[dropcap]’క[/dropcap]రోనా వ్యథ’ను సీస పద్యాలలో వెల్లడిస్తున్నారు శ్రీమాన్ కోగంటి వీరరాఘవాచార్యులు.
***అడుగులు తడబడ నాయాసమును జెంది
వాహనాకృష్టులై పరచువారు
అన్నదాతలు నిరతాన్న దానము సల్ప
అన్నార్తులై వెస నరుగువారు
ఘన పిపాసను దీర్పగా చలివేంద్రాల
బానల నీరు చేపట్టువారు
తల్లి రొమ్ముల పాలు తనివి కూర్చగ నేడ్చు
బిడ్డలనోదార్ప పెనగువారు
త్వరితగతినేగ మోదసంభరితులగుచు
త్రొక్కు కుంచును లారీల నెక్కువారు
దవ్వునడచిన పదముల నొవ్వునోర్చి
నెత్తురోడెడి పదముల నొత్తుకొనుచు
రోసి చనిరి కసాయి కరోన వలన!
ఇతడటే! గుర్విణి నతి కష్టమున కోర్చి
సైకిలు పై తెచ్చె సాహసించి
ఇదియటే! జవ్వని ఇంత దూరము వచ్చి
ఇలు సొచ్చు గడపపై నిట్లు మడిసె
వీడటే! కావడి పిల్లల ధరియించి
మూపువాపుల కోర్చి ముదమునందె
ఈమటే! శిరసున ఈమూట బరువును
చంకను చంటితో టెంకిజేరె
ఆకలికి దప్పికకు నెంతొ అటమటించి
మించు రుగ్మత కోర్చి గమించి మించు
అభిజనాపేక్షమై నిరాహారులగుచు
వేనవేలుగ చనిరి కరోన కతన!
భయమున జ్వరమున బాధల వ్యధలతో
మార్గ మధ్యమ్మున మడిసి రకట!
అధిక వేగమ్మున బధిరాంధ బుద్ధులై
కాందిశీకుల మృతి గాంచి రకట!
అంటురోగమ్మను తంటాను మరచి క
రోన బారిన పడ్డ రోగులకట!
పగిలిన పాదముల్ రగిలించు లాక్ డౌను
సదుపాయరహితులై సమసిరకట!
చూచు వారలకిది కడు చోద్యమగును
బాధనొందెడు డెందముల్ భగ్గు మనవె?
యాన భార భయోద్వేగ పథమునందు
జతనమొనరించి మొండిగా సాగిరచట!
ఆకటి మంటల అటమటించెడు పెద్ద
తల్లిదండ్రుల వెతల్ తలచి తలచి
వండివార్చెడి సాధ్వి నిండు గుండెను చీల్చి
లేమిచూపుల సొద లాము కవియ
సంతాన సౌభాగ్య సంరంభమది యెల్ల
దారిద్య్రమున బ్రుంగ తలచి తలచి
తనకు సంపాదనా ద్రఢిమ పుష్కలమైన
కూలి పనులు లేక కుమిలి కుమిలి
పొట్టచేత బట్టి పొలతి వెన్నంటిరా
చంక చంటితోడ సాగివచ్చి
జీవనమ్ము సల్పు సేవక వితతికి
రొమ్ము నవయను కరోన రాగ!