Site icon Sanchika

కోవిడ్ – ఒంటరితనం

[box type=’note’ fontsize=’16’] ఇటీవలే కరోనా క్రిమితో పోరాడి విజేతలయారు వారాల ఆనంద్. క్రిమి తో పోరాట కాలంలో ఆయన మానసిక స్థితికి దర్పణం  ఈ కవిత. [/box]

[dropcap]ద[/dropcap]శాబ్దాలుగా గుండె  గూట్లో దాచుకున్న ఒంటరితనం
ఒక్కసారిగా క్రిక్కిరిసి పొయింది
తడి తడిగా తేమ తేమగా వున్న
‘మనసు నేల’
చిత్తడి చిత్తడి అయింది

అనిశ్చితి ఆందోళన ఆవేదన ముప్పిరి గొని
దేహపు తలుపుల్ని బద్దలు కొట్టడంతో
‘ఒంటరితనం’ జాతర జాతరయింది
బతుకేమో గత్తర గత్తర యింది

ఆకాశంలో చుక్కలు
కొమ్మమీది ఆకులూ బిత్తర చూపులు చూస్తున్నాయి

చేతులు బార్లా చాపుకుని
దుఃఖం ఎదురుగా నిలబడితే
కంటి కొసల్లోంచి నీటి బొట్లు రాలడం తెల్సు కానీ
ప్రవాహమయి దుమికి ముంచెత్తడం
నాకు కొత్తే

గుంజీలు తీయడానికీ
చెంప లేసుకొవడానికీ
నిలబడి నాలుగు గుటకల శ్వాస
తీసుకునే సమయమూ ఇవ్వక
కాలం దట్టమయిన మబ్బులా శ్మశానాన్ని
కమ్మెస్తున్నది

మృత్యువు వర్షమై కురవాలని పరుగులెత్తి వస్తున్నది.

పాప పుణ్యాలను దోసిట పట్టి
కదిలే వాగులూ నదులూ
పాడెల్ని మోస్తున్నాయి

రోడ్డెక్కితే చాలు
మూల మలుపుల్లో కరెంటు స్తంభాలకూ
నివాళి దీపాల వెలుగులో ఎన్ని నవ్వు ముఖాలు
వేలాడుతున్నాయి

వాటిల్లో
ఎక్కడయినా నా ముఖం కనిపిస్తుందేమోనని
వెతుకుతున్నా

అయినా నా ముఖమే కనిపించాల్సిన అవసరం లేదు
అనేకా నేక ముఖాలు

నవ్వుతూనో ఏడుస్తూనో గాలిలో
తేలియాడుతున్నాయి

నాదేముంది మెల్లి మెల్లిగా దారి చేసుకుంటూ
ఒంటరితనం లోకి తిరుగు ముఖం పట్టా
నష్ట నివారణ మొదలయింది
కాలం అవసరమయినంత గాలిని
పీల్చుకుంటోంది

మేఘాలు తొలగిపోతున్నాయి
వర్షపు భీతి భంజితమవుతోంది…
స్వచ్చమయిన ప్రాణవాయువు  వీస్తోంది.

 

— వారాల ఆనంద్
(గ్లోబల్ నుంచి)

Exit mobile version