Site icon Sanchika

కరోనా వారియర్స్

[dropcap]“అ[/dropcap]మ్మా! వీడియోకాల్ చేస్తాను. బాబుని చూపించవా?” బేలగా అడిగింది నీరజ.

“అలాగేనమ్మా” అంది నీరజతల్లి లక్ష్మి.

“అరేయ్! కన్నా! చిన్నా! ఏం చేస్తున్నావ్! నాన్నా!”

తల్లిని చూస్తూనే ఏడుపు మొదలు పెట్టాడు.

ఫోన్ ఆఫ్ చేసి గట్టిగా ఏడవసాగింది నీరజ.

“నీరూ! ఎందుకే ఏడుస్తున్నావ్” ఓదార్చడానికి దగ్గరకు రాబోయి తమాయించుకుంది శ్రీదేవి.

“అవును కదా! మనం ఒకరికొకరం భుజంమీద చెయ్యేసుకుని అనునయించుకునే పరిస్థితీ కరువైపోయింది కదూ!” అని బాధగా అంటూ తన మంచంమీద కూలబడింది శ్రీదేవి.

నీరజ ఏడుపు ఆపలేదు.

“ఏమే! నీరూ! మీ బాబుకి సంవత్సరము వయనేనా? చెప్పు” అడిగింది శ్రీదేవి.

“అవును ..” అంది నీరజ.

“నా కూతురి వయసెంత? చెప్పు. ఊ! చెప్పూ” శ్రీదేవి అడిగింది.

“నాలుగునెలలు” జవాబిచ్చింది నీరజ.

“అవునా! ఇంకా పాలు కూడా మానలేదు. నేను పాలు తగ్గిపోవడానికి మందులు కూడా వేసుకుంటున్నాను” అంటూ శ్రీదేవి ఏడుపు ఆపుకోలేకపోయింది.

“అవునే! ఈ కరోనా మహమ్మారి మనని వేధించడమే కాదు, పిల్లలకీ మనల్ని దూరం చేసింది. పసిపిల్లల తల్లులం, మనల్ని హాస్టల్ పాలు చేసింది. ఇక ఊరుకోవే!” ఈసారి ఓదార్పు నీరజ వంతయింది.

“అలాగే! ఈ విపత్కాలంలో రోగులకు సేవచేసే అదృష్టం మనకి కలిగింది. మన చదువుకు సార్థకత లభించింది. గుడ్ నైట్!” చెప్పింది శ్రీదేవి.

“ఓకె! గుడ్ నైట్” చెప్పింది నీరజ.

‘తమ పిల్లలను కలిసేదెప్పుడో?’ అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు, ఆ కరోనా వారియర్స్ అయిన ఇద్దరు లేడీ డాక్టర్లూ.

Exit mobile version