Site icon Sanchika

కౌన్సిలింగ్

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన ‘కౌన్సిలింగ్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]నాడు (పూర్వం) నేడు, రేపు పిల్లల భవిష్యత్తు వారి తల్లిదండ్రుల చేతుల్లోనే వుంది. పెద్దలు నేర్పే పద్ధతులు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు పిల్లలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా అవుతాయి. అందులో అపశ్రుతులు కలిగితే పిన్నలు ఒక వయస్సులో.. తెగిన గాలిపటాలుగా మారి, వారి బంగారు భవిష్యత్తు పలువురకు పరిహాసాస్పదం అవుతుంది. కనుక పెద్దలు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. అది కన్నవారి ధర్మం, బాధ్యత.

సెల్ మ్రోగింది. సమయం ఉదయం ఏడుగంటలు. సంధాత సాంబశివరావు గారు సెల్‍ను చేతికి తీసుకొన్నారు.

“హల్లో!”

“…. …. …”

“ఎవరండీ మీరు?”

“…. …. …”

“కౌన్సిలింగా?”

“…. …. …”

“ఆ…..ఆ….. అర్థం అయ్యింది. మీరు మీ శ్రీమతితో కలిసి మా కార్యాలయానికి ఐదు గంటలకు రండి”

“…. …. …”

“మంచిది!”

సంధాత సాంబశివరావు సెల్‍ను టీపాయ్ పైన ఉంచి స్నానానికి వెళ్ళాడు.

‘పరోపకారం ఇద్దమ్ శరీరం..’ ఆర్య వాక్కు. జనం వారిని యస్. యస్. రావుగారని పిలుస్తారు.

స్నానానంతరం పూజా నైవేద్యాది ఉదయపు తన దినచర్యను ముగించి, కాలేజికి బయలుదేరారు. వారి అర్థాంగి అరుణ కాన్పుకు అమ్మగారింటికి నెల్లూరికి వెళ్ళింది. యస్. యస్. రావు గారి వయస్సు నలభై అయిదు సంవత్సరాలు. ఎం.ఎ, పి హెచ్.డి ప్రిన్సిపాల్. ఇంగ్లీషు, చరిత్రలను అనర్గళంగా చెప్పగలరు.

హైందవ ధర్మాలలో వివాహ వ్యవస్థ చాలా గొప్పది. వధూవరులకు వివాహం సమయంలో పురోహితుడు, వధువు తండ్రి చేత ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరిత్వాయ అని పలికిస్తాడు.

ఆ పదాల అర్థము:- ధర్మేచ – ధర్మము, కర్తవ్యము; అర్థేచ – ఆర్థికము, ధనము, సంపద; కామేచ – కోరిక, ఆకాంక్ష, మోక్షేచ – మోక్షము విముక్తి కోసం అని అర్థం. నా కూతురును ఆదరాభిమానంతో ప్రీతిగా జీవితాంతము చూచుకోవాలని వధువు తండ్రి వరుని కోరుతాడు. జవాబుగా వరుడు ‘నాతిచరామి’ అని పురోహితులు చెప్పగా పలుకుతాడు.

పురోహితుడు వధూవరుల చేత అగ్ని పై ప్రమాణం చేయించి ఏడు ప్రదక్షిణాలను చేయిస్తాడు. అక్షింతలను బంధుమిత్రుల కందరికీ అందిస్తాడు. మాంగల్యధారణం కాగానే ఆ అక్షింతలను ఆ బంధుమిత్రులు వధూవరుల శిరస్సులపై చల్లి, వారి సంసారజీవితం ఆనందంగా సాగాలని ఆశీర్వదిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది ఆ మహా హైందవ పవిత్ర వివాహ వ్యవస్థను వ్యాపారంగా మార్చారు. పురోహితుడు చెప్పగా వారు పలికే మహోన్నతమైన పదాలతో.. వాటి అర్థాలతో వారికి నిమిత్తం లేదు. ఆ స్థితికి కారణం ఆంగ్ల సంకర నాగరీకత మహోన్నతమైన హైందవ తత్వాల పట్ల నిరసన. వర్ణాంతర వివాహాలు (ప్రేమ పేరుతో) స్వాభావిక విరుద్ధ చింతనలు. ఇరువురికి ఒకరిపై ఒకరికి, ఆలుమగలకు నిరసన, అసహ్యం, సుఖ సంసార జీవితం కలగా మారి బేధాభిప్రాయాలతో విడాకులు తీసుకోవడం ప్రబలమైనాయి. పిల్లల ఈ స్థితికి ముఖ్య కారణం తల్లిదండ్రుల స్వార్థ చింతన స్వాతిశయం. యువతీ యువకుని వలే విద్యావంతురాలు కావడం. బిడ్డలు తప్పుడు ధోరణిని తల్లిదండ్రులు సమర్ధించడం ఆలుమగలు విడిపోవటానికి కారణాలు.

***

యస్. యస్. రావుగారు వారి శిష్యుడు వరదాచారి వారి కాలేజి వ్యవహారాలు ముగించుకొని సాయంత్రం ఐదుగంటలకు ఆఫీసుకు చేరారు. వారికి ఉదయం ఫోన్ చేసింది శ్రీపతి గారి అర్థాంగి. పేరు నవీన.

వారి వివాహం జరిగి ఆరుమాసాలు.

శ్రీపతి సివిల్ ఇంజనీర్. తండ్రి మురారి. రెండు సంవత్సరాల క్రిందట హృద్రోగంతో (గుండె జబ్బు) మరణించాడు. తల్లి శ్యామలాంబ. వారికి ఒక చెల్లెలు మహీజ. ఇంటర్ చదువుతుంది. శ్యామలాంబ ఖచ్చితమైన మనిషి.

నవీన తండ్రి గోవిందరావు సర్కిల్ ఇన్‌స్పెక్టర్. తల్లి నీలవేణి హైస్కూలు టీచర్. ఆ దంపతులకు నవీన ఒక్కతే కూతురు.

శ్యామలాంబ సనాతన ఆచార సంపన్నురాలు. ఎంతో దైవ భక్తికలది. కాపురానికి వెళ్ళిన నవీనకు అత్తగారి పూజలు, పునస్కారాలు నచ్చలేదు.

శ్యామలాంబ గురించి ఏకాంతంలో భక్తితో విమర్శించేది. “వేరు కాపురం పెట్టాలి, కారణం మీ అమ్మగారి తత్త్వం నాకు నచ్చలేదు. తల్లికూతుళ్ళు ఒకటై నన్ను విమర్శిస్తున్నారు. పూజలు పునస్కారాలు వ్రతాల మీద నాకు నమ్మకం లేదు. మా అమ్మకూ లేదు. మా అమ్మ నన్ను ఎంతో గారాబంగా పెంచింది. నాకు నచ్చని పని నేను చేయను. వేరు కాపురం పెడితే మనం హాయిగా వుండవచ్చు ఏమంటారు?” గద్దించినట్లు అడిగింది నవీన.

శ్రీపతి సౌమ్యుడు. అమ్మ మాటను జవదాటడు. అమ్మ తమ్ముడు రామకోటి గారి సలహా మేరకు అంటే “ఒకే కూతురు కావలసినంత ఆస్తి, నవీన తల్లిదండ్రి గతించిన తరువాత నీవు కోట్లకు అధిపతివి అవుతావు అల్లుడు. నా మాట విని నవీనతో పెండ్లికి ఒప్పుకో” – ఇలాంటి ప్రసంగం చేసి తన అక్క శ్యామలాంబను శ్రీపతిని ఒప్పించిన రామకోటి నవీన శ్రీపతులు పెండ్లి జరిపించాడు. రామకోటి నవీన తల్లి స్కూల్లోనే టీచర్‍గా పనిచేస్తున్నాడు. వివాహం అయిన నెలరోజులకే శ్రీపతికి నవీన వ్యవహారం పూర్తిగా అర్థం అయ్యింది.

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏం లాభం! నోరు విప్పితే నలుగురిలో అవమానం పాలు కావాల్సి వస్తుంది. కనున మౌనమే మహదానందం. వారంరోజులు తరువాత నవీన శ్రీపతిని వేరు కాపురం విషయాన్ని అడిగింది. శ్రీపతి మౌనంగా వుండిపోయాడు. నవీన తన అమ్మగారింటికి వెళ్ళిపోయింది.

***

“సార్!..” పిలుపు.

“ఎవరో చూడు వరదా!”

వరదాచారి వరండాలోనికి వెళ్ళి చూచాడు. వారికి ఎదురుగా శ్రీపతి.

“నమస్కారం సార్!” చేతులు జోడించాడు శ్రీపతి.

“మీ పేరు?” అడిగారు వరదాచారి.

“శ్రీపతి సార్! పెద్దసార్ వున్నారా?”

“ఆఁ.. వున్నారు రండి..”

వరదాచారి ముందు, వెనకాల శ్రీపతి యస్. యస్. రావుగారి గదిలో ప్రవేశించారు.

“సార్! వీరే శ్రీపతిగారు” చెప్పాడు వరదాచారి.

“ఓ.. రండి.. రండి కూర్చోండి.”

నమస్కరించి శ్రీపతి వారి టేబుల్ ముందున్న రెండవ వరుసలో కూర్చున్నాడు.

యస్. యస్. రావు శ్రీపతి ముఖంలోనికి చూచాడు.

“అవునూ! మీ ఆవిడ ఎక్కడ?” అని అడిగారు.

క్షణం తర్వాత..

“రాలేదా?”

“అవును సార్!”

“ఎందుకు రాలేదు?”

“ఆమె నా దగ్గర లేదు సార్!”

“మరెక్కడ వుంది?”

“వారి అమ్మగారింట్లో వుంది సార్!”

“మీ పేరు ఏమన్నారు?”

“శ్రీపతి సార్!”

“ఆఁ… చూడండి శ్రీపతిగారు! ఒక్క చేత్తో చప్పట్లు కొట్టగలమా?”

“లేదు సార్!”

“ఆఁ.. అలాగే ఆలుమగలు ఇరువురూ ఉంటే.. అంటే కలిసి వస్తే ఇరువురి వాదోపవాదాలను విని, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, ప్రకారం నేను సలహాలను ఇవ్వగలను. వారు వుండేది ఎక్కడ?”

“ఓ పది కిలోమీటర్ల దూరంలో ప్రక్క గ్రామంలో వున్నారు సార్!”

“సరే! వారికి మీరు ఫోన్ చేసి వెంటనే సంధాత యస్. యస్. రావుగారు రమ్మంటున్నారని పిలవండి” చెప్పారు యస్. యస్. రావు.

వారి టేబుల్ ముందు రెండు వరుసల్లో వరుసకు ఐదు కుర్చీలు చొప్పున పది కుర్చీలు వున్నాయి. శ్రీపతి ముందు వరుసలో మనుషులు కూర్చొని వున్నందున వెనుక వరుసలో కూర్చున్నారు. యస్.యస్. రావు గారు చెప్పిన ప్రకారం భార్యకు ఫోన్ చేయడానికి లేచి గది నుండి బయటికి వెళ్ళిపోయాడు.

ముందు వరుసలో ఇద్దరు మగవారు, ముగ్గురు ఆడవారు కూర్చొని ఉన్నారు.

ఆ కేసు వివరణ: ఆ దంపతులది వర్ణాంతర, కులాంతర వివాహం. అది జరిగి సంవత్సరం అయ్యింది. యువకుడు శ్యామ్ అతని తల్లి శాంతి, యువతి రోజ్‍మన్, ఆమె తల్లి లిల్లీ, తండ్రి జోసఫ్ ఆ కుర్చీలలో కూర్చుని ఉన్నారు.

“సార్! మరోసారి చెబుతున్నాను. నా కూతురు రోజ్‍మన్ ఇక ఆ శ్యామ్‍తో కాపురం చేయలేదు. నేను నా భార్యా, కూతురు ముగ్గురం ఒక నిర్ణయానికి వచ్చాము.”

“ఏమిటది?” అడిగారు యస్. యస్. రావు.

“వివాహ రద్దు – విడాకులు” జోసఫ్ జవాబు.

“మీ కూతురు ప్రస్తుతం గర్భవతి అన్నారుగా!”

“అయితే ఏమి? విడాకులకు గర్భానికి ఏమిటి సంబంధం?”

“విడాకుల తరువాత మీరు మీ అమ్మాయికి మరో పెండ్లి చేస్తారా?”

“తప్పకుండా. నేను ఆల్‍రెడీ అబ్బాయిని చూచాను.”

“మరి పుట్టబోయే బిడ్డ విషయం?”

“మేమే పెంచుకొంటాం లేదా అనాథ శరణాలయంలో వదిలేస్తాము. అది మా ఇష్టం” అహంకారంతో చెప్పాడు జోసఫ్.

“చూడండి జోసఫ్ గారూ! చిన్నపిల్లలు ఆవేశంలో ఈగోతో ఏవేవో నిర్ణయాలు తీసుకొంటారు. మనం అంటే మీరు మీ వైఫ్ పెద్దవాళ్ళం. ఆ పిల్లల బాగోగులను గురించి బాగా ఆలోచించి, వారి సమస్య సమసిపోయి, వారు ఆనందంగా వివాహ వ్యవస్థ ధర్మాలను పాటిస్తూ, భావి జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆలోచించుకొని సరైన నిర్ణయం అంటే వారిరువురి సంసారం ఆనందంగా సాగే రీతిలో ప్రసంగించండి. వారికి నచ్చచెప్పండి. నా మాటలను పాటించండి.”

“సార్! అతన్ని మేము మతం మారమంటున్నాము. అతను కాదు కుదరదు అంటున్నాడు. కాబట్టి ఈ వ్యవహార పరిష్కారపు మార్గం విడాకులే!.. మీరు మాకు చెబుతున్నారే కానీ ఆ తల్లి కొడుకులకు ఏమీ చెప్పడం లేదు ఎందుకని?”

“మతం మార్పిడికి రాజ్యాంగ చట్టాలతో చెక్ పెట్టే చట్టాలు వున్నాయి జోసఫ్, వినండి.

‘ఒకటి :- కొడుకు గాని, కోడలు గాని మతం పుచ్చుకొన్నాక పిల్లలను కంటే వారికి తాత ఆస్తిలో గాని మరి ఏ ఇతర హిందూ మత బంధువుల నుండి గాని.. వారసత్వపు హక్కుగాని, వాటాగాని పంచమని అడిగే హక్కు గాని లేదు.

రెండు:- తల్లిదండ్రులు మతం మారినట్లతే వారి పిల్లలకు, పిల్లల ఆస్తికి గార్డియన్‍గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు  (సెక్షన్ 6,  హిందూ మైనార్టీ అండ్ గార్డియన్ షిప్ చట్టం). అటువంటప్పుడు దగ్గరి బంధువులు గాని, చుట్టు ప్రక్కల హిందువులు గాని, స్వఛ్ఛందంగా ముందుకు వస్తే సంబంధిత జిల్లా కోర్టు వారు, వచ్చిన వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతేకాదు మతమార్పిడిల కార్యక్రమంపై (బాప్టిజం లేదా ముస్లిం మతంలపై) ముందుగా ఎవరైనా కోర్టుకు వస్తే, మైనర్లను మతం మార్చకుండా, సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.

మూడు:- భార్య గాని, భర్త గాని మతం మారితే లేక కూటములకు దర్గాలకు వెలుతుంటే వారినుండి విడాకులు పొందవచ్చు (సెక్షన్ 18(3) హిందూ వివాహ చట్టం).

నాలుగు:- భార్య గాని, తల్లి గాని, కుమార్తె గాని Bc – A,B,C గ్రూపుల వారు O.Cలుగా పరిగణింపబడుతారు. అదే విధంగా క్రైస్తవ మతం పుచ్చుకొన్న S.Cలు B.C.Cగాను, ముస్లిం మతం పుచ్చుకొన్న S.C లు O.C లుగా పరిగణింపబడుతారు’.

మీ కుమార్తెను వివాహం  చేసికొని శ్యామ్ వ్యామోహంతో చాలా పెద్ద తప్పు చేశాడు. అతను తెలివి కలవాడు. తన వలన ఎవరికీ కష్టనష్టాలు కలుగకూడదని అతని అభిప్రాయం. అందుకే అతను విడాకులకు సమ్మతించడం లేదు. ఒకసారి తప్పు చేసి వివాహమాడిన యువతిని కష్టాలు, అవమానాల పాలుచేయడం అతనికి ఇష్టం లేదు.

జోసఫ్! మీ కూతురు రోజ్‍మన్ అతన్ని ఎంత వేధించినా, మానవతా దృష్టితో హైందవ వివాహ పవిత్రతను ఎరిగిన వాడైనందున శ్యామ్ విడాకులకు విముఖతను చూపుతున్నాడు. మీ కుమార్తెతో సంసార జీవితాన్ని సాగించాలనుకొంటున్నాడు. పెద్దలైన మీరు యుక్తి యుక్త విచక్షణతో మీ కూతురుకు మంచి సలహా యిచ్చి, ఆమె కాపురాన్ని నిలబెట్టండి. ఇక నేను మీకు ఏమీ చెప్పదలచుకోలేదు. మీరు వెళ్ళవచ్చు” అన్నారు.

జోసఫ్, అతని భార్య లిల్లీ, రోజ్‍మన్ మౌనంగా తలలు దించుకొని బయటికి వెళ్ళిపోయారు.

చిత్తరువుల్లా కూర్చొని యస్. యస్. రావు గారి ప్రసంగాన్ని వింటున్న శ్యామ్, అతని తల్లి శాంతి వారికి నమస్కరించి గదినుండి బయటికి నడిచారు.

***

శ్రీపతి భార్యతో ఫోన్ మాట్లాడి వాకిట ముందు నిలబడి శ్యామ్, రోజ్‍మన్‍ల కేసును యస్. యస్. రావుగారి మూలంగా విన్నాడు. దిగాలుపడిన ముఖాలతో గదినుండి బయటికి వచ్చిన జోసఫ్ లిల్లీ, రోజ్‍మన్‍లను చూచాడు.

రోజ్ మన్ మంచి అందగత్తె. ఆ మాటను మనస్సున అనుకొన్నాడు శ్రీపతి.

వరదాచారి పిలుపుతో గదిలో ప్రవేశించాడు శ్రీపతి.

“ఆఁ.. శ్రీపతి మీ ఆవిడ వస్తూవుందా!..” అడిగారు రావుగారు.

శ్రీపతి ఆశ్చర్యంతో రావు గారి ముఖంలోనికి చూచాడు. ఏం చెప్పాలో తోచక కారణం అతని భార్య ఫోనులో ‘నేను రాను’ అని చెప్పి కట్ చేసింది.

“శ్రీపతి ఏం జవాబు చెప్పింది?” చిరునవ్వుతో అడిగారు యస్. యస్. రావు గారు.

యస్. యస్ రావుగారికి తెలుసు శ్రీపతి నుండి వినబోయే సమాధానం.

“సార్!” మెల్లగా పిలిచాడు శ్రీపతి.

“ఆ.. చెప్పండి”

“తాను..”

“తాను!..”

“నే రాను పో! అంది సార్” మెల్లగా విచారంగా చెప్పాడు. శ్రీపతి తలదించుకొన్నాడు.

యస్.యస్. రావు కొన్ని క్షణాలు శ్రీపతిని పరీక్షగా చూచాడు.

‘ఇతను చాలా అమాయకుడు పాపం.. కొరకరాని కొయ్యపాల పడ్డాడు. ఇతనికి ధైర్య సాహసాలు నేర్పాలి. మారిన ఇతన్ని చూచి ఆ అర్థాంగి పరుగున వచ్చి ఇతని నిలయానికి వచ్చి శ్రీపతికి క్షమాపణ చెప్పాలి’ మనస్సున అనుకొన్నారు యస్. యస్. రావు.

“శ్రీపతి!”

“సార్!”

“నేను చెప్పినట్లు నీవు చేయగలవా!..”

“ఏమిటి సార్ అది?”

“నీవు వేరొకరిని ప్రేమించాలి. వారిని నీ ఇంట్లో పెట్టుకోవాలి. ఆమెకు నీకు త్వరలో వివాహం అని మీ ఊర్లో, నీ భార్య ఊర్లో వార్తలను పుట్టించాలి. ఆ వార్తల వ్యవహారం నేను, నా శిష్యుడు వరదాచారి చేత చేయిస్తాను. మీ ప్రక్క ఇంట్లో ఎవరున్నారు?”

“మా మేనమామ, అత్త, వారి కూతురు”

“ఆమె పేరు?”

“దీప్తి”

“దీప్తికి వయస్సు ఎంత?”

“పద్దెనిమిది”

“ఏం చదువుతుంది?”

“బి.ఎస్సీ మొదటి సంవత్సరం”

“సూపర్!..” నవ్వారు యస్.యస్. రావు.

“మీ మామగారి ఫోన్ నెంబర్ చెప్పండి”

శ్రీపతి చెప్పాడు.

యస్. యస్. రావు తన ఫోనులో నెంబరు ఎక్కించుకున్నారు. సీట్ నుంచి లేచి వరండాలోనికి వెళ్ళాడు. శ్రీపతి మేనమామ ముకుందయ్య గారితో మాట్లాడాడు. నవ్వుతూ వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు.

“చూడూ బ్రదర్! నేను అన్ని విషయాలు మీ మామయ్య ముకుందయ్యగారితో మాట్లాడాను. మీరు వారు ఏం చెబితే అది చెయ్యండి. మూడునెలల లోపల పాలకోసం బయట మేసి ఇంటికి వస్తున్న ఆలమందలో తన తల్లిని వెతుక్కొంటూ పరుగెత్తుకు వెళ్ళే లేగదూడ చందాన మీ ఆవిడ మీ ఇంటికి చేరుతుంది. మీరు మాత్రం నిర్భయంగా మీ మేనమామ గారి మాటలను పాటించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.. గుడ్ లక్.. గాడ్ ఈజ్ గ్రేట్!!..” ఆనందంగా చెప్పారు యస్. యస్. రావు గారు.

శ్రీపతి కుర్చీనుంచి లేచి “ధన్యవాదాలు సార్!” వినయంగా చేతులు జోడించాడు. వెళ్ళి వస్తానని చెప్పి ఆ గది నుండి ఆనందంగా బయటికి నడిచాడు.

***

ముకుందయ్య తన కూతురు దీప్తిని శ్రీపతి ఇంటికి తరచూ పంపేవాడు. శ్రీపతి తల్లి శ్యామలాంబ దీప్తిని ఎంతో ప్రేమగా చూచుకొనేది. త్వరలో దీప్తి పరీక్షలు కాగానే శ్రీపతికి – దీప్తికి వివాహం జరగబోతున్నదనే వార్త ఊరంతా వ్యాపించింది. ఆ గాలి వార్తను వరదాచారి నవీన ఊరివాడే అయినందున శ్రీపతి, దీప్తిల జరుగబోయే వివాహ విషయాన్ని ఆ ఊర్లో తన తల్లితో చెప్పాడు. ఒక్క గంటలోపల ఆ వార్త నవీన గారి తల్లి చెవికి సోకింది. కుమార్తెతో ఆమె చర్చించింది. “నేను నీకు విడాకులు ఇప్పించి మరో వివాహం జరిపిస్తాను, బేబీ డోంట్ వర్రీ” అహంకారంతో చెప్పింది.

అప్పటికి నవీన నెలతప్పి నాలుగు మాసాలు. తల్లి సలహా నవీనకు నచ్చలేదు.

కడుపులోని శ్రీపతి ప్రతిరూపం.. ‘అమ్మా! తప్పు చేస్తున్నావు’ అని హెచ్చరించినట్లనిపించింది.

నవీన వరదాచారిని కలిసి రావుగారి దగ్గర కౌన్సిలింగ్ ఏర్పాటు చేయించవలసిందిగా కోరింది. వరదాచారి ‘ఓకే’ అన్నాడు.

***

“నవీనా!”

“సార్!..”

“వీరు మీ తల్లిగారేనా!”

“అవును సార్!”

“పేరు”

“బంగారమ్మ!”

“ఓ.. చాలా మంచిపేరు!” నవ్వారు యస్. యస్. రావు.

“ఎందుకండీ నవ్వుతున్నారు?” అడిగింది బంగారమ్మ.

“మీ పేరు మాత్రం చాలా గొప్పగా వుంది. కానీ తత్త్వం..” రావుగారు మాట పూర్తి చేయకముందే..

“పరమ చండాలంగా వుంది..” పూర్తి చేశాడు నవ్వుతూ వరదాచారి.

“వరదాచారీ!..” బుసకొట్టింది బంగారమ్మ.

“అమ్మా!.. బంగారమ్మగారూ! మీరు టీచర్ కదా!.. ఎందరో పిల్లలకు పాఠాలు చెప్పి వృద్ధిలోకి తీసుకొని వచ్చి ఉంటారు కదా” అన్నారు రావుగారు.

“అవును” స్వరంలో అహంకారం.

“మరి మీ కూతురు బంగారు జీవితాన్ని మీ నిర్ణయంతో ఎందుకమ్మ నాశనం చేయాలనుకొంటున్నారు? చూడండి.. మన హైందవ ధర్మ శాస్త్రాల్లో స్త్రీకి ఎంతో విలువ, వివాహ వ్యవస్థకు ఎంతో ఘనత వున్నదన్న విషయం మీకు తెలీదా!.. కూతురి చేత  శ్రీపతికి విడాకులు ఇప్పించి ఆమెకు మరో వివాహం చేస్తారా! ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు అబార్షన్ చేయిస్తారా! మీరు మీ కూతురికి చెప్పవలసింది, మీరు ఆమెకు ఎంతో శ్రీపతి తల్లి అంతేనని. ఆమె దైవ ఆరాధన, చింతన ఆమెకే కాదు ఆమెకు సంబంధించి అందరి మేలుకోసం. భ్రూణహత్య మహా పాతకం అన్న విషయం మీకు తెలీదా?” చిరునవ్వుతో అడిగారు రావుగారు.

“సార్!.. మీరు నా కళ్ళు తెరిపించారు. మీకు నా నమస్సుమాంజలి. నేను మా యింటికి అదే మా అత్తారింటికి వెళుతున్నాను. ధన్యవాదాలు” అని కుర్చీనుంచి వేగంగా లేచింది నవీన.

యస్. యస్. రావుగారు నవ్వుతూ “శ్రీపతీ!” అని పిలిచారు.

ప్రక్క గదిలోని శ్రీపతి ఆ గదిలోనికి వచ్చాడు.

“మీ ఆవిడ మీ యింటికి వెళుతుందట” నవ్వారు రావుగారు.

“సార్!.. నేను కూడా తనతోటే వెళతాను సార్!” అన్నాడు శ్రీపతి.

నవీన దీనంగా కన్నీళ్ళతో శ్రీపతి ముఖంలోనికి చూచింది. శ్రీపతి నవీన చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు.

“సార్! ధన్యవాదాలు” నవ్వుతూ చెప్పాడు.

“బేబీ!..” అరిచింది బంగారమ్మ.

“పదండి..” అంది నవీన తల్లివైపు చూడకుండా..

ఆ భార్యాభర్తలు గదినుండి బయటికి నడిచారు. బంగారమ్మ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది.

“బంగారమ్మ గారు! ఇక తమరు తమ యింటికి దయచేయండి” వ్యంగ్యంగా అన్నారు రావుగారు.

బంగారమ్మ రుసరుసలాడుతూ గదినుండి బయటికి నడిచింది.

రావుగారి సెల్ మ్రోగింది. అందుకొన్నారు.

ఆవలి వైపున రోజ్‍మన్.

“సార్!.. నేను నా ఇంటికి అంటే భర్త దగ్గరకు వెళుతున్నాను. మీ మాటల వల్ల నా కళ్ళకు కమ్మియున్న పొరలు తొలగిపోయాయి. మీకు శతకోటి వందనాలు” వాయిస్ కట్ అయింది.

“వరదాచారి!.. రోజ్‍మన్ ఫోన్. ఆమె కూడా తన భర్త శ్యామ్ గారి ఇంటికి, అంటే తన ఇంటికి వెళుతున్నదట” చెప్పారు యస్. యస్. రావుగారు.

తమ ప్రయత్నం ఫలించినందుకు గురుశిష్యులు ఆనందంగా నవ్వుకొన్నారు.

Exit mobile version