఫీలింగ్ కలగజేస్తుంది, ఇదంతా దర్శకుడి ప్రతిభ.

తీయాలనుకున్నది తీశాడా సమర్థవంతంగా?

భయం అన్ని భావోద్వేగాలని అధిగమిస్తుంది. అని చెప్పి చివర్లో ఒక కొటేషన్ పెట్టి కథ ముగిస్తాడు దర్శకుడు. రాము చెప్పింది కూడా అదే ఈ సినిమా రిలీజ్ అప్పుడు. భయం అందునా ప్రాణ భయం, కుటుంబాన్ని, బంధాల్ని, ఇతర ప్రాముఖ్యతలని ఎలా అధిగమించి ఎలా మన జీవితాల్ని శాసిస్తుంది అన్నది చెప్పదలచుకున్నాడు ఆయన.

సత్య తీసినప్పుడు కూడా ఇలాగే ఒకటి చెప్పాడు రాము. హంతకులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. ఒక వ్యక్తిని ఎంతో ఆవశ్యకత ఉంటే తప్ప చంపరు. తీరా చంపే ముందు ఆ హంతకుల మనోభావాలు ఎలా ఉంటాయి? అన్న అంశాన్ని తీయబోతున్నాను. అని చెప్పి మొదలెట్టి ఏదో తీశాడు. అయినా అది ఆకట్టుకుంది.

ఈ కరోనా వైరస్ సినిమా విషయంలో కూడా ఆయన తీయదలచుకున్న అసలు విషయం కాస్త పలచన పడి, ఒక వ్యక్తి యొక్క చావు తరువాత, ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి అన్న అంశం ప్రధాన అంశం అయి కూర్చుంది. మన చేత కన్నీళ్ళు పెట్టించిన అంశం కూడా అదే అయ్యింది.

పెద్ద కొడుకు కార్తీక్ పాత్రలో చాగంటి వంశీ నటన బాలెన్స్‌డ్‌గా ఉంది. చివర్లో అతను ఎమోషనల్ అయి ప్రభుత్వాన్ని నిందిస్తూ ఒక సామాన్యుడు ఎలా రియాక్ట్ అవుతాడో అలా చక్కగా నటించాడు. చివర్లో టీవీ బద్దలు కొట్టే దృశ్యం సామాన్యుడి అసహాయతకి అద్దం పడుతుంది. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టు ఏమీ చేయలేని స్థితి.

చివరి మాట:

ఏది ఏమయినప్పటికీ, ఒకప్పుడు దాసరి నారాయణ రావు గారిలాగా, ఇప్పట్లో విక్రమ్ భట్ గారి లాగా, మన రాము ఎంత మంది సమర్థులైన దర్శకులని , సాంకేతిక నిపుణులని, నటీ నటులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడో తెలుసుకుంటే, మనకు ఆయన మీద గౌరవం పెరుగుతుంది.

ఆయన ఒక నిత్య కృషీ వలుడు. అంతే.

~

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: అగస్త్య మంజు (ఇది వరకు లక్ష్మీస్ ఎన్టీ ఆర్ తీసింది ఈయనే)

నిర్మాత: రాంగోపాల్ వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here